వైఎస్ షర్మిల ఫిర్యాదుపై ఖచ్చితమైన చర్యలు: కేటీఆర్
హైదరాబాద్ : వైఎస్ షర్మిల గౌరవానికి భంగం కలిగేలా సోషల్ మీడియాలో అభూత కల్పనలపై ప్రచారం చేస్తున్నవారిపై కఠినమైన చర్యలు తప్పవని తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపటానికి అవసరం అయితే చట్టంలో మార్పులు కూడా తెస్తామని ఆయన తెలిపారు. వైఎస్ షర్మిల ఫిర్యాదు అందిన మరుక్షణమే కమిషనరేట్ ఆఫ్ పోలీస్తో మాట్లాడి స్పందించాలని కోరినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఆ ఫిర్యాదుపై చురుగ్గా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
అలాగే ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విషయంలోనూ అంతే విధంగా స్పందించామన్నారు. (ఎమ్మెల్యేపై ఓ వ్యక్తి ఫేస్బుక్లో అభ్యంతరకర వ్యాఖ్యలు పెట్టిన విషయం తెలిసిందే). ప్రముఖుల వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి పాల్పడే నిందితుల్ని చట్టానికి లోబడి శిక్షించటం జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. సైబర్ నేరగాళ్ల ఆటలు కట్టించేందుకు గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
కాగా సైబర్ నేరాల వెనక ఉన్నవారిని కూడా ఉపేక్షించకూడదని న్యాయవాదులు, పోలీసులు అభిప్రాయపడుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడివారికి మూడు నెలల నుంచి 7 సంవత్సరాల వరకూ శిక్షపడే అవకాశం ఉందని సీసీఎస్ డీసీపీ పాలరాజు తెలిపారు. బాధితుల్లో మహిళలే ఎక్కువమంది అని, వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.