సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఆర్మూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ప్రపంచం మొత్తం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కరోనా నియంత్రణకు సీఎం ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేశారని, అవసరమైతే మరో 5 వేలకోట్లు ఇవ్వడానికి సిద్ధం అని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడారు.
ఇప్పటికే పాఠశాలలు, సినిమా హాళ్లు, పార్కులు, పబ్‌లు మూసేశారని జీవన్‌రెడ్డి తెలిపారు. కానీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరోనాపై చర్యలే తీసుకోవడం లేదని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలను ప్రజలంతా హర్షిస్తే కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీలతో సంబంధంలో లేకుండా అన్ని రాష్ట్రాలు కరోనాను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. దేశానికి పట్టిన అసలు కరోన కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. కరోన నియంత్రణలో ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ప్రజలు స్వచ్ఛందంగా సినిమా హాల్లు, పబ్‌లు మూసేయాలని ఎమ్మెల్యే కోరారు.
Comments
Please login to add a commentAdd a comment