సాక్షి, నిజామాబాద్: బంగ్లాదేశీయులకు భారత పాస్‌పోర్టుల కుంభకోణంపై రాజకీయ దుమారం రేగుతోంది. అధికార టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌కు చెందిన వారికి బోగస్ ఆధార్‌కార్డులతో పాసుపోర్టులు జారీ చేసిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విధితమే. ఈ కుంభకోణంలో స్పెషల్‌బ్రాంచ్ ఎస్సై, ఏఎస్సైలు, మీ సేవా కేంద్రాల నిర్వాహకులతో పాటు, పాస్‌పోర్టులు పొందిన వారిలో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు.
అయితే పాస్‌పోర్టుల జారీ అంశంపై బీజేపీ మాటల యుద్ధానికి తెరతీసింది. బోధన్ కేంద్రంగా నకిలీ ఆధార్‌కార్డులను సృష్టించి రోహింగ్యాలు పాస్‌పోర్టుల పొందడం వెనుక స్థానిక ఎమ్మెల్యే షకీల్ హస్తం ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఓటర్ లిస్టులో కూడా ఓ వర్గానికి చెందిన బోగస్ ఓటర్లను చేర్చారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చాక జారీ అయిన పాస్‌పోర్టులు, ఆధార్‌కార్డులపై రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎట్టకేలకు టీఆర్‌ఎస్ స్పందించింది. ఈ స్కాంను రాష్ట్ర ప్రభుత్వమే వెలుగులోకి తెచ్చిందని షకీల్ పేర్కొన్నారు. ఒక్క రోహింగ్యాకు పాస్‌పోర్టు జారీచేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకునే ప్రయత్నం
పాస్‌పోర్టుల జారీ వ్యవహారంపై రాష్ట్ర సర్కారుపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుండగా, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకునే ప్రయత్నం జరుగుతుండడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్నట్లయింది. భారత పాస్‌పోర్టులతో ఇద్దరు రోహింగ్యాలు దేశం దాటి వెళ్లిపోతుంటే ఇమిగ్రేషన్ అధికారులే పట్టుకున్నారని బీజేపీ పేర్కొంటోంది.
ఒకే ఇంటి నుంచి పదుల సంఖ్యలో పాస్‌పోర్టుల జారీ వెనుక రాష్ట్ర పోలీసు విభాగంలోని ఎస్‌బీ అధికారుల లోపంతోనే ఈ పాస్‌పోర్టులు జారీ అయ్యాయని చెబుతున్నారు. దీనిపై టీఆర్‌ఎస్ స్పందిస్తూ జాతీయ భద్రతకే ముప్పుపొంచి ఉండే విధంగా పాస్‌పోర్టులు జారీ అవుతుంటే కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీసెర్చ్ ఎనాలసిస్ వింగ్ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాలు ఏం చేస్తున్నాయని టీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది.
సోషల్ మీడియా వేదికగా..
దొంగ పాస్‌పోర్టుల వ్యవహారంపై సోషల్ మీడియాలోనూ పొలిటికల్ వార్ కొనసాగుతోంది. ఈ అంశంపై బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ పోటాపోటీగా పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులు ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment