మొదట వారిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. కానీ, ఇప్పుడు వ్యక్తిగత శత్రువులు. రెండు పార్టీల మధ్య రాజకీయాలకే పరిమితం కావల్సిన వైరం.. ఇద్దరు నేతలు వ్యక్తిగతంగా తిట్టుకునే వరకు ఎందుకు వచ్చింది? గత లోక్ సభ ఎన్నికలప్పుడు మొదలైన రగడ.. రానురాను కత్తులు మింగి.. నిప్పులు కక్కేవరకూ ఎందుకు దారితీసింది? ఎంపీ అరవింద్.. ఎమ్మెల్సీ కవిత మధ్య సింహం వర్సెస్ సివంగిలా సాగుతున్న యుద్ధం వెనుక కారణాలేంటీ?
2019లో మారిన సీను
2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి లోక్సభకు ఎన్నికైన కల్వకుంట్ల కవిత.. తానిచ్చిన హామీలు నెరవేర్చలేదనే అభిప్రాయాన్ని తీసుకురావడంలో బీజేపీ నేతలు సక్సెసయ్యారు. ఎంపీ అభ్యర్థిగా బీజేపీ టిక్కెట్ సాధించుకునే క్రమంలో ధర్మపురి అరవింద్ దీన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పాదయాత్ర చేపట్టారు. చెరకు ఫ్యాక్టరీలు తెరిపించకపోవడంపై టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు అరవింద్.
తనను పార్లమెంట్‌కు పంపిస్తే ఫ్యాక్టరీలను తెరిపించడంతో పాటు.. నిజామాబాద్లో పసుపు బోర్డ్ ఏర్పాటు చేయిస్తానంటూ ఏకంగా బాండ్ పేపర్‌తో రైతుల విశ్వాసాన్ని చూరగొన్నారు. తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకునే క్రమంలో కొంత యారగెంట్‌గా మాట్లాడటాన్నే తన శైలిగా మార్చుకున్నారు ధర్మపురి అరవింద్. అరవింద్ విమర్శలు, పాదయాత్ర, పసుపు రైతుల మూకుమ్మడి నామినేషన్లు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే కవితకు సహకరించకపోవడం వంటివెన్నో కారణాలు కవిత ఓటమికి కారణాలయ్యాయి. అవన్నీ ధర్మపురి అరవింద్ విజయానికి దారి తీసాయి.
మాటలు.. మంటలు
అరవింద్ ఎంపీగా విజయం సాధించడంతో పాటు..ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో.. నిజామాబాద్ కార్పోరేషన్ లో కూడా 28 డివిజన్లు గెల్చుకుని.. టీఆర్ఎస్ తో ఢీ అంట్ ఢీ అనే పార్టీగా స్థానికంగా నిజామాబాద్ జిల్లాలో కమలం పార్టీ అవతరించింది. గతంలో ఎమ్మెల్యేగా యెండల లక్ష్మీనారాయణ గెల్చినా... అరవింద్ గెలుపు తర్వాత.. కాషాయజెండా బలం మరింత పెరిగింది. దాంతో అరవింద్‌కు గెలుపిచ్చిన కిక్కుతో... కవితపై, కేసీఆర్‌పై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం ఎక్కువైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్టుగా కవిత మళ్లీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నిజామాబాద్ నుంచి గెలిచారు. ఆ గెలుపు పైన కూడా అరవింద్ సెటైర్లు వేయడంతో... కవిత వర్సెస్ అరవింద్ మాటల యుద్ధం ముదిరింది.
పార్లమెంటుకా? అసెంబ్లీకా?
వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న బీజేపి ఎంపీలందరినీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని బీజేపి అధిష్ఠానం యోచిస్తున్నట్టుగా ప్రచారం ఊపందుకోవడంతో... ఎంపీ అరవింద్ ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతారని.. బాల్కొండ నుంచి కూడా దిగే అవకాశాలున్నట్టు.. అలాగే నిజామాబాద్ రూరల్, అర్బన్ వంటి నియోజకవర్గాలపైనా దృష్టి సారించారంటూ రకరకాల ప్రచారాలు ఊపందుకున్నాయి.
అరవింద్ వర్సెస్ కవిత కాస్తా... అరవింద్ వర్సెస్ టీఆర్ఎస్‌గా మారడంతో.. అరవింద్ ఎక్కడికెళ్లితే అక్కడ అడ్డుకోవడాలు సాధారణ విషయాలుగా మారాయి. ఆర్మూరు మండలం ఇసాపల్లిలో పసుపు రైతులు అరవింద్‌ను అడ్డుకుని ఆయన కారు అద్దాలు ధ్వంసం చేయడం గతంలో ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత ఇందల్వాయి మండలంలోనూ శివాజీ విగ్రహావిష్కరణ సమయంలోనూ... దర్పల్లి, మోపాల్ వంటి ప్రాంతాల్లోనూ అరవింద్ ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడమూ ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణాన్ని సృష్టించింది.
నోరు జారింది.. అద్దం పగిలింది
కొంతకాలం పాటు నిజామాబాద్లో వాతావరణం స్తబ్దుగా మారింది. తాను ఎంపీగా గెలవడానికీ...తర్వాత తనను తాను లైమ్ లైట్ లో ఉంచుకోవడానికి... కవితను, కల్వకుంట్ల కుటుంబాన్నే అరవింద్ ఎక్కువ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇది కాస్తా ప్రత్యర్థి పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల స్థాయి నుంచి వ్యక్తిగత శత్రుత్వంగా మారింది. కవిత కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో టచ్ లో ఉన్నారని... ఆమెకు బీఆర్ఎస్లో ఎలాంటి పాత్ర ఇవ్వకపోవడమే అందుకు కారణమన్నట్టుగా అరవింద్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి ప్రత్యర్థుల మధ్య అగ్గి రాజుకుంది.
ఇదే సమయంలో హైదరాబాద్ లో అరవింద్ తల్లి ఒక్కరే ఉన్న సమయంలో టీఆర్ఎస్ నేతలు ఆయన ఇంటిపై దాడికి దిగి ఫర్నీచర్, ఇంటి అద్దాలు ధ్వంసం చేయడంతో మరింత రచ్చకు దారి తీసింది. ఏకంగా గవర్నర్ ఇన్వాల్వ్ కావడం...అరవింద్ కు టాప్ టు బాటమ్ పార్టీ నేతల నుంచి సానుభూతి పెరిగింది. మరోవైపు అరవింద్ ఇంటిపై దాడిని ఓ సామాజికవర్గపు ఎంపీ ఇంటిపై దాడి అంటూ కులరంగు పులమడం మరింత అగ్గి రాజుకునేలా చేసింది. కవితకు మద్దతుగా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. చివరకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య వ్యక్తిగత పోరుగా మారిపోయింది.
ఏడాది ముందే గరం గరం
ఇద్దరు ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య తలెత్తిన కొత్త పోరు ఇప్పుడు జిల్లాలో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది. పైగా ఎక్కడ పోటీ చేస్తే అక్కడి కొచ్చి ఓడిస్తానని కవిత సవాల్ విసరడం... దమ్ముంటే ఆర్మూర్‌లో నాపై గెలువు అని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అరవింద్కు ఛాలెంజ్ చేయడం పోరు మరింత రసవత్తరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో అరవింద్ ఎక్కడ నిలబడుతాడోనన్న చర్చకు ఫుల్ స్టాప్ పెడుతున్నట్లుగా.. తాను నిజామాబాద్‌లోనే మళ్లీ పోటీ చేస్తానని అరవింద్ ప్రకటించారు. చూడాలి.. ముందు ముందు ఈ ఇద్దరు నేతల మధ్య పోరు ఎక్కడకు దారితీస్తుందో..?
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment