సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. కల్వకుంట్ల కవిత భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇప్పుడు జిల్లాలో మరో ఎమ్మెల్సీ పదవి అంశం తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆకుల లలిత పదవీకాలం మరో ఆరు నెలల్లో ముగియనుంది. దీంతో మరో నాలుగైదు నెలల్లో ఈ స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయి. దీంతో ఈ ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై ఇప్పటి నుంచే ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆకుల లలితనే మరో టర్మ్ పొడిగిస్తారా..? లేదా ఈ స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారా..? అనే అంశంపై టీఆర్‌ఎస్‌లో చర్చ షురువైంది. ఎమ్మెల్యేల కోటా కావడంతో జిల్లాకు చెందిన వారికే అవకాశం ఇస్తారా..? మరో జిల్లాకు చెందిన వారిని ఈ పదవి వరిస్తుందా..? వంటి ఉహాగానాలు అధికార పార్టీలో నెలకొన్నాయి. (పెద్దల అనుమతితో ప్రేమ వివాహం: నందిని)
కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి..
ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగిన ఆమె 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికలు ముగిసిన పక్షం రోజుల్లోనే ఆమె పార్టీ మారడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎన్నో ఏళ్లుగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్ కండువా కప్పుకోవడం కలకలం రేగింది. ఇప్పుడు ఆకుల లలిత పదవీకాలం కొన్నినెలల్లోనే ముగుస్తుండడంతో ఈ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై చర్చ మొదలైంది. (హైదరాబాద్‌కు అంకాపూర్ చికెన్)
అధినేత ఆశీస్సులెవ్వరికో..
ఎమ్మెల్సీ పదవి విషయంలో పార్టీలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎంపీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆయనకు అధినేత అవకాశం కల్పించే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. అలాగే జిల్లాకు చెందిన పలువురు ద్వితీయశ్రేణి నాయకుల పేర్లపై కూడా అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఆర్మూర్‌కు చెందిన డాక్టర్ మధుశేఖర్, జెడ్పీ మాజీ వైస్ చైర్‌పర్సన్ గడ్డం సుమనారెడ్డితో పాటు, మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులు ఈ పదవిని ఆశిస్తున్నారు. అయితే గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయనే దానిపై కూడా చర్చ జరుగుతోంది.
ఈ పదవి జిల్లాకు దక్కేనా..?
ఎమ్మెల్సీ స్థానం ఎమ్మెల్యేల కోటాలోనిది కావడంతో ఈ పదవి జిల్లా నాయకులకు దక్కుతుందా? ఇతర జిల్లాల నేతలను వరిస్తుందా? అనే చర్చ కూడా కొనసాగుతోంది. మరోవైపు ఆకుల లలితనే మరోమారు ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌లో కొనసాగిన ఆకుల లలిత టీఆర్‌ఎస్‌లో చేరడంలో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కీలకపాత్ర పోషించినట్లు అప్పట్లో చర్చ జరిగింది. విద్యాసాగర్ ఆకుల లలితకు దగ్గరి బంధువు. ఆయన ద్వా రానే ఆమె టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి మరో టర్మ్ కొనసాగిస్తారనే పక్కా హామీతోనే లలిత టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ఊహాగానాలున్నాయి. మొత్తం మీద సీఎం ఎవరికి అవ కాశం కల్పిస్తారనేదానిపై ఉత్కంఠ కొనసాగనుంది.
ఆకుల లలితకు మళ్లీ అవకాశం దక్కేనా..!
Published Sun, Nov 1 2020 9:01 AM | Last Updated on Sun, Nov 1 2020 3:19 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment