Akula Lalitha
-
నిజామాబాద్ అర్బన్‌లో బీఆర్ఎస్ హడావుడి.. కవిత సైతం అక్కడి నుంచే పోటీ!
సాక్షి, నిజామాబాద్: సిట్టింగులకే మరోసారి టికెట్లు అని సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటికీ బీఆర్ఎస్ నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్టు దక్కించుకునేందుకు రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలలుగా నగరంలో విస్తృతంగా తిరుగుతున్నారు. మొదట తన సామాజికవర్గమైన మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మున్నూరుకాపు మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తూ, మరోవైపు వివాహాలకు, పరామర్శలకు వెళ్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్ పుట్టినరోజు, కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా అడుగడుగునా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పార్టీ నాయకత్వం తనకు అర్బన్ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు లలిత చెబుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇక్కడ తిరిగేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో మైనారిటీల తర్వాత అత్యధికంగా ఉన్నది మున్నూరుకాపు ఓట్లే కావడంతో ఈ కోటాలో తనకు కచ్చితంగా టిక్కెట్ దక్కుతుందని లలిత భావిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. అనేక మలుపులు. పూర్తి డైనమిక్‌గా ఉండే రాజకీయాల్లో ఆకుల లలిత రాజకీయ జీవితం ఇటీవల కాలంలో అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. తనకు తృటిలో ఎమ్మెల్సీ టికెట్ జారిపోవడంతో నామినేటెడ్ పోస్టుతో సరిపెట్టుకున్నారు. ఈ ప్రొటోకాల్‌తో నగరంలో తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో అర్బన్ టికెట్ రేసులో ఉన్నట్లు చెప్పకనే చెబుతున్నారు. 2008 ఉపఎన్నికల్లో డిచ్పల్లి నుంచి కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన లలిత 2009లో నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2016లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. అయితే పోలింగ్‌కు మూడు రోజుల ముందే బీఆర్ఎస్తో అంతర్గత ఒప్పందం చేసుకుని అస్త్రసన్యాసం చేసినట్లు రాజకీయ వర్గాలతో పాటు ఇతర అన్నివర్గాలు కోడై కూస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు రాకముందే బీఆర్ఎస్లో చేరారు. మరోసారి ఎమ్మెల్సీ పదవి కొనసాగింపు కోసం కేసీఆర్ నుంచి హామీ తీసుకుని తన వియ్యంకుడు నేతి విద్యాసాగర్‌తో కలిసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఎమ్మెల్సీ అవకాశం మరోసారి దక్కలేదు. ఎంపీగా ఓటమిపాలైన కేసీఆర్ కుమార్తె కవితకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో లలితకు నిరాశే మిగిలింది. చివరకు రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం కవిత మహిళా బిల్లు కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్న నేపథ్యంలో మహిళా కోటా, మున్నూరుకాపు కోటాలో అర్బన్ టికెట్ కోసం ఆశలు పెట్టుకుని నగరంలో తిరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే కవిత కూడా అర్బన్ నుంచి పోటీ చేయవచ్చనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో లలితకు మరోసారి కవిత రూపంలో అడ్డంకి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా 2018 ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఆకుల లలిత పోటీ చేసినప్పుడు ఆమె వెంట తిరిగిన క్యాడర్‌ను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇబ్బందులు పెట్టడంతో, ఈసారి లలిత ఎక్కడ పోటీ చేసినా వ్యతిరేకంగా పనిచేస్తామని సదరు నాయకులు, కార్యకర్తలు చెబుతుండడం గమనార్హం. -
ఏడాదికి ముందే బలప్రదర్శనలు.. సిట్టింగ్‌ను కాదని.. మాజీ ఎమ్మెల్యే హడావుడి
సాక్షి, నిజామాబాద్ : ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే నిజామాబాద్‌లో నాయకుల బలప్రదర్శనలు షురూ అయ్యాయి. తాజాగా ఎంపీ అర్వింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య నువ్వా నేనా అనేవిధంగా మాటలయుద్ధం ముదిరింది. ఈ నేపథ్యంలో రాజధాని హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాడి వేడి వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ స్థానంలో మరోరకమైన రాజకీయ వాతావరణం ఏర్పడింది. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కోవిధంగా తమ బలాన్ని ప్రదర్శించుకునేందుకు తాపత్రయపడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి సిట్టింగులకు మళ్లీ టిక్కెట్లు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ పలువురు ఎమ్మెల్యేల్లో ఒకింత అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో టీఆర్ఎస్లో టిక్కెట్టు రేసు మొదలైందనేలా నాయకుల కార్యక్రమాలు ఉంటున్నాయి. నిజామాబాద్ అర్బన్‌లో మైనారిటీల తరువాత మున్నూరుకాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత సైతం ఈ స్థానం నుంచి టిక్కెట్టు ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే లలిత నగరంలో మున్నూరుకాపు కార్తీక వనభోజనాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ వస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న లలిత, మరోసారి ఎమ్మెల్సీ హామీని కేసీఆర్ నుంచి పొంది టీఆర్ఎస్లో చేరారు. చివరి నిముషంలో సదరు ఎమ్మెల్సీ స్థానం కల్వకుంట్ల కవితకు కేటాయించారు. లలితకు రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చారు. అయితే లలిత తన సొంత నియోజకవర్గం ఆర్మూర్ బదులు తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ అర్బన్‌ను ఆశిస్తున్నట్లు సమాచారం. మున్నూరుకాపు నుంచి మహిళగా తనకు అవకాశం లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రొటీన్‌గా చేస్తే పట్టించుకోం.. కానీ టార్గెట్‌గా నడుస్తోంది: మంత్రి తలసాని పట్టు జారకుండా.. ఆకుల లలిత కార్యక్రమాల్లో పాల్గొంటుండగానే ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా కార్యక్రమాల్లో దూకు డు పెంచారు. నగర అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇచ్చిన నేపథ్యంలో నగరంలో ఈ నెల 16న భారీ ప్రదర్శన చేయించారు. మళ్లీ తనదే టిక్కెట్టు అన్న ధీమాతో ఉన్న గణేశ్‌గుప్తా పట్టు ఏమాత్రం జారకూడదనే సంకల్పంతో ముందుకు కదులుతున్నారు. ఇదిలా ఉండగా వైశ్య సామాజిక వర్గం నుంచి బీజేపీ తరపున ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బలంగా దూసుకొస్తున్నారు. ధన్‌పాల్‌కు అన్నివర్గాల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఈసారి ఆయనకు బీజేపీ నుంచి టిక్కె ట్టు కచ్చితంగా వస్తుందని వివిధ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటు నుంచి బీజేపీ ద్వారా తన సామాజిక వర్గానికే చెందిన నాయకుడు బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా, మరోవైపు టీఆర్ఎస్ నుంచి ఓట్ల శాతం ఎక్కువగా ఉన్న మున్నూరుకాపు సామాజిక వర్గం నాయకురాలు టిక్కెట్టు ఆశించే పరిస్థితి ఎమ్మెల్యే గణేశ్ గుప్తాకు నెలకొంది. నిజామాబాద్ అర్బన్ నియాజకవర్గంలో టిక్కెట్ల వేట ఇప్పటి నుంచే ప్రారంభమైందని వివిధ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగేదెవరు, ఎంఐఎం బరిలోకి దిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం చోటుచేసుకుంటుందనే రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
TS: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆఖరి నిమిషంలో ట్విస్ట్
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో నిన్నటి వరకు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకులు లలిత పేరు వినిపించింది. (చదవండి: ఎటూ తేల్చని కాంగ్రెస్) కానీ చివరకు అధిష్టానం నిజామాబాద్ నుంచి స్థానికసంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత పేరును ఖరారు చేసింది. రేపు ఉదయం కవిత నామినేషన్ వేయనున్నారు. చివరి వరకూ ఆకుల లలిత పేరు వినిపించినా చివరి నిముషంలో కవిత అభ్యర్థిత్వం ఖరారు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారు.. సగం కొత్తవారికే..! -
ఆకుల లలితకు మళ్లీ అవకాశం దక్కేనా..!
సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. కల్వకుంట్ల కవిత భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇప్పుడు జిల్లాలో మరో ఎమ్మెల్సీ పదవి అంశం తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆకుల లలిత పదవీకాలం మరో ఆరు నెలల్లో ముగియనుంది. దీంతో మరో నాలుగైదు నెలల్లో ఈ స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయి. దీంతో ఈ ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై ఇప్పటి నుంచే ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆకుల లలితనే మరో టర్మ్ పొడిగిస్తారా..? లేదా ఈ స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారా..? అనే అంశంపై టీఆర్ఎస్లో చర్చ షురువైంది. ఎమ్మెల్యేల కోటా కావడంతో జిల్లాకు చెందిన వారికే అవకాశం ఇస్తారా..? మరో జిల్లాకు చెందిన వారిని ఈ పదవి వరిస్తుందా..? వంటి ఉహాగానాలు అధికార పార్టీలో నెలకొన్నాయి. (పెద్దల అనుమతితో ప్రేమ వివాహం: నందిని) కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి.. ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగిన ఆమె 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికలు ముగిసిన పక్షం రోజుల్లోనే ఆమె పార్టీ మారడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎన్నో ఏళ్లుగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్ కండువా కప్పుకోవడం కలకలం రేగింది. ఇప్పుడు ఆకుల లలిత పదవీకాలం కొన్నినెలల్లోనే ముగుస్తుండడంతో ఈ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై చర్చ మొదలైంది. (హైదరాబాద్‌కు అంకాపూర్ చికెన్) అధినేత ఆశీస్సులెవ్వరికో.. ఎమ్మెల్సీ పదవి విషయంలో పార్టీలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎంపీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్లో చేరిన సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆయనకు అధినేత అవకాశం కల్పించే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. అలాగే జిల్లాకు చెందిన పలువురు ద్వితీయశ్రేణి నాయకుల పేర్లపై కూడా అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఆర్మూర్‌కు చెందిన డాక్టర్ మధుశేఖర్, జెడ్పీ మాజీ వైస్ చైర్పర్సన్ గడ్డం సుమనారెడ్డితో పాటు, మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులు ఈ పదవిని ఆశిస్తున్నారు. అయితే గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. ఈ పదవి జిల్లాకు దక్కేనా..? ఎమ్మెల్సీ స్థానం ఎమ్మెల్యేల కోటాలోనిది కావడంతో ఈ పదవి జిల్లా నాయకులకు దక్కుతుందా? ఇతర జిల్లాల నేతలను వరిస్తుందా? అనే చర్చ కూడా కొనసాగుతోంది. మరోవైపు ఆకుల లలితనే మరోమారు ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌లో కొనసాగిన ఆకుల లలిత టీఆర్ఎస్లో చేరడంలో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కీలకపాత్ర పోషించినట్లు అప్పట్లో చర్చ జరిగింది. విద్యాసాగర్ ఆకుల లలితకు దగ్గరి బంధువు. ఆయన ద్వా రానే ఆమె టీఆర్ఎస్లో చేరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి మరో టర్మ్ కొనసాగిస్తారనే పక్కా హామీతోనే లలిత టీఆర్ఎస్లో చేరినట్లు ఊహాగానాలున్నాయి. మొత్తం మీద సీఎం ఎవరికి అవ కాశం కల్పిస్తారనేదానిపై ఉత్కంఠ కొనసాగనుంది. -
ఎవరా ఇద్దరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో ఉండే ఇద్దరు మహిళలు ఎవరనే అంచనాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ తరఫున ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి (మెదక్), గొంగిడి సునీత (ఆలేరు), అజ్మీరా రేఖానాయక్ (ఖానాపూర్) ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆకుల లలిత ఎమ్మెల్సీగా ఉన్నారు. తాజాగా ఎన్నికలు జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ ఖరారు చేసిన అభ్యర్థుల్లో సత్యవతి రాథోడ్ ఉన్నారు. మొత్తం ఐదుగురు సభ్యుల్లో ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కనుంది. గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన పద్మాదేవేందర్‌రెడ్డి తాజా విస్తరణలో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఈసారి పదవి లభించపోవడంతో తదుపరి విస్తరణలో అవకాశం ఉంటుందని ఆమె భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో విప్‌గా పని చేసిన గొంగిడి సునీత సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు బీసీల్లోని ప్రధాన సామాజికవర్గమైన మున్నూరు కాపుల నుంచి మంత్రివర్గంలో ఎవరికీ అవకాశం దక్కలేదు. ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ వర్గం వారే కావడంతో ఈ కోటాలో సీఎం గుర్తిస్తారని భావిస్తున్నారు. మరోవైపు 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన సత్యవతి రాథోడ్ డోర్నకల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డి.ఎస్. రెడ్యానాయక్ చేతిలో ఓడిపోయారు. అనంతరం రెడ్యానాయక్ టీఆర్ఎస్లో చేరినా సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్లోనే కొనసాగుతూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్లో చేరిన సమయంలోనే ఆమెకు మంత్రి పదవి హామీ లభించిందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో సీఎం కాకుండా 17 మంది మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం 11 మంది (సీఎం కాకుండా) మంత్రులు ఉన్నారు. వారిలో ఎస్టీ వర్గానికి, మహిళకు చోటు దక్కలేదు. సత్యవతి రాథోడ్‌కు మంత్రిగా అవకాశం కల్పిస్తే ఆ రెండు కోటాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో సత్యవతి రాథోడ్‌కు మంత్రిగా అవకాశం దక్కుతుందని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు గత ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు వచ్చాయి. ఇదే లెక్కన తదుపరి విస్తరణలో తనకు అవకాశం ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ భావిస్తున్నారు. -
‘కాంగ్రెస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోండి’
నిజామాబాద్: తాను టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోలేదని, కాంగ్రెస్ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్సీ ఆకుల లలిత హితవు పలికారు. నిజామాబాద్ జిల్లాలోని ఇంపీరియల్ గార్డెన్లో ఎమ్మెల్సీ ఆకుల లలిత తన అనుచరులతో ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆకులలలిత మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు చూసే ఆకర్షితురాలిని అయ్యాయని పేర్కొన్నారు. సమస్యలు తీరుస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, కాంగ్రెస్ నుంచి పోతున్న బాధ ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్ఎస్లోకి వెళ్తున్నట్లు తెలిపారు. ఎంపీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్సీ స్ధాయి వరకు కాంగ్రెస్ పార్టీయే అన్నీ ఇచ్చిందని వెల్లడించారు. కానీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని అందువల్లే పార్టీ మారాల్సి వస్తోందని వివరించారు. ఎన్నికల్లో కేసీఆర్ పథకాలతోనే సైలెంట్ ఓటింగ్ జరిగిందన్నారు. సమస్యలు పరిష్కరించాలంటే టీఆర్ఎస్లో చేరక తప్పడం లేదన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని, అధైర్యపడవద్దన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో, మీ అందరితో కలిసి గులాబీ కండువా వేసుకుంటానని చెప్పారు. -
కౌన్సిల్ గులాబీమయం.. కాంగ్రెస్ ఖాళీ!
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి రెండోసారి అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్... శాసనమండలిలో పూర్తిస్థాయి ఆధిక్యం దిశగా వేసిన రాజకీయ వ్యూహం విజయవంతమైంది. కాంగ్రెస్‌కు చెందిన మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీలలో నలుగురు టీఆర్ఎస్లో విలీనం కావాలని నిర్ణయించుకోవడంతో ఒక్క రోజులోనే శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా సైతం లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్‌కు ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎం.ఎస్. ప్రభాకర్, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి గతంలోనే టీఆర్ఎస్లో చేరారు. ఇదే పార్టీకి చెందిన ఆకుల లలిత, టి.సంతోష్ కుమార్ గురువారం సీఎం కేసీఆర్‌ను కలవడంతో వారు టీఆర్ఎస్లో చేరడం ఖాయమైపోయింది. కాంగ్రెస్‌కు ఉన్న ఆరుగురు ఎమ్మెల్సీలలో నలుగురు టీఆర్ఎస్ వైపు రావడంతో అధికార పార్టీ వెంటనే వ్యూహం సిద్ధం చేసింది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకే శాసనమండలికి చేరుకున్నారు. శాసనమండలి చైర్మన్ వి. స్వామిగౌడ్ కార్యాలయానికి రాగానే ఆయ నను కలసి కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్ శాసనమండలి పక్షంలో విలీనం చేయాలని కోరుతూ లేఖ సమర్పించారు. ‘శాసనమండలి ఆవరణలో మేము నలుగురం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించుకున్నాం. కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్ పక్షంలో విలీనం చేయాలని ఈ భేటీలో నిర్ణయించుకున్నాం. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని నాలుగో పేరా ప్రకారం మా వినతిని పరిశీలించగలరు’అని కోరుతూ నలుగురు ఎమ్మెల్సీల సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు. ఒక పార్టీ తరఫునన గెలిచిన చట్టసభ్యులలో మెజారిటీ సంఖ్యలో ఉన్న వారు వేరే పార్టీలో విలీనం అయితే వారిపై అనర్హత వేటు పడదనే నిబంధన ప్రకారం నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నాలుగో పేరా పేర్కొంటోందని వివరించారు. అనంతరం నలుగురు ఎమ్మెల్సీల లేఖను శాసనమండలి చైర్మన్ వి. స్వామిగౌడ్ పరిశీలించారు. తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్ శాసనమండలిపక్షంలో విలీనం చేస్తూ సాయంత్రం ఆరు గంటలకు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్, ఆకుల లలిత, టి. సంతోష్ కుమార్, కె. దామోదర్‌రెడ్డిలను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యలు వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిర్ణయంతో శాసనమండలిలో కాంగ్రెస్ తరఫున మహమ్మద్ షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మిలిగారు. ఇద్దరు సభ్యులే ఉండటంతో శాసనమండలిలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. ఎమ్మెల్యేలూ జంప్ చేస్తే మండలిలో కాంగ్రెస్ సున్నాయే... శాసనమండలిలో 40 మంది సభ్యులు ఉంటారు. తాజా పరిణామాల అనంతరం టీఆర్ఎస్కు 31 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు, స్వతంత్రులు ఇద్దరు... మజ్లిస్, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి రాజీనామాలతో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యులుగా ఉన్న షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనుంది. దైవార్షిక ఎన్నికల్లో భాగంగా వచ్చే ఫిబ్రవరి, మార్చిలో శాసనమండలికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియలో దాదాపు 16 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ స్థానాలు ఆరు ఖాళీ అవుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కె. యాదవరెడ్డిపై వేటు వేస్తే ఈ సంఖ్య ఏడుకు చేరుతుంది. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే కోటా ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలోనే ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు ఒక స్థానం వస్తుంది. అయితే ఎన్నికల నాటికి సమీకరణలు మారి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యలో మార్పులు జరిగితే ఆ ఒక్క సీటూ హస్తం పార్టీకి దక్కే అవకాశం ఉండదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే జరిగితే శాసనమండలిలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం సైతం లేకుండా పోయే పరిస్థితి ఉండనుంది. రాజ్యాంగం ప్రకారమే నిర్ణయం: ఎం.ఎస్.ప్రభాకర్ కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. నలుగురం టీఆర్ఎస్ఎల్పీలో విలీనం కావాలని ముందుకొచ్చాం. రాజ్యాంగం ప్రకారం మూడింట రెండోవంతు మంది సభ్యులు ఇలా నిర్ణయం తీసుకోవచ్చు. నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ స్వామిగౌడ్ చెప్పారు. కాంగ్రెస్‌లో మాకు ఎన్నో అవమానాలు జరిగాయి. టీడీపీతో పొత్తు ముంచింది: టి. సంతోష్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ కొంపముంచింది. మా ఎవరితో చెప్పకుండా పొత్తు ఎలా పెట్టుకున్నారు? కాంగ్రెస్‌లో నాయకత్వ లేమి ఉంది. అందుకే టీఆర్ఎస్లో విలీనం కావాలని నిర్ణయం తీసుకున్నాం. మేము ప్రజల వైపు: ఆకుల లలిత మేము ప్రజలవైపు ఉండాలనుకుంటున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు తగిన గౌరవం ఇస్తారని భావిస్తున్నాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తాం. నేడు కొండా మురళీ రాజీనామా... ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు శనివారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. శుక్రవారమే మురళీ రాజీనామా చేయాల్సి ఉంది. అయితే శానసమండలి చైర్మన్ కార్యాలయం శనివారం సమయం ఇచ్చినందున మురళీ రాజీనామా నిర్ణయం వాయిదా పడినట్లు తెలిసింది. కొండా మురళీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. -
హస్తానికి గులాబీ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ శాసనమండలి సభ్యులు ఆకుల లలిత, టి.సంతోష్ కుమార్ గురువారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆకుల లలిత ఆర్మూర్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆకుల లలిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. 2015లో ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి ఆమె ఎన్నికయ్యారు. గతంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. 2008 ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా డిచ్పల్లి నుంచి ఎన్నికయ్యారు. ఆకుల లలిత టీఆర్ఎస్లో చేరడం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హస్తం పార్టీకి బలమైనదెబ్బని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు టి. సంతోష్ కుమార్ 2013లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 40 మంది సభ్యులుగల శాసన మండలిలో ప్రస్తుతం షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాత్రమే మిగిలారు. వారిద్దరి పదవీకాలం మార్చి ఆఖరుతో ముగియనుంది. వారి పదవీకాలం ముగిశాక మండలిలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేకుండాపోయే పరిస్థితి నెలకొంది. అదేబాటలో ఎమ్మెల్యేలు..! ఆకుల లలిత, టి. సంతోష్ కుమార్ బాటలోనే మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ తొలి సమావేశానికి ముందే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వస్తారని పేర్కొంటున్నాయి. -
‘మోసం చేయాలని చూశాడు’
సాక్షి, హైదరాబాద్: తనను మోసం చేసేందుకు తోట బాలాజీనాయుడు అనే వ్యక్తి ప్రయత్నించిన మాట వాస్తమేనని తెలంగాణ ఎమ్మెల్సీ ఆకుల లలిత తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... అతడిపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే రూ. 2 కోట్ల నిధులు వస్తాయని తనను నమ్మించే ప్రయత్నం చేశాడని వెల్లడించారు. బాలాజీ వ్యవహారంపై అనుమానం వచ్చి ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టి అతడిని అరెస్ట్ చేశారని తెలిపారు. కాగా, ఇప్పటివరకు 19 సార్లు జైలుకు వెళ్లొచ్చిన బాలాజీనాయుడు ప్రముఖులను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ప్రభుత్వ పథకాలు పేరు చెప్పి ఇప్పటి వరకు 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు టోపీ పెట్టాడు. ఏపీ, తెలంగాణల్లోని 29 పోలీస్స్టేషన్లలో ఇతడిపై కేసులున్నాయి. ఈ ఏడాది జనవరిలో జైలు నుంచి విడుదలైన అతడు తాజాగా పోలీసులకు చిక్కాడు. -
మద్యపాన నిషేధం విధించాలి
రాష్ర్టంలో మద్యపానం నిషేధం విధించాలి. ఒకవైపు బలహీనవర్గాల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామంటూనే చీప్ లిక్కర్‌తో బడుగుల జీవితాలను కొల్లగొట్టి, వారి ఆరోగ్యాలను గుల్ల చేస్తున్నారు. ఇతర రూపాల్లో ఆదాయం కోసం ప్రయత్నించాలి. యాదగిరిగుట్ట, వేములవాడ గుళ్లకు బడ్జెట్ కేటాయించి, చదువుల తల్లి సరస్వతి దేవాలయం బాసర పట్ల చిన్నచూపు సరికాదు. సొంత వనరులు లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యం..? - ఆకుల లలిత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ -
డీఎస్ మాకు చేసిందేమీ లేదు: లలిత
నిజామాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తమకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ పీసీసీ అధ్యక్షుడు ఇప్పించారని తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... బలహీన వర్గాలకు న్యాయం చేశామంటున్న డీఎస్ ఇప్పటివరకు ఎంతమందిని పైకి తీసుకొచ్చారని ప్రశ్నించారు. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసినా, ఆయన శిష్యురాలిని కాబట్టి ఊరుకున్నానని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర కారణంగానే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. -
'ఆకుల లలిత గెలుపు ఖాయం'
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఆకుల లలిత గెలవడం ఖాయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. శుక్రవారంఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను గౌరవించడం లేదని ఆరోపించారు. అందుకు కేసీఆర్ మంత్రి వర్గంలో ఒక్క మహిళ కూడా లేక పోవడమే అందుకు నిదర్శనమన్నారు. డ్వాక్రా మహిళల గ్రూపులను కూడా కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఉత్తమ్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
రంగంలోకి దిగుతున్న ఢిల్లీ దూతలు
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలికి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. పార్టీ అభ్యర్థి ఆకుల లలితను గెలిపించుకునేలా అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు వాయలార్ రవి, గులాం నబీ ఆజాద్ గురువారం మధ్యాహ్నం హస్తిన నుంచి హైదరాబాద్ రానున్నారు. సీఎల్పీలో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం శుక్రవారం భేటీ కానుంది. పార్టీలో ఉన్న అసంతృప్తులను ఏకతాటిపై తెచ్చేందుకు ఢిల్లీ దూతలు రంగంలోకి దిగుతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ పదవి కోసం ఆశలు పెట్టుకున్న నేతలకు ...ఆకుల లలిత అభ్యర్థిత్వంపై అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఆమె గెలుపుపై అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఎమ్మెల్సీ సీటు కోసం టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఆయన కోడలు పొన్నాల వైశాలి కూడా తీవ్రంగా ప్రయత్నించారు. వీరితో పాటు మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్‌తో పాటు పలువురు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ జిల్లాలకు చెందిన 40 మంది సీనియర్లు చివరిదాకా ప్రయత్నించారు. ఆకుల లలితను అధిష్టానం ఎంపిక చేయడంతో పలువురు సీనియర్లు అలకబూనారు.ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. -
లలితకే టికెట్
-
లలితకే టికెట్
* మహిళా కోటాలో హైకమాండ్ నిర్ణయం * డి. శ్రీనివాస్‌కు తప్పని నిరాశ * ఏఐసీసీలో చోటు లభించే అవకాశం! * టీఆర్ఎస్ నేతలకూ ఈసారి నో * టీడీపీలో ‘అరికెల’ ప్రయత్నం వృథా! సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్కంఠ తొలగిపోయింది. ఎమ్మెల్యేల కోటా కింద శాసనమండలి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు ఆకుల లలిత పేరును బుధవారం సాయంత్రం ఖరారు చేసింది. గురువారమే నామినేష్లకు చివరి గడువు కావడంతో పార్టీ అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందోనని ఆశావహులు ఉత్కంఠతో ఎదురు చూశారు. చివరకు ఆకుల లలిత పేరును ప్రకటించడంతో సస్పెన్స్ వీడిపోయింది. దీంతో ఆమె వర్గీయులు రాత్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ పదవి కోసం శాసనమండలి లో విపక్ష మాజీ నేత డి.శ్రీనివాస్ తీవ్రంగా ప్రయత్నించారు. సీనియర్ నాయకుడిగా రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత తనదేనని, ఈసారి కూడ ఎమ్మెల్సీ టిక్కెట్టు తనకే దక్కుతుందని మొదటి నుంచి డీఎస్ ఎంతో భరోసాగా ఉన్నారు. కానీ, పరిస్థితులు అనుకూలించ లేదు. తన రాజకీయ గురువుగా భావించే డీఎస్‌పై ఆకుల లలిత పైచేయి సాధించారు. మహిళా కోటాలో ఆమెకు అదృష్టం వరించింది. సీడబ్ల్యూసీలోకి డీఎస్! కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఇటీవలే శాసనమండలి విపక్ష నేతగా పదవీ విరమణ చేసిన ధర్మపురి శ్రీనివాస్‌కు అవకాశం ఉంటుందని భావించినా హైకమాండ్ లలిత వైపే మొగ్గు చూపింది. చాలా మంది పోటీపడినా, అధిష్టానం వద్ద లాబీరుుంగ్ చేసినా, వారికి ప్రయోజనం లేకుండాపోయింది. డీఎస్ కూడా మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేం దుకు గట్టి ప్రయత్నమే చేశారు. కానీ, మహిళకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణరుుంచడంతో ఆయన కోరిక నెరవేరకుండా పోయింది. మరోవైపు జిల్లాలోని కాంగ్రెస్ గ్రూపులన్నీ లలితవైపే నిలవడంతో డీఎస్ ఒంటరయ్యూరని తెలుస్తోం ది. శాసనమండలిలో విపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బొమ్మా మహేశ్‌కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ తదితరులు ఆకుల లలితకే టికెట్ వచ్చేలా కృషి చేశారని సమాచారం.అయితే, పార్టీకి దీర్ఘకాలంగా సేవలను అందిస్తూ వచ్చిన డీఎస్‌కు పార్టీలోనే మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఏఐసీసీలోగానీ, పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీలోగానీ చోటు కల్పిస్తామని డీఎస్‌కు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన కూడా అందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం. టీఆర్ఎస్ నేతలకు నిరాశే! సాధారణ ఎన్నికలలో తిరుగులేని విజయూలను సాధించినప్పటికీ, కొన్ని సమీకరణాల కారణంగా జిల్లా టీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్సీ అవకాశం ఉండబోదని స మాచారం. ఈ విషయూన్ని టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే ఆశావహ నేతలకు స్పష్టం చేసిందని చెబుతున్నారు. ఆరింటిలో నాలుగు స్థానాలకే పార్టీ పోటీచేసే అవకాశం ఉన్నందున, ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నవారికి అవకాశం ఇవ్వాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా, ఎ మ్మెల్సీ టికెట్ ఇస్తామని చెప్పిన నేతలకు ‘స్థానిక సంస్థల’లో అవకాశం ఇస్తామ ని నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. దీంతో పలువురు నేతలు నిరాశకు గురయ్యారు. టీడీపీలోనూ అంతే టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఇంకా ఆశలు వదులుకోలేదు. త్రీమెన్ కమిటీ నిర్ణయంపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది. మ రోవైపు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఏ నిర్ణయం వెలువడలేదు. 1983 నుంచి పార్టీలో కొనసాగుతూ మండల కన్వీనర్ నుంచి శా సనమండలి నేత వరకు ఎదిగిన ‘అరికెల’ టీఆర్ఎస్ గాలం వేసినా పార్టీ వీడలేదు. ఆయనకు అవకాశం ఉంటుందా లేదా అన్నది గురువారం ఉదయం వరకు తేలిపోవచ్చు. -
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత
- అలిగిన పార్టీ సీనియర్లు హైదరాబాద్: శాసనసభ్యుల కోటా నుంచి శాసనమండలికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకుల లలిత పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఆమె గురువారం ఉదయం నామినేషన్ వేయనున్నట్టుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి బుధవారం వెల్లడించారు. ఎమ్మెల్సీ సీటు కోసం టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఆయన కోడలు పొన్నాల వైశాలి కూడా తీవ్రంగా ప్రయత్నించారు. వీరితో పాటు మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్‌తో పాటు పలువురు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ జిల్లాలకు చెందిన 40 మంది సీనియర్లు చివరిదాకా ప్రయత్నించారు. ఆకుల లలితను అధిష్టానం ఎంపిక చేయడంతో పలువురు సీనియర్లు అలకబూనారు. దానం నాగేందర్ రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆకుల లలిత ఎంపికపై పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హర్షం ప్రకటించారు. మహిళలను మంత్రివర్గంలోకి తీసుకోకుండా అవమానించిన టీఆర్ఎస్కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం చెంప దెబ్బ వంటిదని పొన్నం వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ శాసనసభాపక్షం అసెంబ్లీలోని కార్యాలయంలో గురువారం సమావేశం కానుంది. ఆకుల లలిత అభ్యర్థిత్వంపై ఈ భేటీలో అధికారిక ప్రకటన, అనంతరం నామినేషన్ ప్రక్రియ ఉంటుందని విప్ సంపత్‌కుమార్ వెల్లడించారు. పార్టీలో కొనసాగలేను: దానం ఈమెయిల్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై దానం నాగేందర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న సమయంలో ఆకుల లలితను ఎంపిక చేయడం చాలా పెద్ద తప్పు అని, పార్టీ సీనియర్లను అవమానిస్తూ ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీలో కొనసాగలేనంటూ అధిష్టానవర్గానికి దానం నాగేందర్ ఈమెయిల్ చేసినట్లుగా తెలిసింది. -
రేణుకా చౌదరి, బలరాం నాయక్ వర్గీయుల ఘర్షణ
హైదరాబాద్: కాంగ్రెస్ సీట్ల కేటాయింపు విషయమై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, కేంద్ర మంత్రి బలరాం నాయక్ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. రేణుకా చౌదరి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. అదే సమయంలో టికెట్ వస్తుందని ఆశించి, రాని వారు కూడా పొన్నాల నివాసం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, మరికొందరు మహిళా నేతలు కూడా వచ్చారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన తనకే టికెట్ ఇవ్వలేదని లలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక రాష్ట్ర నేతలు ఉన్నారని ఆమె ఆరోపించారు. పొన్నాల వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తరువాత బాన్సువాడ నుంచి పోటీ చేయమని ఆయన లలితను కోరారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. తాను నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఆ టికెట్‌ను తనకు కాకుండా మరో నేతకు కేటాయించడం బాధాకరం అన్నారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి, బలరాం నాయక్ వర్గీయుల గొడవపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు గల్లంతు కావడానికి బలరాం నాయక్ కారణమంటూ రేణుక వర్గీయుల ఘర్షణకు దిగారు.