సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి రెండోసారి అధికారాన్ని చేపట్టిన టీఆర్‌ఎస్... శాసనమండలిలో పూర్తిస్థాయి ఆధిక్యం దిశగా వేసిన రాజకీయ వ్యూహం విజయవంతమైంది. కాంగ్రెస్‌కు చెందిన మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీలలో నలుగురు టీఆర్‌ఎస్‌లో విలీనం కావాలని నిర్ణయించుకోవడంతో ఒక్క రోజులోనే శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా సైతం లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్‌కు ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎం.ఎస్. ప్రభాకర్, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి గతంలోనే టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇదే పార్టీకి చెందిన ఆకుల లలిత, టి.సంతోష్ కుమార్ గురువారం సీఎం కేసీఆర్‌ను కలవడంతో వారు టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైపోయింది. కాంగ్రెస్‌కు ఉన్న ఆరుగురు ఎమ్మెల్సీలలో నలుగురు టీఆర్‌ఎస్ వైపు రావడంతో అధికార పార్టీ వెంటనే వ్యూహం సిద్ధం చేసింది.
నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకే శాసనమండలికి చేరుకున్నారు. శాసనమండలి చైర్మన్ వి. స్వామిగౌడ్ కార్యాలయానికి రాగానే ఆయ నను కలసి కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్‌ఎస్ శాసనమండలి పక్షంలో విలీనం చేయాలని కోరుతూ లేఖ సమర్పించారు. ‘శాసనమండలి ఆవరణలో మేము నలుగురం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించుకున్నాం. కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్‌ఎస్ పక్షంలో విలీనం చేయాలని ఈ భేటీలో నిర్ణయించుకున్నాం. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లోని నాలుగో పేరా ప్రకారం మా వినతిని పరిశీలించగలరు’అని కోరుతూ నలుగురు ఎమ్మెల్సీల సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు.
ఒక పార్టీ తరఫునన గెలిచిన చట్టసభ్యులలో మెజారిటీ సంఖ్యలో ఉన్న వారు వేరే పార్టీలో విలీనం అయితే వారిపై అనర్హత వేటు పడదనే నిబంధన ప్రకారం నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నాలుగో పేరా పేర్కొంటోందని వివరించారు. అనంతరం నలుగురు ఎమ్మెల్సీల లేఖను శాసనమండలి చైర్మన్ వి. స్వామిగౌడ్ పరిశీలించారు. తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్‌ఎస్ శాసనమండలిపక్షంలో విలీనం చేస్తూ సాయంత్రం ఆరు గంటలకు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్, ఆకుల లలిత, టి. సంతోష్ కుమార్, కె. దామోదర్‌రెడ్డిలను టీఆర్‌ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యలు వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిర్ణయంతో శాసనమండలిలో కాంగ్రెస్ తరఫున మహమ్మద్ షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మిలిగారు. ఇద్దరు సభ్యులే ఉండటంతో శాసనమండలిలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది.
ఎమ్మెల్యేలూ జంప్ చేస్తే మండలిలో కాంగ్రెస్ సున్నాయే...
శాసనమండలిలో 40 మంది సభ్యులు ఉంటారు. తాజా పరిణామాల అనంతరం టీఆర్‌ఎస్‌కు 31 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు, స్వతంత్రులు ఇద్దరు... మజ్లిస్, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి రాజీనామాలతో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యులుగా ఉన్న షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనుంది. దైవార్షిక ఎన్నికల్లో భాగంగా వచ్చే ఫిబ్రవరి, మార్చిలో శాసనమండలికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియలో దాదాపు 16 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ స్థానాలు ఆరు ఖాళీ అవుతున్నాయి. టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కె. యాదవరెడ్డిపై వేటు వేస్తే ఈ సంఖ్య ఏడుకు చేరుతుంది. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే కోటా ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలోనే ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు ఒక స్థానం వస్తుంది. అయితే ఎన్నికల నాటికి సమీకరణలు మారి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యలో మార్పులు జరిగితే ఆ ఒక్క సీటూ హస్తం పార్టీకి దక్కే అవకాశం ఉండదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే జరిగితే శాసనమండలిలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం సైతం లేకుండా పోయే పరిస్థితి ఉండనుంది.
రాజ్యాంగం ప్రకారమే నిర్ణయం: ఎం.ఎస్.ప్రభాకర్
కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. నలుగురం టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం కావాలని ముందుకొచ్చాం. రాజ్యాంగం ప్రకారం మూడింట రెండోవంతు మంది సభ్యులు ఇలా నిర్ణయం తీసుకోవచ్చు. నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ స్వామిగౌడ్ చెప్పారు. కాంగ్రెస్‌లో మాకు ఎన్నో అవమానాలు జరిగాయి.
టీడీపీతో పొత్తు ముంచింది: టి. సంతోష్ కుమార్
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ కొంపముంచింది. మా ఎవరితో చెప్పకుండా పొత్తు ఎలా పెట్టుకున్నారు? కాంగ్రెస్‌లో నాయకత్వ లేమి ఉంది. అందుకే టీఆర్‌ఎస్‌లో విలీనం కావాలని నిర్ణయం తీసుకున్నాం.
మేము ప్రజల వైపు: ఆకుల లలిత
మేము ప్రజలవైపు ఉండాలనుకుంటున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు తగిన గౌరవం ఇస్తారని భావిస్తున్నాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తాం.
నేడు కొండా మురళీ రాజీనామా...
ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు శనివారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. శుక్రవారమే మురళీ రాజీనామా చేయాల్సి ఉంది. అయితే శానసమండలి చైర్మన్ కార్యాలయం శనివారం సమయం ఇచ్చినందున మురళీ రాజీనామా నిర్ణయం వాయిదా పడినట్లు తెలిసింది. కొండా మురళీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment