సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో ఉండే ఇద్దరు మహిళలు ఎవరనే అంచనాలు మొదలయ్యాయి. టీఆర్‌ఎస్ తరఫున ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి (మెదక్), గొంగిడి సునీత (ఆలేరు), అజ్మీరా రేఖానాయక్ (ఖానాపూర్) ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆకుల లలిత ఎమ్మెల్సీగా ఉన్నారు. తాజాగా ఎన్నికలు జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్‌ఎస్ ఖరారు చేసిన అభ్యర్థుల్లో సత్యవతి రాథోడ్ ఉన్నారు. మొత్తం ఐదుగురు సభ్యుల్లో ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కనుంది.
గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన పద్మాదేవేందర్‌రెడ్డి తాజా విస్తరణలో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఈసారి పదవి లభించపోవడంతో తదుపరి విస్తరణలో అవకాశం ఉంటుందని ఆమె భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో విప్‌గా పని చేసిన గొంగిడి సునీత సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు బీసీల్లోని ప్రధాన సామాజికవర్గమైన మున్నూరు కాపుల నుంచి మంత్రివర్గంలో ఎవరికీ అవకాశం దక్కలేదు.
ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ వర్గం వారే కావడంతో ఈ కోటాలో సీఎం గుర్తిస్తారని భావిస్తున్నారు. మరోవైపు 2014 ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరిన సత్యవతి రాథోడ్ డోర్నకల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డి.ఎస్. రెడ్యానాయక్ చేతిలో ఓడిపోయారు. అనంతరం రెడ్యానాయక్ టీఆర్‌ఎస్‌లో చేరినా సత్యవతి రాథోడ్ టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన సమయంలోనే ఆమెకు మంత్రి పదవి హామీ లభించిందనే ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో సీఎం కాకుండా 17 మంది మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం 11 మంది (సీఎం కాకుండా) మంత్రులు ఉన్నారు. వారిలో ఎస్టీ వర్గానికి, మహిళకు చోటు దక్కలేదు. సత్యవతి రాథోడ్‌కు మంత్రిగా అవకాశం కల్పిస్తే ఆ రెండు కోటాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో సత్యవతి రాథోడ్‌కు మంత్రిగా అవకాశం దక్కుతుందని టీఆర్‌ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు గత ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు వచ్చాయి. ఇదే లెక్కన తదుపరి విస్తరణలో తనకు అవకాశం ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment