Telangana Cabinet Expansion 2019
-
టీఆర్ఎస్లో ఉండలేకపోతున్నా..రాజీనామాకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లభించడం లేదని బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న పరిస్థతుల్లో అక్కడ ఉండలేకపోతున్నానని, రాజీనామాకు కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ దయ వల్లే ఎమ్మెల్యేగా గెలిచానని, అయితే ఆయనను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యే షకీల్ వ్యాఖ్యలు చేశారు. చదవండి: టీఆర్ఎస్కు మరో ఎమ్మెల్యే షాక్! మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే షకీల్... కమలం గూటికి చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అర్వింద్‌తో అన్ని విషయాలు మాట్లాడానని, సోమవారం అన్ని బయటపెడతానని ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు. -
టీఆర్ఎస్కు మరో ఎమ్మెల్యే షాక్!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అసంతృప్తి ప్రకంపనలు ఇంకా టీఆర్ఎస్లో కొనసాగుతున్నాయి. అధికార పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ గురువారం నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. కాగా మొన్నటి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించలేదని షకీల్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ...అర్వింద్‌తో సమావేశం కావడంతో టీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. భేటీ అనంతరం షకీల్ పార్టీ మారడంపై స్పందించారు. పార్టీ మారితే మారొచ్చు అంటూ ఫీలర్లు వదిలారు. ఇక మంత్రివర్గంలో స్థానం దక్కని జోగు రామన్న, నాయిని నర్సింహారెడ్డిని టీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగించడంతో వారిద్దరూ మెత్తపడ్డారు. నాయిని బహిరంగంగానే తన అసంతృప్తి తెలిపితే, జోగు రామన్న మాత్రం అలక వహించి అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ పలుమార్లు... టీఆర్ఎస్ నేతలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తోంది. అంతేకాకుండా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తారని సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం జరుగుతోంది. అలాగే త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు సందర్భంగా బీజేపీ కూడా దూకుడు పెంచింది. పట్టణ ప్రాంతాల్లో కొంత పట్టు ఉన్న ఆ పార్టీ స్థానిక నేతలపై దృష్టి సారించింది. -
‘మంత్రి పదవి రానందుకు అసంతృప్తి లేదు’
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కేబినెట్లో మంత్రి పదవి దక్కకపోవడంతో ఎలాంటి అసంతృప్తి లేదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. అలకబూనిన ఎమ్మెల్యే గాంధీ, గన్మెన్లను పంపించారని మీడియాలో వచ్చిన కథనాలను ఆయన కొట్టి పారేశారు. తన మనవడిని చూసేందుకు గుంటూరుకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో రెండు రోజుల పాటు గన్మెన్లను వాపస్ పంపానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన ప్రతిసారి గన్మెన్లను తీసుకొని వెళ్లాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. సోమవారం గుంటూరుకు వెళ్లేందుకు ప్రయాణమైన ఆయన నగర శివార్లలోకి వెళ్లగానే గన్మెన్లను పంపించారనే ప్రచారం జరగడంతో వెనుదిరిగి వివేకానందనగర్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ప్రతిసారి ఇలానే గన్మెన్లను పంపిస్తానని వివరించారు. తమ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్‌కు మంత్రి పదవి ఇవ్వడం పట్ల ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు విధేయునిగా ఉంటానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం కేటీఆర్‌ను కలిశానన్నారు. (చదవండి: గులాబీ పుష్పక విమానం.. ఓవర్ లోడ్!) -
కారు పార్టీలో ఏం జరుగుతోంది..?!
సాక్షి, మంచిర్యాల: అజ్ఞాతంలోకి వెళ్లి కలకలం సృష్టించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న వ్యవహారంపై టీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రామన్నకు చోటు దక్కకపోవడంతో అలకబూనిన ఆయన సోమవారం అందుబాటులో లేకపోవడం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం హైదరాబాద్‌లోనే ప్రత్యక్షమైన రామన్న.. తాను అనారోగ్య కారణంగానే అందుబాటులో లేనని చెప్పుకొచ్చారు. కాగా టీఆర్ఎస్లో మంత్రులు, మాజీమంత్రులు అసంతృప్తి రాగం వినిపిస్తున్న క్రమంలో.. జోగు రామన్న వ్యవహారంపై పార్టీ అధిష్టానం దృష్టిపెట్టింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. జోగు రామన్నకు స్వయంగా ఫోన్ చేసి ఏం జరిగిందని తెలుసుకున్నట్లు సమాచారం. జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లిన అనంతరం ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న పరిణామాలపై నిఘావర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించాయి. అలకతో కూడిన అనారోగ్యం మాజీమంత్రి జోగు రామన్న వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కేసీఆర్ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జోగు రామన్న.. ఈ ప్రభుత్వంలోనూ అవకాశం వస్తుందని భావించారు. కాని మంత్రివర్గ కూర్పులో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డికి మాత్రమే చాన్స్ దక్కింది. తొలిదఫా రాకున్నా.. విస్తరణలో కచ్చితంగా అవకాశం ఉంటుందనే నమ్మకంతో ఉండగా.. రెండు రోజుల క్రితం ఆ అవకాశమూ చేజారింది. దీంతో అలకబూనిన రామన్న సోమవారం నుంచి ఎవరికీ అందుబాటులోకి రాకుండా పోయారు. రామన్న అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆయన సొంత నియోజకవర్గమైన ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన నివాసం వద్ద ఓ కార్యకర్త కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రామన్నకు మంత్రి పదవి రాకపోవడానికి కారణమంటూ.. టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఇద్దరు కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో మంగళవారం ఫోన్ ఆన్ చేసిన రామన్న.. అనారోగ్యం కారణంగానే ‘దూరంగా’ ఉన్నానంటూ వివరణ ఇచ్చారు. ఇక రామన్న కుటుంబ సభ్యులు మాత్రం మంత్రి పదవి రాకపోవడంతోనే రక్తపోటు (బీపీ) పెరిగి అనారోగ్యానికి గురయ్యాడని చెప్పారు. నిఘావర్గాల నివేదిక మాజీమంత్రి రామన్న అజ్ఞాతంలోకి వెళ్లిన అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై నిఘావర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. పార్టీ అంతర్గత పరిస్థితి, ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం, పార్టీ నాయకులు కొట్టుకోవడంతో పాటు, ఇతర నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదించినట్లు తెలిసింది. కేటీఆర్ ఫోన్..? మంత్రి పదవి దక్కకపోవడంతో జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లాడనే వార్తల నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. స్వయంగా జోగు రామన్నకు ఫోన్ చేసినట్లు సమాచారం. తాము కూడా గులాబీ ఓనర్లమేనంటూ ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇదే క్రమంలో సాంస్కృతిక సారథి మాజీ చైర్మన్ రసమయి బాలకిషన్ కూడా ఈటల వ్యాఖ్యలను సమర్థించడం.. మంత్రివర్గ విస్తరణ తరువాత మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ మాజీ సీఎం రాజయ్య ధిక్కార స్వరాన్ని వినిపించడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జోగు రామన్న కూడా అలకబూని అజ్ఞాతంలోకి వెళ్లడంతో కేటీఆర్ ఆయనకు ఫోన్ చేసి భవిష్యత్‌పై భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. -
మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై..
సాక్షి, నాగర్ కర్నూల్/నిజామాబాద్/భూపాలపల్లి : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్ పార్టీలో కొద్దిపాటి కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమకు కేబినెట్ బెర్త్ దక్కకపోవడంపై పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. తనకు మంత్రి పదవి ఇస్తానని సీఎం కేసీఆర్ మాట తప్పారంటూ మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ అధిష్టానాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలోనే పలువురు టీఆర్ఎస్ సీనియర్ నేతలు పార్టీని వీడతారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. దీంతో కొందరు నేతలు మీడియాకు ముందుకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ టీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. తాను టీఆర్ఎస్ పార్టీ నాయకుడినని తెలిపారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని గుర్తుచేశారు. తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ మారతానంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. అలాంటి ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కేసీఆర్‌పై పూర్తి విశ్వాసం ఉంది.. తనకు సీఎం కేసీఆర్‌పై పూర్తి విశ్వాసం ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవి రానందకు అసంతృప్తి లేదని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. తాను ఎవరిని నమ్ముతానో వారితోనే చివరి వరకు ఉంటానని తెలిపారు. టీఆర్ఎస్లో పదవుల కోసం చేరలేదు : గండ్ర మంత్రివర్గ ఏర్పాటుపై తాను అసంతృప్తితో ఉన్నట్టు వచ్చిన వార్తల్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి పదవుల కోసం రాలేదని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై పట్ల నమ్మకంతోనే టీఆర్ఎస్లో చేరానని తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నట్టు చెప్పారు. పదవుల కన్నా పార్టీని బలోపేతం చేయడంపై తన దృష్టి ఉందని పేర్కొన్నారు. సీఎం ఆశీస్సుల వల్లే తన కుటుంబానికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కిందని అన్నారు. తను అనని మాటలు అన్నట్లుగా ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. -
అజ్ఞాతం వీడిన రామన్న.. పార్టీ మార్పుపై క్లారిటీ
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తి గురైన మాజీ మంత్రి.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అజ్ఞాతం వీడారు. ఆదివారం మంత్రివర్గ విస్తరణ అనంతరం కనిపించకుండాపోయిన ఆయన మంగళవారం నాడు మీడియా ముందుకు వచ్చారు. ‘నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు. మంత్రిపదవి రాకపోవడంతో మినిస్టర్ క్వార్టర్స్ ఖాళీ చేస్తున్నాం. రెండు రోజులుగా నా పిల్లలు ఆ పనిలో ఉన్నారు. నాకు కొంత ఆరోగ్యం బాగాలేక, లోబీపీ వల్ల రెస్ట్ తీసుకుందాం అని స్నేహితుడు ఇంటికి వెళ్ళాను. మంత్రి పదవి దక్కలేదని అలగలేదు. పార్టీ మరే ప్రసక్తే లేదు. చివరి వరకూ టీఆర్ఎస్లోనే ఉంటా. మా నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు మంచి గౌరవం కల్పించారు. గత ప్రభుత్వంలో మంతత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించింది. కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటా’ అని వ్యాఖ్యానించారు. కాగా ఆదివారం ఉదయం హైదరాబాద్ వెళ్లిన ఆయన.. కేబినెట్ విస్తరణ అనంతరం అదేరాత్రి మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్నారు. సోమవారం ఉదయం నుంచి ఎవరికీ అందుబాటులో లేకుండాపోయిన విషయం తెలిసిందే. గన్మెన్లను, డ్రైవర్‌ను, చివరికి వాహనాన్ని కూడా క్వార్టర్స్ వద్దే ఉంచి ఆయన చెప్పా పెట్టకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన మొబైల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో సమాచారం తెలియలేదు. కుటుంబ సభ్యులు కూడా ఎటువెళ్లారో తెలీదని చెప్పడంతో రామన్న అనుచరుల్లో గతరెండు రోజులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఆయన బయటకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మనస్తాపం.. టీఆర్ఎస్ సర్కార్ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జోగు రామన్నకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ అమాత్య పదవిని కట్టబెట్టారు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా సర్కార్‌ను రద్దుచేసే వరకూ ఆయన మంత్రిగా కొనసాగారు. ఆ సమయంలో ఉమ్మడి జిల్లా నుంచి జోగు రామన్నతోపాటు ఇంద్రకరణ్‌రెడ్డి కూడా మంత్రిగా ఉన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మొదటి మంత్రివర్గ విస్తరణలోనే అమాత్య పదవి వస్తుందని జోగు రామన్న గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ.. ఉమ్మడి జిల్లా నుంచి నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని మాత్రమే మంత్రి పదవి వరించింది. ఈ క్రమంలో మలివిడతలో తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని రామన్న ఆశించారు. ఆ మేరకు అధినేత కూడా తనకు భరోసా ఇచ్చారని తన అనుచరుల వద్ద వ్యక్తం చేశారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన మంత్రివర్గ కూర్పులో పేరుంటుందని భరోసా పెట్టుకున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు మంత్రి పదవి రావడం, రామన్నకు చుక్కెదురు కావడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లు సమాచారం. -
అఙ్ఞాతంలోకి మాజీ మంత్రి జోగు రామన్న
-
పదవుల పందేరంపై టీఆర్ఎస్లో కలకలం
సాక్షి, హైదరాబాద్ : మంత్రివర్గ విస్తరణతోపాటు చీఫ్ విప్, విప్ తదితర పదవుల పందేరం టీఆర్ఎస్లో కొత్త సమస్యలు సృష్టి స్తోంది. అసమ్మతి గళాలకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ అనుసరించిన వ్యూహం మరిన్ని అసంతృప్త గళాలకు ఊపిరి పోస్తోంది. మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలతో పార్టీలో మొదలైన కలకలం మంత్రివర్గం విస్తరణ తర్వాత కూడా సద్దుమణగడం లేదు. ఆదివారం మొదలైన అసెంబ్లీ సమా వేశాల సందర్భంగా తనకు ఎదురైన మీడియా ప్రతినిధు లతో మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకత్వాన్ని సమాధానం చెప్పుకునే స్థితిలోకి నెట్టినట్లు కనిపిస్తోంది. తనను ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా వారించిన సీఎం కేసీఆర్.. మంత్రి పదవి ఇస్తానని మాట తప్పారు అని నాయిని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంటే వద్దన్నారు. కౌన్సిల్లో ఉండు. నీకు మంత్రి పదవి ఇస్తా అని అన్నాడు. మా అల్లుడికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కేసీఆర్ చెప్పారు. నాకు ఆర్టీసీ చైర్మన్ పదవి వద్దు. అందులో రసం లేదు. కేసీఆర్ మా ఇంటికి పెద్ద. మేమంతా ఓనర్లమే. కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో, ఎప్పుడు దిగిపోతారో వాళ్లిష్టం’’ అంటూ నాయిని వ్యాఖ్యానించారు. మరోవైపు మాజీ ఉప ముఖ్యమంత్రి తాడికొండ రాజయ్య కూడా తనకు ఏ పదవీ దక్కే పరిస్థితి లేదని వాపోయారు. అదే సమయంలో మాదిగ సామాజిక వర్గానికి కేబినెట్లో స్థానం కల్పించక పోవడాన్ని మీడియా వద్ద ప్రస్తావించడంతోపాటు మాదిగ కుల సంఘాలు ప్రశ్నించాలనే రీతిలో సంకేతాలు ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణతో ఆశావహుల్లో నిరాశ మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కుతుందని భావించిన కొందరు ఎమ్మెల్యేలు.. సీఎం తమను కనీసం పిలిచి మాట్లాడక పోవడంపై అవేదన చెందుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో చోటు ఆశించిన మాజీ మంత్రి జోగు రామన్న ఆదివారం ఉదయం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఫోన్ స్విఛాఫ్ చేయడంతోపాటు గన్మెన్లను కూడా వదిలి వెళ్లడంపై చర్చ జరుగుతోంది. తనకు తిరిగి మంత్రి పదవి లభిస్తుందనే ధీమాతో ఉన్న జోగు రామన్న మినిస్టర్ క్వార్టర్స్‌లోనే ఉంటున్నట్లు తెలిసింది. మంత్రి పదవిపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతోనే మినిస్టర్ క్వార్టర్స్‌లో కొనసాగుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావడం వెనుక కూడా అసంతృప్తే కారణమని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈటల వ్యాఖ్యలు సద్దుమణుగుతున్న వేళ తాజాగా అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నుంచి ఆయన్ను తొలగించినట్లు సమాచారం. ఈటల స్థానంలో కొత్త మంత్రి గంగుల కమలాకర్ హాజరు కావడంతో ఈటలకు చెక్ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ ఓవైపు బీజేపీ పదేపదే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల అసమ్మతి రాగం ఎటు దారి తీస్తుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. -
అజ్ఞాతంలోకి జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లారు. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం లభించకపోవడంతో.. అలక వహించిన జోగు రామన్న ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయినట్టుగా సమాచారం. ఆదివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌లోని తన నివాసంలోనే ఉన్న జోగు రామన్న.. సోమవారం సాయంత్రం గన్మెన్లను వదిలి, కుటుంబ సభ్యులకు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో జోగు రామన్న కుటుంబ సభ్యులు ఆయన ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఆయన ఫోన్లు కూడా అందుబాటులో లేనట్టుగా తెలుస్తోంది. కాగా, గత ప్రభుత్వంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా జోగు రామన్న బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఈ సారి కేబినెట్ బెర్త్‌పై ఆశలు పెట్టుకున్న ఆయనకు నిరాశే మిగిలింది. ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కుతుందని భావించిన జోగు రామన్న.. తనకు అవకాశం లభించకపోవడంతో అసంతృప్తికి గురైనట్టుగా తెలుస్తోంది. -
కేసీఆర్ కొత్త టీమ్
-
హరీశ్‌కు ఆర్థికం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా తన్నీరు హరీశ్‌రావు నియమితులయ్యారు.కేటీఆర్‌కు మళ్లీ పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్ శాఖలు దక్కాయి. సబితా ఇంద్రారెడ్డికి విద్యా శాఖ, గంగుల కమలాకర్‌కు బీసీ సంక్షేమం, ఆహార, పౌరసరఫరాల, వినియోగదారుల వ్యవహారాలు, సత్యవతి రాథోడ్‌కు ఎస్టీ, స్త్రీ, శిశు సంక్షేమం, పువ్వాడ అజయ్‌కుమార్‌కు రవాణా శాఖలను కేటాయించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఆదివారం కొత్తగా చేరిన ఈ ఆరుగురు మంత్రులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సలహా మేరకు శాఖలను కేటాయిస్తూ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో కొందరు ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. హరీశ్, కేటీఆర్‌లకు కేటాయించిన శాఖలను ఇప్పటివరకు సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తూ వచ్చారు. జగదీశ్‌రెడ్డి విద్యా శాఖను కోల్పోగా, ఆయనకు మళ్లీ ఇంధన శాఖను కేటాయించారు. గత మంత్రివర్గంలో సైతం ఆయన ఇంధన శాఖను కలిగి ఉన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ నిర్వహించిన ఎస్టీ సంక్షేమ శాఖను సత్యవతి రాథోడ్‌కు, బీసీ సంక్షేమం గంగుల కమలాకర్‌కు కేటాయించారు. దీంతో కొప్పుల వద్ద ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, వికలాంగ, వయోజనుల సంక్షేమ శాఖలు మిగిలాయి. వేముల ప్రశాంత్‌రెడ్డి నిర్వహించిన రవాణా శాఖను పువ్వాడ అజయ్‌కుమార్‌కు కేటాయించారు. చామకూర మల్లారెడ్డి నుంచి స్త్రీ, శిశు సంక్షేమ శాఖను సత్యవతి రాథోడ్‌కు అప్పగించారు. కీలకమైన రెవెన్యూ, నీటిపారుదల, గనుల శాఖలను సీఎం కేసీఆర్ తన దగ్గరే పెట్టుకున్నారు. ప్రతిష్టాత్మక నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన, అమలుపై స్వీయ పర్యవేక్షణ కోసం సీఎం స్వయంగా ఈ శాఖలను నిర్వహించనున్నారు. గత మంత్రివర్గంలో పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్ శాఖల మంత్రిగా తనదైన ముద్ర వేసిన కేటీఆర్‌కు మళ్లీ అవే శాఖలను కేటాయించారు. -
కేసీఆర్ టీంలోకి హరీశ్, కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ఆశావహుల ఆరు నెలల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. కేబినెట్ విస్తరణలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన జట్టులో మరో ఆరుగురికి చోటు కల్పించారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన తన్నీరు హరీశ్‌రావు, కల్వకుంట్ల తారక రామారావుకు మళ్లీ మంత్రులుగా అవకాశం కల్పించారు. అలాగే తొలిసారి ఇద్దరు మహిళలు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లను తన కేబినెట్లోకి తీసుకోవడంతోపాటు మొదటిసారి గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్‌లకు మంత్రి పదవులు కేటాయించారు. ఈ మేరకు ఆదివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రుల చేత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. సీఎం కేసీఆర్ వెంట రాగా ప్రమాణ స్వీకార వేదిక వద్దకు గవర్నర్ సాయంత్రం 4.10కు చేరుకున్నారు. జాతీయ గీతాలాపన అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే నేతలను వేదికపైకి ఆహ్వానించారు. తొలుత హరీశ్‌రావు ప్రమాణ స్వీకారం చేయగా ఆ తర్వాత కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్ ప్రమాణం చేశారు. నూతన మంత్రుల్లో కేటీఆర్ పవిత్ర హృదయం సాక్షిగా ప్రమాణం చేయగా మిగతా ఐదుగురు దైవసాక్షిగా పదవీస్వీకార ప్రమాణం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మంత్రులందరితోనూ ‘అనే నేను’అంటూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆరుగురు నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం 13 నిమిషాల వ్యవధిలో ముగిసింది. గంటకుపైగా రాజ్‌భవన్‌లో కేసీఆర్... నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్‌భవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ సుమారు గంటన్నరపాటు రాజ్‌భవన్‌లో గడిపారు. నూతన మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్బంగా సీఎస్ ఎస్కే జోషికి సూచనలు చేస్తూ కనిపించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఫొటో సెషన్ సందర్భంగా రాష్ట్ర మంత్రులందరినీ సీఎం కేసీఆర్ నూతన గవర్నర్‌కు పేరు పేరునా పరిచయం చేశారు. అనంతరం దర్బార్ హాల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నూతన గవర్నర్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న పలు కార్యక్రమాలకు సంబంధించిన అంశాలతోపాటు సోమవారం శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న విషయాన్ని గవర్నర్‌కు సీఎం తెలియజేశారు. ప్రత్యేక ఆకర్షణగా హరీశ్, కేటీఆర్... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు ఒకే వాహనంలో రాజ్‌భవన్‌కు చేరుకుని ప్రమాణస్వీకార వేదిక వద్దకు కలసి వచ్చారు. దీంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున కేటీఆర్, హరీశ్ అనుకూల నినాదాలు చేశారు. పార్టీకి చెందిన మంత్రులు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కేటీఆర్‌ను ఆలింగనం చేసుకొని అభినందనలు తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసేంత వరకు కేటీఆర్, హరీశ్ పక్కపక్కన కూర్చొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం హరీశ్‌రావు, కేటీఆర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ సీఎం కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. గంగుల కమలాకర్ పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించగా కేసీఆర్ వారించారు. నూతన మంత్రులకు సీఎం పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన మంత్రులకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆల్ ది బెస్ట్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం నూతన గవర్నర్‌గా తమిళిసై పదవీ స్వీకారం చేసిన వేదికపైనే సాయంత్రం కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారంలో తమిళనాడు నుంచి వచ్చిన అతిథులు సాయంత్రం జరిగిన మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌తోపాటు రాష్ట్ర మంత్రులు ముందు వరుసలో ఆసీనులయ్యారు. నూతన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సబిత, సత్యవతి రాథోడ్ తమ కుటుంబ సభ్యులతో ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకున్నారు. అజయ్‌కుమార్ పుట్టిన తేదీ: ఏప్రిల్ 19, 1965 కుటుంబం: భార్య, ఒక కుమారుడు ఎమ్మెల్యేగా అనుభవం: 2014, 2018లో గెలుపు మంత్రి బాధ్యతలు: మొదటిసారి సబితా ఇంద్రారెడ్డి పుట్టిన తేదీ: మే 5, 1963 కుటుంబం: ముగ్గురు కుమారులు ఎమ్మెల్యేగా అనుభవం: 2000 (ఉపఎన్నిక), 2004, 2009, 2018లలో ఎమ్మెల్యేగా విజయం మంత్రి బాధ్యతలు: 2004లో వైఎస్ కేబినెట్లో గనుల మంత్రిగా, 2009లో తొలి మహిళా హోంమంత్రిగా బాధ్యతలు కె. తారకరామారావు పుట్టిన తేదీ: జూలై 24, 1976 కుటుంబం: భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఎమ్మెల్యేగా అనుభవం: 2009, 2010 (ఉప ఎన్నిక), 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలుపు మంత్రి బాధ్యతలు: 2014లో పంచాయతీరాజ్ మంత్రి, ఆ తర్వాత మున్సిపల్, ఐటీ, పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు టి.హరీశ్‌రావు పుట్టిన తేదీ: జూన్ 3, 1972 కుటుంబం: భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఎమ్మెల్యేగా అనుభవం: 2004, 2008, 2009, 2010, 2014, 2018 వరుసగా విజయం మంత్రి బాధ్యతలు: 2004లో వైఎస్ కేబినెట్లో యువజన సర్వీసుల మంత్రిగా ప్రమాణం, ఆ తర్వాతే ఎమ్మెల్యేగా గెలుపు, 2014లో సాగునీటి మంత్రిగా బాధ్యతలు సత్యవతి రాథోడ్ పుట్టిన తేదీ: అక్టోబర్ 31, 1969 కుటుంబం: భర్త, ఇద్దరు కుమారులు ఎమ్మెల్యేగా అనుభవం: 2009లో ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్సీ మంత్రి బాధ్యతలు: మొదటిసారి గంగుల కమలాకర్ పుట్టిన తేదీ: మే 8, 1968 కుటుంబం: భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఎమ్మెల్యేగా అనుభవం: 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయం మంత్రి బాధ్యతలు: మొదటిసారి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కూర్పులో కేసీఆర్ నేర్పు
సాక్షి, హైదరాబాద్ : పదవుల పందేరం అధికార టీఆర్ఎస్ పార్టీలో జోష్ నింపింది. ప్రభుత్వ పనితీరుపై ఇంటా బయటా విమర్శలు వస్తున్న నేపథ్యం లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ శరవేగంగా పావులు కదిపారు. బీజేపీ దూకుడు, ఈటల వ్యాఖ్యల కలకలం, రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. శనివారం శాసనసభ, శాసనమండలి చీఫ్‌విప్‌లు, విప్ల జాబితాను ఏకకాలంలో విడుదల చేయడంతోపాటు ఆదివారం మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో విస్తరించారు. మండలి చైర్మన్ ఎన్నికకు కూడా రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో మిగతా నామినేటెడ్ పదవులపై పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీమంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారితోపాటు పద్మా దేవేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్ వంటి నేతలకు త్వరలో కీలక పదవులు ఇస్తామనే సంకేతాలు కూడా సీఎం ఇచ్చారు. 12 మంది ఎమ్మెల్యేలను కీలక కార్పొరేషన్లకు చైర్మన్లు గా నియమిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 70కి పైగా కార్పొరేషన్లు, ఇతర పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు. దీంతో త్వరలో టీఆర్ఎస్లో నామినేటెడ్ పదవుల పందేరం వేగం పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలకు పెద్దపీట తాజా మంత్రివర్గ విస్తరణతోపాటు చీఫ్ విప్, విప్ల నియామకంలో సీఎం కేసీఆర్ సామాజికవర్గాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పదవులు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. ఆయా జిల్లా ల్లో స్థానిక రాజకీయ పరిస్థితులతోపాటు కీలక సమయాల్లో ఇతర పార్టీల నుంచి చేరినవారిని కూడా కీలక పదవులకు ఎంపిక చేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన హరీశ్‌రావు, కేటీఆర్‌కు వరుసగా రెండో పర్యాయం మంత్రివర్గంలో చోటుకల్పించారు. ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి వచ్చిన గంగుల కమలాకర్, 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీని వీడిన సత్యవతి రాథోడ్‌కు మంత్రి పదవులు దక్కాయి. తొలి శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన పువ్వాడ అజయ్ ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్ గూటికి చేరారు. వీరిద్దరికి కూడా మంత్రి పదవులు కట్టబెట్టారు. ఆచితూచి పదవుల పంపిణీ గతంలో శాసన మండలి చైర్మన్‌గా బీసీ సామాజికవర్గానికి చెందిన స్వామిగౌడ్ వ్యవహరించగా, ప్రస్తుతం గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఈ పదవికి ఎంపిక చేశారు. దీంతో బీసీ సామాజికవర్గానికి చెందిన బోడకుంటి వెంకటేశ్వర్లును విప్ పదవి నుంచి చీఫ్‌విప్‌గా ప్రమోట్ చేశారు. కాంగ్రెస్ నుంచి వివిధ సందర్భాల్లో టీఆర్ఎస్లో చేరిన కె.దామోదర్‌రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, టి.భానుప్రసాద్‌లకు కూడా విప్‌లుగా అవకాశం కల్పించారు. ఉద్యమ సమయంలో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన కర్నె ప్రభాకర్‌ను మండలి విప్‌గా నియమించారు. ఉద్యమసమయం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న దాస్యం వినయ్‌భాస్కర్ తెలంగాణలో ఓ బలమైన సామాజికవర్గానికి చెందిన నేత కావడం కలిసి వచ్చింది. సబితాఇంద్రారెడ్డికి మంత్రి పదవిని ఇవ్వడంతో.. గత శాసనసభలో మాదిరిగానే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిని విప్‌గా మరోమారు కొనసాగించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓ సామాజికవర్గం ఓటర్లను దృష్టిలో పెట్టుకుని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి విప్‌గా అవకాశం ఇచ్చారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన రేగ కాంతారావు(ఎస్టీ)తో పాటు, టీఆర్ఎస్ యువ ఎమ్మెల్యేలు, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన గువ్వల బాలరాజు, బాల్క సుమన్‌కు విప్‌గా అవకాశం దక్కింది. కరీంనగర్ జిల్లాకు పెద్దపీట రాష్ట్ర మంత్రివర్గంలో కరీంనగర్ జిల్లాకు పెద్దపీట వేస్తూ.. ఏకంగా 4 మంత్రిపదవులు కేటాయించారు. హరీశ్‌రావు చేరికతో సీఎం కేసీఆర్‌సహా ఇద్దరికి ఉమ్మడి మెదక్ నుంచి ప్రాతినిథ్యం దక్కింది. హైదరాబాద్, పూర్వపు మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరేసి, ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లా నుంచి ఒక్కొక్కరికి మంత్రులుగా అవకాశం లభించింది. సామాజికవర్గాల కోణంలో చూస్తే వెలమ సామాజిక వర్గం నుంచి నలుగురు, రెడ్డి సామాజికవర్గం నుంచి ఆరుగురు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కమ్మ, యాదవ, మున్నూరు కాపు, ముదిరాజ్, గౌడ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కింది. బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకే... లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న బీజేపీ ఇటీవల ఇతర పార్టీల నుంచి వలసలు ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పక్షంగా ఎదిగేందు కు పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్తోపాటు, బయటా కూడా చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ ఎదురవుతుందనే అంచనాల నేపథ్యం లో..రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గవర్నర్ మార్పు కూడా రాజకీయ కోణంలోనే జరిగిందనే ప్రచారం సాగుతోంది. దీంతో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు పదవుల పందేరాన్ని కేసీఆర్ వ్యూహంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ దూకుడు కు అడ్డుకట్ట వేసేందుకు కేటీఆర్‌కు మరోమారు మంత్రిగా అవకాశం ఇవ్వడంతోపాటు, తాజా కేబినెట్ విస్తరణను చేపట్టినట్లు తెలుస్తోంది. -
ఇరిగేషన్ నుంచి ఫినాన్స్.. మంత్రుల ఫ్రొఫైల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిది నెలల తరువాత తొలిసారి కేబినెట్ విస్తరణ జరిపారు. కొత్తగా ఐదురుగు ఎమ్మెల్యేలకు, ఓ ఎమ్మెల్సీకి మొత్తం ఆరుగురికి మంత్రివర్గంలో చోటుకల్పించారు. వీరిలో ఇద్దరు మహిళలు సీనియర్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌లు ఉన్నారు. దీంతో తెలంగాణ తొలి మహిళా మంత్రులుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. గత ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీష్ రావుకు.. ఈసారి కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు. అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తిరిగి ఐటీ, మున్సిపల్ శాఖలను కేటాయించారు. మంత్రుల వివరాలు... డబుల్ హ్యాట్రిక్.. ఇరిగేషన్ నుంచి ఫినాన్స్ తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన హరీష్‌రావు.. టీఆర్ఎస్లో కీలక నేతగా గుర్తింపు పొందారు. 2004 నుంచి వరుసగా సిద్ధిపేట అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి.. డబుల్ హ్యాట్రిక్ నమోదు చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 95 వేల ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 1,18,699 ఓట్ల మెజార్టీ సాధించి సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్లో తనకు తిరుగు లేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో భారీ నీటిపారుదల, శాసన సభ వ్యవహారాల శాఖ శాఖ మంత్రిగా విజయవంతమైన హరీష్.. తాజా మంత్రివర్గ విస్తరణలో కీలకమైన ఆర్థికను దక్కించుకున్నారు. తెలంగాణకు వరప్రదాయినిగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరీష్ పాత్ర వర్ణించలేనిది. 1972, జూన్ 3న జన్మించిన హరీష్.. 32 ఏళ్ల వయసులో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. చదవండి: వైభవంగా మంత్రుల ప్రమాణ స్వీకారం సాఫ్ట్వేర్ నుంచి ఐటీ మంత్రిగా... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడిగా కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. 2006లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2009 నుంచి సిరిసిల్ల శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ తొలి కేబినెట్ లో ఐటీ, మున్సిపల్, పంచాయతీ రాజ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 డిసెంబర్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. 1976, జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శోభ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో జన్మించారు. రెండేళ్లపాటు కరీంనగర్ లో చదువుకున్న రామారావు, హైదరాబాద్‌లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. గుంటూరులోని విజ్ఞాన్‌లో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. నిజాం కాలేజీలోని మైక్రోబయాలజీ డిగ్రీలో చేరారు. తరవాత పూణే యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ పూర్తిచేసి, అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి మేనేజ్మెంట్ అండ్ ఈ-కామర్స్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం అమెరికాలోని ‘ఇంట్రా’ అనే సంస్థలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి వచ్చి.. కేసీఆర్ వారసుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ బాధ్యతలు నెరవేర్చనున్నారు. దేశంలో తొలి మహిళా హోంమంత్రి రికార్డు.. 2004, 2009లో చేవెళ్ల అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సబితా ఇంద్రారెడ్డి.. 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు వహించారు. 2009 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి.. దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా విధులు నిర్వర్తించి రికార్డు సృష్టించారు. 2009-14 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం.. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. గులాబీ గూటికి చేరారు. అనంతరం కొద్దికాలంలోనే మంత్రిగా చోటు దక్కించుకున్నారు. అంతేకాకుండా తెలంగాణ తొలి మహిళా మంత్రిగా కూడా సబితా ప్రత్యేక గుర్తింపును పొందారు. 1963 మే 5న జన్మించారు. ఒకే ఒక్కడు.. అజయ్ అనతికాలంలోనే కీలక నేతగా ఎదిగిన పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు ప్రస్తుతం పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ గెలిచిన ఏకైక స్థానం ఖమ్మం (అజయ్ కుమార్) మాత్రమే. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమితో జిల్లాకు తొలిమంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో తాజా మంత్రివర్గ విస్తరణలో.. విజయం సాధించిన అజయ్‌కు అవకాశం దక్కింది. కమ్యూనిస్ట్ కుటుంబ నుంచి వచ్చిన అజయ్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి తొలిసారి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో సీనియరైన తుమ్మల నాగేశ్వరరావును ఓడించడంతో కొద్దికాలంలోనే గుర్తింపు పొందారు. 2015లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్ గూటికి చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి మాజీ ఎంపి నామా నాగేశ్వరరావుపై ఉత్కంఠభరితమైన విజయాన్ని నమోదు చేశారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ఆయనకు రవాణ శాఖ దక్కింది. చదవండి: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు హ్యాట్రిక్ విజయం.. 2009లో కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన గంగుల కమలాకర్ తొలిసారి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల సమయంలో గులాబీ తీర్థం పుచ్చుకుని కారేక్కేశారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 1968 మే 8న జన్మించారు. సర్పంచ్ నుంచి మంత్రిగా.. మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగుకు చెందిన సత్యవతి రాథోడ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1996లో గుండ్రాతిమడుగు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆమె.. 2007లో నర్సింహుల పేట జెడ్పీటీసీగా, 2009లో డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఆమె టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలిగా ఉన్న ఆమెను సీఎం కేసీఆర్ తాజా కేబినెట్ విస్తరణలో మంత్రిగా అవకాశం కల్పించారు. తెలంగాణ తొలి మహిళా మంత్రిగా కూడా సత్యవతి ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజా మంత్రివర్గ విస్తరణలో గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా నియమితులయ్యారు. -
కొలువుదీరిన తెలంగాణ కేబినెట్..
-
ఆరుగురు మంత్రులకు శాఖల కేటాయింపు
-
శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురు మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే శాఖలను కేటాయించారు. గత ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీష్‌రావుకు.. ఈసారి కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు. అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తిరిగి ఐటీ, మున్సిపల్ శాఖలను కేటాయించారు. కీలకమైన విద్యాశాఖను మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి దక్కించుకున్నారు. ప్రస్తుతం విద్యాశాఖ బాధ్యతలు నెరవేరుస్తున్న జగదీశ్వర్ రెడ్డికి విద్యుత్‌శాఖను కేటాయించారు. ఆదివారం సాయంత్రం హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్‌లు మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. నూతన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వీరితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించిన.. కొద్ది సమయంలోనే వారందరికీ శాఖలను కేటాయించారు. అయితే ఇవాళ రాత్రి 7 గంటలకు మంత్రివర్గ సమావేశం కానున్నట్లు సమాచారం. బడ్జెట్‌పై చర్చించిన అనంతరం కేబినెట్ దానిని ఆమోదించనుంది. మంత్రుల శాఖలు ఇవే.. కేటీఆర్: ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ హరీష్ రావు: ఆర్థిక శాఖ సబితా ఇంద్రారెడ్డి: విద్యాశాఖ గంగుల కమలాకర్: బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ సత్యవతి రాథోడ్: గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ పువ్వాడ అజయ్ కుమార్: రవాణ శాఖ చదవండి: వైభవంగా మంత్రుల ప్రమాణ స్వీకారం -
మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన గంగుల కమలాకర్
-
మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన సత్యవతి రాథోడ్
-
మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన అజయ్ కుమార్
-
మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన కేటీఆర్
-
వైభవంగా మంత్రుల ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి మంత్రివర్గ విస్తరణ జరిపారు. ఈ మేరకు ఆదివారం కొత్తగా ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో అంగరంగవైభవంగా సాగిన ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు (సిద్దిపేట) తోపాటు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్ (కరీంనగర్), శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్ (ఖమ్మం)లు మంత్రులుగా ప్రమాణం చేశారు. నూతన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వీరితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి జరుగుతున్న మంత్రివర్గ విస్తరణ కావడంతో జాబితాపై తొలినుంచి ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ముందుగా అందిన సమాచారం మేరకు ఊహించిన వారికే కేబినెట్లో చోటు దక్కింది. తాజా మంత్రివర్గ విస్తరణతో రాష్ట్రంలో మంత్రుల సంఖ్య 18కి చేరింది. తొలి మహిళా మంత్రులు సబిత, సత్యవతి... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. 2014–2018 మధ్యకాలంలో తెలంగాణ తొలి శాసనసభలో మహిళలకు మంత్రివర్గంలో చోటు లభించలేదు. దీంతో విపక్షాల నుంచి కేసీఆర్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అసెంబ్లీ తొలి సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈసారి మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈమేరకు తాజా మంత్రివర్గంలో సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లకు చోటు దక్కడంతో తొలి మహిళా మంత్రులుగా చరిత్ర సృష్టించారు. కాగా తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే.. ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం విశేషం. గత ప్రభుత్వంలో పద్మా దేవేందర్‌రెడ్డికి డిప్యూటీ స్పీకర్‌గా, గొంగిడి సునీతకు ప్రభుత్వ విప్‌గా అవకాశం లభించినా.. తాజా మంత్రివర్గంలో మాత్రం వారికి ఎలాంటి అవకాశం రాలేదు. -
మంత్రిగా చాన్స్.. కేసీఆర్, కేటీఆర్‌కు థాంక్స్
-
మంత్రిగా చాన్స్.. కేసీఆర్, కేటీఆర్‌కు థాంక్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్లో తనకు మంత్రిగా అవకాశం కల్పించడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సంతోషం వ్యక్తం చేశారు. తనకు ఇంతమంచి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలిలో మొట్టమొదటిసారిగా మహిళకు మంత్రిగా అవకాశం కల్పించడం, గిరిజన మహిళ అయిన తనకు ఈ ఘనత ఇవ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ఆమె ‘సాక్షి’ టీవీతో ముచ్చటించారు. గతంలో ఉన్న పరిస్థితుల కారణంగానే గత హయాంలో మహిళలకు మంత్రి పదవి దక్కలేదని, కానీ మహిళా సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తోందని, మిషన్ భగీరథ ద్వారా మహిళలు బిందెలతో రోడెక్కకుండా చేయడం, పెన్షన్‌ను రూ. 2వేలకు పెంచడం, మహిళల కోసం పలు సంక్షేమ పథకాలు అమలుచేయడం మహిళల పట్ల కేసీఆర్‌కు ఉన్న ప్రేమాభిమానాలను చాటుతున్నాయని సత్యవతి పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు కడియం శ్రీహరిలాంటి సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నారని, వారందరితో కలిసి పనిచేస్తానని, అందరినీ కలుపుకొనిపోతానని ఆమె తెలిపారు. తనకు ఏ శాఖ ఇచ్చినా.. దానిని సమర్థంగా నిర్వర్తించి.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూస్తానన్నారు. మహిళలు సొంతంగా నిర్ణయాలు తీసుకొని.. తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్వతహాగా పైకి రావాలని ఆమె ఆకాంక్షించారు. మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగుకు చెందిన సత్యవతి రాథోడ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1996లో గుండ్రాతిమడుగు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆమె.. 2007లో నర్సింహుల పేట జెడ్పీటీసీగా, 2009లో డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, 2014లో ఆమె టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలిగా ఉన్న ఆమెను సీఎం కేసీఆర్ తాజా కేబినెట్ విస్తరణలో మంత్రిగా అవకాశం కల్పించారు. -
నెలాఖర్లో మంత్రివర్గ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గరపడుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో అధికారికంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అదే సంఖ్యలో కీలక పదవులలో ఉన్న వారు అవసరం. దీంతో జూన్ 2లోపే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని, ప్రభుత్వంలోని కీలకమైన పదవులన్నీ భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలు, కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం.. వంటి అంశాల ఆధారంగా మంత్రులుగా ఎవరెవరికి అవకాశం వస్తుందనేది పూర్తి స్పష్టత రానుంది. మరోవైపు కాంగ్రెస్ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. మరో ఇద్దరి చేరిక ఖాయమైంది. ఈ నేపథ్యంలో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ శాసనసభ పక్షం టీఆర్ఎస్లో విలీనం కానుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే విస్తరణకు ముహూర్తం ఖరారవుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకుతోడు కొత్తగా వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత కల్పించేలా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. సమీకరణల ఆధారంగా రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రభుత్వంలో సీఎంతోపాటుగా 17 మంది మంత్రులు ఉంటారు. ప్రస్తుత మంత్రివర్గంలో 11 మంత్రులే ఉన్నారు. మరో ఆరుగురు కొత్తగా మంత్రులు చేరే అవకాశం ఉంటుంది. గత ఏడాది డిసెంబరు 13న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అప్పుడు కేసీఆర్ సీఎంగా, మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణం చేశారు. 2నెలల తర్వాత (ఈ ఏడాది ఫిబ్రవరి 18న) మంత్రివర్గ విస్తరణ జరిగింది. అప్పుడు మరో 10మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో మరో ఆరుగురు మంత్రులుగా చేరే అవకాశం ఉంది. ప్రస్తుత రెడ్డి సామాజికవర్గం నుంచి ఐదుగురు, బీసీల నుంచి ముగ్గురు, ఎస్సీ, మైనారిటీ, వెలమ వర్గాల నుంచి ఒక్కరు చొప్పున మంత్రులుగా ఉన్నారు. మంత్రివర్గంలో ఎస్టీలకు, మహిళలకు ప్రాతినిధ్యం లేదు. వీటితోపాటు ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురికి చోటు దక్కనుంది. మంత్రివర్గ విస్తరణపై సీఎం కేసీఆర్ కసరత్తు మొదలుపెట్టారు. కొత్తగా చేర్చుకునే ఆరుగురి విషయంలో ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఈ జాబితాలో మార్పులు జరిగే అవకాశముంది. ఉమ్మడి జిల్లాలు, సామాజికవర్గాల సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఉమ్మడి జిల్లాల సమీకరణాల ఆధారంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఒక సీనియర్ మంత్రిని తొలగించి అదే జిల్లా నుంచి టీఆర్ఎస్ కీలక నేతకు అవకాశం ఇస్తారని టీఆర్ఎస్లో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రస్తుతం ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ మంత్రులుగా ఉన్నారు. గత ప్రభుత్వంలోనూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఈటల రాజేందర్, కేటీఆర్ మంత్రులుగా పనిచేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తదుపరి విస్తరణలో కచ్చితంగా చోటుదక్కే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న ఇద్దరినీ కొనసాగిస్తూ కొత్తగా కేటీఆర్ ప్రభుత్వంలో చేరితే.. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రుల సంఖ్య మూడుకు చేరుతుంది. అయితే ఒకే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులుగా ఉంటారా అని టీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్‌రావు మంత్రిగా ఉన్నారు. గత ప్రభుత్వంలో వరంగల్ ఉమ్మడి జిల్లా స్పీకర్, 2 మంత్రి పదవులు దక్కాయి. ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఇదే రకమైన ప్రాధాన్యత ఉండనుంది. మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించాల్సి ఉంది. అలాగే ఎస్టీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ఎస్టీ మహిళా కోటాలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌కు మంత్రిగా అవకాశం ఉండనుంది. ఎస్సీ లోని ప్రధానమైన మాదిగ సామాజికవర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు అవకాశం దక్కనుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి చామకూర మల్లారెడ్డి మంత్రిగా ఉన్నారు. ఈ జిల్లా నుంచి మరొకరికి మంత్రిగా అవకాశం దక్కే పరిస్థితి ఉంది. మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం ఉండా లని కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.సబితారెడ్డి శాసనసభలో సూచించారు. దీనికి సీఎం కేసీఆర్ స్పందిస్తూ మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని ప్రకటించారు. అనంతరం పరిణామాలతో సబితారెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ సీఎల్పీ విలీనం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మంత్రివర్గంలో సబితారెడ్డికి చోటు దక్కే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మెదక్ ఉమ్మడి జిల్లా నుంచి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మంత్రులుగా ఎవరూ లేరు. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ కీలకనేత టి.హరీశ్‌రావు మంత్రిగా ఉన్నారు. తదుపరి విస్తరణలో హరీశ్‌రావుకు మంత్రివర్గంలో చోటు దక్కనుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో టీఆర్ఎస్ ఒకే స్థానంలో గెలిచింది. బీసీల్లోని ప్రధాన మున్నూరుకాపు సామాజికవర్గం నుంచి ఈసారి మంత్రివర్గంలో ఎవరికీ చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరుఫున గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావుకు అవ కాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే శాసనమండలి చైర్మన్‌గా నేతి విద్యాసాగర్‌కు అవకాశం ఇస్తే వనమాకు అవకాశం విషయంలో పరిస్థితి మరోరకంగా ఉండనుంది. అలాగే మంత్రివర్గంలో ప్రస్తుతం ఎస్సీల్లోని ప్రధానమైన మాదిగ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం లేదు. సత్తుపల్లిలో టీడీపీ తరుఫున గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డి మంత్రిగా ఉన్నారు. కీలకమైన శాసనసభ స్పీకర్‌గా ఇదే జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ జిల్లాకు మంత్రి, విప్ పదవులు దక్కాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇప్పటికే రెండు కీలక పదవులు ఉన్న నేపథ్యంలో మూడో పదవి వచ్చే అవకాశాలు తక్కువే ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి జగదీశ్‌రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ శాసనమండలి తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. విద్యాసాగర్‌ను త్వరలోనే పూర్తిస్థాయి చైర్మన్‌గా నియమించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరో మంత్రి పదవి దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఈ జిల్లాకు 2 మంత్రిపదవులు, చీఫ్ విప్ పదవి దక్కింది. సామాజిక సమీకరణ నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు మరొకరు మంత్రిగా ఉండే అవకాశం కనిపించడంలేదు. ఈ జిల్లా ఎమ్మెల్యేల్లో ఒకరికి చీఫ్ విప్/విప్ పదవి వరించే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రస్తుతం ఎస్.నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ మంత్రులుగా ఉన్నారు. గత ప్రభుత్వంలోనూ ఈ జిల్లా నుంచి ఇద్దరు మంత్రివర్గంలో ఉన్నారు. ఈ జిల్లా నుంచి ఎవరికీ అవకాశం ఉండదని తెలుస్తోంది. హైదరాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి మహమూద్ అలీ, తలసాని మంత్రులుగా, టి.పద్మారావు శాస నసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. హైదరాబాద్ నుంచి కొత్తగా ఎవరికీ పదవి దక్కే అవకాశం లేదని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇతర కీలక పదవులు శాసనమండలి చైర్మన్‌గా నేతి విద్యాసాగర్‌కు అవకాశం ఇవ్వనున్నారు. డిప్యూటీ చైర్మన్ పదవిని ఎవరికి కట్టబెడతారనేది ఆసక్తికరంగా మారింది. అలాగే శాసనసభలో చీఫ్ విప్, విప్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. శాసనమండలిలో చీఫ్ విప్‌గా ఉండే పాతూరి సుధాకర్‌రెడ్డి ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం శాసనమండలి విప్‌గా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఈ పదవిని ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే మరొకరికి విప్‌గా అవకాశం దక్కనుంది. కీలక పదవుల కేటాయింపులో సీనియర్ ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, గంగుల కమలాకర్, బాజిరెడ్డి గోవర్దన్, కోనేరు కోనప్ప, గంప గోవర్దన్, ఆత్రం సక్కు, గొంగిడి సునీతల పేర్లను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. -
ఎవరా ఇద్దరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో ఉండే ఇద్దరు మహిళలు ఎవరనే అంచనాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ తరఫున ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి (మెదక్), గొంగిడి సునీత (ఆలేరు), అజ్మీరా రేఖానాయక్ (ఖానాపూర్) ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆకుల లలిత ఎమ్మెల్సీగా ఉన్నారు. తాజాగా ఎన్నికలు జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ ఖరారు చేసిన అభ్యర్థుల్లో సత్యవతి రాథోడ్ ఉన్నారు. మొత్తం ఐదుగురు సభ్యుల్లో ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కనుంది. గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన పద్మాదేవేందర్‌రెడ్డి తాజా విస్తరణలో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఈసారి పదవి లభించపోవడంతో తదుపరి విస్తరణలో అవకాశం ఉంటుందని ఆమె భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో విప్‌గా పని చేసిన గొంగిడి సునీత సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు బీసీల్లోని ప్రధాన సామాజికవర్గమైన మున్నూరు కాపుల నుంచి మంత్రివర్గంలో ఎవరికీ అవకాశం దక్కలేదు. ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ వర్గం వారే కావడంతో ఈ కోటాలో సీఎం గుర్తిస్తారని భావిస్తున్నారు. మరోవైపు 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన సత్యవతి రాథోడ్ డోర్నకల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డి.ఎస్. రెడ్యానాయక్ చేతిలో ఓడిపోయారు. అనంతరం రెడ్యానాయక్ టీఆర్ఎస్లో చేరినా సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్లోనే కొనసాగుతూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్లో చేరిన సమయంలోనే ఆమెకు మంత్రి పదవి హామీ లభించిందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో సీఎం కాకుండా 17 మంది మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం 11 మంది (సీఎం కాకుండా) మంత్రులు ఉన్నారు. వారిలో ఎస్టీ వర్గానికి, మహిళకు చోటు దక్కలేదు. సత్యవతి రాథోడ్‌కు మంత్రిగా అవకాశం కల్పిస్తే ఆ రెండు కోటాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో సత్యవతి రాథోడ్‌కు మంత్రిగా అవకాశం దక్కుతుందని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు గత ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు వచ్చాయి. ఇదే లెక్కన తదుపరి విస్తరణలో తనకు అవకాశం ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ భావిస్తున్నారు. -
కేబినెట్లోకి ఇద్దరు మహిళలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రిమండలిలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. మంత్రివర్గంలోకి గరిష్టంగా 17 మందిని తీసుకోవచ్చని, రాబోయే రోజుల్లో ఇంకా ఆరుగురిని (సీఎం కాకుండా ప్రస్తుతం 11 మంది మంత్రులు ఉన్నారు) తీసుకునేది ఉందన్నారు. అందులో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. తాము మహిళలను నిర్లక్ష్యం చేయబోమని... వారిపట్ల గౌరవం ఉందన్నారు. తమకు మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారని.. వారి మద్దతే లేకపోతే తాము అధికారంలోకి రాగలిగేవారం కాదన్నారు. తాజాగా ప్రకటించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలోనూ ఒక మహిళకు స్థానం కల్పించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కేబినెట్లో మహిళలకు చోటు కల్పించాలంటూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శనివారం శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేసిన సూచనకు సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ఈ మేరకు బదులిచ్చారు. అలాగే వివిధ అంశాలపై సమాధానమిచ్చారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... రైతులకు రుణమాఫీ చెక్కులు... కేంద్రం పీఎం–కిసాన్ పథకం కింద ఐదెకరాల్లోపు రైతులకు ఏటా ఇచ్చే రూ.6వేల నగదుతో సంబం ధం లేకుండానే రైతుబందు కింద రైతులకు ఎకరాకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తాం. రైతులకు నేరుగా రుణమాఫీ చెక్కులు అందజేసే ఆలోచన చేస్తున్నాం. రైతులకు వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు ఇస్తాం. రైతులకు 4–5 దఫాలుగా రుణమాఫీ చేస్తాం. ఈ విషయంలో రైతులు ఆందోళనకు గురికావద్దు. ఒకవేళ కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఏర్పడితే ముందుగానే మాఫీ చేస్తాం. ఈ విషయంపై రైతులకు నేనే లేఖ రాస్తా. కిందటిసారి తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పుడు బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టారు. రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ కాగానే లబ్ధిదారుల నుంచి బ్యాంకర్లు వడ్డీ కట్ చేసుకున్న సంఘటనలు కొన్నిచోట్ల జరిగాయి. మరోసారి రైతులకు అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నేరుగా వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు అందజేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రూ. 1.60 లక్షలలోపు రుణాలపై రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ కుదువ పెట్టాల్సిన అవసరం లేదు. ధరణి వెబ్సైట్ చూసి రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశిస్తాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ భూములను ఆక్రమించిన వారిలో అనర్హులనే ఖాళీ చేయిస్తాం. రైతులకు ఇంకొకరి అజమాయిషీ ఉండనీయం. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వలేం... కౌలు రైతులకు రైతుబంధు పథకం అమలు చేయడం సాధ్యం కాదు. రైతుబంధు సొమ్ము తీసుకునే రైతులే ఉదారంగా కౌలు రైతులకు ఎంతో కొంత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. పాత పాస్‌బుక్కుల్లో ఉన్న 33 అనవసర కాలమ్‌లను ఎత్తివేశాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వచ్చే ఆరు నెలల్లో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేస్తాం. భూముల విషయంలో అటవీ, రెవెన్యూ అధికారుల మధ్య సమస్యలు ఉన్నాయి. పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. రెండు, మూడు నెలల్లో ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తాం. గంట గంటకు రికార్డులు అప్డేట్ అవుతాయి. భూపాలపల్లిలో ఒక రైతు కుటుంబం ఎమ్మార్వోకు లంచం కోసం భిక్షాటన చేయడం చూసి వెంటనే చర్య తీసుకున్నాం. అమెరికా అప్పులున్న దేశం కూడా! ప్రపంచంలో ఏదైనా అత్యంత ధనిక దేశం ఉందంటే అది అమెరికానే. అదే సమయంలో అత్యంత అప్పులున్న దేశం కూడా అదే. అటువంటి అమెరికా తెలివిలేక అప్పులు చేసిందా? మన కంటే పెద్ద దేశమైన చైనా జీఎస్డీపీ మన కంటే తక్కువ. 1980 వరకు చైనా మనకంటే పేదరికంలో ఉండేది. చైనాలో కరువు వస్తే ఒకేసారి 7–10 లక్షల మంది చనిపోయారు. అక్కడి పాలకుల విధానాల వల్ల 2, 3 దశాబ్దాల కాలంలోనే చైనా మన కంటే వేగంగా అభివృద్ధి చెందింది. జపాన్ జీఎస్డీపీ కంటే 300 శాతం అధికంగా అప్పులు తీసుకుంటుంది. అప్పులు తెచ్చేది తినడానికి కాదు.. అభివృద్ధి కోసం, ప్రాజెక్టులు కట్టడం కోసమే. రాష్ట్రానికి చెందిన 25 సంవత్సరాల బాండ్లు కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. తెలంగాణ బాండ్లను బ్యాంకులు పోటీపడి కొన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల కోసమే అప్పులు చేస్తున్నాం. వాటిని తీర్చే సత్తా తెలంగాణ రాష్ట్రానికి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధిని ఎక్కడా దాటలేదు. అప్పుల విషయంలో ఆర్బీఐ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ప్రభుత్వాలు చేసే అప్పులు ప్రైవేటు అప్పుల్లా ఉండవు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాకే సంస్థలు అప్పులు ఇస్తాయి. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన ఐదారు రోజుల్లోనే రూ. 15 వేల కోట్ల అప్పు ఇస్తామని పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. రూరల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ. 50 వేల కోట్ల వరకు రుణం ఇస్తామని చెప్పింది. కాళేశ్వరం చివరి దశలో ఉన్నందున దానికి అప్పు ఇవ్వాలని కోరాం. దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి... రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.50 వేల కోట్లకుపైగా నిధులు పోతున్నా రాష్ట్రానికి రూ. 24 వేల కోట్లే తిరిగి వస్తున్నాయి. మిగిలిన రూ. 26 వేల కోట్లు కేంద్రమే ఉపయోగించుకుంటోంది. దేశాన్ని సాకుతున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను గుప్పిట్లో పెట్టుకుంది. రాష్ట్రాల పరిధిలోని అనేక శాఖల అధికారాలు కేంద్రానికి ఇచ్చారు. రాష్ట్రాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాల గురించి కేంద్రం నిర్ణయం తీసుకోవాలా? రోజువారీ కూలీకి ఢిల్లీ నుంచి అనుమతి కావాలా? ప్రధాని మోదీ చెబుతున్న సహకార సమాఖ్య ఎక్కడా లేదు. నదీ జలాల వాటాపై తేల్చాలని ప్రధాని మోదీకి స్వయంగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. ఉమ్మడి జాబితాలోని అంశాలతో సమస్యలు తలెత్తుతున్నాయి. దళితులు, గిరిజనులు ఇప్పటికీ అభివృద్ధికి దూరంగానే ఉన్నారు. రెడ్డి, వైశ్యులు, వెలమలు కూడా కార్పొరేషన్లు కోరుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో కేంద్రం నుంచి ప్రతి నెలా ఒకటో తేదీకి నిధులు వచ్చేవి. మోదీ వచ్చాక అవి ఆలస్యమవుతూ 15వ తేదీకి వచ్చే పరిస్థితి నెలకొంది. కేంద్రం నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రాజెక్టులు కడుతున్నాం. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వచ్చాయి. రాష్ట్రం కోసం ప్రొటోకాల్ తక్కువ ఉన్న మంత్రులను కూడా స్వయంగా కలిశా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రంగారెడ్డి జిల్లాకు నీరందిస్తాం. ఈ ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్బీఐ అవకాశం ఇచ్చింది. అసెంబ్లీ తర్వాత రుణాల రీ షెడ్యూల్ చేయాలని ఆదేశాలు ఇస్తాం. లోక్‌సభ ఎన్నికల తర్వాతైనా కేంద్రంలో గుణాత్మక ప్రభుత్వం ఏర్పడాలి. ఎవరితోనూ రాజీపడాల్సిన అవసరం మాకు లేదు. వచ్చే పదేళ్లలో తెలంగాణ ఖర్చు పెట్టబోయే బడ్జెట్ రూ. 30 లక్షల కోట్లు. త్వరలో కొత్త మున్సిపల్ చట్టం... మనిషి కులం మారదు. అయినా ప్రజలు పలుమార్లు కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండటం శోచనీయం. ఈ పరిస్థితి మారాలి. రాబోయే కొన్ని నెలల్లోనే పలు సంస్కరణలు అమలు కాబోతున్నాయి. పుట్టిన వెంటనే కుల ధ్రువీకరణ పత్రం జారీ చేస్తాం. సర్టిఫికెట్ల జారీలో ఉన్న లొసుగులను సరిచేస్తాం. మున్సిపాలిటీల్లో లంచం ఇవ్వకుండా పనులు జరిగే రోజులు రావాలన్నారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తాం. త్వరలోనే కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. ప్రతినెలా పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేస్తాం. కంక్లూజివ్ టైటిల్‌ను తీసుకొస్తాం. దీనివల్ల ఆక్రమణలు జరగవు. ప్రజల ఆస్తులకు ప్రభుత్వం బాధ్యత వహించి రక్షణగా ఉంటుంది. ప్రభుత్వ శాఖల భూములను కూడా గుర్తిస్తాం. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు రాని వారు లక్ష మంది ఉన్నారు. వారందరికీ పట్టాలు ఇస్తాం. మొదటి విడతలోనే ఎన్నికలు పెట్టాలని కోరాం... లోక్‌సభ ఎన్నికలను రాష్ట్రంలో మొదటి విడతలో పెట్టాలని కోరాం. ఎందుకంటే ఎప్పుడో చివరి దశలో ఎన్నికలు పెడితే అప్పటివరకు ఎన్నికల కోడ్ వల్ల పనులేవీ చేయకుండా కూర్చోవాల్సి వస్తుంది. ముందే ఎన్నికలు పెడితే మున్సిపాలిటీలు, జెడ్పీ, మండల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల కోసం 4–5 వేల సిబ్బందిని భర్తీ చేసి వాటిని పరిపుష్టం చేస్తాం. ప్రతి జిల్లాలో సెషన్ కోర్టులు అవసరం. ఈ విషయంపై సీజేతో మాట్లాడతా. దేశంలో ఆరు పెద్ద నగరాలకు కేంద్రం ఏటా రూ. 5 వేల కోట్లు కేటాయించి అంతే మొత్తంలో ఆయా రాష్ట్రాలు కూడా కేటాయింపులు చేస్తే రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి సాధిస్తాయి. ఈ విషయాన్ని ప్రధానికి కూడా చెప్పా. చైనాలోని బీజింగ్‌లో ఐదు ఔటర్ రింగ్‌రోడ్డులు ఉన్నాయి. మరొకటి కూడా కడుతున్నారు. అయినా అక్కడ ట్రాఫిక్‌జాం అవడానికి ప్రధాన కారణం బీజింగ్‌లో 70 లక్షల కార్లు ఉండటమే. ఢిల్లీలోనూ కాలుష్యం పెరుగుతోంది. హైదరాబాద్ ఇందిరా పార్కు లాంటి చోట్ల ఆక్సిజన్ సెల్లింగ్ సెంటర్లు వచ్చే పరిస్థితి నెలకొంది. ఒక పరిమితి దాటితే ప్రజలను పట్టణాలకు వలస రానీయకూడదా అన్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ విషయంలో మనం జాగ్రత్త పడాల్సి ఉంది. ప్రతిపక్షాల నుంచి ఆశించిన సూచనలేవీ? ప్రతిపక్షాల నుంచి ఆశించిన సూచనలు, సలహాలు రాలేదు. నాలుగేళ్లుగా చెబుతున్నవే మరోసారి చెప్పాయి. రూ. 80,200 కోట్లను సభ మంజూరు చేయాల్సి ఉంది. బడ్జెట్‌ను గుణాత్మకంగా చూడాలి.. గణాత్మకంగా కాదు. 31 మార్చి తర్వాతే ఎకనామిక్ సర్వే పెడతారు. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం వస్తే అప్పటి పరిస్థితినిబట్టి జూన్–జూలైలలో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడతాం. విపక్షాలు కనీస అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నాయి. ముందుస్తు ఎన్నికలపై శ్రీధర్‌బాబు వ్యాఖ్యలు వాస్తవం కాదు. నా అంచనా ప్రకారం గత జూలై–ఆగస్టులలోనే ఎన్నికలు జరగాల్సింది. ఎన్నికల సంఘం మాకు సహకరించలేదు. కాంగ్రెస్ పార్టీ రూ. 2 లక్షలు రుణమాఫీ అని చెప్పింది. మేము మాత్రం నాలుగు విడతల్లో రూ. లక్ష మాత్రమే మాఫీ చేస్తామని చెప్పాం. దానికి ఆమోదంగానే ప్రజలు మమ్మల్ని గెలిపించారు. రాజీవ్ స్వగృహకు సంబంధించి రుణాలను మాఫీ చేస్తానని నేను చెప్పలేదు. రాజీవ్ గృహకల్పకు సంబంధించి రూ. 4 వేల కోట్లు మాఫీ చేశాం. రైతు అంటే ఎవరు? ముఖ్యమంత్రి ప్రసంగం ముగిశాక కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కౌలు రైతుకు రైతుబంధు సొమ్ము ఇవ్వడానికి సాంకేతిక సమస్య ఉందంటున్న ప్రభుత్వం భూమి ఉన్నవాడే రైతా? పంట సాగు చేసే వాడు రైతా? నిర్వచనం చెప్పాలని కోరారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ వ్యవసాయ భూమిని పట్టాగా హక్కున్న వాడే రైతు అన్నారు. భూటాన్ దేశంలో నేచురల్ హ్యాపినెస్ అంటూ శ్రీధర్‌బాబు అంటున్నారనీ, పక్క రాష్ట్రం వారు కూడా ఏదేదో చేశారంటూ ఎద్దేవా చేశారు. రెండు బిల్లులకు ఆమోదం... శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై జరిగిన చర్చ ఆమోదంతో ముగిసింది. అదేవిధంగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. 2018–19 సవరించిన అంచనాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. -
చంద్రబాబు కూడా మోసం చేశారు: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు పెద్ద బాధ్యత అప్పగించారని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆయన శుక్రవారం ఉదయం సెక్రటేరియట్ డీ–బ్లాక్‌లో తన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రుణపడి ఉంటానని అన్నారు. గ్రామ పంచాయతీలు అందంగా తీర్చిదిద్దాలన్న మంత్రి ఎర్రబెల్లి... నూతన పంచాయతీ రాజ్ చట్టంతో గ్రామీణ రూపురేఖలు మారుతాయని ఆకాంక్షించారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా గ్రామాలు ఇంకా అధ్వాన్నంగానే ఉన్నాయన్నారు. ఇక తన 35ఏళ్ల రాజకీయ జీవితంలో 25 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసినా ఇంత ఆనందం ఎప్పుడు కలగలేదని తెలిపారు. చాలామంది తనను మోసం చేశారని, ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానంటే కొన్ని శక్తులు అడ్డుపడ్డాయని ఎర్రబెల్లి పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా తనకు మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారని ఆయన అన్నారు. తాను అడగకుండానే కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా ఇంత పెద్ద బాధ్యత అప్పగించారని అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రి మల్లారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, రాజయ్య, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్, అరెకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, కెచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, గుండు సుధారాణి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. -
నాడు ఇంద్రారెడ్డి.. నేడు మల్లారెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాకు మరోసారి కార్మికశాఖ లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా పట్లోళ్ల ఇంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహించగా.. తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణలో బెర్త్ దక్కించుకున్న చామకూర మల్లారెడ్డిని అదే శాఖతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ వరించింది. మేడ్చల్ శాసనసభ్యుడిగా తొలిసారి విజయం సాధించిన మల్లారెడ్డి మంగళవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ప్రమాణస్వీకారం చేశారు. 2014లో మల్కాజిగిరి ఎంపీగా టీడీపీ తరఫున గెలుపొందిన మల్లారెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యేగా బరిలో దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో సీఎం కేసీఆర్.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో చామకూరకు అవకాశం కల్పిం చారు. మృదుస్వభావి, హాస్యచతురుడైన మల్లారెడ్డికి ఆమాత్య హోదా కట్టబెట్టడం సమంజసమని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి.. గ్రేటర్ పరిధిలో బలమైన రెడ్డి సామాజికవర్గాన్ని దృష్టిలో ఉంచుకొని చామకూరకు చాన్స్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. నాడు ఇంద్రారెడ్డి.. నేడు మల్లారెడ్డి తొలిసారే మంత్రి పదవి దక్కించుకున్న మల్లారెడ్డికి కార్మికశాఖతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖను కేటాయిస్తూ మంగళవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ శాఖను మన జిల్లా నుంచి ఇంద్రారెడ్డి నిర్వర్తించారు. ఆ తర్వాత ఇప్పుడు మల్లారెడ్డికి ఈ పోర్టుపొలియో లభించింది. గత ప్రభుత్వ హయాంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన మహేందర్‌రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడంతో అదే శాఖను మల్లారెడ్డికి కట్టబెడుతారనే ప్రచారం జరిగింది. అదేసమయంలో ఆయన వ్యవహారశైలిని అంచనా వేసిన విశ్లేషకులు.. ఆయనకు క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖలు దక్కుతాయని అంచనా వేశారు. అయితే, పరిశీలకుల ఊహలకందని విధంగా కార్మిక శాఖను సీఎం అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, మంత్రి కావాలనే చిరకాల వాంఛ నెరవేరడంతో మల్లారెడ్డి ఆనందంలో మునిగిపోయారు. అమాత్య పదవిపై కన్నేసిన ఆయన ఎంపీ పదవిని కాదని ఎమ్మెల్యేగా పోటీచేయడం.. విజయం సాధించడం.. మంత్రి పదవిని దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇదిలావుండగా, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న మేడ్చల్, పరిసర కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు భారీగా ఉండడం.. కార్మికులు కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ పనిచేస్తుండడం ఆయన పనితీరును ప్రభావితం చేయనుంది. శుభాకాంక్షలు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చామకూర మల్లారెడ్డికి జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నాయకులతో కలిసి బోయిన్‌పల్లిలోని మంత్రి నివాసానికి వెళ్లారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం మల్లారెడ్డికి పూల మొక్కను బహూకరించారు. ఆమెతో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సంజీవ్‌రెడ్డి, శైలజ, రమాదేవి తదితరులు ఉన్నారు. -
ప్రజల ఆశీస్సులతోనే మంత్రినయ్యా..
సాక్షి, జనగామ: ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని.. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని.. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని.. భయంగానీ, పక్షపాతంగానీ, రాగద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఎర్రబెల్లి దయాకర్‌రావు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్నీ నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించడానికి తప్ప ఏ విషయాన్నీ ప్రత్యక్షం గానీ, పరోక్షం గానీ వ్యక్తులకు గానీ సంస్థలకు తెలియపర్చనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా’ అంటూ రాష్ట్ర మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఎర్రబెల్లి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. 36 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా మంత్రిగా నియమితులైన దయాకర్‌రావు తన కుటుంబసభ్యుల సమేతంగా తరలివెళ్లి ప్రమాణ స్వీకారం చేశారు. యాదాద్రిలో పూజలు.. తల్లిదండ్రుల స్మరణ.. రాష్ట్ర మంత్రిగా నియమితులైన ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ ఇలవేల్పు అయిన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబసమేతంగా లక్ష్మీనర్సింహస్వామికి పూజలు చేసి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. వరుస క్రమంలో ఆరోమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లి తన తల్లిదండ్రులైన ఆదిలక్ష్మి, జగన్నాథరావు చిత్రపటాలకు పూలమాలు వేసి స్మరించుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ కేటాయింపు.. ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖలను కేటాయించారు. 2018లో కొత్తగా పంచాయతీ రాజ్ చట్టం అమలులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. గ్రామాల అభివృద్ధిని కీలకంగా భావిస్తున్న శాఖను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన దయాకర్‌రావుకు కేటాయించడం విశేషం. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వరంగల్ ఉమ్మడి జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యా దగిరిరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, డీఎస్ రెడ్యానాయక్, శంకర్నా యక్తోపాటు ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు. జనగామ జిల్లాతోపాటు వరంగల్,భూపాలపల్లి, వ రంగల్ రూరల్,ములుగు,మహబూబాబాద్ జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు, పలువురు ప్రజా ప్రతినిధులు అభినందలు తెలిపారు. సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఎర్రబెల్లి దయాకర్‌రావు సొంతం. జిల్లాలో మాస్ ఫాలోయింగ్ కలిగిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పర్వతగిరిలో ఓ సాధారణ రేషన్ లీడర్ నుంచి ప్రారంభమైన ఆయన జీవితం రాజకీయాల్లోకి రావడంతో ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు తనకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీలో పలు పదవులను చేపడుతూ మ రోవైపు ప్రజాప్రతినిధిగా వరుస ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తూ రాష్ట్రస్థాయి వరకు ఎదిగిన తీరు అమోఘం. విద్యార్థిదశ నుంచే నాయకత్వ లక్షణాలను కలిగిన దయాకర్‌రావు సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర మంత్రి వరకు తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1999లో రెండోసారి, 2004లో మూడో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో నాటి చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 2008లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలుపొం దారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో పాలకుర్తి నుంచి గెలుపొందారు. వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పాలకుర్తి: నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే మంత్రిని అయ్యానని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆయన మంత్రిగా హైదరాబాద్‌లో మంగళవారం బాధ్యతలు స్వీకరించగా.. నియోజకవర్గం నుంచి తరలివచ్చిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చడంతోపాటు నృత్యాలు చేశారు. దయాకర్‌రావుకు రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్ధేశించి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తనపై నమ్మకంతో మంత్రి పదవిని అప్పగించారని, దానిని వమ్ము చేయకుండా బాధ్యతగా వ్యవహరించి పదవికి వన్నె తెస్తానని చెప్పారు. మూడు దశాబ్దాల కార్యకర్తల కల నేడు నెరవేరిందని, ఊరూరికి దేవాదుల ద్వారా గోదావరి జలాలు తెచ్చి చెరువులను నింపుతామని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ధ్యేయమని, కరువు ప్రాంతమైన పాలకుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి కార్యచరణ రూపొందిస్తానని తెలిపారు. ప్రజల కోరిక మేరకు త్వరలో అన్ని మండలాలు పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. -
కీలక బాధ్యతలు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వేముల ప్రశాంత్‌రెడ్డి రాష్ట్ర మంత్రిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు అత్యంత కీలకమైన శాసన సభా వ్యవహారాలు, రోడ్లు భవనా లు, రవాణా, గృహ నిర్మాణ శాఖలు అప్పగించారు. సివిల్ ఇంజినీర్ అయిన ప్రశాంత్‌రెడ్డికి సీఎం కేసీఆర్ ఇంజినీరింగ్ శాఖలే కేటాయించారు. మిషన్‌భగీరథ వైస్ చైర్మన్‌గా పనిచేసిన ప్రశాంత్‌రెడ్డి, కేసీఆర్ కలల ప్రాజెక్టు వాటర్‌గ్రిడ్ పనులను అనతి కాలంలోనే ముందుకు తీసుకెళ్లారు. నిర్దేశించిన పనిలో సమర్థత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తన జట్టులో కేసీఆర్ చోటు కల్పించారు. గత ప్రభుత్వ హయాంలో శాసన సభా వ్యవహారాల మంత్రిగా హరీశ్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్రావు పనిచేశారు. రవాణా శాఖ మంత్రిగా మహేందర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. వీటితో పాటు గృహ నిర్మాణశాఖ బాధ్యతలు కూడా వేములకు అప్పగించారు. దైవసాక్షిగా ప్రమాణం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా పది మంది ఎమ్మెల్యేలకు అవకాశం లభించింది. ఇందులో ప్రశాంత్‌రెడ్డి ఒకరు కాగా, ఆయన రాజ్‌భవన్‌లో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తల్లి మంజుల ఆశ్వీరాదం తీసుకున్న అనంతరం ప్రశాంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. కాగా ప్రశాంత్‌రెడ్డికి మంత్రి వర్గంలో చోటు ఖాయమనే అభిప్రాయం మొదటి నుంచి వ్యక్తమైంది. అందరూ ఊహించినట్లుగానే మంత్రి పదవి దక్కింది. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు కావడం, కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ పట్ల ఉన్న విధేయతే ఆయనకు పదవి వరించేలా చేసింది. ఎంపీ కవితను కలిసిన మంత్రి.. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎంపీ కల్వకుంట్ల కవితను మర్యాద పూర్వకంగా కలిసారు. హైదరాబాద్‌లో ఎంపీ నివాసానికి వెళ్లారు. మహానాయకుడు కేసీఆర్ కేబినెట్లో చోటు లభించడం తన అదృష్టమని ప్రశాంత్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు, తన విజయానికి కృషి చేసిన ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా నియమితులైన ప్రశాంత్‌రెడ్డికి ఎంపీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత్‌రెడ్డికి పలువురి శుభాకాంక్షలు.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రశాంత్‌రెడ్డిని జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కలసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ దఫెదార్ రాజు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి, నుడా చైర్మన్ చామకూర ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ సుమనారెడ్డి, పార్టీ నాయకులు డాక్టర్ మధుశేఖర్ తదితరులు ప్రశాంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. -
రెండోసారి విద్యాశాఖ
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : ‘గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా..లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నాకర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్పా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.’ అని రాజ్‌భవన్‌లో గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం ఆయనకు సీఎం కేసీఆర్విద్యాశాఖను కేటాయించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొలువుదీరిన టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలోనూ జగదీశ్‌రెడ్డికి విద్యాశాఖను కేటాయించారు. ఆ తర్వాత ఆ శాఖను కడియం శ్రీహరికి ఇచ్చి జగదీశ్‌రెడ్డికి విద్యుత్‌శాఖను అప్పగించారు. ఇప్పుడు మళ్లీ విద్యాశాఖను ఇస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారం పది మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించగా అందులో మూడో వ్యక్తి జగదీశ్‌రెడ్డి ఉన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు జగదీశ్‌రెడ్డి దంపతులిద్దరూ సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయనకు ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, నోముల నర్సింహయ్య, మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళ్లిక, మార్కెట్ కమిటీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు బండా నరేందర్‌రెడ్డి, కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, గండూరి ప్రకాశ్, ఓయూ జేఏసీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు అభినందనలు తెలిపారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కుటుంబ సభ్యులు హారతిపట్టారు. మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సూర్యాపేట పట్టణంలో మున్సిపల్ కౌన్సిలర్లు, నేతలు భారీ ఎత్తున బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కొత్త జిల్లాలో రెండోసారి మంత్రిగా.. సూర్యాపేట నియోజకవర్గ చరిత్రలో ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి, రెండో సారి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యేగా జగదీశ్‌రెడ్డి నిలిచారు. ఉమ్మడి జిల్లా పరంగా చూస్తే రెండు, అంతకన్నా ఎక్కువ సార్లు మంత్రులుగా చేసిన వారిలో కొండా లక్ష్మణ్‌బాపూజీ, ఎలిమినేటి మాధవరెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ఉన్నారు. వీరి తర్వాత ప్రస్తుతం గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచి రెండో సారి మంత్రి పదవి దక్కించుకున్న వారిలో ఉన్నారు. విద్యాశాఖ..మంత్రిగా తెలంగాణ ప్రభుత్వ తొలి కేబినెట్లో తొలి విద్యాశాఖ మంత్రిగా జగదీశ్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 2014 జూలై 2 నుంచి 2015 జనవరి 29 వరకు విద్యాశాఖ మంత్రిగా కొనసాగారు. ఆతర్వాత ఈ శాఖను కడియం శ్రీహరికి ఇచ్చి.. విద్యుత్ శాఖను జగదీశ్‌రెడ్డికి ఇచ్చారు. అనంతరం ఎస్సీ కులాల అభివృద్ధి శాఖను కూడా ఆయనకు కేటాయించారు. మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వ రెండో కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. విద్యారంగంపై ఆయనకు పూర్తిగా అవగాహన ఉండడంతో ఈశాఖ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి అభీష్టం మేరకు.. ఏ శాఖ అయినా మంత్రి మండలిదే సమష్టి బాధ్యతని, ముఖ్యమంత్రి కేసీఆర్ అభీష్టం మేరకే నడుచుకుంటానని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వ్యవసాయదారుడిగా విద్యుత్‌శాఖ మంత్రిగా విధులు నిర్వహించడం సంతృప్తినిచ్చిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్ తన మీద పెట్టిన బాధ్యతలతో సత్ఫలితాలు సాధిస్తానన్నారు. రెండోసారి మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అనే నేను..!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నిర్మల్ శాసనసభ్యుడు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(ఐకే రెడ్డి) మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రిగా ఐకే రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు. 2014లో తెలంగాణ తొలి ప్రభుత్వంలో న్యాయ, దేవాదాయ, గృహ నిర్మాణ శాఖలను నిర్వహించిన అల్లోల రెండోసారి మంత్రిగా సంతకం చేశారు. కాగా, రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జోగు రామన్నతోపాటు ఇతర ఎమ్మెల్యేలు హాజరై మంత్రిగా ప్రమాణం చేసిన ఐకే రెడ్డికి అభినందనలు తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరే! పరిమిత సంఖ్యలో 10 మందితో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సీనియర్ రాజకీయ వేత్త, విద్యావంతుడైన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి మాత్రమే అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రుడుగా వ్యవహరించిన ఐకే రెడ్డి గత ఎన్నికల్లో నియోజకవర్గంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఘన విజయం సాధించారు. ఆయనకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగినా, సోమవారం వరకు ఉత్కంఠత కొనసాగింది. చివరికి అనుభవానికి, విధేయతకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇచ్చి ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా మరోసారి అవకాశం కల్పించారు. జిల్లా నుంచి గత ప్రభుత్వంలో బీసీ సంక్షేమం, అటవీ శాఖలకు మంత్రిగా పనిచేసిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు పరిమిత మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. అలాగే కొత్తగా మంత్రి పదవిని ఆశించిన ఎమ్మెల్యేలు బాల్క సుమన్(చెన్నూరు), రేఖానాయక్(ఖానాపూర్), కోనేరు కోనప్ప(సిర్పూరులకు కూడా నిరాశే ఎదురైంది. పార్లమెంటు ఎన్నికల అనంతరం మరో ఆరుగురిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉన్నందున, అప్పటికి తమకు చాన్స్ రావచ్చని ఆశావహులు భావిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల ఆశలు మంత్రిగా రెండోసారి నియమితులైన అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డికి సమర్థవంతమైన నాయకుడిగా పేరుంది. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగున్న ఆయన 70 ఏళ్ల వయస్సులో సైతం చురుగ్గా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న ఆయనకు సవాళ్లు స్వాగతం పలుకనున్నాయి. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ పూర్తికాలేదు. మిషన్ భగీరథ పనులు ఇంకా సాగుతూనే.. ఉన్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పనులు నాలుగు జిల్లాల్లో పెండింగ్‌లోనే ఉన్నాయి. సాగునీటి సమస్యలు కొలిక్కి రావడం లేదు. చిన్న, మధ్య తరహా నీటి ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో సేవలు అందించడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో రెవెన్యూ వివాదాలు పరిష్కారానికి నోచుకోలేదు. 1/70 చట్టం పరిధిలో ఉన్న మండలాలు, గ్రామాల్లో గిరిజనులు, గిరిజనేతరులకు భూముల పట్టాల పంపిణీపై ఇబ్బందులు ఉన్నాయి. గత ఎన్నికల ప్రచారంలో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాలను ప్రస్తావిస్తూ, గెలిచిన నెలరోజుల్లోనే ప్రభుత్వ యంత్రాంగంతో ఆదిలాబాద్‌కు వచ్చి నాలుగు రోజులు అక్కడే ఉండి సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రాకపోయినా, మంత్రిగా ఐకే రెడ్డి ఈ అటవీ భూముల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు ఆశిస్తున్నారు. -
ఈటలకు వైద్యం.. కొప్పులకు సంక్షేమం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మంత్రివర్గ విస్తరణ, పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆహ్వానం అందే వరకు ఆశావహుల్లో టెన్షనే నెలకొనగా.. ప్రమాణ స్వీకారం తర్వాత కూడా శాఖలపైన సాయంత్రం వరకు గాని ఉత్కంఠకు తెరపడ లేదు. మంత్రి పదవులు కేటాయింపుపై సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. ఈటల రాజేందర్‌కు సంక్షేమ శాఖలు, కొప్పుల ఈశ్వర్‌కు విద్యాశాఖ కేటాయిస్తారన్న ప్రచారం సాగింది. అయితే ఒకరు పాత, ఇంకొకరు కొత్త మంత్రులైనప్పటికీ బయట ప్రచా రానికి భిన్నంగా మంత్రి పదవులను ముఖ్య మంత్రి కేసీఆర్ కేటాయించారు. గత కేబినేట్ ఈటల రాజేందర్ ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహించగా ఈసారి ఆయనకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా నియమించారు. అలాగే మొదటిసారి మంత్రిగా మంత్రివర్గంలో చేరిన ఈశ్వర్‌కు ఐదు శాఖలను కలగలిపిన సంక్షేమ శాఖల మంత్రిగా అవకాశం కల్పించారు. ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ సమర్థవంతంగా పనిచేశాడన్న పేరుం ది. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల కోసం హాస్టళ్లలో ‘సన్నబియ్యం’ పథకాన్ని ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ ప్రశంసలు పొందారు. ఉద్యమంలోనూ, ప్రభుత్వంలోనూ కొత్త విధానాలను శ్రీకా రం చుట్టిన పేరున్న రాజేందర్‌కు పేదలకు మరిం త సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కేటాయిం చారంటున్నారు. కొప్పుల ఈశ్వర్ కూడా పేద, బడుగు, బలహీన వర్గాల పరిస్థితి ఎరిగిన వ్యక్తిగా ఆ వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తారన్న ఉద్దేశంతో ఆయనకు సంక్షేమ శాఖలు కేటాయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇద్దరు మంత్రుల చేతుల్లో జిల్లా భవిత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరికి మంత్రి పదవులు దక్కడంతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు మరింత ఆశలు పెట్టుకుంటున్నారు.ఉమ్మడి రాష్ట్రం లోనూ కరీంనగర్ జిల్లాకు వైద్య ఆరోగ్యశాఖ అందని ద్రాక్షగానే మారింది. ఆర్థికశాఖ కూడా ఎవరినీ వరించలేదు. అయితే అరుదైన ఆర్థిక శాఖను నిర్వహించిన ఈటల రాజేందర్‌కు ఈసారి వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి రావడంతో అభివృద్ధిపై జగిత్యాల జిల్లాలో ఆశలు చిగురించాయి. గతంలో సింగరేణి కార్మిక నాయకుడిగా పనిచేసిన కొప్పులకు పెద్దపల్లి జిల్లా ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన ఉండడంతో ఆ జిల్లా ప్రగతిపై విశ్వాసం నెలకొంది. ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్లకు మంత్రులుగా అవకాశం కల్పించడం, శాఖల కేటాయింపు పట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. బాణాసంచాలు, టపాసులు కాల్చారు. స్వీట్లు పంపిణీ చేసిన అభిమానులు సంబరాలు నిర్వహించారు. జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌లను కలిసి పుష్పగుచ్ఛాలు అం దించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులను కలిసి వారిలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నగర మేయర్ రవీందర్‌సింగ్, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, నాయకులు ఎడ్ల అశోక్, కలర్ సత్తెన్న, మైఖేల్ శ్రీను, గుంజపడుగు హరిప్రసాద్, బి.తిరుపతి నాయక్, దూలం సంపత్, జక్కుల నాగరాజు, ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, జిల్లా అధ్యక్షుడు కోరెం సంజీవరెడ్డి ఉన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల రుణం తీర్చుకుంటా : ఈటల తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి మంత్రి పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హృదయపూర్వక కతజ్ఞతలు. ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటాను. ఎమ్మెల్యేగా గెలిపించిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం అహర్నిశలు పనిచేస్తా. బాధ్యత పెరిగింది : కొప్పుల సాక్షి, జగిత్యాల: కేసీఆర్ అప్పగించిన మంత్రి పదవితో నాపై బాధ్యత మరింత పెరిగింది. రాష్ట్ర ప్రజల అవసరాలు.. వారి ఆకాంక్షలకు తగ్గట్టు పనిచేస్తూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో ముందుంటా. నాపై నమ్మకం ఉంచి మంత్రి పదవి అప్పగించిన కేసీఆర్‌కు రుణపడి ఉంటాను. వరుసగా ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఆదరించిన నియోజకవర్గ ప్రజలకు, వెన్నంటే ఉంటూ గెలుపునకు సహకరించిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.. -
‘టీఆర్ఎస్లో సైనికుడిని’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితిలో క్రమశిక్షణ గల సైనికుడిగా పని చేస్తున్నానని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. టీఆర్ఎస్ అధినేతగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆదేశాలను అమలు చేస్తానని అన్నారు. పార్టీలో సామాన్య కార్యకర్తగా పని చేస్తానన్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే పదులసార్లు స్పష్టం చేశానని, ఎన్నికల సమయంలోనూ చెప్పానని తెలిపారు. తనకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న చెడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తన పేరుతో ఎలాంటి గ్రూపులు, సేనలు లేవని... ఎవరైనా ఇలాంటివి పెట్టుకుంటే సీరియస్‌గా తీసుకోవద్దని చెప్పారు. (కీలక శాఖలు అన్ని కేసీఆర్ వద్దే) మంగళవారం రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు ఏది ఆదేశిస్తే దాన్ని తూ.చ. తప్పకుండా అమలు చేస్తా. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు చెప్పా. ముఖ్యమంత్రిగారు ఆయా ప్రాంతాలు, అన్ని వర్గాలు, ఇతర సమీకరణలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్ నాకు ఏ బాధ్యత అప్పగించినా క్రమశిక్షణగల కార్యకర్తగా అమలు చేస్తాను. మంత్రివర్గంలో చోటు విషయంలో నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. ఎవరైనా సోషల్ మీడియాలో చెడుగా ప్రచారం చేస్తే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. టీఆర్ఎస్ కార్యకర్తలందరు పార్టీ కోసం, కేసీఆర్ కోసం పనిచేయాలి. కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన వారికి శుభాకాంక్షలు, అభినందనలు. ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. రెండోసారి టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసు కొచ్చారు. ప్రజల ఆకాంక్షలను నిజం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. కొత్త మంత్రులు పూర్తిస్థాయిలో మంచిగా పనిచేసి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉండి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నా’అని అన్నారు. -
దేవుడి మంత్రిగా మళ్లీ ‘ఇంద్రుడే’
సాక్షి, హైదరాబాద్ : ఆలయాల శాఖకు అమాత్యులుగా పనిచేసిన వారికి అనంతర రాజకీయ జీవితంలో దేవుడి కరుణ మాత్రం కలగలేదు. గతంలో 8 మంది నేతలు దేవాదాయ మంత్రులుగా పనిచేశారు. వారిలో ఎవరినీ మరోసారి మంత్రి పదవి వరించలేదు. ఎమ్మెల్యేగా గెలవడమే కష్టమైందని చరిత్ర చెబుతోంది. కానీ, నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాత్రం 36 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. గత కేబినెట్లో దేవాదాయ మంత్రిగా పనిచేసిన ఆయన ఈసారి కూడా మంత్రి అయ్యారు. మంత్రి కావడమే కాదు... దేవాదాయ మంత్రిగా రికార్డు సృష్టించారు. (కేసీఆర్ వద్దే ఆర్థిక శాఖ ) చరిత్ర ఇదీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరి దేవాదాయ మంత్రిగా పనిచేసిన వారు మళ్లీ మంత్రి పదవి చేపట్టడం అనేది జరగలేదు. మంత్రి పదవి అటుంచితే తదుపరి ఎన్నికల్లో విజయం సాధించడమే గగనమైపోయింది. కొంతమందికైతే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా రాలేదు. మరీ పూర్వం నుంచి కాదు గానీ 1983లో ఎన్టీఆర్ కేబినెట్లో దేవాదాయ మంత్రిగా పనిచేసిన యతిరాజారావుతో పాటు 1994లో ఎన్టీఆర్ హయాంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత సింహాద్రి సత్యనారాయణ కూడా ఆ తర్వాత ఎన్నికల్లో ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. ఇక 1995లో చంద్రబాబు కేబినెట్లో ఈ శాఖ నిర్వహించిన దామచర్ల ఆంజనేయులు తదుపరి ఎన్నికల్లో గెలవలేదు. ఇక 1999 ఎన్నికల తర్వాత ఏర్పడ్డ చంద్రబాబు కేబినెట్లో దండు శివరామరాజు దేవాదాయ శాఖ చేపట్టారు. 2004 ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం కూడా రాలేదు. తర్వాత ఈ శాఖ చేపట్టిన ఎం.సత్యనారాయణరావు మధ్యలోనే పదవి నుంచి తప్పుకున్నారు. తర్వాతి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎమ్మెస్సార్ తర్వాత ఆయన సామాజిక వర్గానికే చెందిన జువ్వాడి రత్నాకర్‌రావు ఆ శాఖ చేపట్టారు. అయితే, 2009 ఎన్నికల్లోనూ, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయన గెలవలేదు. ఇక, 2009 ఎన్నికల తర్వాత దేవాదాయశాఖ చేపట్టిన గాదె వెంకట్‌రెడ్డికి కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో మంత్రిపదవి దక్కలేదు. ఎమ్మెస్సార్‌కు, రత్నాకర్‌రావుకు మధ్యలో కొన్ని నెలలు దేవాదాయ బాధ్యతలు నిర్వర్తించిన జేసీ దివాకర్‌రెడ్డికి 2009లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రి పదవి రాలేదు. అప్పుడు దేవాదాయ మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు తెలంగాణ తొలి కేబినెట్లో మంత్రి కాలేకపోయారు. ఆ తర్వాత విస్తరణలో మంత్రి అయినా దేవాదాయశాఖ చేపట్టలేదు. అప్పుడు దేవాదాయ శాఖ బాధ్యతలు తీసుకున్న ఇంద్రకరణ్‌రెడ్డి 2018లో కేసీఆర్ ప్రభుత్వం రద్దయ్యేంతవరకు అదే శాఖ నిర్వహించారు. మళ్లీ 2018 ముందస్తు ఎన్నికల్లో గెలిచి మళ్లీ ఇప్పుడు కేసీఆర్ కేబినెట్లో దేవాదాయ శాఖ మంత్రిగా నియమింపబడటం విశేషం. -
కేసీఆర్ వద్దే ఆర్థిక శాఖ
ఎన్నో అంచనాలు, మరెన్నో ఊహాగానాలు పక్కనబెడుతూ సీఎం కేసీఆర్ కొత్త కేబినెట్లో శాఖలను కేటాయించారు. కీలక ఆర్థిక, రెవెన్యూ, నీటిపారుదల శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. ఆర్థిక బాధ్యతలు అప్పజెబుతారని ప్రచారం జరిగిన నిరంజన్ రెడ్డికి వ్యవసాయ శాఖను అప్పగించారు. ఈటలకు వైద్య, ఆరోగ్య శాఖను కేటాయించారు. ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్‌కు గత కేబినెట్లోని మంత్రిత్వ శాఖలే ఇచ్చారు. అంతకుముందు మంగళవారం ఉదయం 11.30కు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణం ఘనంగా జరిగింది. జగదీశ్‌రెడ్డి, ఈటల పవిత్ర హృదయంతో, మిగిలిన 8మంది దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం వీరంతా గవర్నర్, సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్, హరీశ్‌రావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా, గురువారం కొత్త కేబినెట్ భేటీ కానుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు. కొత్త మంత్రులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సాక్షి, హైదరాబాద్ : రెండోసారి అధికారంలోకి వచ్చాక.. కేసీఆర్ మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం కొలువుదీరిన కొత్త మంత్రివర్గంలో శాఖల కేటాయింపులో తన మార్కును ఆయన స్పష్టంగా చూపించారు. కీలకమైన ఆర్థిక, నీటిపారుదల, రెవెన్యూ, విద్యుత్ శాఖలను తనవద్దే పెట్టుకున్నారు. ప్రమాణం చేసిన మంత్రుల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలకు గతంలో కేటాయించిన శాఖల బాధ్యతలు అప్పగించగా.. మిగిలిన వారి శాఖలను మార్చారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖను నిర్వహించిన ఈటల రాజేందర్‌కు వైద్య, ఆరోగ్య శాఖను, జి.జగదీశ్‌రెడ్డికి విద్యాశాఖను అప్పగించారు. గత ప్రభుత్వంలో టి.పద్మారావుగౌడ్ నిర్వహించిన ఎక్సైజ్, యువజన సర్వీసుల శాఖలను.. అదే వర్గానికి చెందిన వి.శ్రీనివాస్‌గౌడ్‌కు, జూపల్లి కృష్ణారావు నిర్వహించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను అదే వర్గానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ముఖ్యమంత్రి కేటాయించారు. పట్నం మహేందర్‌రెడ్డి నిర్వహించిన రవాణా శాఖను అదే వర్గానికి చెందిన వేముల ప్రశాంత్‌రెడ్డికి, గత ప్రభుత్వంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన వ్యవసాయ శాఖను అదే వర్గానికి చెందిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కేటాయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జోగు రామన్న నిర్వహించిన అటవీ, పర్యావరణ శాఖలను.. అదే జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డికి అప్పగించారు. కీలకమైన శాసనసభ వ్యవహారాల శాఖ బాధ్యతలను తన సన్నిహితుడైన వేముల ప్రశాంత్రెడ్డికే కేసీఆర్ కేటాయించారు. టీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీశ్ రావులు నిర్వహించిన పురపాలక, పరిశ్రమలు, ఐటీ, సాగునీటి పారుదల శాఖలతోపాటు కీలకమైన ఆర్థిక, రెవెన్యూ, విద్యుత్ శాఖలను కేసీఆర్ ఎవరికీ కేటాయించలేదు. సందడిగా ప్రమాణ కార్యక్రమం కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం రాజ్‌భవన్‌లో సందడిగా జరిగింది. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం ఉదయం 11.30 గంటలకు పది మందితో ప్రమాణస్వీకారం చేయించారు. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి.శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డిలు వరుసగా మంత్రులుగా ప్రమాణం చేశారు. జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్ పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు. మిగిలిన ఎనిమిది మంది దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. మంత్రులుగా ప్రమాణం అనంతరం వీరంతా.. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్దకెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త మంత్రులను వీరిరువురు అభినందించారు. కొత్త మంత్రులు కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులతో కార్యక్రమానికి వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరు పక్కపక్కనే కూర్చుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, టి.పద్మారావుగౌడ్, సి.లక్ష్మారెడ్డితోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. కొత్తమంత్రులు, ముఖ్యుల రాకతో రాజ్‌భవన్ సందడిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి డిసెంబర్ 13న కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పుడు కేసీఆర్‌తోపాటు మహమూద్‌అలీ ఒక్కరే ప్రమాణం చేశారు. మంగళవారం రాజ్‌భవన్‌లో ఇంద్రకరణ్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్ నరసింహన్. చిత్రంలో సీఎం కేసీఆర్ తదితరులు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం ప్రమాణ స్వీకారం అనంతరం జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి పాదాభివందనం చేయబోతే సీఎం కేసీఆర్ వారిని వారించారు. మల్లారెడ్డి గవర్నర్ నరసింహన్‌కు పాదాభివందనం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రులుగా ప్రమాణం చేసే వారి పేర్లను వరుసగా పిలిచారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరుకు బదులుగా ఎర్రబెల్లి దివాకర్‌రావు అని పిలవగా.. సీఎం జోక్యం చేసుకుని సవరించారు. అనంతరం కొత్త మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ గ్రూఫ్ ఫొటో దిగారు. మంత్రుల నియామకంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి రాత్రి 7గంటలకు శాఖలను కేటాయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొత్త మంత్రులకు అధికారిక వాహనాలను, బందోబస్తును ఏర్పాటు చేశారు. కేటీఆర్ శుభాకాంక్షలు కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన అభినందించారు. ‘కొత్త మంత్రులందరికీ çహృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో మీరంతా తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారన్న నమ్మకం నాకుంది’అని పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారం జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన హరీశ్‌రావు, కేటీఆర్, జితేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, పద్మారావు, కడియం శ్రీహరి తదితరులు కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతా 1994లో టీడీపీ అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. కానీ లక్ష్మీపార్వతి వల్ల రాలేదు. తర్వాత చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట తప్పారు. సీఎం కేసీఆర్ మాత్రం మంత్రి పదవిపై మాట ఇచ్చి నిలుపుకున్నారు. కేసీఆర్ నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెడతా. మా జిల్లాలోని సీనియర్ కడియం శ్రీహరి, చందూలాల్, మధుసూదనాచారిలను కలుపుకొని వారి అనుభవంతో ముందుకు వెళతా. – ఎర్రబెల్లి దయాకర్‌రావు కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శం సీఎం కేసీఆర్ పరిపాలన దేశానికి ఆదర్శంగా నిలిచింది. అందరి ఆశీర్వాదంతోనే ఈ స్థాయిలో ఉన్నాను. మీలో ఒకడిగా ఉంటూ అన్నివేళలా అండగా ఉంటాను. నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన బాధ్యతను పూర్తిస్థాయిలో నెరవేరుస్తాను. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. – తలసాని శ్రీనివాస్‌యాదవ్ 16 ఎంపీ సీట్లు గెలుస్తాం సీఎం కేసీఆర్ చేసిన ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లు గెలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 సీట్లను గెలుచుకుంటుంది. మంత్రిగా నాకు రెండోసారి అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. బంగారు తెలంగాణ సాకారం కోసం ఆయన పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు నడుచుకుంటాను. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నిర్మల్ ప్రజలకు కృతజ్ఞతలు. – అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కేసీఆర్, కేటీఆర్‌కు ధన్యవాదాలు రెండోసారి మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు. ఇప్పటివరకు అన్నింట్లో సహకరించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు. సమన్వయం, సామరస్యంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అద్భుత ఫలితాలు సాధించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకమే మమ్మల్ని విజయపథం వైపు నడిపించింది. – జి.జగదీశ్‌రెడ్డి ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటా నాకు మంత్రివర్గంలో అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ ఆదేశాల మేరకు పనిచేస్తాను. సీఎం కేసీఆర్ నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను. ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నన్ను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ధర్మపురి ప్రజలకు కృతజ్ఞతలు. – కొప్పుల ఈశ్వర్ పంట కాలనీలకు కార్యరూపం రాష్ట్రంలో ప్రజల జీవన విధానమైన వ్యవసాయ రంగం సమస్యలు తీర్చి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా శాస్త్రీయ పద్ధతిలో మార్కెటింగ్‌పై దృష్టి పెడతాను. రైతుల సమస్యలు పరిష్కరించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తాను. సాగు విస్తరణ, మార్కెటింగ్, సరఫరా రంగాలపై దృష్టి పెడతా. రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లోకి అందించేలా ప్రణాళికలను రూపొందిస్తాం. సీఎం కేసీఆర్ ఆలోచన విధానానికి అనుగుణంగా రైతు సమన్వయ సమితులను బలోపేతం చేస్తాం. రైతు సమన్వయ సమితులకు విధివిధానాలను త్వరలోనే ఖరారు చేస్తాం. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులు త్వరలో పూర్తి కానున్నాయి. సాగునీటిని హేతుబద్ధ్దంగా వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. తెలంగాణ వాతావరణ పరిస్థితులు, రాష్ట్రంలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటల కాలనీలను ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించేందుకు ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతాం. ఫుడ్‌ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా, ప్రజలకు కల్తీలేని నాణ్యమైన ఆహార పదార్థాలను అందించేందుకు అవకాశం ఉంటుంది. – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి -
తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు
-
తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలు కేటాయించారు. సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్‌కు సంక్షేమశాఖలు కేటాయించగా, మరో సీనియర్ నేత ఇంద్రకరణ్‌రెడ్డికి న్యాయ, అటవీ, దేవాదాయశాఖలు అలాట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవమరించిన ఈటల రాజేందర్‌కు ఈసారి వైద్యారోగ్యశాఖ దక్కగా.. గతంలో విద్యుత్‌శాఖ మంత్రిగా వ్యవహరించిన జగదీశ్‌రెడ్డికి ఈసారి విద్యాశాఖ లభించింది. గత హయంలోనూ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్‌కు పశుసంవర్థకశాఖ కేటాయించారు. ఇక, తొలిసారి మంత్రి పదవి నిర్వహిస్తున్న వారిలో నిరంజన్‌రెడ్డికి వ్యవసాయ శాఖ, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు, ప్రశాంత్‌రెడ్డికి రోడ్లు-భవనాలు, రవాణాశాఖలు కేటాయించారు. మేడ్చల్ మల్లారెడ్డికి కార్మిక శాఖ దక్కగా.. శ్రీనివాస్‌గౌడ్‌కు ఎక్సైజ్, పర్యాటక శాఖలు లభించాయి. తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా పదిమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కీలకమైన ఆర్థిక, రెవెన్యూ, సాగునీటి పారుదల, ఐటీ, పరిశ్రమలు, పట్టాణాభివృద్ధి వంటి శాఖలను కేసీఆర్ తనవద్దే ఉంచుకోవడం గమనార్హం. గత హయాంలో తన తనయుడు కేటీఆర్ నిర్వహించిన ఐటీ, పట్టాణాభివృద్ధి శాఖలను, హరీశ్‌రావు నిర్వహించిన సాగునీటి పారుదల శాఖను కేసీఆర్ ఎవరికీ కేటాయించలేదు. -
మంత్రి పదవిపై స్పందించిన హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గంలో చోటు దక్కలేదన్న బాధ తనకు ఏమాత్రం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. మంత్రి పదవి రాలేదని తాను అసంతృప్తితో ఉన్నట్లు, పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. మంగళవారం రాజ్‌భవన్‌లో జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఎన్నికైన తెలంగాణ మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధే ద్యేయంగా కొత్త మంత్రులు కేసీఆర్ దిశా నిర్దేశంలో కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా సామాన్య కార్యకర్తగా, క్రమశిక్షణ గల నాయకుడిగా పనిచేస్తానని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపైన వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. -
ఏ బాధ్యత అప్పగించిన క్రమశిక్షణగా పనిచేస్తా
-
ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ టీమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా పది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ వారితో ప్రమాణం చేయించారు. జాతీయ గీతాలాపన అనంతరం మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఒక్కొక్కరిని సభా వేదికపైకి పిలిచారు. ప్రమాణం స్వీకారం చేసిన వారు వరుసగా మొదటగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. తలసాని అనంతరం సూర్యాపేట ఎమ్మెల్యే, గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. జగదీష్ రెడ్డి ప్రమాణం చేసిన అనంతరం టీఆర్ఎస్ సీనియర్ నేత, గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణం చేసిన ఈటల రాజేందర్ ప్రమాణం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రాతినిథ్యం వహించిన ఈయన పార్టీ ఎల్పీ నేతగా పనిచేశారు. తొలి సారి వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఆరు సార్లు ధర్మపురి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేశారు. తొలి మంత్రివర్గ విస్తరణలో ఏకైక ఎస్సీ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ నిలిచారు. పాలకుర్తి ఎమ్మెల్యే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఈయన తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల నాయకుడిగా పనిచేశారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. చివరగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఆయన మల్కజ్గిరి ఎంపీగా పనిచేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌లతో కలిసి కొత్త మంత్రులు ఫోటోలు దిగారు. -
భావోద్వేగానికి లోనైన ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: తనకు మంత్రి పదవి దక్కడంపై ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను అందరిని కలుపుకొని వెళ్తానని, జిల్లా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పారు. ‘ఎన్టీఆర్ నాకు మంత్రి పదవి ఇస్తానని అన్నారు కానీ లక్ష్మీపార్వతి వల్ల రాలేదు. చంద్రబాబు నన్ను మంత్రిని చేస్తానని మాటతప్పారు. కేసీఆర్ నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వరంగల్ జిల్లాకు పెండింగ్ లో ఉన్న రింగ్ రోడ్డు, టెక్స్ టైల్ పార్కు, ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తేచ్చేందుకు కృషిచేస్తా. సీనియర్ నాయకులు కడియం శ్రీహరి, చందూలాల్, మధుసూదనాచారిలను కలుపుకొని వారి అనుభవంతో ముందుకు వెళతా. వరంగల్ ఉద్యమకారులు, టీఆర్ఎస్ శ్రేణులకు అండగా ఉంటాన’ని ఎర్రబెల్లి అన్నారు. అరుదైన గౌరవమని: కొప్పుల ఈశ్వర్ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కడం ఆనందంగా ఉందని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఉద్యమ నాయకుడిగా తనకిది అరుదైన గౌరవమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన మీద పెట్టిన నమ్మకాన్ని నెరవేరుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి జవాబుదారిగా పనిచేస్తానని చెప్పారు. (నేడే కేసీఆర్ కేబినెట్ విస్తరణ) కేసీఆర్‌కు కృతజ్ఞతలు: ఇంద్రకరణ్ రెడ్డి తనపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇంద్రకరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మొదటి ఐదేళ్లలో కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. బంగారు తెలంగాణ కల సాకారం చేసేందుకు సమిష్టిగా పనిచేస్తామన్నారు. కార్యకర్తల కృషి వల్లే తనకు మంత్రి పదవి దక్కిందన్నారు. నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ముఖ్యమంత్రి తనకు ఏ శాఖ అప్పగించిన శిరసావహిస్తానని స్పష్టం చేశారు.