సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు పెద్ద బాధ్యత అప్పగించారని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆయన శుక్రవారం ఉదయం సెక్రటేరియట్ డీ–బ్లాక్‌లో తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రుణపడి ఉంటానని అన్నారు. గ్రామ పంచాయతీలు అందంగా తీర్చిదిద్దాలన‍్న మంత్రి ఎర్రబెల్లి... నూతన పంచాయతీ రాజ్ చట్టంతో గ్రామీణ రూపురేఖలు మారుతాయని ఆకాంక్షించారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా గ్రామాలు ఇంకా అధ్వాన్నంగానే ఉన్నాయన్నారు.
ఇక తన 35ఏళ్ల రాజకీయ జీవితంలో 25 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసినా ఇంత ఆనందం ఎప్పుడు కలగలేదని తెలిపారు. చాలామంది తనను మోసం చేశారని, ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానంటే కొన్ని శక్తులు అడ్డుపడ్డాయని ఎర్రబెల్లి పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా తనకు మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారని ఆయన అన్నారు. తాను అడగకుండానే కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా ఇంత పెద్ద బాధ్యత అప్పగించారని అన్నారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రి మల్లారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, రాజయ్య, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్, అరెకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, కెచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, గుండు సుధారాణి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment