మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌లకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలుపుతున్న టీఆర్‌ఎస్ నేతలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మంత్రివర్గ విస్తరణ, పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆహ్వానం అందే వరకు ఆశావహుల్లో టెన్షనే నెలకొనగా.. ప్రమాణ స్వీకారం తర్వాత కూడా శాఖలపైన సాయంత్రం వరకు గాని ఉత్కంఠకు తెరపడ లేదు. మంత్రి పదవులు కేటాయింపుపై సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. ఈటల రాజేందర్‌కు సంక్షేమ శాఖలు, కొప్పుల ఈశ్వర్‌కు విద్యాశాఖ కేటాయిస్తారన్న ప్రచారం సాగింది. అయితే ఒకరు పాత, ఇంకొకరు కొత్త మంత్రులైనప్పటికీ బయట ప్రచా రానికి భిన్నంగా మంత్రి పదవులను ముఖ్య మంత్రి కేసీఆర్ కేటాయించారు. గత కేబినేట్ ఈటల రాజేందర్ ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహించగా ఈసారి ఆయనకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా నియమించారు.
అలాగే మొదటిసారి మంత్రిగా మంత్రివర్గంలో చేరిన ఈశ్వర్‌కు ఐదు శాఖలను కలగలిపిన సంక్షేమ శాఖల మంత్రిగా అవకాశం కల్పించారు. ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ సమర్థవంతంగా పనిచేశాడన్న పేరుం ది. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల కోసం హాస్టళ్లలో ‘సన్నబియ్యం’ పథకాన్ని ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ ప్రశంసలు పొందారు. ఉద్యమంలోనూ, ప్రభుత్వంలోనూ కొత్త విధానాలను శ్రీకా రం చుట్టిన పేరున్న రాజేందర్‌కు పేదలకు మరిం త సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కేటాయిం చారంటున్నారు. కొప్పుల ఈశ్వర్ కూడా పేద, బడుగు, బలహీన వర్గాల పరిస్థితి ఎరిగిన వ్యక్తిగా ఆ వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తారన్న ఉద్దేశంతో ఆయనకు సంక్షేమ శాఖలు కేటాయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇద్దరు మంత్రుల చేతుల్లో జిల్లా భవిత
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరికి మంత్రి పదవులు దక్కడంతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు మరింత ఆశలు పెట్టుకుంటున్నారు.ఉమ్మడి రాష్ట్రం లోనూ కరీంనగర్ జిల్లాకు వైద్య ఆరోగ్యశాఖ అందని ద్రాక్షగానే మారింది. ఆర్థికశాఖ కూడా ఎవరినీ వరించలేదు. అయితే అరుదైన ఆర్థిక శాఖను నిర్వహించిన ఈటల రాజేందర్‌కు ఈసారి వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి రావడంతో అభివృద్ధిపై జగిత్యాల జిల్లాలో ఆశలు చిగురించాయి. గతంలో సింగరేణి కార్మిక నాయకుడిగా పనిచేసిన కొప్పులకు పెద్దపల్లి జిల్లా ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన ఉండడంతో ఆ జిల్లా ప్రగతిపై విశ్వాసం నెలకొంది.
ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌లకు మంత్రులుగా అవకాశం కల్పించడం, శాఖల కేటాయింపు పట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. బాణాసంచాలు, టపాసులు కాల్చారు. స్వీట్లు పంపిణీ చేసిన అభిమానులు సంబరాలు నిర్వహించారు. జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌లను కలిసి పుష్పగుచ్ఛాలు అం దించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులను కలిసి వారిలో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నగర మేయర్ రవీందర్‌సింగ్, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, నాయకులు ఎడ్ల అశోక్, కలర్ సత్తెన్న, మైఖేల్ శ్రీను, గుంజపడుగు హరిప్రసాద్, బి.తిరుపతి నాయక్, దూలం సంపత్, జక్కుల నాగరాజు, ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, జిల్లా అధ్యక్షుడు కోరెం సంజీవరెడ్డి ఉన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజల రుణం తీర్చుకుంటా : ఈటల
తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి మంత్రి పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హృదయపూర్వక కతజ్ఞతలు. ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటాను. ఎమ్మెల్యేగా గెలిపించిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం అహర్నిశలు పనిచేస్తా.
బాధ్యత పెరిగింది : కొప్పుల
సాక్షి, జగిత్యాల: కేసీఆర్ అప్పగించిన మంత్రి పదవితో నాపై బాధ్యత మరింత పెరిగింది. రాష్ట్ర ప్రజల అవసరాలు.. వారి ఆకాంక్షలకు తగ్గట్టు పనిచేస్తూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో ముందుంటా. నాపై నమ్మకం ఉంచి మంత్రి పదవి అప్పగించిన కేసీఆర్‌కు రుణపడి ఉంటాను. వరుసగా ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఆదరించిన నియోజకవర్గ ప్రజలకు, వెన్నంటే ఉంటూ గెలుపునకు సహకరించిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా..
Comments
Please login to add a commentAdd a comment