కేసీఆర్‌ టీంలోకి హరీశ్‌, కేటీఆర్‌ | KCR Expands Telangana Cabinet | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ టీంలోకి హరీశ్‌, కేటీఆర్‌

Published Mon, Sep 9 2019 2:34 AM | Last Updated on Mon, Sep 9 2019 8:01 AM

KCR Expands Telangana Cabinet - Sakshi

ఆదివారం రాజ్‌భవన్‌లో సబితా ఇంద్రారెడ్డి, హరీశ్‌రావు, కె. తారక రామారావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌ కుమార్‌ల చేత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయిస్తున్న గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌. చిత్రంలో సీఎం కేసీఆర్, సీఎస్‌ జోషి

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ఆశావహుల ఆరు నెలల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. కేబినెట్‌ విస్తరణలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన జట్టులో మరో ఆరుగురికి చోటు కల్పించారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన తన్నీరు హరీశ్‌రావు, కల్వకుంట్ల తారక రామారావుకు మళ్లీ మంత్రులుగా అవకాశం కల్పించారు. అలాగే తొలిసారి ఇద్దరు మహిళలు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లను తన కేబినెట్‌లోకి తీసుకోవడంతోపాటు మొదటిసారి గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌ కుమార్‌లకు మంత్రి పదవులు కేటాయించారు. ఈ మేరకు ఆదివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రుల చేత తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. సీఎం కేసీఆర్‌ వెంట రాగా ప్రమాణ స్వీకార వేదిక వద్దకు గవర్నర్‌ సాయంత్రం 4.10కు చేరుకున్నారు. జాతీయ గీతాలాపన అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే నేతలను వేదికపైకి ఆహ్వానించారు. తొలుత హరీశ్‌రావు ప్రమాణ స్వీకారం చేయగా ఆ తర్వాత కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రమాణం చేశారు. నూతన మంత్రుల్లో కేటీఆర్‌ పవిత్ర హృదయం సాక్షిగా ప్రమాణం చేయగా మిగతా ఐదుగురు దైవసాక్షిగా పదవీస్వీకార ప్రమాణం చేశారు. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ మంత్రులందరితోనూ ‘అనే నేను’అంటూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆరుగురు నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం 13 నిమిషాల వ్యవధిలో ముగిసింది. 

గంటకుపైగా రాజ్‌భవన్‌లో కేసీఆర్‌... 
నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్‌భవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌ సుమారు గంటన్నరపాటు రాజ్‌భవన్‌లో గడిపారు. నూతన మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్బంగా సీఎస్‌ ఎస్‌కే జోషికి సూచనలు చేస్తూ కనిపించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఫొటో సెషన్‌ సందర్భంగా రాష్ట్ర మంత్రులందరినీ సీఎం కేసీఆర్‌ నూతన గవర్నర్‌కు పేరు పేరునా పరిచయం చేశారు. అనంతరం దర్బార్‌ హాల్‌లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నూతన గవర్నర్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న పలు కార్యక్రమాలకు సంబంధించిన అంశాలతోపాటు సోమవారం శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న విషయాన్ని గవర్నర్‌కు సీఎం తెలియజేశారు. 

ప్రత్యేక ఆకర్షణగా హరీశ్, కేటీఆర్‌... 

  • టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, హరీశ్‌రావు ఒకే వాహనంలో రాజ్‌భవన్‌కు చేరుకుని ప్రమాణస్వీకార వేదిక వద్దకు కలసి వచ్చారు. దీంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున కేటీఆర్, హరీశ్‌ అనుకూల నినాదాలు చేశారు. పార్టీకి చెందిన మంత్రులు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కేటీఆర్‌ను ఆలింగనం చేసుకొని అభినందనలు తెలిపారు. 
  • ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసేంత వరకు కేటీఆర్, హరీశ్‌ పక్కపక్కన కూర్చొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
  • మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం హరీశ్‌రావు, కేటీఆర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌ సీఎం కేసీఆర్‌ పాదాలకు నమస్కరించారు. గంగుల కమలాకర్‌ పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించగా కేసీఆర్‌ వారించారు. నూతన మంత్రులకు సీఎం పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. 
  • నూతన మంత్రులకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆల్‌ ది బెస్ట్‌ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. 
  • ఆదివారం ఉదయం నూతన గవర్నర్‌గా తమిళిసై పదవీ స్వీకారం చేసిన వేదికపైనే సాయంత్రం కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 
  • నూతన గవర్నర్‌ ప్రమాణ స్వీకారంలో తమిళనాడు నుంచి వచ్చిన అతిథులు సాయంత్రం జరిగిన మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.  
  • అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌తోపాటు రాష్ట్ర మంత్రులు ముందు వరుసలో ఆసీనులయ్యారు. 
  • నూతన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సబిత, సత్యవతి రాథోడ్‌ తమ కుటుంబ సభ్యులతో ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకున్నారు.  

అజయ్‌కుమార్‌ 
పుట్టిన తేదీ: ఏప్రిల్‌ 19, 1965 
కుటుంబం: భార్య, ఒక కుమారుడు 
ఎమ్మెల్యేగా అనుభవం: 2014, 2018లో గెలుపు 
మంత్రి బాధ్యతలు: మొదటిసారి 

సబితా ఇంద్రారెడ్డి 
పుట్టిన తేదీ: మే 5, 1963 
కుటుంబం: ముగ్గురు కుమారులు 
ఎమ్మెల్యేగా అనుభవం: 2000 (ఉపఎన్నిక), 2004, 2009, 2018లలో ఎమ్మెల్యేగా విజయం 
మంత్రి బాధ్యతలు: 2004లో వైఎస్‌ కేబినెట్‌లో గనుల మంత్రిగా, 2009లో తొలి మహిళా హోంమంత్రిగా బాధ్యతలు  

కె. తారకరామారావు 
పుట్టిన తేదీ: జూలై 24, 1976 
కుటుంబం: భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె 
ఎమ్మెల్యేగా అనుభవం: 2009, 2010 (ఉప ఎన్నిక), 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలుపు  
మంత్రి బాధ్యతలు: 2014లో పంచాయతీరాజ్‌ మంత్రి, ఆ తర్వాత మున్సిపల్, ఐటీ, పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు  

టి.హరీశ్‌రావు 
పుట్టిన తేదీ: జూన్‌ 3, 1972 
కుటుంబం: భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె 
ఎమ్మెల్యేగా అనుభవం: 2004, 2008, 2009, 2010, 2014, 2018  వరుసగా విజయం 
మంత్రి బాధ్యతలు: 2004లో వైఎస్‌ కేబినెట్‌లో యువజన సర్వీసుల మంత్రిగా ప్రమాణం, ఆ తర్వాతే ఎమ్మెల్యేగా గెలుపు, 2014లో సాగునీటి మంత్రిగా బాధ్యతలు 

సత్యవతి రాథోడ్‌ 
పుట్టిన తేదీ: అక్టోబర్‌ 31, 1969 
కుటుంబం: భర్త, ఇద్దరు కుమారులు 
ఎమ్మెల్యేగా అనుభవం: 2009లో ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్సీ 
మంత్రి బాధ్యతలు: మొదటిసారి  

గంగుల కమలాకర్‌ 
పుట్టిన తేదీ: మే 8, 1968 
కుటుంబం: భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె 
ఎమ్మెల్యేగా అనుభవం: 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయం 
మంత్రి బాధ్యతలు: మొదటిసారి   

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement