Thaneeru Harish Rao
-
సినిమా టీజర్ విడుదల చేసిన మంత్రి
అముద శ్రీనివాస్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నా.. నీ ప్రేమ కథ’. కారుణ్య చౌదరి కథానాయిక. ΄పోత్నాక్ శ్రవణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘టీజర్ అద్భుతంగా ఉంది. హీరో, దర్శకుడు అముద శ్రీనివాస్ చక్కని ప్రతిభ కనబరిచారు. టీజర్‌ని చూస్తుంటే సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రంతో ΄పోత్నాక్ శ్రవణ్ కుమార్‌కి మంచి లాభాలు రావాలి. అలాగే హీరో, దర్శకుడు అముద శ్రీనివాస్‌కి మంచి అవకాశాలు రావాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎల్‌పి రాజా, కెమెరా: ఎంఎస్ కిరణ్ కుమార్. -
హల్దివాగు దశ, దిశ మారుతోందా!
సాక్షి, సిద్దిపేట: సమృద్ధిగా వర్షాలు పడితేగానీ నిండుగా నీరు కనిపించని హల్దివాగు దశ, దిశ మారుతోంది. కాలంతో పనిలేకుండా రైతులకు నీళ్లు అందేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొండపోచమ్మ సాగర్ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా హల్ది వాగులోకి.. అక్కడి నుంచి మంజీరా మీదుగా నిజాంసాగర్‌లోకి గోదావరి జలాలను తరలించనున్నారు. సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయం 10.30 గంటలకు నీటి విడుదలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం పరిశీలించారు. కొండపోచమ్మ టు నిజాంసాగర్ కొండపోచమ్మ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా 6.12 కిలోమీటర్ వద్ద నుంచి హల్దివాగులోకి గోదావరి జలాలను వదిలే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలుత ఈ కాల్వ నుంచి వర్గల్ మండలం చౌదరిపల్లి బంధం చెరువులోకి నీటిని వదులుతారు. అక్కడి నుంచి మత్తడి దూకుతూ గొలుసుకట్టు చెరువులైన వర్గల్ పెద్దచెరువు, శాకారం ధర్మాయిచెరువు, అంబర్‌పేట కాని చెరువులు నిండి నాచారం మీదుగా హల్దివాగుకు గోదావరి జలాలు చేరుతాయి. మొత్తం 98 కిలోమీటర్ల పొడవుండే ఈ వాగు మెదక్ జిల్లా తుప్రాన్ మండలం యావపూర్, నాగులపల్లి మీదుగా కామారెడ్డి జిల్లాలో మంజీరానదిలో కలుస్తుంది. దీంతో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీరుకూరు, నస్రుల్లాబాద్, నిజామాబాద్ జిల్లా బోధన్, కోటగిరి, వర్గి, ఆర్మూరు మొదలైన ప్రాంతాల రైతులకు చెందిన 14,268 ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 20వేల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు అందించేందుకు దోహదపడనుంది. పదిరోజుల్లో నిజాంసాగర్‌కు.. మంగళవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా విడుదల చేసే గోదావరి జలాలు హల్దివాగును దాటుకుంటూ పది రోజుల్లో నిజాంసాగర్‌కు చేరుకోనున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి రోజుకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీవాగులోకి ప్రవేశించే జలాలు.. వాగుపై ఉన్న 32 చెక్ డ్యామ్‌లను నింపుకొంటూ పది రోజుల్లో నిజాంసాగర్‌లోకి చేరుతాయి. ఏర్పాట్లన్నీ సిద్ధం సీఎం కేసీఆర్ మంగళవారం గోదావరి జలాలను హల్దివాగులోకి విడుదల చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు వర్గల్ మండలం అవుసులోనిపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్ది వాగు కాల్వలోకి నీటిని విడుదల చేస్తారు. తర్వాత 11.15 గంటలకు మర్కూక్ మండలంలోని పాములపర్తిలో గోదావరి జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదల చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు, బందోబస్తును మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. చదవండి: హాట్‌హాట్‌గా ఓటు వేట -
రైతు ఆత్మహత్యపై స్పందించిన హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలం వేలూరులో నర్సింహులు అనే రైతు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే అతని మృతికి ప్రభుత్వ అధికారుల వేధింపులే కారణమని ప్రతిపక్షాలు, మృతుని బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై మంత్రి హరీష్‌రావు స్పందించారు. రైతు మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రైతు కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ ఊరిలో ప్రభుత్వ భూమి ఉంటే అందులో నుంచి నర్సింహులు కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇస్తామని అన్నారు. వాళ్ల అమ్మాయి చదువుకు కూడా ప్రభుత్వం తరఫున సాకారం అందిస్తామని వెల్లడించారు. (నర్సింహులు మృతి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి) ఈ ఘటనకు బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. నర్సింహులు ఆత్మహత్యకు సంబంధించి విమర్శలు చేసేవారు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కాంగ్రెస్ హయాంలోనే అతని భూమి లాక్కున్నారని అన్నారు. ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తే అది వారిపై పడిందన్నారు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు రాజకీయాలు చేయడం చాలా బాధకరమని పేర్కొన్నారు. (వారిపై చర్యలు తీసుకోండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం) కాగా, నర్సింహులుకు ఉన్న 13 గుంటల భూమిని బలవంతంగా రైతు వేదిక నిర్మాణానికి తీసుకుంటున్నారనే ఆవేదనతో బుధవారం పురుగుల మందు తాగాడని అతని బంధువులు ఆరోపించారు. ఆ భూమిని రికార్డుల్లోకి కూడా ఎక్కించకుండా ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. సర్పంచ్, రెవెన్యూ అధికారుల ఒత్తిడి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలో రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘మంత్రి స్పందించడం ఆనందంగా ఉంది’
హైదరాబాద్ : కరోనా వైరస్‌తో పోరాడుతున్న జర్నలిస్టు సిద్ధిరెడ్డి శ్రీనివాస్ ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ మారిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. కరోనాతో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ తన ఆరోగ్య పరిస్థితిపై ఓ వీడియోను షేర్ చేశారు. అందులో తన ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదని.. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని కన్నీరు పెట్టారు. దయచేసి తనను అపోలో ఆస్పత్రిలో చేర్పించాలని మంత్రి హరీశ్‌రావును కోరారు. కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారని.. అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు. చికిత్సకు తానే డబ్బులు భరిస్తానని చెప్పారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. అతని సమస్యపై హరీశ్‌రావు స్పందించడం ఆనందంగా ఉందన్నారు. ‘ఈ వీడియోను నాకు ఒక జర్నలిస్టు మిత్రుడు పంపించాడు. కానీ అప్పటికే మంత్రి హరీశ్‌రావు అతన్ని యశోద ఆస్పత్రిలో చేర్పించారని తెలిసింది. ఈ వీడియో అతనికి సాయం అందేలా చేసింది. మంత్రి స్పందించడం నాకు ఆనందం కలిగించింది. శ్రీనివాస్ త్వరలో కోలుకోవాలి’ అని విశ్వేశ్వరరెడ్డి ఆకాంక్షించారు. శాపాల నుంచి ఎవరు కాపాడలేరు.. మరోవైపు, సచివాలయం కూల్చివేతకు సంబంధించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా బాధితుడి శరీరాన్ని కుక్కలు తింటున్నాయని.. ఇంతకంటే సిగ్గుపడే అంశం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. ఇదేనా మీ బంగారు తెలంగాణ అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. చనిపోతున్న ప్రజల శాపాల నుంచి వాస్తు, యాగాలు, జ్యోతిష్యులు వారిని కాపాడలేరని వ్యాఖ్యానించారు. A journalist friend sent me this video. But got to know Minister Harish Rao got him admitted in Yashodha Hospital. The video helped get attention and glad the minister could respond. I wish the Siddhireddy Srinivas speedy recovery. pic.twitter.com/NaiPdd0BZx — Konda Vishweshwar Reddy (@KVishReddy) July 8, 2020 -
‘ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలి’
సాక్షి, సిద్దిపేట : మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదని.. ఎంత మందికి సహాయం చేశామన్నదే పది కాలాల పాటు నిలుస్తుందని, ప్రజలు ఆపదలో ఉన్న సమయంలో దాతలు తమ దాతృత్వాన్ని చాటుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కుకునూరుపల్లి, సిద్దిపేట కాటన్ మార్కెట్ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని ఆటోడ్రైవర్లు, రజకులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను ప్రబలకుండా చేసేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయని చెప్పారు. దీంతో ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బంది అయినా.. ప్రాణం కన్నా ఏదీ ముఖ్యం కాదని, ఈ విపత్కర పరిస్థితిలో ప్రాణాలు కాపాడుకోవడమే ప్రధానమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే రాష్ట్రంలో కొంత మేరకు మెరుగైన పరిస్థితి నెలకొందని చెప్పారు. లాక్డౌన్ కారణంగా రోజు వారీ కూలీలు, ఇతర చేతి వృత్తి పనుల వారికి ఉపాధి కరువైందన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 12 కేజీల బియ్యం ఉచితంగా అందజేస్తోందని తెలిపారు. సమస్యను అర్థం చేసుకుని ప్రముఖ కంపెనీల యజమానులు, వ్యాపారస్తులు, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాల నాయకుల ముందుకు వచ్చి నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, బియ్యం, ఇతర సామగ్రి పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. ప్రజలకే కాకుండా ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి సహాయ నిధులకు కూడా తమ వంతు విరాళం ఇవ్వడం సంతోషకరం అని పేర్కొన్నారు. ఇదే సహకారం ఇక ముందు కూడా ఉండాలని, పేదలకు సాయం అందించేందుకు దాతలు ముందురు రావాలని కోరారు. లాక్‌డౌన్‌ను పొడిగించడాన్ని మేధావులు, వైద్యులు స్వాగతిస్తున్నారన్నారు. అ యితే సామాన్య ప్రజలకు స్థానిక నాయకులు అవగాహన కల్పించాలని సూచించారు. -
గజ్వేల్..‘పట్టణ ప్రగతి’కి మోడల్
గజ్వేల్ : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మెరుగైన పట్టణ జీవన వ్యవస్థను తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నం ప్రశంసనీయం.. ఇక్కడ నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వైకుంఠధామం, అర్బన్ పార్కులాంటి నిర్మాణాలు తలమాణికంగా నిలుస్తున్నాయి’అని పలువురు మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మ న్లు, కమిషనర్ల బృందం కొనియాడింది. ‘పట్టణ ప్రగతి’పై హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో మంగళవారం సీఎం కేసీఆర్‌తో సమీక్షలో పాల్గొన్న వీరంతా అక్కడి నుంచి బస్సుల్లో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సి పాలిటీని సందర్శించారు. హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రులు ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ తదితరులతో పాటు కలెక్టర్లు, పలువురు ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు ఇక్కడ పర్యటించారు. ముందుగా మున్సిపాలిటీకి సరిహద్దులో ఉన్న వర్గల్ మండలం సింగాయపల్లి అటవీ ప్రాంతాన్ని ఈ బృందం సందర్శించింది. అటవీశాఖ పీసీసీఎఫ్ డోబ్రియాల్ వీరికి అటవీ అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను అంశాలవారీగా వివరించారు. ఆ తర్వాత బృందం గజ్వేల్‌లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా మార్కెట్లో కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం విక్రయాలను, మార్కెట్లోని ఇతర దుకాణ సముదాయాలను పరిశీలించి ముగ్ధులయ్యారు. మంత్రులు సబిత, సత్యవతితో పాటు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, పలువురు మహిళా మున్సిపల్ చైర్మన్లు కూరగాయల వ్యాపారులతో ముచ్చటించారు. ఇది పూర్తయ్యాక వారంతా తిరిగి బస్సుల్లో పట్టణంలోని వైకుంఠధామంను సంద ర్శించి పరిసరాలను ఆసక్తిగా పరిశీలన జరిపారు. తర్వాత అర్బన్ పార్కును సందర్శించారు. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓపెన్‌జిమ్‌లో కొద్దిసేపు గడిపారు. జిమ్ చేస్తూ తోటి మంత్రులు, ఎమ్మెల్యేలను ఉత్సాహపరిచారు. అర్బన్ పార్కు నిర్మాణం జరిగిన విధానం తమను ఆకట్టుకుందని.. ఇలాంటి నిర్మాణాలు తమ జిల్లాల్లో కూడా జరిగేలా చొరవ చూపుతామని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పార్కును ప్రత్యేకంగా కలియతిరిగి తమ జిల్లాలో ఎక్కడెక్కడ ఇలాంటివి నిర్మించుకోవాలనే అంశంపై చర్చించుకున్నారు. మంత్రులకు స్వాగతం పలుకుతున్న హరీశ్‌రావు మెరుగైన వసతులే సీఎం లక్ష్యం: హరీశ్‌రావు రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మెరుగైన వసతులే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధిని మోడల్‌గా చూపుతూ ఇదే తరహాలో ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని సీఎం సూచించారని తెలిపారు. మెరుగైన నగర, పట్టణ జీవన వ్యవస్థను తీసుకురావడానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, వైకుంఠధామాల నిర్మాణంతో పాటు పట్టణాలకు ఆనుకొని ఉండే విధంగా అర్బన్ పార్కులను నిర్మించి స్వచ్ఛమైన గాలి అందించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
పథకాల అమల్లో రాజీ లేదు
సాక్షి, సిద్దిపేట: కరువు కాటకాలు వచ్చినా.. రాష్ట్రంలో ఆర్థిక మాధ్యం ఏర్పడినా, కేంద్రం రాష్ట్రానికి అందించాల్సిన నిధలకు కోతపెట్టినా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపే ప్రసక్తే లేదని, వీటి అమలులో రాజీపడమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట పట్టణాల్లో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. అలాగే ఉమ్రాకు వెళ్లే 40 మంది ఇమామ్, మౌజమ్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణ జీవన చిత్రానికి నిదర్శనం బతుకమ్మ పండుగ అన్నారు. ఈ పండగ సందర్భంగా ఎంతటి పేదవారైనా తమ ఆడపడుచులకు కొత్త చీరె కొని ఇస్తారని, కొత్త చీరెకట్టుకొని బతుకమ్మను పట్టుకొని వెళ్లే ఆడపడుచులు మురిసి పోతారని చెప్పారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న బతుకమ్మ పండుగకు కొత్త చీరెలను పంపిణీ చేసి, ఆడపడుచులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా మారారని హరీశ్ అన్నారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నేతన్నల బతుకు మార్చేందుకు బతుకమ్మ చీరెల తయారీ బాధ్యత వారికి అప్పగించామన్నారు. విపక్షాల విమర్శలు శోచనీయం రాష్ట్రంలో ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుంటే అభినందించాల్సిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం శోచనీయమని మంత్రి హరీశ్ అన్నారు. తెలంగాణలో మసీదుల నిర్వాహణ కష్టంగా మారిన రోజుల్లో నేను అండగా ఉంటానని కేసీఆర్ భరోసా కల్పించారని చెప్పారు. దీనిలో భాగంగానే మౌజమ్, ఇమామ్‌ల భృతిని రూ. 5వేలకు పెంచారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పద్నాలుగేళ్ల తర్వాత పలకరింపు!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని వేర్వేరు నియోజకవర్గాలు, వేర్వేరు పారీ్టల నుంచి అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ.. వారిద్దరి నడుమ పద్నాలుగేళ్లుగా పలకరింపులు లేవు. అసెంబ్లీ మొదలుకుని.. జిల్లా పరిషత్ సమావేశాల వరకు పరస్పరం ఎదురైనా కనీసం ఒకరినొకరు కన్నెత్తి చూసుకోలేని పరిస్థితి. ఆ ఇద్దరిలో ఒకరు సిద్దిపేట నుంచి టీఆర్ఎస్ పక్షాన ఎన్నికైన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కాగా, మరొకరు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అయితే బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సభ జరుగుతున్న సమయంలో బయటకు వచి్చన హరీశ్‌రావు.. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తో సంభాíÙస్తున్న సమయంలో జగ్గారెడ్డి అటుగా వచ్చారు. హరీశ్, సోలిపేట సంభాషణలో జోక్యం చేసుకుంటూ.. ‘నేను ఉమ్మడి మెదక్ జిల్లాలో శాసనసభ్యుడిగా ఉన్నా. మీరు జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా కూడా ఉన్నారు. నాకు మీరంటే ఎలాంటి వ్యతిరేక భావన లేదు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి. మెడికల్ కాలేజీ మంజూరుకు మీ సహకారం అవసరం’ అని కోరారు. సుమారు నిమిషం పాటు జరిగిన సంభాషణలో సంగారెడ్డి అభివృద్ధికి సంబంధించిన అంశాలను జగ్గారెడ్డి ప్రస్తావించగా.. హరీశ్ అంతే సానుకూలంగా తప్ప క సహకరిస్తానన్నారు. 2004 నుంచి ఇద్దరు నేతల నడుమ కనీస పలకరింపులు కూడా లేవు. కాంగ్రెస్‌లో సింగిల్ హీరో ఉండడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం సహజమేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో సింగిల్ హీరో ఉండడని, అందరికీ రాహుల్‌గాం«దీనే హీరో, ఆయ న కిందే అందరూ పనిచేయాలని చెప్పారు. -
ఐఆర్ లేదు.. పీఆర్సీనే!
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి కాకుండా వేతన సవరణ (పీఆర్సీ) చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పీఆర్సీ కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం. అందిన వెంటనే నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తాం’ అని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. శాసనమండలిలో బడ్జెట్‌పై సమాధానం ఇచ్చిన హరీశ్.. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీపై పైవిధంగా స్పందించారు. నిరుద్యోగుల భృతిపై మార్గదర్శకాల కోసం అధికారులను ఆదేశించామని, అవి రాగానే భృతి ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. మార్గదర్శకాలు రూపొందించగానే.. రైతులు తీసుకున్న పంటరుణాల మాఫీ అంశంపై మంత్రి హరీశ్ స్పందిస్తూ మరో పది, పదిహేను రోజుల్లో మార్గదర్శకాలు రూపొందించిన వెంటనే సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయని, అప్పు చేయడం తప్పు కాదని, జీఎస్డీపీ ఆధారంగా అప్పులు చేసుకునేలా నిబంధనలున్నాయన్నారు. జీఎస్డీపీలో 20.04 శాతం మేర అప్పులు చేశామన్నారు. తెలంగాణ కంటే మరో 13 రాష్ట్రాలు జీఎస్డీపీ కంటే ఎక్కువ అప్పులు చేసినట్లు ఆ రాష్ట్రాల పేర్లను ప్రస్తావించారు. అగ్రరాజ్యమైన అమెరికా సైతం అప్పులు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసినప్పటికీ వాటిని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే వినియోగిస్తోందన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 1.44 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే.. ఇప్పటివరకు 1.17 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక చేత్తో నిధులిస్తూ మరో చేత్తో తీసుకుంటోందన్నారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్లో కేంద్ర, రాష్ట్రాల వాటాలో భారీ వ్యత్యాసం వచ్చిందన్నారు. గతంలో 80:20, 70:30గా ఉండేదని, ఇప్పుడు సగంసగం చేయడంతో రాష్ట్రాలపై మరింత భారం పడిందని చెప్పారు జాతీయ పార్టీలతో రాష్ట్రానికి నష్టం.. కేంద్రంలో అధికారం చేపట్టిన 2 జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయని హరీశ్ విమర్శించారు. గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో మధ్య మానేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ పార్టీ పెట్టిన ఖర్చు రూ.10 కోట్లేనని, టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.617 కోట్లు ఖర్చు పెట్టి పనులన్నింటినీ పూర్తి చేసిందన్నారు. ప్రాజెక్టుల పట్ల కాంగ్రెస్‌కు, తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని చెప్పారు. ‘జీవన్‌రెడ్డి ఒకే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం నిజమవ్వదు. మధ్య మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు తామే కట్టామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నా.. వారి హయాంలో కొబ్బరికాయలు మాత్రమే కొట్టారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూర్తిచేసింది. కాళేశ్వరానికి జాతీయ హోదా కోరుతూ కేంద్రానికి మేం లేఖలు రాసిన మాట వాస్తవం..’అని వెల్లడించారు. ఏయే సందర్భాల్లో లేఖలు ఇచ్చిన తీరును ఆయన వివరిస్తూ లేఖల ప్రతులను సభ్యులకు ఇచ్చారు. ‘ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులకు సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు లేఖలు రాశారు. పార్లమెంటు ఎదుట ధర్నాలు కూడా చేశారు. విద్యారంగంలో మహిళా విద్యకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాం’అని చెప్పారు. ఉద్యోగులకు త్వరలో ప్యాకేజీ.. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచాలని సభ్యులు జీవన్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి తదితరులు మండలిలో లేవనెత్తిన అంశంపై హరీశ్ స్పందిస్తూ ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశం సీఎం దృష్టిలో ఉందన్నారు. ఉద్యోగుల అంశాలన్నింటిపై త్వరలో ఒక ప్యాకేజీ రూపంలో సీఎం ప్రకటిస్తారని వివరించారు. ఈనెల 22కు వాయిదా.. శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ఈనెల 22కు వాయిదా పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మండలిలో సభ్యులు ప్రస్తావించిన అంశాలు, ప్రశ్నలకు మంత్రి హరీశ్ సమాధానాలిచ్చారు. అదేవిధంగా సభ్యులు ఇచ్చిన సలహాలు, సూచనలను ప్రభుత్వానికి వివరిస్తానని ఆయన చెప్పారు. అనంతరం సభను ఈనెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. -
‘ఆరోగ్య తెలంగాణే సీఎం లక్ష్యం’
సాక్షి, సిద్దిపేట: ‘ఎన్ని సంపదలున్నా ఆరోగ్యమే మిన్న.. అందుకోసమే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆరోగ్య తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు’అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 30 రోజుల ప్రణాళిక అమలుతీరును పరిశీలించేందుకు మంత్రి శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం కొల్లూర్, సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి, సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవల్లి గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికీ తిరిగి దోమల ఆవాసాలైన మురికి కాల్వలు, ఇళ్లలో వ్యర్థ వస్తువులు, పాత ఇండ్లు మొదలైన వాటిని శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు చేయడం వల్ల 15 కోట్ల మంది మరణిస్తే.. దోమలు కుట్టడం కారణం గా 20 కోట్ల మంది మరణించారని పేర్కొన్నారు. రాజమణమ్మా నీ ఇల్లే ఇలా ఉంటే ఏలా? ‘నీవు ఆశా వర్కర్‌వు.. ఆరోగ్య సేవలు, పరిశుభ్రత గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత నీమీద ఉంది.. నీ ఇల్లే ఇలా ఉంటే ఏలా అమ్మా’.. అంటూ తడ్కపల్లి గ్రామంలోని ఆశావర్కర్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. 30 రోజుల ప్రణాళిక అమలుతీరును పరిశీలించడంలో భాగంగా ఆయన ఆశావర్కర్ రాజమణి ఇంటికి వెళ్లారు. -
హరీశ్‌కు ఆర్థికం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా తన్నీరు హరీశ్‌రావు నియమితులయ్యారు.కేటీఆర్‌కు మళ్లీ పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్ శాఖలు దక్కాయి. సబితా ఇంద్రారెడ్డికి విద్యా శాఖ, గంగుల కమలాకర్‌కు బీసీ సంక్షేమం, ఆహార, పౌరసరఫరాల, వినియోగదారుల వ్యవహారాలు, సత్యవతి రాథోడ్‌కు ఎస్టీ, స్త్రీ, శిశు సంక్షేమం, పువ్వాడ అజయ్‌కుమార్‌కు రవాణా శాఖలను కేటాయించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఆదివారం కొత్తగా చేరిన ఈ ఆరుగురు మంత్రులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సలహా మేరకు శాఖలను కేటాయిస్తూ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో కొందరు ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. హరీశ్, కేటీఆర్‌లకు కేటాయించిన శాఖలను ఇప్పటివరకు సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తూ వచ్చారు. జగదీశ్‌రెడ్డి విద్యా శాఖను కోల్పోగా, ఆయనకు మళ్లీ ఇంధన శాఖను కేటాయించారు. గత మంత్రివర్గంలో సైతం ఆయన ఇంధన శాఖను కలిగి ఉన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ నిర్వహించిన ఎస్టీ సంక్షేమ శాఖను సత్యవతి రాథోడ్‌కు, బీసీ సంక్షేమం గంగుల కమలాకర్‌కు కేటాయించారు. దీంతో కొప్పుల వద్ద ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, వికలాంగ, వయోజనుల సంక్షేమ శాఖలు మిగిలాయి. వేముల ప్రశాంత్‌రెడ్డి నిర్వహించిన రవాణా శాఖను పువ్వాడ అజయ్‌కుమార్‌కు కేటాయించారు. చామకూర మల్లారెడ్డి నుంచి స్త్రీ, శిశు సంక్షేమ శాఖను సత్యవతి రాథోడ్‌కు అప్పగించారు. కీలకమైన రెవెన్యూ, నీటిపారుదల, గనుల శాఖలను సీఎం కేసీఆర్ తన దగ్గరే పెట్టుకున్నారు. ప్రతిష్టాత్మక నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన, అమలుపై స్వీయ పర్యవేక్షణ కోసం సీఎం స్వయంగా ఈ శాఖలను నిర్వహించనున్నారు. గత మంత్రివర్గంలో పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్ శాఖల మంత్రిగా తనదైన ముద్ర వేసిన కేటీఆర్‌కు మళ్లీ అవే శాఖలను కేటాయించారు. -
కేసీఆర్ టీంలోకి హరీశ్, కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ఆశావహుల ఆరు నెలల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. కేబినెట్ విస్తరణలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన జట్టులో మరో ఆరుగురికి చోటు కల్పించారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన తన్నీరు హరీశ్‌రావు, కల్వకుంట్ల తారక రామారావుకు మళ్లీ మంత్రులుగా అవకాశం కల్పించారు. అలాగే తొలిసారి ఇద్దరు మహిళలు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లను తన కేబినెట్లోకి తీసుకోవడంతోపాటు మొదటిసారి గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్‌లకు మంత్రి పదవులు కేటాయించారు. ఈ మేరకు ఆదివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రుల చేత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. సీఎం కేసీఆర్ వెంట రాగా ప్రమాణ స్వీకార వేదిక వద్దకు గవర్నర్ సాయంత్రం 4.10కు చేరుకున్నారు. జాతీయ గీతాలాపన అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే నేతలను వేదికపైకి ఆహ్వానించారు. తొలుత హరీశ్‌రావు ప్రమాణ స్వీకారం చేయగా ఆ తర్వాత కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్ ప్రమాణం చేశారు. నూతన మంత్రుల్లో కేటీఆర్ పవిత్ర హృదయం సాక్షిగా ప్రమాణం చేయగా మిగతా ఐదుగురు దైవసాక్షిగా పదవీస్వీకార ప్రమాణం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మంత్రులందరితోనూ ‘అనే నేను’అంటూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆరుగురు నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం 13 నిమిషాల వ్యవధిలో ముగిసింది. గంటకుపైగా రాజ్‌భవన్‌లో కేసీఆర్... నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్‌భవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ సుమారు గంటన్నరపాటు రాజ్‌భవన్‌లో గడిపారు. నూతన మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్బంగా సీఎస్ ఎస్కే జోషికి సూచనలు చేస్తూ కనిపించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఫొటో సెషన్ సందర్భంగా రాష్ట్ర మంత్రులందరినీ సీఎం కేసీఆర్ నూతన గవర్నర్‌కు పేరు పేరునా పరిచయం చేశారు. అనంతరం దర్బార్ హాల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నూతన గవర్నర్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న పలు కార్యక్రమాలకు సంబంధించిన అంశాలతోపాటు సోమవారం శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న విషయాన్ని గవర్నర్‌కు సీఎం తెలియజేశారు. ప్రత్యేక ఆకర్షణగా హరీశ్, కేటీఆర్... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు ఒకే వాహనంలో రాజ్‌భవన్‌కు చేరుకుని ప్రమాణస్వీకార వేదిక వద్దకు కలసి వచ్చారు. దీంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున కేటీఆర్, హరీశ్ అనుకూల నినాదాలు చేశారు. పార్టీకి చెందిన మంత్రులు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కేటీఆర్‌ను ఆలింగనం చేసుకొని అభినందనలు తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసేంత వరకు కేటీఆర్, హరీశ్ పక్కపక్కన కూర్చొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం హరీశ్‌రావు, కేటీఆర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ సీఎం కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. గంగుల కమలాకర్ పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించగా కేసీఆర్ వారించారు. నూతన మంత్రులకు సీఎం పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన మంత్రులకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆల్ ది బెస్ట్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం నూతన గవర్నర్‌గా తమిళిసై పదవీ స్వీకారం చేసిన వేదికపైనే సాయంత్రం కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారంలో తమిళనాడు నుంచి వచ్చిన అతిథులు సాయంత్రం జరిగిన మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌తోపాటు రాష్ట్ర మంత్రులు ముందు వరుసలో ఆసీనులయ్యారు. నూతన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సబిత, సత్యవతి రాథోడ్ తమ కుటుంబ సభ్యులతో ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకున్నారు. అజయ్‌కుమార్ పుట్టిన తేదీ: ఏప్రిల్ 19, 1965 కుటుంబం: భార్య, ఒక కుమారుడు ఎమ్మెల్యేగా అనుభవం: 2014, 2018లో గెలుపు మంత్రి బాధ్యతలు: మొదటిసారి సబితా ఇంద్రారెడ్డి పుట్టిన తేదీ: మే 5, 1963 కుటుంబం: ముగ్గురు కుమారులు ఎమ్మెల్యేగా అనుభవం: 2000 (ఉపఎన్నిక), 2004, 2009, 2018లలో ఎమ్మెల్యేగా విజయం మంత్రి బాధ్యతలు: 2004లో వైఎస్ కేబినెట్లో గనుల మంత్రిగా, 2009లో తొలి మహిళా హోంమంత్రిగా బాధ్యతలు కె. తారకరామారావు పుట్టిన తేదీ: జూలై 24, 1976 కుటుంబం: భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఎమ్మెల్యేగా అనుభవం: 2009, 2010 (ఉప ఎన్నిక), 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలుపు మంత్రి బాధ్యతలు: 2014లో పంచాయతీరాజ్ మంత్రి, ఆ తర్వాత మున్సిపల్, ఐటీ, పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు టి.హరీశ్‌రావు పుట్టిన తేదీ: జూన్ 3, 1972 కుటుంబం: భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఎమ్మెల్యేగా అనుభవం: 2004, 2008, 2009, 2010, 2014, 2018 వరుసగా విజయం మంత్రి బాధ్యతలు: 2004లో వైఎస్ కేబినెట్లో యువజన సర్వీసుల మంత్రిగా ప్రమాణం, ఆ తర్వాతే ఎమ్మెల్యేగా గెలుపు, 2014లో సాగునీటి మంత్రిగా బాధ్యతలు సత్యవతి రాథోడ్ పుట్టిన తేదీ: అక్టోబర్ 31, 1969 కుటుంబం: భర్త, ఇద్దరు కుమారులు ఎమ్మెల్యేగా అనుభవం: 2009లో ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్సీ మంత్రి బాధ్యతలు: మొదటిసారి గంగుల కమలాకర్ పుట్టిన తేదీ: మే 8, 1968 కుటుంబం: భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఎమ్మెల్యేగా అనుభవం: 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయం మంత్రి బాధ్యతలు: మొదటిసారి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నేడే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. దాదాపు రూ.లక్షా 65 వేల కోట్ల అంచనాలతో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిసింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ఆదివారం రాత్రి ప్రగతిభవన్‌లో సమావేశ మైన రాష్ట్ర మంత్రివర్గం కొత్త బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దీంతోపాటే వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు. ఇటు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్ట నున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో రూ.లక్షా 82 వేల కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, సెప్టెంబర్ 30తో కాలపరిమితి ముగియబోతోంది. ఈ నేపథ్యంలో 2019–20కు సంబంధించిన పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను సోమవారం ప్రవేశపెడుతున్నారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ రూపకల్పన జరుపుతున్నట్లు ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటిం చారు. ఆర్థిక మాంద్యం దేశంలోని అన్ని రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ప్రజల్లో వస్తు, సేవల కొనుగోళ్ల శక్తి క్షీణించి వివిధ రకాల పన్నుల రూపంలో రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయం పడిపోయిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొ న్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, ఇకపై కొంత జాగ్రత్తలు తీసుకోక తప్పదని రాష్ట్రప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పోల్చితే పూర్తి స్థాయి బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లో కోతలు తప్పవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పోల్చితే పూర్తి స్థాయి బడ్జెట్‌ను 8 నుంచి 12 శాతం వరకు కుదించే అవకాశాలున్నాయి. బడ్జెట్ అంకెల్లో చూస్తే రూ.14 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల వరకు కేటాయింపుల్లో కోతపడవచ్చని తెలిసింది. ఎప్పటిలాగే బడ్జెట్లో వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్ద పీట వేయనుండగా, నీటిపారుదల రంగానికి కొంత వరకు నిధులను కత్తిరించనున్నారని చర్చ జరుగుతోంది. సీఎంకు విప్ల కృతజ్ఞతలు కొత్తగా నియమితులైన అసెంబ్లీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఇతర విప్‌లు ఆదివారం రాత్రి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ, మండలిలో విప్ల బాధ్యతలను సీఎం వారికి వివరించారు. -
పాంచ్‌కా ఖానా..తీన్ కా నాస్త
బోయిన్పల్లి మార్కెట్లో తక్కువ ధరలో భోజనం, టిఫిన్ వెల్లడించిన మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారులతో కలిసి మార్కెట్ సందర్శన సమస్యల పరిష్కారంపై అక్కడికక్కడే సమీక్ష కంటోన్మెంట్: వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవం. అయితే ఇది నగరం మొత్తం కాదండోయ్..నగరం చుట్టుపక్కల ఆయా ప్రాంతాల నుంచిఎంతో శ్రమించి కూరగాయలు తీసుకొచ్చే రైతులు,హమాలీల కోసం బోయిన్పల్లి మార్కెట్లో తక్కువ ధరలో టిఫిన్ ,భోజనం అందించనున్నారు. ఈమేరకు త్వరలో క్యాంటీన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు. మరోమంత్రి పద్మారావు,మార్కెటింగ్ ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం ఉదయం మార్కెట్‌ను సందర్శించిన ఆయన సుమారు 3గంటలపాటు కలియతిరిగారు. ప్రతీ సమస్యను నేరుగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నేరుగా షాపుల వద్దకు చేరుకుని మార్కెట్లోకి కూరగాయలు తీసుకొచ్చిన రైతులు, హమాలీలు, కమీషన్ ఏజెంట్లు,రిటైల్ విక్రేతలతో మాట్లాడారు. ధరల గురించి ఆరాతీశారు. ఈ సందర్భంగా హామాలీలు ప్రధానంగా క్యాంటీన్ సమస్యను మంత్రి ద ృష్టికి తీసుకొచ్చి సదరు కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు చేశారు. అక్కడ్నుంచి మరుగుదొడ్లు, మంచినీటి ట్యాంకులు, క్యాంటీన్, నిరుపయోగంగా ఉన్న రైతుల రెస్ట్‌రూమ్‌లను పరిశీలించారు. అనంతరం మార్కెట్‌యార్డు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. రైతులు, హమాలీలు, దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో త్వరలో రూ.3 అల్పాహారం, రూ.5కే భోజనాన్ని అందిస్తామని, ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న ఇలాంటి విధానంపై అధ్యయనం చేసి అతిత్వరలో మార్కెట్‌యార్డులోనూ సబ్సిడీతో కూడి న క్యాంటీన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బినామీ పేర్ల మీద నడుస్తున్న దుకాణాలు, కేటాయింపు జరిగినా రోడ్డుపైనే క్రయ,విక్రయాలు సాగిస్తున్న 39 దుకాణాల అంశంపై త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ధరల నియంత్రణపై ద ృష్టి : కూరగాయ ల ధరల నియంత్రణకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. పలురకాల కూరగాయలను వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నందున..వాటి ధరల్ని రాష్ట్రస్థాయిలో నియంత్రించలేకపోతున్నామని చెప్పారు. ఇత ర రాష్ట్రాలతో పోటీగా మనరాష్ట్రంలో కూడా కాయగూరల సాగువిస్తీర్ణం పెం చుతామన్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట ఆయాశాఖల ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, జనార్దన్‌రెడ్డి, లక్ష్మీభాయి తదితరులున్నారు. -
‘సీమాంధ్ర ప్రజలు తెలంగాణలో ఎక్కడైనా ఉండొచ్చు’
రామాయంపేట, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని, ఆపడం ఎవరితరం కాదని, అన్నదమ్ములవలె విడిపోదామని టీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకోవడానికి సీఎం కిరణ్, లగడపాటి, రాయపాటి తదితర కాంగ్రెస్ నాయకులు ఎన్నో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర ప్రజలు తెలంగాణలో ఎక్కడైనా ఉండవచ్చన్నారు. ఎన్ని కుట్రలు చేసినా హైదరాబాద్ తెలంగాణ ప్రజలదేనని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్రలో ప్రజలు నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు కానీ, సీమాంధ్ర నాయకుల వ్యాపారాలు, ఫ్యాక్టరీలు ఏవైనా మూతపడ్డాయా? అని ఆయన ప్రశ్నించారు. అమాయకులైన సీమాంధ్ర ప్రజలతో నాయకులు ఆడుకుంటున్నారని అన్నారు. సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విభజనను సమర్ధించే వారిపై సీమాంధ్రలో దాడులా? రాష్ట్ర విభ జనను సమర్ధిస్తూ గుంటూరులో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ర్యాలీ తీస్తే వారిపై దాడులు చే యడం ఎంతవరకు సమంజసమని కామారెడ్డిలో హరీష్‌రావు ప్రశ్నించారు. సీమాంధ్రులకు హైదరాబాద్‌లో హక్కులు, రక్షణ అంటున్న నేతలు.. మరి ఎస్టీ, ఎస్టీలకు హక్కులు లేవా? చెప్పాలన్నారు. ఖలిస్థానీల చేతిలో ఇందిరాగాంధీ, ఎల్టీటీఈ చేతిలో రాజీవ్‌గాంధీ చనిపోయారని, రాష్ట్రాన్ని విభజించిన సోనియాగాంధీకి కూడా ఉసురు తగులుతుందంటూ పయ్యావుల కేశవ్ మాట్లాడిన మాటల వెనుక మర్మమేమిటని హరీష్‌రావు నిలదీశారు. ఇందిరా, రాజీవ్‌లాగే సోనియాగాంధీని చంపుతారా? అని ప్రశ్నించారు.హైద రాబాద్‌లో శాంతిభద్రలు తమ అధీనంలో ఉండాలనేలా సీమాంధ్ర నేతలు మాట్లాడుతున్నారని, లా అండ్ ఆర్డర్ కాదు వారికి ‘ల్యాండ్‌పై ఆర్డర్’ కావాలని హరీష్ ఎద్దేవా చేశారు.