
సాక్షి, సిద్దిపేట : మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదని.. ఎంత మందికి సహాయం చేశామన్నదే పది కాలాల పాటు నిలుస్తుందని, ప్రజలు ఆపదలో ఉన్న సమయంలో దాతలు తమ దాతృత్వాన్ని చాటుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కుకునూరుపల్లి, సిద్దిపేట కాటన్ మార్కెట్ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని ఆటోడ్రైవర్లు, రజకులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను ప్రబలకుండా చేసేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయని చెప్పారు.
దీంతో ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బంది అయినా.. ప్రాణం కన్నా ఏదీ ముఖ్యం కాదని, ఈ విపత్కర పరిస్థితిలో ప్రాణాలు కాపాడుకోవడమే ప్రధానమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే రాష్ట్రంలో కొంత మేరకు మెరుగైన పరిస్థితి నెలకొందని చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా రోజు వారీ కూలీలు, ఇతర చేతి వృత్తి పనుల వారికి ఉపాధి కరువైందన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 12 కేజీల బియ్యం ఉచితంగా అందజేస్తోందని తెలిపారు. సమస్యను అర్థం చేసుకుని ప్రముఖ కంపెనీల యజమానులు, వ్యాపారస్తులు, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాల నాయకుల ముందుకు వచ్చి నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, బియ్యం, ఇతర సామగ్రి పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. ప్రజలకే కాకుండా ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి సహాయ నిధులకు కూడా తమ వంతు విరాళం ఇవ్వడం సంతోషకరం అని పేర్కొన్నారు. ఇదే సహకారం ఇక ముందు కూడా ఉండాలని, పేదలకు సాయం అందించేందుకు దాతలు ముందురు రావాలని కోరారు. లాక్‌డౌన్‌ను పొడిగించడాన్ని మేధావులు, వైద్యులు స్వాగతిస్తున్నారన్నారు. అ యితే సామాన్య ప్రజలకు స్థానిక నాయకులు అవగాహన కల్పించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment