సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి కాకుండా వేతన సవరణ (పీఆర్సీ) చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పీఆర్సీ కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం. అందిన వెంటనే నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తాం’ అని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. శాసనమండలిలో బడ్జెట్‌పై సమాధానం ఇచ్చిన హరీశ్.. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీపై పైవిధంగా స్పందించారు. నిరుద్యోగుల భృతిపై మార్గదర్శకాల కోసం అధికారులను ఆదేశించామని, అవి రాగానే భృతి ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.
మార్గదర్శకాలు రూపొందించగానే..
రైతులు తీసుకున్న పంటరుణాల మాఫీ అంశంపై మంత్రి హరీశ్ స్పందిస్తూ మరో పది, పదిహేను రోజుల్లో మార్గదర్శకాలు రూపొందించిన వెంటనే సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయని, అప్పు చేయడం తప్పు కాదని, జీఎస్‌డీపీ ఆధారంగా అప్పులు చేసుకునేలా నిబంధనలున్నాయన్నారు. జీఎస్‌డీపీలో 20.04 శాతం మేర అప్పులు చేశామన్నారు. తెలంగాణ కంటే మరో 13 రాష్ట్రాలు జీఎస్‌డీపీ కంటే ఎక్కువ అప్పులు చేసినట్లు ఆ రాష్ట్రాల పేర్లను ప్రస్తావించారు. అగ్రరాజ్యమైన అమెరికా సైతం అప్పులు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసినప్పటికీ వాటిని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే వినియోగిస్తోందన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 1.44 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే.. ఇప్పటివరకు 1.17 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక చేత్తో నిధులిస్తూ మరో చేత్తో తీసుకుంటోందన్నారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్లో కేంద్ర, రాష్ట్రాల వాటాలో భారీ వ్యత్యాసం వచ్చిందన్నారు. గతంలో 80:20, 70:30గా ఉండేదని, ఇప్పుడు సగంసగం చేయడంతో రాష్ట్రాలపై మరింత భారం పడిందని చెప్పారు
జాతీయ పార్టీలతో రాష్ట్రానికి నష్టం..
కేంద్రంలో అధికారం చేపట్టిన 2 జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయని హరీశ్ విమర్శించారు. గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో మధ్య మానేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ పార్టీ పెట్టిన ఖర్చు రూ.10 కోట్లేనని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.617 కోట్లు ఖర్చు పెట్టి పనులన్నింటినీ పూర్తి చేసిందన్నారు. ప్రాజెక్టుల పట్ల కాంగ్రెస్‌కు, తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని చెప్పారు. ‘జీవన్‌రెడ్డి ఒకే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం నిజమవ్వదు. మధ్య మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు తామే కట్టామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నా.. వారి హయాంలో కొబ్బరికాయలు మాత్రమే కొట్టారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూర్తిచేసింది. కాళేశ్వరానికి జాతీయ హోదా కోరుతూ కేంద్రానికి మేం లేఖలు రాసిన మాట వాస్తవం..’అని వెల్లడించారు. ఏయే సందర్భాల్లో లేఖలు ఇచ్చిన తీరును ఆయన వివరిస్తూ లేఖల ప్రతులను సభ్యులకు ఇచ్చారు. ‘ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులకు సీఎం కేసీఆర్ సహా టీఆర్‌ఎస్ నేతలు లేఖలు రాశారు. పార్లమెంటు ఎదుట ధర్నాలు కూడా చేశారు. విద్యారంగంలో మహిళా విద్యకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాం’అని చెప్పారు.
ఉద్యోగులకు త్వరలో ప్యాకేజీ..
ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచాలని సభ్యులు జీవన్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి తదితరులు మండలిలో లేవనెత్తిన అంశంపై హరీశ్ స్పందిస్తూ ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశం సీఎం దృష్టిలో ఉందన్నారు. ఉద్యోగుల అంశాలన్నింటిపై త్వరలో ఒక ప్యాకేజీ రూపంలో సీఎం ప్రకటిస్తారని వివరించారు.
ఈనెల 22కు వాయిదా..
శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ఈనెల 22కు వాయిదా పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మండలిలో సభ్యులు ప్రస్తావించిన అంశాలు, ప్రశ్నలకు మంత్రి హరీశ్ సమాధానాలిచ్చారు. అదేవిధంగా సభ్యులు ఇచ్చిన సలహాలు, సూచనలను ప్రభుత్వానికి వివరిస్తానని ఆయన చెప్పారు. అనంతరం సభను ఈనెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు.
ఐఆర్ లేదు.. పీఆర్సీనే!
Published Mon, Sep 16 2019 2:37 AM | Last Updated on Mon, Sep 16 2019 5:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment