‘సీమాంధ్ర ప్రజలు తెలంగాణలో ఎక్కడైనా ఉండొచ్చు’
రామాయంపేట, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని, ఆపడం ఎవరితరం కాదని, అన్నదమ్ములవలె విడిపోదామని టీఆర్‌ఎస్ ఎల్పీ ఉప నేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకోవడానికి సీఎం కిరణ్, లగడపాటి, రాయపాటి తదితర కాంగ్రెస్ నాయకులు ఎన్నో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
సీమాంధ్ర ప్రజలు తెలంగాణలో ఎక్కడైనా ఉండవచ్చన్నారు. ఎన్ని కుట్రలు చేసినా హైదరాబాద్ తెలంగాణ ప్రజలదేనని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్రలో ప్రజలు నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు కానీ, సీమాంధ్ర నాయకుల వ్యాపారాలు, ఫ్యాక్టరీలు ఏవైనా మూతపడ్డాయా? అని ఆయన ప్రశ్నించారు. అమాయకులైన సీమాంధ్ర ప్రజలతో నాయకులు ఆడుకుంటున్నారని అన్నారు. సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విభజనను సమర్ధించే వారిపై సీమాంధ్రలో దాడులా?
రాష్ట్ర విభ జనను సమర్ధిస్తూ గుంటూరులో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ర్యాలీ తీస్తే వారిపై దాడులు చే యడం ఎంతవరకు సమంజసమని కామారెడ్డిలో హరీష్‌రావు ప్రశ్నించారు. సీమాంధ్రులకు హైదరాబాద్‌లో హక్కులు, రక్షణ అంటున్న నేతలు.. మరి ఎస్టీ, ఎస్టీలకు హక్కులు లేవా? చెప్పాలన్నారు.
ఖలిస్థానీల చేతిలో ఇందిరాగాంధీ, ఎల్‌టీటీఈ చేతిలో రాజీవ్‌గాంధీ చనిపోయారని, రాష్ట్రాన్ని విభజించిన సోనియాగాంధీకి కూడా ఉసురు తగులుతుందంటూ పయ్యావుల కేశవ్ మాట్లాడిన మాటల వెనుక మర్మమేమిటని హరీష్‌రావు నిలదీశారు. ఇందిరా, రాజీవ్‌లాగే సోనియాగాంధీని చంపుతారా? అని ప్రశ్నించారు.హైద రాబాద్‌లో శాంతిభద్రలు తమ అధీనంలో ఉండాలనేలా సీమాంధ్ర నేతలు మాట్లాడుతున్నారని, లా అండ్ ఆర్డర్ కాదు వారికి ‘ల్యాండ్‌పై ఆర్డర్’ కావాలని హరీష్ ఎద్దేవా చేశారు.