సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి మంత్రివర్గ విస్తరణ జరిపారు. ఈ మేరకు ఆదివారం కొత్తగా ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో అంగరంగవైభవంగా సాగిన ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు (సిద్దిపేట) తోపాటు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్ (కరీంనగర్), శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్ (ఖమ్మం)లు మంత్రులుగా ప్రమాణం చేశారు. నూతన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వీరితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా రెండోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి జరుగుతున్న మంత్రివర్గ విస్తరణ కావడంతో జాబితాపై తొలినుంచి ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ముందుగా అందిన సమాచారం మేరకు ఊహించిన వారికే కేబినెట్‌లో చోటు దక్కింది. తాజా మంత్రివర్గ విస్తరణతో రాష్ట్రంలో మంత్రుల సంఖ్య 18కి చేరింది.
తొలి మహిళా మంత్రులు సబిత, సత్యవతి...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. 2014–2018 మధ్యకాలంలో తెలంగాణ తొలి శాసనసభలో మహిళలకు మంత్రివర్గంలో చోటు లభించలేదు. దీంతో విపక్షాల నుంచి కేసీఆర్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అసెంబ్లీ తొలి సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈసారి మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈమేరకు తాజా మంత్రివర్గంలో సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లకు చోటు దక్కడంతో తొలి మహిళా మంత్రులుగా చరిత్ర సృష్టించారు.
కాగా తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే.. ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం విశేషం. గత ప్రభుత్వంలో పద్మా దేవేందర్‌రెడ్డికి డిప్యూటీ స్పీకర్‌గా, గొంగిడి సునీతకు ప్రభుత్వ విప్‌గా అవకాశం లభించినా.. తాజా మంత్రివర్గంలో మాత్రం వారికి ఎలాంటి అవకాశం రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment