సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిది నెలల తరువాత తొలిసారి కేబినెట్ విస్తరణ జరిపారు. కొత్తగా ఐదురుగు ఎమ్మెల్యేలకు, ఓ ఎమ్మెల్సీకి మొత్తం ఆరుగురికి మంత్రివర్గంలో చోటుకల్పించారు. వీరిలో ఇద్దరు మహిళలు సీనియర్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌లు ఉన్నారు. దీంతో తెలంగాణ తొలి మహిళా మంత్రులుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. గత ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీష్ రావుకు.. ఈసారి కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు. అలాగే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తిరిగి ఐటీ, మున్సిపల్ శాఖలను కేటాయించారు.
మంత్రుల వివరాలు...
డబుల్ హ్యాట్రిక్.. ఇరిగేషన్ నుంచి ఫినాన్స్
తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన హరీష్‌రావు.. టీఆర్‌ఎస్‌లో కీలక నేతగా గుర్తింపు పొందారు. 2004 నుంచి వరుసగా సిద్ధిపేట అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి.. డబుల్ హ్యాట్రిక్ నమోదు చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 95 వేల ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 1,18,699 ఓట్ల మెజార్టీ సాధించి సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో తనకు తిరుగు లేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో భారీ నీటిపారుదల, శాసన సభ వ్యవహారాల శాఖ శాఖ మంత్రిగా విజయవంతమైన హరీష్.. తాజా మంత్రివర్గ విస్తరణలో కీలకమైన ఆర్థికను దక్కించుకున్నారు. తెలంగాణకు వరప్రదాయినిగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరీష్ పాత్ర వర్ణించలేనిది. 1972, జూన్ 3న జన్మించిన హరీష్.. 32 ఏళ్ల వయసులో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
చదవండి: వైభవంగా మంత్రుల ప్రమాణ స్వీకారం
సాఫ్ట్‌వేర్ నుంచి ఐటీ మంత్రిగా...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడిగా కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. 2006లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2009 నుంచి సిరిసిల్ల శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ తొలి కేబినెట్ లో ఐటీ, మున్సిపల్, పంచాయతీ రాజ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 డిసెంబర్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. 1976, జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శోభ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో జన్మించారు. రెండేళ్లపాటు కరీంనగర్ లో చదువుకున్న రామారావు, హైదరాబాద్‌లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. గుంటూరులోని విజ్ఞాన్‌లో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. నిజాం కాలేజీలోని మైక్రోబయాలజీ డిగ్రీలో చేరారు. తరవాత పూణే యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ పూర్తిచేసి, అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి మేనేజ్‌మెంట్ అండ్ ఈ-కామర్స్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం అమెరికాలోని ‘ఇంట్రా’ అనే సంస్థలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి వచ్చి.. కేసీఆర్ వారసుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ బాధ్యతలు నెరవేర్చనున్నారు.
దేశంలో తొలి మహిళా హోంమంత్రి రికార్డు..
2004, 2009లో చేవెళ్ల అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సబితా ఇంద్రారెడ్డి.. 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు వహించారు. 2009 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి.. దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా విధులు నిర్వర్తించి రికార్డు సృష్టించారు. 2009-14 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం.. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. గులాబీ గూటికి చేరారు. అనంతరం కొద్దికాలంలోనే మంత్రిగా చోటు దక్కించుకున్నారు. అంతేకాకుండా తెలంగాణ తొలి మహిళా మంత్రిగా కూడా సబితా ప్రత్యేక గుర్తింపును పొందారు. 1963 మే 5న జన్మించారు.
ఒకే ఒక్కడు.. అజయ్
అనతికాలంలోనే కీలక నేతగా ఎదిగిన పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ గెలిచిన ఏకైక స్థానం ఖమ్మం (అజయ్ కుమార్) మాత్రమే. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమితో జిల్లాకు తొలిమంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో తాజా మంత్రివర్గ విస్తరణలో.. విజయం సాధించిన అజయ్‌కు అవకాశం దక్కింది. కమ్యూనిస్ట్ కుటుంబ నుంచి వచ్చిన అజయ్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి తొలిసారి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో సీనియరైన తుమ్మల నాగేశ్వరరావును ఓడించడంతో కొద్దికాలంలోనే గుర్తింపు పొందారు. 2015లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్ గూటికి చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీచేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి మాజీ ఎంపి నామా నాగేశ్వరరావుపై ఉత్కంఠభరితమైన విజయాన్ని నమోదు చేశారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ఆయనకు రవాణ శాఖ దక్కింది.
చదవండి: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
హ్యాట్రిక్ విజయం..
2009లో కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన గంగుల కమలాకర్ తొలిసారి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల సమయంలో గులాబీ తీర్థం పుచ్చుకుని కారేక్కేశారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 1968 మే 8న జన్మించారు.
సర్పంచ్ నుంచి మంత్రిగా..
మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగుకు చెందిన సత్యవతి రాథోడ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1996లో గుండ్రాతిమడుగు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆమె.. 2007లో నర్సింహుల పేట జెడ్పీటీసీగా, 2009లో డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఆమె టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలిగా ఉన్న ఆమెను సీఎం కేసీఆర్ తాజా కేబినెట్ విస్తరణలో మంత్రిగా అవకాశం కల్పించారు. తెలంగాణ తొలి మహిళా మంత్రిగా కూడా సత్యవతి ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజా మంత్రివర్గ విస్తరణలో గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment