బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్
నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని రేవంత్ చూస్తున్నారు
అయినా ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలి
పార్టీ నాయకులకు మాజీ సీఎం ఉద్బోధ
కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ
ఏసీబీ విచారణ తీరుపై వివరించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పసలేని కేసులు నమోదు చేసి, పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేసినా ప్రజా సమస్యలను ఎత్తి చూపడంపైనే దృష్టి కేంద్రీకరించాలని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలను ఆదేశించారు. ‘ఫార్ములా ఈ– రేస్’కేసులో ఏసీబీ విచారణకు హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. గురువారం ఏసీబీ విచారణ అనంతరం నందినగర్ నివాసానికి వెళ్లిన కేటీఆర్, శుక్రవారం తన భార్యతో కలసి ఎర్రవల్లి నివాసానికి వెళ్లారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మరో నేత కార్తీక్‌రెడ్డి కూడా కేసీఆర్‌తో జరిగిన ఈ భేటీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏసీబీ విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలు, తాను ఇచ్చిన సమాధానాలు, సమర్పించిన పత్రాలు.. తదితర అంశాలను ఈ సమావేశంలో కేటీఆర్ వివరించారు. ఇదిలా ఉండగా, ‘రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని పిచ్చి కేసులతో పార్టీ నేతలను ప్రభుత్వం వేధిస్తుంది. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని రేవంత్ పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక గందరగోళం సృష్టించి స్థానిక సంస్థల గండం నుంచి బయట పడేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా జనంతో ఉంటే వారే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు’అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఏడాదిలోనే కాంగ్రెస్ తేలిపోయింది
‘అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే కాంగ్రెస్ ప్రభుత్వం తేలిపోయింది. ఉన్న పథకాలు అమలు చేయలేక, కొత్త పథకాలు తెచ్చే తెలివిలేక ప్రభుత్వం చేతులెత్తేసింది’అని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. ఎన్నికల హామీలేవీ అమలు చేసే పరిస్థితి లేదని ప్రజలకు అర్థమైందని, గతంలో మనం చేసిన మంచితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చెడును కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌పై ఉందని ఆయన అన్నట్లు్ల సమాచారం. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన రీతిలో పనిచేస్తే ఫలితాలు మనకే అనుకూలంగా ఉంటాయి. పండుగ తర్వాత దృష్టి అంతా పార్టీ నిర్మాణం, బలోపేతంపైనే ఉంటుంది’అని కేసీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment