స్పీకర్ పోచారంను కలిసిన వేముల
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వేముల ప్రశాంత్‌రెడ్డి రాష్ట్ర మంత్రిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు అత్యంత కీలకమైన శాసన సభా వ్యవహారాలు, రోడ్లు భవనా లు, రవాణా, గృహ నిర్మాణ శాఖలు అప్పగించారు. సివిల్ ఇంజినీర్ అయిన ప్రశాంత్‌రెడ్డికి సీఎం కేసీఆర్ ఇంజినీరింగ్ శాఖలే కేటాయించారు. మిషన్‌భగీరథ వైస్ చైర్మన్‌గా పనిచేసిన ప్రశాంత్‌రెడ్డి, కేసీఆర్ కలల ప్రాజెక్టు వాటర్‌గ్రిడ్ పనులను అనతి కాలంలోనే ముందుకు తీసుకెళ్లారు.
నిర్దేశించిన పనిలో సమర్థత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తన జట్టులో కేసీఆర్ చోటు కల్పించారు. గత ప్రభుత్వ హయాంలో శాసన సభా వ్యవహారాల మంత్రిగా హరీశ్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్‌రావు పనిచేశారు. రవాణా శాఖ మంత్రిగా మహేందర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. వీటితో పాటు గృహ నిర్మాణశాఖ బాధ్యతలు కూడా వేములకు అప్పగించారు.
దైవసాక్షిగా ప్రమాణం
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా పది మంది ఎమ్మెల్యేలకు అవకాశం లభించింది. ఇందులో ప్రశాంత్‌రెడ్డి ఒకరు కాగా, ఆయన రాజ్‌భవన్‌లో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తల్లి మంజుల ఆశ్వీరాదం తీసుకున్న అనంతరం ప్రశాంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. కాగా ప్రశాంత్‌రెడ్డికి మంత్రి వర్గంలో చోటు ఖాయమనే అభిప్రాయం మొదటి నుంచి వ్యక్తమైంది. అందరూ ఊహించినట్లుగానే మంత్రి పదవి దక్కింది. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు కావడం, కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ పట్ల ఉన్న విధేయతే ఆయనకు పదవి వరించేలా చేసింది.
ఎంపీ కవితను కలిసిన మంత్రి..
ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎంపీ కల్వకుంట్ల కవితను మర్యాద పూర్వకంగా కలిసారు. హైదరాబాద్‌లో ఎంపీ నివాసానికి వెళ్లారు. మహానాయకుడు కేసీఆర్ కేబినెట్‌లో చోటు లభించడం తన అదృష్టమని ప్రశాంత్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు, తన విజయానికి కృషి చేసిన ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా నియమితులైన ప్రశాంత్‌రెడ్డికి ఎంపీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.
ప్రశాంత్‌రెడ్డికి పలువురి శుభాకాంక్షలు..
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రశాంత్‌రెడ్డిని జిల్లాకు చెందిన పలువురు టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నేతలు కలసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ దఫెదార్ రాజు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి, నుడా చైర్మన్ చామకూర ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ సుమనారెడ్డి, పార్టీ నాయకులు డాక్టర్ మధుశేఖర్ తదితరులు ప్రశాంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment