Telangana Cabinet Formation
-
నాడు ఇంద్రారెడ్డి.. నేడు మల్లారెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాకు మరోసారి కార్మికశాఖ లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా పట్లోళ్ల ఇంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహించగా.. తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణలో బెర్త్ దక్కించుకున్న చామకూర మల్లారెడ్డిని అదే శాఖతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ వరించింది. మేడ్చల్ శాసనసభ్యుడిగా తొలిసారి విజయం సాధించిన మల్లారెడ్డి మంగళవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ప్రమాణస్వీకారం చేశారు. 2014లో మల్కాజిగిరి ఎంపీగా టీడీపీ తరఫున గెలుపొందిన మల్లారెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యేగా బరిలో దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో సీఎం కేసీఆర్.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో చామకూరకు అవకాశం కల్పిం చారు. మృదుస్వభావి, హాస్యచతురుడైన మల్లారెడ్డికి ఆమాత్య హోదా కట్టబెట్టడం సమంజసమని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి.. గ్రేటర్ పరిధిలో బలమైన రెడ్డి సామాజికవర్గాన్ని దృష్టిలో ఉంచుకొని చామకూరకు చాన్స్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. నాడు ఇంద్రారెడ్డి.. నేడు మల్లారెడ్డి తొలిసారే మంత్రి పదవి దక్కించుకున్న మల్లారెడ్డికి కార్మికశాఖతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖను కేటాయిస్తూ మంగళవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ శాఖను మన జిల్లా నుంచి ఇంద్రారెడ్డి నిర్వర్తించారు. ఆ తర్వాత ఇప్పుడు మల్లారెడ్డికి ఈ పోర్టుపొలియో లభించింది. గత ప్రభుత్వ హయాంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన మహేందర్‌రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడంతో అదే శాఖను మల్లారెడ్డికి కట్టబెడుతారనే ప్రచారం జరిగింది. అదేసమయంలో ఆయన వ్యవహారశైలిని అంచనా వేసిన విశ్లేషకులు.. ఆయనకు క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖలు దక్కుతాయని అంచనా వేశారు. అయితే, పరిశీలకుల ఊహలకందని విధంగా కార్మిక శాఖను సీఎం అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, మంత్రి కావాలనే చిరకాల వాంఛ నెరవేరడంతో మల్లారెడ్డి ఆనందంలో మునిగిపోయారు. అమాత్య పదవిపై కన్నేసిన ఆయన ఎంపీ పదవిని కాదని ఎమ్మెల్యేగా పోటీచేయడం.. విజయం సాధించడం.. మంత్రి పదవిని దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇదిలావుండగా, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న మేడ్చల్, పరిసర కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు భారీగా ఉండడం.. కార్మికులు కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ పనిచేస్తుండడం ఆయన పనితీరును ప్రభావితం చేయనుంది. శుభాకాంక్షలు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చామకూర మల్లారెడ్డికి జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నాయకులతో కలిసి బోయిన్‌పల్లిలోని మంత్రి నివాసానికి వెళ్లారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం మల్లారెడ్డికి పూల మొక్కను బహూకరించారు. ఆమెతో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సంజీవ్‌రెడ్డి, శైలజ, రమాదేవి తదితరులు ఉన్నారు. -
ప్రజల ఆశీస్సులతోనే మంత్రినయ్యా..
సాక్షి, జనగామ: ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని.. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని.. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని.. భయంగానీ, పక్షపాతంగానీ, రాగద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఎర్రబెల్లి దయాకర్‌రావు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్నీ నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించడానికి తప్ప ఏ విషయాన్నీ ప్రత్యక్షం గానీ, పరోక్షం గానీ వ్యక్తులకు గానీ సంస్థలకు తెలియపర్చనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా’ అంటూ రాష్ట్ర మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఎర్రబెల్లి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. 36 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా మంత్రిగా నియమితులైన దయాకర్‌రావు తన కుటుంబసభ్యుల సమేతంగా తరలివెళ్లి ప్రమాణ స్వీకారం చేశారు. యాదాద్రిలో పూజలు.. తల్లిదండ్రుల స్మరణ.. రాష్ట్ర మంత్రిగా నియమితులైన ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ ఇలవేల్పు అయిన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబసమేతంగా లక్ష్మీనర్సింహస్వామికి పూజలు చేసి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. వరుస క్రమంలో ఆరోమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లి తన తల్లిదండ్రులైన ఆదిలక్ష్మి, జగన్నాథరావు చిత్రపటాలకు పూలమాలు వేసి స్మరించుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ కేటాయింపు.. ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖలను కేటాయించారు. 2018లో కొత్తగా పంచాయతీ రాజ్ చట్టం అమలులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. గ్రామాల అభివృద్ధిని కీలకంగా భావిస్తున్న శాఖను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన దయాకర్‌రావుకు కేటాయించడం విశేషం. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వరంగల్ ఉమ్మడి జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యా దగిరిరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, డీఎస్ రెడ్యానాయక్, శంకర్నా యక్తోపాటు ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు. జనగామ జిల్లాతోపాటు వరంగల్,భూపాలపల్లి, వ రంగల్ రూరల్,ములుగు,మహబూబాబాద్ జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు, పలువురు ప్రజా ప్రతినిధులు అభినందలు తెలిపారు. సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఎర్రబెల్లి దయాకర్‌రావు సొంతం. జిల్లాలో మాస్ ఫాలోయింగ్ కలిగిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పర్వతగిరిలో ఓ సాధారణ రేషన్ లీడర్ నుంచి ప్రారంభమైన ఆయన జీవితం రాజకీయాల్లోకి రావడంతో ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు తనకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీలో పలు పదవులను చేపడుతూ మ రోవైపు ప్రజాప్రతినిధిగా వరుస ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తూ రాష్ట్రస్థాయి వరకు ఎదిగిన తీరు అమోఘం. విద్యార్థిదశ నుంచే నాయకత్వ లక్షణాలను కలిగిన దయాకర్‌రావు సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర మంత్రి వరకు తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1999లో రెండోసారి, 2004లో మూడో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో నాటి చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 2008లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలుపొం దారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో పాలకుర్తి నుంచి గెలుపొందారు. వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పాలకుర్తి: నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే మంత్రిని అయ్యానని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆయన మంత్రిగా హైదరాబాద్‌లో మంగళవారం బాధ్యతలు స్వీకరించగా.. నియోజకవర్గం నుంచి తరలివచ్చిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చడంతోపాటు నృత్యాలు చేశారు. దయాకర్‌రావుకు రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్ధేశించి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తనపై నమ్మకంతో మంత్రి పదవిని అప్పగించారని, దానిని వమ్ము చేయకుండా బాధ్యతగా వ్యవహరించి పదవికి వన్నె తెస్తానని చెప్పారు. మూడు దశాబ్దాల కార్యకర్తల కల నేడు నెరవేరిందని, ఊరూరికి దేవాదుల ద్వారా గోదావరి జలాలు తెచ్చి చెరువులను నింపుతామని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ధ్యేయమని, కరువు ప్రాంతమైన పాలకుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి కార్యచరణ రూపొందిస్తానని తెలిపారు. ప్రజల కోరిక మేరకు త్వరలో అన్ని మండలాలు పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. -
కీలక బాధ్యతలు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వేముల ప్రశాంత్‌రెడ్డి రాష్ట్ర మంత్రిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు అత్యంత కీలకమైన శాసన సభా వ్యవహారాలు, రోడ్లు భవనా లు, రవాణా, గృహ నిర్మాణ శాఖలు అప్పగించారు. సివిల్ ఇంజినీర్ అయిన ప్రశాంత్‌రెడ్డికి సీఎం కేసీఆర్ ఇంజినీరింగ్ శాఖలే కేటాయించారు. మిషన్‌భగీరథ వైస్ చైర్మన్‌గా పనిచేసిన ప్రశాంత్‌రెడ్డి, కేసీఆర్ కలల ప్రాజెక్టు వాటర్‌గ్రిడ్ పనులను అనతి కాలంలోనే ముందుకు తీసుకెళ్లారు. నిర్దేశించిన పనిలో సమర్థత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తన జట్టులో కేసీఆర్ చోటు కల్పించారు. గత ప్రభుత్వ హయాంలో శాసన సభా వ్యవహారాల మంత్రిగా హరీశ్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్రావు పనిచేశారు. రవాణా శాఖ మంత్రిగా మహేందర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. వీటితో పాటు గృహ నిర్మాణశాఖ బాధ్యతలు కూడా వేములకు అప్పగించారు. దైవసాక్షిగా ప్రమాణం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా పది మంది ఎమ్మెల్యేలకు అవకాశం లభించింది. ఇందులో ప్రశాంత్‌రెడ్డి ఒకరు కాగా, ఆయన రాజ్‌భవన్‌లో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తల్లి మంజుల ఆశ్వీరాదం తీసుకున్న అనంతరం ప్రశాంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. కాగా ప్రశాంత్‌రెడ్డికి మంత్రి వర్గంలో చోటు ఖాయమనే అభిప్రాయం మొదటి నుంచి వ్యక్తమైంది. అందరూ ఊహించినట్లుగానే మంత్రి పదవి దక్కింది. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు కావడం, కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ పట్ల ఉన్న విధేయతే ఆయనకు పదవి వరించేలా చేసింది. ఎంపీ కవితను కలిసిన మంత్రి.. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎంపీ కల్వకుంట్ల కవితను మర్యాద పూర్వకంగా కలిసారు. హైదరాబాద్‌లో ఎంపీ నివాసానికి వెళ్లారు. మహానాయకుడు కేసీఆర్ కేబినెట్లో చోటు లభించడం తన అదృష్టమని ప్రశాంత్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు, తన విజయానికి కృషి చేసిన ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా నియమితులైన ప్రశాంత్‌రెడ్డికి ఎంపీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత్‌రెడ్డికి పలువురి శుభాకాంక్షలు.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రశాంత్‌రెడ్డిని జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కలసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ దఫెదార్ రాజు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి, నుడా చైర్మన్ చామకూర ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ సుమనారెడ్డి, పార్టీ నాయకులు డాక్టర్ మధుశేఖర్ తదితరులు ప్రశాంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. -
రెండోసారి విద్యాశాఖ
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : ‘గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా..లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నాకర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్పా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.’ అని రాజ్‌భవన్‌లో గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం ఆయనకు సీఎం కేసీఆర్విద్యాశాఖను కేటాయించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొలువుదీరిన టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలోనూ జగదీశ్‌రెడ్డికి విద్యాశాఖను కేటాయించారు. ఆ తర్వాత ఆ శాఖను కడియం శ్రీహరికి ఇచ్చి జగదీశ్‌రెడ్డికి విద్యుత్‌శాఖను అప్పగించారు. ఇప్పుడు మళ్లీ విద్యాశాఖను ఇస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారం పది మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించగా అందులో మూడో వ్యక్తి జగదీశ్‌రెడ్డి ఉన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు జగదీశ్‌రెడ్డి దంపతులిద్దరూ సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయనకు ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, నోముల నర్సింహయ్య, మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళ్లిక, మార్కెట్ కమిటీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు బండా నరేందర్‌రెడ్డి, కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, గండూరి ప్రకాశ్, ఓయూ జేఏసీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు అభినందనలు తెలిపారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కుటుంబ సభ్యులు హారతిపట్టారు. మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సూర్యాపేట పట్టణంలో మున్సిపల్ కౌన్సిలర్లు, నేతలు భారీ ఎత్తున బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కొత్త జిల్లాలో రెండోసారి మంత్రిగా.. సూర్యాపేట నియోజకవర్గ చరిత్రలో ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి, రెండో సారి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యేగా జగదీశ్‌రెడ్డి నిలిచారు. ఉమ్మడి జిల్లా పరంగా చూస్తే రెండు, అంతకన్నా ఎక్కువ సార్లు మంత్రులుగా చేసిన వారిలో కొండా లక్ష్మణ్‌బాపూజీ, ఎలిమినేటి మాధవరెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ఉన్నారు. వీరి తర్వాత ప్రస్తుతం గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచి రెండో సారి మంత్రి పదవి దక్కించుకున్న వారిలో ఉన్నారు. విద్యాశాఖ..మంత్రిగా తెలంగాణ ప్రభుత్వ తొలి కేబినెట్లో తొలి విద్యాశాఖ మంత్రిగా జగదీశ్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 2014 జూలై 2 నుంచి 2015 జనవరి 29 వరకు విద్యాశాఖ మంత్రిగా కొనసాగారు. ఆతర్వాత ఈ శాఖను కడియం శ్రీహరికి ఇచ్చి.. విద్యుత్ శాఖను జగదీశ్‌రెడ్డికి ఇచ్చారు. అనంతరం ఎస్సీ కులాల అభివృద్ధి శాఖను కూడా ఆయనకు కేటాయించారు. మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వ రెండో కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. విద్యారంగంపై ఆయనకు పూర్తిగా అవగాహన ఉండడంతో ఈశాఖ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి అభీష్టం మేరకు.. ఏ శాఖ అయినా మంత్రి మండలిదే సమష్టి బాధ్యతని, ముఖ్యమంత్రి కేసీఆర్ అభీష్టం మేరకే నడుచుకుంటానని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వ్యవసాయదారుడిగా విద్యుత్‌శాఖ మంత్రిగా విధులు నిర్వహించడం సంతృప్తినిచ్చిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్ తన మీద పెట్టిన బాధ్యతలతో సత్ఫలితాలు సాధిస్తానన్నారు. రెండోసారి మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అనే నేను..!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నిర్మల్ శాసనసభ్యుడు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(ఐకే రెడ్డి) మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రిగా ఐకే రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు. 2014లో తెలంగాణ తొలి ప్రభుత్వంలో న్యాయ, దేవాదాయ, గృహ నిర్మాణ శాఖలను నిర్వహించిన అల్లోల రెండోసారి మంత్రిగా సంతకం చేశారు. కాగా, రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జోగు రామన్నతోపాటు ఇతర ఎమ్మెల్యేలు హాజరై మంత్రిగా ప్రమాణం చేసిన ఐకే రెడ్డికి అభినందనలు తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరే! పరిమిత సంఖ్యలో 10 మందితో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సీనియర్ రాజకీయ వేత్త, విద్యావంతుడైన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి మాత్రమే అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రుడుగా వ్యవహరించిన ఐకే రెడ్డి గత ఎన్నికల్లో నియోజకవర్గంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఘన విజయం సాధించారు. ఆయనకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగినా, సోమవారం వరకు ఉత్కంఠత కొనసాగింది. చివరికి అనుభవానికి, విధేయతకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇచ్చి ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా మరోసారి అవకాశం కల్పించారు. జిల్లా నుంచి గత ప్రభుత్వంలో బీసీ సంక్షేమం, అటవీ శాఖలకు మంత్రిగా పనిచేసిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు పరిమిత మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. అలాగే కొత్తగా మంత్రి పదవిని ఆశించిన ఎమ్మెల్యేలు బాల్క సుమన్(చెన్నూరు), రేఖానాయక్(ఖానాపూర్), కోనేరు కోనప్ప(సిర్పూరులకు కూడా నిరాశే ఎదురైంది. పార్లమెంటు ఎన్నికల అనంతరం మరో ఆరుగురిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉన్నందున, అప్పటికి తమకు చాన్స్ రావచ్చని ఆశావహులు భావిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల ఆశలు మంత్రిగా రెండోసారి నియమితులైన అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డికి సమర్థవంతమైన నాయకుడిగా పేరుంది. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగున్న ఆయన 70 ఏళ్ల వయస్సులో సైతం చురుగ్గా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న ఆయనకు సవాళ్లు స్వాగతం పలుకనున్నాయి. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ పూర్తికాలేదు. మిషన్ భగీరథ పనులు ఇంకా సాగుతూనే.. ఉన్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పనులు నాలుగు జిల్లాల్లో పెండింగ్‌లోనే ఉన్నాయి. సాగునీటి సమస్యలు కొలిక్కి రావడం లేదు. చిన్న, మధ్య తరహా నీటి ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో సేవలు అందించడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో రెవెన్యూ వివాదాలు పరిష్కారానికి నోచుకోలేదు. 1/70 చట్టం పరిధిలో ఉన్న మండలాలు, గ్రామాల్లో గిరిజనులు, గిరిజనేతరులకు భూముల పట్టాల పంపిణీపై ఇబ్బందులు ఉన్నాయి. గత ఎన్నికల ప్రచారంలో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాలను ప్రస్తావిస్తూ, గెలిచిన నెలరోజుల్లోనే ప్రభుత్వ యంత్రాంగంతో ఆదిలాబాద్‌కు వచ్చి నాలుగు రోజులు అక్కడే ఉండి సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రాకపోయినా, మంత్రిగా ఐకే రెడ్డి ఈ అటవీ భూముల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు ఆశిస్తున్నారు. -
కేసీఆర్ వద్దే ఆర్థిక శాఖ
ఎన్నో అంచనాలు, మరెన్నో ఊహాగానాలు పక్కనబెడుతూ సీఎం కేసీఆర్ కొత్త కేబినెట్లో శాఖలను కేటాయించారు. కీలక ఆర్థిక, రెవెన్యూ, నీటిపారుదల శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. ఆర్థిక బాధ్యతలు అప్పజెబుతారని ప్రచారం జరిగిన నిరంజన్ రెడ్డికి వ్యవసాయ శాఖను అప్పగించారు. ఈటలకు వైద్య, ఆరోగ్య శాఖను కేటాయించారు. ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్‌కు గత కేబినెట్లోని మంత్రిత్వ శాఖలే ఇచ్చారు. అంతకుముందు మంగళవారం ఉదయం 11.30కు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణం ఘనంగా జరిగింది. జగదీశ్‌రెడ్డి, ఈటల పవిత్ర హృదయంతో, మిగిలిన 8మంది దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం వీరంతా గవర్నర్, సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్, హరీశ్‌రావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా, గురువారం కొత్త కేబినెట్ భేటీ కానుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు. కొత్త మంత్రులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సాక్షి, హైదరాబాద్ : రెండోసారి అధికారంలోకి వచ్చాక.. కేసీఆర్ మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం కొలువుదీరిన కొత్త మంత్రివర్గంలో శాఖల కేటాయింపులో తన మార్కును ఆయన స్పష్టంగా చూపించారు. కీలకమైన ఆర్థిక, నీటిపారుదల, రెవెన్యూ, విద్యుత్ శాఖలను తనవద్దే పెట్టుకున్నారు. ప్రమాణం చేసిన మంత్రుల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలకు గతంలో కేటాయించిన శాఖల బాధ్యతలు అప్పగించగా.. మిగిలిన వారి శాఖలను మార్చారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖను నిర్వహించిన ఈటల రాజేందర్‌కు వైద్య, ఆరోగ్య శాఖను, జి.జగదీశ్‌రెడ్డికి విద్యాశాఖను అప్పగించారు. గత ప్రభుత్వంలో టి.పద్మారావుగౌడ్ నిర్వహించిన ఎక్సైజ్, యువజన సర్వీసుల శాఖలను.. అదే వర్గానికి చెందిన వి.శ్రీనివాస్‌గౌడ్‌కు, జూపల్లి కృష్ణారావు నిర్వహించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను అదే వర్గానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ముఖ్యమంత్రి కేటాయించారు. పట్నం మహేందర్‌రెడ్డి నిర్వహించిన రవాణా శాఖను అదే వర్గానికి చెందిన వేముల ప్రశాంత్‌రెడ్డికి, గత ప్రభుత్వంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన వ్యవసాయ శాఖను అదే వర్గానికి చెందిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కేటాయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జోగు రామన్న నిర్వహించిన అటవీ, పర్యావరణ శాఖలను.. అదే జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డికి అప్పగించారు. కీలకమైన శాసనసభ వ్యవహారాల శాఖ బాధ్యతలను తన సన్నిహితుడైన వేముల ప్రశాంత్రెడ్డికే కేసీఆర్ కేటాయించారు. టీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీశ్ రావులు నిర్వహించిన పురపాలక, పరిశ్రమలు, ఐటీ, సాగునీటి పారుదల శాఖలతోపాటు కీలకమైన ఆర్థిక, రెవెన్యూ, విద్యుత్ శాఖలను కేసీఆర్ ఎవరికీ కేటాయించలేదు. సందడిగా ప్రమాణ కార్యక్రమం కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం రాజ్‌భవన్‌లో సందడిగా జరిగింది. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం ఉదయం 11.30 గంటలకు పది మందితో ప్రమాణస్వీకారం చేయించారు. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి.శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డిలు వరుసగా మంత్రులుగా ప్రమాణం చేశారు. జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్ పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు. మిగిలిన ఎనిమిది మంది దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. మంత్రులుగా ప్రమాణం అనంతరం వీరంతా.. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్దకెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త మంత్రులను వీరిరువురు అభినందించారు. కొత్త మంత్రులు కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులతో కార్యక్రమానికి వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరు పక్కపక్కనే కూర్చుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, టి.పద్మారావుగౌడ్, సి.లక్ష్మారెడ్డితోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. కొత్తమంత్రులు, ముఖ్యుల రాకతో రాజ్‌భవన్ సందడిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి డిసెంబర్ 13న కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పుడు కేసీఆర్‌తోపాటు మహమూద్‌అలీ ఒక్కరే ప్రమాణం చేశారు. మంగళవారం రాజ్‌భవన్‌లో ఇంద్రకరణ్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్ నరసింహన్. చిత్రంలో సీఎం కేసీఆర్ తదితరులు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం ప్రమాణ స్వీకారం అనంతరం జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి పాదాభివందనం చేయబోతే సీఎం కేసీఆర్ వారిని వారించారు. మల్లారెడ్డి గవర్నర్ నరసింహన్‌కు పాదాభివందనం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రులుగా ప్రమాణం చేసే వారి పేర్లను వరుసగా పిలిచారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరుకు బదులుగా ఎర్రబెల్లి దివాకర్‌రావు అని పిలవగా.. సీఎం జోక్యం చేసుకుని సవరించారు. అనంతరం కొత్త మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ గ్రూఫ్ ఫొటో దిగారు. మంత్రుల నియామకంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి రాత్రి 7గంటలకు శాఖలను కేటాయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొత్త మంత్రులకు అధికారిక వాహనాలను, బందోబస్తును ఏర్పాటు చేశారు. కేటీఆర్ శుభాకాంక్షలు కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన అభినందించారు. ‘కొత్త మంత్రులందరికీ çహృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో మీరంతా తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారన్న నమ్మకం నాకుంది’అని పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారం జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన హరీశ్‌రావు, కేటీఆర్, జితేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, పద్మారావు, కడియం శ్రీహరి తదితరులు కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతా 1994లో టీడీపీ అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. కానీ లక్ష్మీపార్వతి వల్ల రాలేదు. తర్వాత చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట తప్పారు. సీఎం కేసీఆర్ మాత్రం మంత్రి పదవిపై మాట ఇచ్చి నిలుపుకున్నారు. కేసీఆర్ నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెడతా. మా జిల్లాలోని సీనియర్ కడియం శ్రీహరి, చందూలాల్, మధుసూదనాచారిలను కలుపుకొని వారి అనుభవంతో ముందుకు వెళతా. – ఎర్రబెల్లి దయాకర్‌రావు కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శం సీఎం కేసీఆర్ పరిపాలన దేశానికి ఆదర్శంగా నిలిచింది. అందరి ఆశీర్వాదంతోనే ఈ స్థాయిలో ఉన్నాను. మీలో ఒకడిగా ఉంటూ అన్నివేళలా అండగా ఉంటాను. నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన బాధ్యతను పూర్తిస్థాయిలో నెరవేరుస్తాను. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. – తలసాని శ్రీనివాస్‌యాదవ్ 16 ఎంపీ సీట్లు గెలుస్తాం సీఎం కేసీఆర్ చేసిన ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లు గెలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 సీట్లను గెలుచుకుంటుంది. మంత్రిగా నాకు రెండోసారి అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. బంగారు తెలంగాణ సాకారం కోసం ఆయన పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు నడుచుకుంటాను. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నిర్మల్ ప్రజలకు కృతజ్ఞతలు. – అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కేసీఆర్, కేటీఆర్‌కు ధన్యవాదాలు రెండోసారి మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు. ఇప్పటివరకు అన్నింట్లో సహకరించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు. సమన్వయం, సామరస్యంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అద్భుత ఫలితాలు సాధించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకమే మమ్మల్ని విజయపథం వైపు నడిపించింది. – జి.జగదీశ్‌రెడ్డి ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటా నాకు మంత్రివర్గంలో అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ ఆదేశాల మేరకు పనిచేస్తాను. సీఎం కేసీఆర్ నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను. ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నన్ను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ధర్మపురి ప్రజలకు కృతజ్ఞతలు. – కొప్పుల ఈశ్వర్ పంట కాలనీలకు కార్యరూపం రాష్ట్రంలో ప్రజల జీవన విధానమైన వ్యవసాయ రంగం సమస్యలు తీర్చి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా శాస్త్రీయ పద్ధతిలో మార్కెటింగ్‌పై దృష్టి పెడతాను. రైతుల సమస్యలు పరిష్కరించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తాను. సాగు విస్తరణ, మార్కెటింగ్, సరఫరా రంగాలపై దృష్టి పెడతా. రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లోకి అందించేలా ప్రణాళికలను రూపొందిస్తాం. సీఎం కేసీఆర్ ఆలోచన విధానానికి అనుగుణంగా రైతు సమన్వయ సమితులను బలోపేతం చేస్తాం. రైతు సమన్వయ సమితులకు విధివిధానాలను త్వరలోనే ఖరారు చేస్తాం. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులు త్వరలో పూర్తి కానున్నాయి. సాగునీటిని హేతుబద్ధ్దంగా వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. తెలంగాణ వాతావరణ పరిస్థితులు, రాష్ట్రంలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటల కాలనీలను ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించేందుకు ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతాం. ఫుడ్‌ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా, ప్రజలకు కల్తీలేని నాణ్యమైన ఆహార పదార్థాలను అందించేందుకు అవకాశం ఉంటుంది. – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి -
ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ టీమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా పది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ వారితో ప్రమాణం చేయించారు. జాతీయ గీతాలాపన అనంతరం మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఒక్కొక్కరిని సభా వేదికపైకి పిలిచారు. ప్రమాణం స్వీకారం చేసిన వారు వరుసగా మొదటగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. తలసాని అనంతరం సూర్యాపేట ఎమ్మెల్యే, గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. జగదీష్ రెడ్డి ప్రమాణం చేసిన అనంతరం టీఆర్ఎస్ సీనియర్ నేత, గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణం చేసిన ఈటల రాజేందర్ ప్రమాణం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రాతినిథ్యం వహించిన ఈయన పార్టీ ఎల్పీ నేతగా పనిచేశారు. తొలి సారి వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఆరు సార్లు ధర్మపురి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేశారు. తొలి మంత్రివర్గ విస్తరణలో ఏకైక ఎస్సీ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ నిలిచారు. పాలకుర్తి ఎమ్మెల్యే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఈయన తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల నాయకుడిగా పనిచేశారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. చివరగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఆయన మల్కజ్గిరి ఎంపీగా పనిచేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌లతో కలిసి కొత్త మంత్రులు ఫోటోలు దిగారు. -
భావోద్వేగానికి లోనైన ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: తనకు మంత్రి పదవి దక్కడంపై ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను అందరిని కలుపుకొని వెళ్తానని, జిల్లా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పారు. ‘ఎన్టీఆర్ నాకు మంత్రి పదవి ఇస్తానని అన్నారు కానీ లక్ష్మీపార్వతి వల్ల రాలేదు. చంద్రబాబు నన్ను మంత్రిని చేస్తానని మాటతప్పారు. కేసీఆర్ నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వరంగల్ జిల్లాకు పెండింగ్ లో ఉన్న రింగ్ రోడ్డు, టెక్స్ టైల్ పార్కు, ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తేచ్చేందుకు కృషిచేస్తా. సీనియర్ నాయకులు కడియం శ్రీహరి, చందూలాల్, మధుసూదనాచారిలను కలుపుకొని వారి అనుభవంతో ముందుకు వెళతా. వరంగల్ ఉద్యమకారులు, టీఆర్ఎస్ శ్రేణులకు అండగా ఉంటాన’ని ఎర్రబెల్లి అన్నారు. అరుదైన గౌరవమని: కొప్పుల ఈశ్వర్ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కడం ఆనందంగా ఉందని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఉద్యమ నాయకుడిగా తనకిది అరుదైన గౌరవమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన మీద పెట్టిన నమ్మకాన్ని నెరవేరుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి జవాబుదారిగా పనిచేస్తానని చెప్పారు. (నేడే కేసీఆర్ కేబినెట్ విస్తరణ) కేసీఆర్‌కు కృతజ్ఞతలు: ఇంద్రకరణ్ రెడ్డి తనపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇంద్రకరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మొదటి ఐదేళ్లలో కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. బంగారు తెలంగాణ కల సాకారం చేసేందుకు సమిష్టిగా పనిచేస్తామన్నారు. కార్యకర్తల కృషి వల్లే తనకు మంత్రి పదవి దక్కిందన్నారు. నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ముఖ్యమంత్రి తనకు ఏ శాఖ అప్పగించిన శిరసావహిస్తానని స్పష్టం చేశారు.