మంగళవారం రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌తో మంత్రులు
ఎన్నో అంచనాలు, మరెన్నో ఊహాగానాలు పక్కనబెడుతూ సీఎం కేసీఆర్ కొత్త కేబినెట్‌లో శాఖలను కేటాయించారు. కీలక ఆర్థిక, రెవెన్యూ, నీటిపారుదల శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. ఆర్థిక బాధ్యతలు అప్పజెబుతారని ప్రచారం జరిగిన నిరంజన్ రెడ్డికి వ్యవసాయ శాఖను అప్పగించారు. ఈటలకు వైద్య, ఆరోగ్య శాఖను కేటాయించారు. ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్‌కు గత కేబినెట్‌లోని మంత్రిత్వ శాఖలే ఇచ్చారు. అంతకుముందు మంగళవారం ఉదయం 11.30కు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణం ఘనంగా జరిగింది. జగదీశ్‌రెడ్డి, ఈటల పవిత్ర హృదయంతో, మిగిలిన 8మంది దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం వీరంతా గవర్నర్, సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్, హరీశ్‌రావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా, గురువారం కొత్త కేబినెట్ భేటీ కానుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు. కొత్త మంత్రులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్ : రెండోసారి అధికారంలోకి వచ్చాక.. కేసీఆర్ మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం కొలువుదీరిన కొత్త మంత్రివర్గంలో శాఖల కేటాయింపులో తన మార్కును ఆయన స్పష్టంగా చూపించారు. కీలకమైన ఆర్థిక, నీటిపారుదల, రెవెన్యూ, విద్యుత్ శాఖలను తనవద్దే పెట్టుకున్నారు. ప్రమాణం చేసిన మంత్రుల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలకు గతంలో కేటాయించిన శాఖల బాధ్యతలు అప్పగించగా.. మిగిలిన వారి శాఖలను మార్చారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖను నిర్వహించిన ఈటల రాజేందర్‌కు వైద్య, ఆరోగ్య శాఖను, జి.జగదీశ్‌రెడ్డికి విద్యాశాఖను అప్పగించారు. గత ప్రభుత్వంలో టి.పద్మారావుగౌడ్ నిర్వహించిన ఎక్సైజ్, యువజన సర్వీసుల శాఖలను.. అదే వర్గానికి చెందిన వి.శ్రీనివాస్‌గౌడ్‌కు, జూపల్లి కృష్ణారావు నిర్వహించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను అదే వర్గానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ముఖ్యమంత్రి కేటాయించారు. పట్నం మహేందర్‌రెడ్డి నిర్వహించిన రవాణా శాఖను అదే వర్గానికి చెందిన వేముల ప్రశాంత్‌రెడ్డికి, గత ప్రభుత్వంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన వ్యవసాయ శాఖను అదే వర్గానికి చెందిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కేటాయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జోగు రామన్న నిర్వహించిన అటవీ, పర్యావరణ శాఖలను.. అదే జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డికి అప్పగించారు. కీలకమైన శాసనసభ వ్యవహారాల శాఖ బాధ్యతలను తన సన్నిహితుడైన వేముల ప్రశాంత్‌రెడ్డికే కేసీఆర్ కేటాయించారు. టీఆర్‌ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీశ్ రావులు నిర్వహించిన పురపాలక, పరిశ్రమలు, ఐటీ, సాగునీటి పారుదల శాఖలతోపాటు కీలకమైన ఆర్థిక, రెవెన్యూ, విద్యుత్ శాఖలను కేసీఆర్ ఎవరికీ కేటాయించలేదు.
సందడిగా ప్రమాణ కార్యక్రమం
కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం రాజ్‌భవన్‌లో సందడిగా జరిగింది. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మంగళవారం ఉదయం 11.30 గంటలకు పది మందితో ప్రమాణస్వీకారం చేయించారు. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి.శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డిలు వరుసగా మంత్రులుగా ప్రమాణం చేశారు. జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్ పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు. మిగిలిన ఎనిమిది మంది దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. మంత్రులుగా ప్రమాణం అనంతరం వీరంతా.. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్దకెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త మంత్రులను వీరిరువురు అభినందించారు. కొత్త మంత్రులు కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులతో కార్యక్రమానికి వచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరు పక్కపక్కనే కూర్చుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, టి.పద్మారావుగౌడ్, సి.లక్ష్మారెడ్డితోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. కొత్తమంత్రులు, ముఖ్యుల రాకతో రాజ్‌భవన్ సందడిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి డిసెంబర్ 13న కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పుడు కేసీఆర్‌తోపాటు మహమూద్‌అలీ ఒక్కరే ప్రమాణం చేశారు.
మంగళవారం రాజ్‌భవన్‌లో ఇంద్రకరణ్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్ నరసింహన్. చిత్రంలో సీఎం కేసీఆర్ తదితరులు
సీఎం కేసీఆర్ ఆశీర్వాదం
ప్రమాణ స్వీకారం అనంతరం జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి పాదాభివందనం చేయబోతే సీఎం కేసీఆర్ వారిని వారించారు. మల్లారెడ్డి గవర్నర్ నరసింహన్‌కు పాదాభివందనం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రులుగా ప్రమాణం చేసే వారి పేర్లను వరుసగా పిలిచారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరుకు బదులుగా ఎర్రబెల్లి దివాకర్‌రావు అని పిలవగా.. సీఎం జోక్యం చేసుకుని సవరించారు. అనంతరం కొత్త మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ గ్రూఫ్ ఫొటో దిగారు. మంత్రుల నియామకంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి రాత్రి 7గంటలకు శాఖలను కేటాయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొత్త మంత్రులకు అధికారిక వాహనాలను, బందోబస్తును ఏర్పాటు చేశారు.
కేటీఆర్ శుభాకాంక్షలు
కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన అభినందించారు. ‘కొత్త మంత్రులందరికీ çహృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో మీరంతా తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారన్న నమ్మకం నాకుంది’అని పేర్కొన్నారు.
రాజ్‌భవన్‌లో మంగళవారం జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన హరీశ్‌రావు, కేటీఆర్, జితేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, పద్మారావు, కడియం శ్రీహరి తదితరులు
కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతా
1994లో టీడీపీ అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. కానీ లక్ష్మీపార్వతి వల్ల రాలేదు. తర్వాత చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట తప్పారు. సీఎం కేసీఆర్ మాత్రం మంత్రి పదవిపై మాట ఇచ్చి నిలుపుకున్నారు. కేసీఆర్ నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెడతా. మా జిల్లాలోని సీనియర్ కడియం శ్రీహరి, చందూలాల్, మధుసూదనాచారిలను కలుపుకొని వారి అనుభవంతో ముందుకు వెళతా. – ఎర్రబెల్లి దయాకర్‌రావు
కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శం
సీఎం కేసీఆర్ పరిపాలన దేశానికి ఆదర్శంగా నిలిచింది. అందరి ఆశీర్వాదంతోనే ఈ స్థాయిలో ఉన్నాను. మీలో ఒకడిగా ఉంటూ అన్నివేళలా అండగా ఉంటాను. నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన బాధ్యతను పూర్తిస్థాయిలో నెరవేరుస్తాను. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. – తలసాని శ్రీనివాస్‌యాదవ్
16 ఎంపీ సీట్లు గెలుస్తాం
సీఎం కేసీఆర్ చేసిన ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 88 సీట్లు గెలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 16 సీట్లను గెలుచుకుంటుంది. మంత్రిగా నాకు రెండోసారి అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. బంగారు తెలంగాణ సాకారం కోసం ఆయన పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు నడుచుకుంటాను. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నిర్మల్ ప్రజలకు కృతజ్ఞతలు. – అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
కేసీఆర్, కేటీఆర్‌కు ధన్యవాదాలు
రెండోసారి మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు. ఇప్పటివరకు అన్నింట్లో సహకరించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు. సమన్వయం, సామరస్యంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అద్భుత ఫలితాలు సాధించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకమే మమ్మల్ని విజయపథం వైపు నడిపించింది. – జి.జగదీశ్‌రెడ్డి
ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటా
నాకు మంత్రివర్గంలో అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ ఆదేశాల మేరకు పనిచేస్తాను. సీఎం కేసీఆర్ నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను. ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నన్ను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ధర్మపురి ప్రజలకు కృతజ్ఞతలు. – కొప్పుల ఈశ్వర్
పంట కాలనీలకు కార్యరూపం
రాష్ట్రంలో ప్రజల జీవన విధానమైన వ్యవసాయ రంగం సమస్యలు తీర్చి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా శాస్త్రీయ పద్ధతిలో మార్కెటింగ్‌పై దృష్టి పెడతాను. రైతుల సమస్యలు పరిష్కరించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తాను. సాగు విస్తరణ, మార్కెటింగ్, సరఫరా రంగాలపై దృష్టి పెడతా. రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లోకి అందించేలా ప్రణాళికలను రూపొందిస్తాం. సీఎం కేసీఆర్ ఆలోచన విధానానికి అనుగుణంగా రైతు సమన్వయ సమితులను బలోపేతం చేస్తాం. రైతు సమన్వయ సమితులకు విధివిధానాలను త్వరలోనే ఖరారు చేస్తాం. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులు త్వరలో పూర్తి కానున్నాయి. సాగునీటిని హేతుబద్ధ్దంగా వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. తెలంగాణ వాతావరణ పరిస్థితులు, రాష్ట్రంలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటల కాలనీలను ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించేందుకు ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతాం. ఫుడ్‌ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా, ప్రజలకు కల్తీలేని నాణ్యమైన ఆహార పదార్థాలను అందించేందుకు అవకాశం ఉంటుంది. – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment