సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్స్ ఆసక్తికర ఫలితాలను వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రానున్నట్టు ఎక్కువ సంఖ్యలో పోల్స్ సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక, తాజాగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్ తేల్చాయి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను దీవించారు. డిసెంబర్ మూడు తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం.
పదేళ్లుగా బీఆర్‌ఎస్ నేతలు భూదోపిడీలకు పాల్పడ్డారు. లక్షల కోట్ల విలువైన భూములు ప్రజలకు, ప్రభుత్వానికి చెందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ధరణిని అడ్డుపెట్టుకుని హైదరాబాద్ పరిధిలో వేలాది ఎకరాలు దోచుకున్నారు. అధికారులు బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి అడ్డగోలు పనులు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. రెవెన్యూ వ్యవస్థను అప్రమత్తం చేస్తున్నాం. కాంట్రాక్టర్లకు వేల కోట్ల చెల్లింపులు ఈ రెండు, మూడు రోజుల్లో చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఒక ప్రభుత్వం నుండి మరొక ప్రభుత్వం మారుతున్న క్రమంలో ఇష్టరాజ్యoగా వ్యవహరించకుండా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అప్రమతంగా ఉండాలి. తెలంగాణలో గత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ధర్మపురి, హుజూర్ నగర్, మంచిర్యాల, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తిలో ఇబ్బందులు నెలకొన్నాయి. ప్రస్తుతం కోర్టులలో కేసులు కూడా ఇంకా నడుస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు కౌంటింగ్ పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు మార్పు కోసం తీసుకున్న నిర్ణయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది.
అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఓటమి భయంతో రైతుబంధు నిధులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారు. కమీషన్ల కోసం రైతుబంధు నిధులు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ మెంట్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే పక్రియ జరుగుతోంది. ప్రభుత్వ అన్ని ట్రాన్సాక్షన్స్‌పై నిఘా పెట్టాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ప్రభుత్వ ట్రాన్సాక్షన్‌పై విజిలెన్స్ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్‌లో అటు ఢిల్లీలో ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ షాకింగ్ ట్విస్ట్.. డిసెంబర్ నాలుగున బీఆర్‌ఎస్ కేబినెట్ భేటీ
Comments
Please login to add a commentAdd a comment