సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా పది మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్ వారితో ప్రమాణం చేయించారు. జాతీయ గీతాలాపన అనంతరం మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఒక్కొక్కరిని సభా వేదికపైకి పిలిచారు. ప్రమాణం స్వీకారం చేసిన వారు వరుసగా
- మొదటగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
- అనంతరం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ దైవ సాక్షిగా ప్రమాణం చేశారు.
- తలసాని అనంతరం సూర్యాపేట ఎమ్మెల్యే, గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు.
- జగదీష్ రెడ్డి ప్రమాణం చేసిన అనంతరం టీఆర్‌ఎస్ సీనియర్ నేత, గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణం చేసిన ఈటల రాజేందర్ ప్రమాణం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రాతినిథ్యం వహించిన ఈయన పార్టీ ఎల్పీ నేతగా పనిచేశారు.
- తొలి సారి వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయన పనిచేశారు.
- ఆరు సార్లు ధర్మపురి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేశారు. తొలి మంత్రివర్గ విస్తరణలో ఏకైక ఎస్సీ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ నిలిచారు.
- పాలకుర్తి ఎమ్మెల్యే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఈయన తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు.
- మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల నాయకుడిగా పనిచేశారు.
- బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
- చివరగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఆయన మల్కజ్‌గిరి ఎంపీగా పనిచేశారు.
- ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌లతో కలిసి కొత్త మంత్రులు ఫోటోలు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment