సాక్షి, హైదరాబాద్: తనకు మంత్రి పదవి దక్కడంపై ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను అందరిని కలుపుకొని వెళ్తానని, జిల్లా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పారు. ‘ఎన్టీఆర్ నాకు మంత్రి పదవి ఇస్తానని అన్నారు కానీ లక్ష్మీపార్వతి వల్ల రాలేదు. చంద్రబాబు నన్ను మంత్రిని చేస్తానని మాటతప్పారు. కేసీఆర్ నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వరంగల్ జిల్లాకు పెండింగ్ లో ఉన్న రింగ్ రోడ్డు, టెక్స్ టైల్ పార్కు, ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తేచ్చేందుకు కృషిచేస్తా. సీనియర్ నాయకులు కడియం శ్రీహరి, చందూలాల్, మధుసూదనాచారిలను కలుపుకొని వారి అనుభవంతో ముందుకు వెళతా. వరంగల్ ఉద్యమకారులు, టీఆర్ఎస్ శ్రేణులకు అండగా ఉంటాన’ని ఎర్రబెల్లి అన్నారు.
అరుదైన గౌరవమని: కొప్పుల ఈశ్వర్
తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కడం ఆనందంగా ఉందని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఉద్యమ నాయకుడిగా తనకిది అరుదైన గౌరవమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన మీద పెట్టిన నమ్మకాన్ని నెరవేరుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి జవాబుదారిగా పనిచేస్తానని చెప్పారు. (నేడే కేసీఆర్ కేబినెట్ విస్తరణ)
కేసీఆర్‌కు కృతజ్ఞతలు: ఇంద్రకరణ్ రెడ్డి
తనపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇంద్రకరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మొదటి ఐదేళ్లలో కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. బంగారు తెలంగాణ కల సాకారం చేసేందుకు సమిష్టిగా పనిచేస్తామన్నారు. కార్యకర్తల కృషి వల్లే తనకు మంత్రి పదవి దక్కిందన్నారు. నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ముఖ్యమంత్రి తనకు ఏ శాఖ అప్పగించిన శిరసావహిస్తానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment