సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్‌రావు అంటే భయం. అందుకే ఆయనకు పీఏసీ చైర్మన్ ఇవ్వలేదన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం రేవంత్ ఓ నియంతగా మారాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అలాగే, అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం ప్రపంచమంతా చూసిందని చెప్పుకొచ్చారు.
కాగా, ప్రశాంత్ రెడ్డి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘సహజంగా ప్రశ్నించే ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం దేశంలో ఆనవాయితీగా వస్తోంది. పీఏసీ చైర్మన్ పదవిని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఇవ్వడం పార్లమెంటరీ స్ఫూర్తికి, సంప్రదాయాలకు విరుద్ధం. పీఏసీలో మొత్తం 13 సభ్యులు ఉండాలని.. ఇందులో తొమ్మిది మంది అసెంబ్లీ నుంచి ఉండాలని అసెంబ్లీ రూల్ బుక్‌లో స్పష్టంగా ఉంది. ఎన్నిక పూర్తయిన తర్వాత స్పీకర్ అసెంబ్లీలోనే కమిటీ సభ్యుల పేర్లు ప్రకటించాలి. అసెంబ్లీ రూల్ బుక్‌లో 250 రూల్ కింద పీఏసీకి సంబంధించి ప్రతిపక్షానికి సంఖ్యను బట్టి సభ్యుల సంఖ్యను కేటాయిస్తారు.
బీఆర్ఎస్‌కు నిబంధనల ప్రకారం పీఏసీలో ముగ్గురు సభ్యులకు అవకాశం ఉంటుందని చెబితే నామినేషన్లు వేశాము. నేను, హరీష్ రావు, గంగుల కమలాకర్ నామినేషన్లు వేశాము. మధ్యలో అరికెపూడి గాంధీ పేరు ఎక్కడి నుంచి వచ్చింది. పీఏసీ సభ్యుల కన్నా ఎక్కువ నామినేషన్లు వస్తే ఓటింగ్ జరగాలి. ఓటింగ్ జరగకుండానే హరీష్ రావు నామినేషన్‌ను ఎలా తొలగించారు. బీఆర్‌ఎస్ తరఫున గాంధీ నామినేషన్ వేయడానికి ఎవరు అనుమతించారు. అరికెపూడి గాంధీ బీఆర్‌ఎస్‌కు చెందిన వ్యక్తి అని మంత్రి శ్రీధర్ బాబు చెబుతున్నారు. గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమించమని కేసీఆర్ సూచించారా?. కేసీఆర్‌ను శ్రీధర్ బాబు ఎప్పుడు సంప్రదించారో చెప్పాలి.
పీఏసీ కమిటీల విషయంలో రేవంత్ సర్కార్ అతి పెద్ద తప్పు చేసింది. రాహుల్ గాంధీ మాటలు కూడా వినిపించుకోలేని స్థాయికి రేవంత్ వెళ్లారా?. కాంగ్రెస్‌లో సీనియర్ అయిన జానారెడ్డి వంటి వారు కూడా రేవంత్‌కు చెప్పే స్థితిలో లేరా?. పీఏసీపై స్పీకర్ గడ్డం ప్రసాద్ పునరాలోచన చేయాలని కోరుతున్నాం. పీఏసీ నియామకంపై తెలంగాణ రాజకీయ విశ్లేషకులు స్పందించాలి. పీఏసీపై స్పీకర్ నిర్ణయం మారకపోతే గవర్నర్‌ను కలవడం, ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తాం.
మోదీ హాయంలో మొదటి రెండు పర్యాయాలు కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేకున్నా పీఏసీ చైర్మన్ పదవులు దక్కాయి. మొన్నటికి మొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సూచన మేరకు కేసీ వేణుగోపాల్‌కు కేంద్రంలో పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఓ సూత్రం.. తెలంగాణలో మరో సూత్రమా?. రాహుల్ రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరుగుతారు.. ఆ రాజ్యాంగం తెలంగాణకు వర్తించదా?. రాహుల్ విధానాలు తెలంగాణలో అమలు కావా?’ అంటూ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment