
సాక్షి, దుబ్బాక: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో విసుగుచెంది.. ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారు అంటూ బాంబు పేల్చారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని.. ఆ ఖర్చును తాము భరిస్తామని అనుకుంటున్నట్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణలో పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యేను కొంటారో కొనండి.. అందుకే అయ్యే ఖర్చును తామే భరిస్తామని అడుగుతున్నారు.
మరోవైపు.. బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్‌గా ఉంటే కుదరడం లేదని, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
