
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యాయ వ్యవస్థకు సవాల్ విసిరారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవులు పోవని, ఉప ఎన్నికలు రావని ఆయన శాసనసభ సాక్షిగా వ్యాఖ్యానించారు. ఇది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఒక విధంగా భరోసా ఇచ్చినట్లే. అదే టైమ్‌లో ఉప ఎన్నికలకు వెళ్లడానికి కాంగ్రెస్ వెనుకంజ వేస్తోందన్న సంకేతం కూడా ఇచ్చినట్లయింది. ప్రజలలో వ్యతిరేకత ఉందంటూ బీఆర్ఎస్, బీజెపిలు చేస్తున్న ప్రచారానికి ఊతమిచ్చినట్లవుతుంది.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న బలహీనతలు, న్యాయ వ్యవస్థ లోపాలను బహిర్గతం చేశాయి. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోని న్యాయ వ్యవస్థ ఇప్పుడు మాత్రం ఎలా తీసుకుంటుందన్నది ఆయన ప్రశ్న కావచ్చు. ఇది హేతుబద్దంగానే కనిపిస్తున్నా నైతికతే ప్రశ్నార్థకం. శాసనసభలో జరిగే చర్చలకు రక్షణ లేదా ఇమ్యూనిటి ఉన్నప్పటికీ, రేవంత్ వ్యాఖ్యల వీడియోని సుప్రీం కోర్టులో ప్రదర్శిస్తే న్యాయమూర్తులు ఎలా స్పందిస్తారన్నది అప్పుడే చెప్పలేం. వారు సీరియస్‌గా తీసుకోకపోతే ఫర్వాలేదు. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదముంది.
అత్యున్నత న్యాయస్థానం రేవంత్ వ్యాఖ్యలనే సాక్ష్యంగా తీసుకుంటే అది పెద్ద సంచలనమవుతుంది. బీఆర్ఎస్ అధినేత, గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించిన మాట నిజం. వారిలో కొందరికి మంత్రి పదవులు ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చి మంత్రి అయ్యారు. దానికి మూల కారణం ఓటుకు నోటు కేసు కావడం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును పొందడం కోసం ఆయనకు రూ.ఏభై లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడినట్లు కేసు నమోదు అయిన సంగతి విదితమే. టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలోనే ఉండేవారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆయన కుట్రపన్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించే వారు.
తొలి ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు 63 సీట్లే ఉండేవి. ఈ క్రమంలో రాజకీయంగా పొంచి ఉన్న ప్రమాదాన్ని గమనంలోకి తీసుకుని కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించారు. దానిపై టీడీపీ పక్షాన రేవంత్ కాని, ఇతరత్రా మరికొందరు కాని హైకోర్టుకు వెళ్లారు. అయినా పెద్దగా ఫలితం రాలేదు. రెండో టర్మ్‌లో కూడా కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లోకి తీసుకువచ్చారు. ఫలితంగా కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోయింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిలో సబితా ఇంద్రారెడ్డి మంత్రయ్యారు. శాసనసభ పక్షాల విలీనం పేరుతో కథ నడిపారు. మొత్తం ఎమ్మెల్యేలు ఒకసారి పార్టీ మారకపోయినా, స్పీకర్‌లు అధికార పార్టీ వారే కనుక ఇబ్బంది లేకుండా సాగిపోయింది.
2014 టర్మ్‌లో ఏపీలో సైతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకోవడమే కాకుండా, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. అయినా స్పీకర్ వారెవ్వరిపై అనర్హత వేటు వేయలేదు. ఈ నేపథ్యంలో ఈ ఫిరాయింపులపై ఫిర్యాదులు అందినా, అసెంబ్లీ గడువు ముగిసే టైమ్‌కు కూడా న్యాయ స్థానాలు తేల్చలేదు. తెలంగాణలో అప్పటికి, ఇప్పటికి ఒక తేడా ఉంది. గతంలో కాంగ్రెస్ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్‌లోకి జంప్ చేయడంతో విలీనం కథ నడిచింది. రాజ్యసభలో కూడా నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీ ఇలాగే విలీనం చేసుకుంది. నిజానికి న్యాయ వ్యవస్థ ఈ ఫిరాయింపుల మూలానికి వెళ్లి ఉంటే బాగుండేది.
అలా చేయకపోవడంతో ఆయా రాష్ట్రాలలో ఇది ఒక అంతులేని కథగా మారింది. కేసీఆర్ జమానాలో జరిగిన దానికి, రేవంత్ హయాంలో జరిగిన ఫిరాయింపులకు తేడా ఉంది. ఆనాడు సామూహిక ఫిరాయింపులన్నట్లుగా బీఆర్ఎస్ చూపింది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం కాంగ్రెస్‌కు బలహీన పాయింట్ కావచ్చు. మొత్తం 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే పది మంది మాత్రమే పార్టీ మారారు. వీరి ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలు ఉన్నప్పటికీ, వాటిని కోర్టులలో నిగ్గు తేల్చేసరికి పుణ్యకాలం ముగిసి పోవచ్చు. తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు నోటీసు ఇచ్చి ఏడాది అయిపోయినా దానికి సమాధానం ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
సుప్రీం వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ నేతలు కచ్చితంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవులు పోతాయని, ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత టి.రాజయ్య ఏకంగా ఎన్నికల ప్రచారమే ఆరంభించారట. దాంతో రేవంత్ అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పడానికి ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. కాని ఈ స్టేట్ మెంట్ ఆయనను ఆత్మరక్షణలోకి కూడా నెట్టినట్లయింది. ఉప ఎన్నికలకు వెనుకాడుతున్నారన్న సంకేతం కాంగ్రెస్‌కు ఎంతవరకు ప్రయోజనమన్న ప్రశ్న వస్తుంది.
2014-2023 వరకు బీఆర్‌ఎస్ ఏ సంప్రదాయాలు అమలు చేసిందో వాటినే తామూ పాటిస్తున్నామని ఆయన అంటున్నారు. గతంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని అడిగారు. దీనికి న్యాయ వ్యవస్థతో పాటు రాజకీయ పార్టీలు బదులు ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని అంటున్నారని కూడా రేవంత్ చెప్పారు. కాని కొందరు పార్టీ మారినట్లు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకు ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ పక్షాన పోటీ చేసినప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
అయితే పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వంటివారు తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. అభివృద్ది పనుల కోసం సీఎంను కలిసి వచ్చామని కాంగ్రెస్ లో చేరినవాళ్లు అంటున్నారని కూడా రేవంత్ చెప్పారు. తాను మాట్లాడేది సబ్ జ్యుడీస్ అవుతుందన్న వాదనను ఆయన తోసిపుచ్చుతూ శాసనసభలో మాట్లాడితే రక్షణ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుల విషయంలో గతంలో ఏ సీఎం కూడా ఇంత నేరుగా అసెంబ్లీలో ఈ విషయాలు మాట్లాడలేదు. బీఆర్ఎస్ చేసిన పనే తాము చేశామని, అప్పుడు లేని కొత్త నిబంధనలు ఇప్పుడు వస్తాయా అని ఆయన ప్రశ్నించారు. నిజమే. బీఆర్ఎస్‌కు ఈ వ్యవహారంలో నైతిక అర్హత లేదు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ కూడా అదే రీతిలో ఫిరాయింపులను ఎంకరేజ్ చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారో అర్థం కాదు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఈ సవాల్‌ను ఎలా ఎదుర్కుంటున్నది చర్చనీయాంశం.
కోర్టు నేరుగా ఎమ్మెల్యేలను అనర్హులుగా చేస్తూ తీర్పు ఇస్తే తప్ప, కేవలం స్పీకర్ ల నిర్ణయానికే వదలివేసే పరిస్థితి ఉంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఎవరూ అనుకోవడం లేదు. పూర్వం నుంచి ఈ ఫిరాయింపుల సమస్య ఉంది. దానిని అరికట్టాలని రాజ్యాంగ సవరణలు తెచ్చినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. న్యాయ వ్యవస్థ కూడా ఆయా రాష్ట్రాలలో ఆయా రకాలుగా ఫిరాయింపులపై స్పందిస్తున్నదన్న అభిప్రాయం కూడా ఉంది. అధికారం ఎటు ఉంటే అటు వైపు పరుగులు తీసే ప్రజాప్రతినిధులు, వారిని ప్రోత్సహించే రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఫిరాయింపుల గురించి మాట్లాడడం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకుంటున్నట్లు అవుతుందేమో!
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత