తెలంగాణలో అధికారం సాధించాలన్న కృత నిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. పంచ్ డైలాగులతో కార్యక్రమం రూపొందించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మళ్లీ తీవ్ర విమర్శలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారు. ‘‘తిరగబడదాం-తరిమికొడదాం’’ అనే నినాదంతో ఈ మూడు నెలలు ప్రజలలో నిరసనలు, ప్రచారం చేపట్టబోతున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ తోడు దొంగలని కూడా ప్రచారం చేయాలని కాంగ్రెస్ తలపెట్టింది. గతంలో ప్రజా గర్జన, సింహగర్జన వంటి నినాదాలతో ఆయా రాజకీయ పార్టీలు సభలు, ర్యాలీలు నిర్వహించేవి. కానీ ఇప్పుడు ఏకంగా తిరగబడదాం-తరిమికొడదాం అన్న నినాదంతో కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ రూపొందించడం విశేషం.
✍️ నిజానికి ఇలాంటి నినాదాలు మంచిదేనా అనేది కూడా ఆలోచించాలి. ఏదో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి వాటిని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అభిమానులు సమర్ధించి ఉండవచ్చు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో తిరగబడటాలు, తరిమికొట్టడాలు ఉండవు!. ఓటు ద్వారానే ప్రభుత్వాలు మారుతుంటాయి. అదే తిరుగుబాటు అనుకుంటే అనుకోవచ్చు!. బీఆర్ఎస్ ప్రభుత్వంపై చార్జీషీట్లు తయారు చేసి రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు వెళ్లాలని కూడా తలపెట్టారు. ప్రచార కార్యక్రమాలు ఏ పార్టీ అయినా చేస్తుంది. బీజేపీ.. బీఆర్ఎస్ లు తోడుదొంగలు అనే నినాదాన్ని కూడా ఇస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుమార్తె కవిత జోలికి ఈడీ వెళ్లలేదనే కారణంగా వారు ఈ ఆరోపణ చేస్తున్నారు. అదే సమయంలో.. ఇక్కడ కొన్ని ఇబ్బందులూ ఉండవచ్చు.
కేంద్ర స్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే భావజాలంతో ఉన్నాయన్న అభిప్రాయం ఏర్పడింది. ఢిల్లీ పాలనాధికార బిల్లు,తదితర బిల్లుల విషయంలో కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా వ్యతిరేకించింది. దాని ఆధారంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అని బీజేపీ ప్రచారం చేస్తోంది. బీజేపీ ఓవరాల్‌గా కాస్త తగ్గడం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశం. అయితే బీఆర్ఎస్‌ను ఓడించడానికి అది సరిపోతుందా? అనే సంశయం నెలకొంది.
✍️ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై కొన్ని అసంతృప్తులు ఉంటే ఉండవచ్చు. వాటిని ఆయన రెక్టిఫై చేసే కార్యక్రమంలో ఉన్నారు. వివిధ సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతులకు లక్ష రూపాయల లోపు రుణాలను కూడా మాఫీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇవి కేసీఆర్‌కు కలిసి వచ్చే పాయింట్లు . కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రూపాయల రుణమాఫీతో సహా పలు హామీలను ఇస్తోంది. అవేవి ఆచరణ సాధ్యం కాదని, వాటిని నమ్మవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రచారం ఆరంభించారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన చార్జీషీట్ లో కొన్ని అంశాలను పరిశీలిస్తే.. అవి కాంగ్రెస్ కు కలసి వచ్చేవేనా? అనే అనుమానం కలగకమానదు.
✍️ బీజేపీపై చేసిన విమర్శలలో తెలంగాణకు ద్రోహం- ఆంధ్రతో స్నేహం అనేది ఉంది. బీజేపీ ఏ రకంగా తెలంగాణకు ద్రోహం చేసిందన్నది స్పష్టత లేదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని కోల్పోయిన ఆంధ్ర పట్ల కేంద్రం కాస్త సానుకూలంగా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడం సరైందేనా? అనే పాయింట్ రావొచ్చు. ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్‌కు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుతో కలిసి 2018లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో పోటీచేసిందన్న సంగతి మర్చిపోకూడదు. అంతేకాక ఇప్పటికీ రేవంత్ రెడ్డికి, చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నాయని అంటారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు సలహాలు ఇచ్చిన వైనం అన్నీ ప్రచారంలోనే ఉన్నాయి.
తెలంగాణ, ఏపీ మధ్య వివాదాలు సృష్టించేలా కాంగ్రెస్ ఎలాంటి వ్యాఖ్య చేసినా.. అది ఆ పార్టీకి మేలు చేయకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ రోజులు పోయి పదేళ్లు కావస్తోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి విషయంలో బీజేపీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు చేశారు. ఈ విషయంలోనే బీజేపీ కాస్త డిఫెన్స్‌లో పడవచ్చు. ఇక ప్రభుత్వ ఆస్తుల అమ్మకం అంటూ కాంగ్రెస్ ఆరోపించడం పెద్ద ఉపయోగం కాకపోవచ్చు. ఎందుకంటే ఆర్దిక సంస్కరణలను తీసుకు వచ్చిందే కాంగ్రెస్ కనుక.
✍️ ఇక బీఆర్‌ఎస్‌పై చేసిన ఆరోపణలలో ఎక్కువ శాతం సాధారణంగా ఉన్నాయి. కాళేశ్వరం ఖజానా ఖాళీ అంటూ ఇచ్చిన నినాదం మాత్రం స్పెసిఫిక్ గా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ పాయింట్‌పై కేసీఆర్‌ను ఇరుకున పెట్టడానికి యత్నించవచ్చు. ఇక రేవంత్ రెడ్డి మళ్లీ ఘాటైన ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల తర్వాత విదేశాలకు పారిపోతారని అర్దం లేని ఆరోపణ ఆయన చేశారు. కాంగ్రెస్ పై కాస్త సానుకూలత ఏర్పడుతున్న తరుణంలో రేవంత్ నోరు జారితే.. అది కాంగ్రెస్ కు నష్టం చేయవచ్చు. దానిని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఓటు నోటు కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లిన సంగతి మర్చిపోకూడదు. ప్రభుత్వ విధానాలపై కాకుండా కేసీఆర్‌పై వ్యక్తిగత నిందలు మోపడం వల్ల కాంగ్రెస్‌కు, రేవంత్ కు ఎంతవరకు కలిసి వస్తుందన్నది చూడాల్సిందే.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment