సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్‌లో తనకు మంత్రిగా అవకాశం కల్పించడంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సంతోషం వ్యక్తం చేశారు. తనకు ఇంతమంచి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలిలో మొట్టమొదటిసారిగా మహిళకు మంత్రిగా అవకాశం కల్పించడం, గిరిజన మహిళ అయిన తనకు ఈ ఘనత ఇవ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ఆమె ‘సాక్షి’ టీవీతో ముచ్చటించారు.
గతంలో ఉన్న పరిస్థితుల కారణంగానే గత హయాంలో మహిళలకు మంత్రి పదవి దక్కలేదని, కానీ మహిళా సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తోందని, మిషన్ భగీరథ ద్వారా మహిళలు బిందెలతో రోడెక్కకుండా చేయడం, పెన్షన్‌ను రూ. 2వేలకు పెంచడం, మహిళల కోసం పలు సంక్షేమ పథకాలు అమలుచేయడం మహిళల పట్ల కేసీఆర్‌కు ఉన్న ప్రేమాభిమానాలను చాటుతున్నాయని సత్యవతి పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు కడియం శ్రీహరిలాంటి సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నారని, వారందరితో కలిసి పనిచేస్తానని, అందరినీ కలుపుకొనిపోతానని ఆమె తెలిపారు. తనకు ఏ శాఖ ఇచ్చినా.. దానిని సమర్థంగా నిర్వర్తించి.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూస్తానన్నారు. మహిళలు సొంతంగా నిర్ణయాలు తీసుకొని.. తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్వతహాగా పైకి రావాలని ఆమె ఆకాంక్షించారు.
మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగుకు చెందిన సత్యవతి రాథోడ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1996లో గుండ్రాతిమడుగు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆమె.. 2007లో నర్సింహుల పేట జెడ్పీటీసీగా, 2009లో డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, 2014లో ఆమె టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలిగా ఉన్న ఆమెను సీఎం కేసీఆర్ తాజా కేబినెట్ విస్తరణలో మంత్రిగా అవకాశం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment