హైదరాబాద్: కాంగ్రెస్ సీట్ల కేటాయింపు విషయమై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, కేంద్ర మంత్రి బలరాం నాయక్ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. రేణుకా చౌదరి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. అదే సమయంలో టికెట్ వస్తుందని ఆశించి, రాని వారు కూడా పొన్నాల నివాసం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, మరికొందరు మహిళా నేతలు కూడా వచ్చారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన తనకే టికెట్ ఇవ్వలేదని లలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక రాష్ట్ర నేతలు ఉన్నారని ఆమె ఆరోపించారు.
పొన్నాల వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తరువాత బాన్సువాడ నుంచి పోటీ చేయమని ఆయన లలితను కోరారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. తాను నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఆ టికెట్‌ను తనకు కాకుండా మరో నేతకు కేటాయించడం బాధాకరం అన్నారు.
ఈ సందర్భంగా రేణుకా చౌదరి, బలరాం నాయక్ వర్గీయుల గొడవపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు గల్లంతు కావడానికి బలరాం నాయక్ కారణమంటూ రేణుక వర్గీయుల ఘర్షణకు దిగారు.