పాలమూరు, న్యూస్‌లైన్ : మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆయా పార్టీలు ఎత్తులు.. పై ఎత్తులతో పావులు కదుపుతున్నాయి. ఈనెల 16న వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఈ సమీకరణలపై అంతా దృష్టి కేంద్రీకరించే అవకాశం కనిపిస్తోంది. ఇక పురపాలిక వారీగా చూస్తే గద్వాల 33 వార్డులకు గాను 23 స్థానాలు, షాద్‌నగర్‌లో 23 వార్డులకు గాను 15 స్థానాలు దక్కించుకొని కాంగ్రెస్ పూర్తి మెజార్టీ సాధించింది.
అయిజ స్పష్టంగా టీఆర్‌ఎస్ ఖాతాకు చేరగా, నారాయణపేటలో బీజేపీ అధిక స్థానాలు గెలుచుకుంది. మిగిలిన మహబూబ్‌నగర్, వనపర్తి, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్లో ఏ పార్టీకి మాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ నెలకొంది. దీంతో ఆయా మున్సిపాలిటీల పరిధిలో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు పార్టీలు ఎత్తులు, పై ఎత్తులు మొదలు పెట్టాయి. స్పష్టమైన సంఖ్యా బలం సాధించిన చోట పార్టీలో అంతర్గతంగా చైర్మన్ పదవిపై కౌన్సిలర్‌ల నడుమ ఏకాభిప్రాయం సాధించేందుకు పార్టీ ముఖ్యులు కసరత్తు చేస్తున్నారు. ఇతరుల మద్దతు అవసరమైన చోట కలిసి వచ్చే ఇతర పార్టీల కౌన్సిలర్లను బుట్టలో వేసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. బేరసారాలు, బుజ్జగింపులు, ప్రలోభాలతో ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేలా ఆశావహులు పావులు కదుపుతున్నారు.
కౌన్సిలర్లను కాపాడుకోవడమెలా...
వచ్చేనెల రెండు తర్వాతే కొత్త పాలక మండళ్లు కొలువుదీర నుండంటంతో గెలుపొందిన కౌన్సిలర్లను కాపాడుకోవడం అన్ని పార్టీలకు కత్తిమీద సాములా తయారైంది. వారు చేజారకుండా ఉండేందుకు శిబిరాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 16న సాధారణ ఎన్నికల ఫలితాలు ఉండటంతో ఆ తర్వాత క్యాంపులు ఏర్పాటయ్యే అవకాశముందని అంచనా. తమ మద్దతు కీలకమైన చోట వైస్ చైర్మన్ పదవి లేదా ఇతర ప్రయోజనాలు కోరేందుకు కొందరు కౌన్సిలర్లు సన్నద్ధమవుతున్నారు. పలుచోట్ల స్వతంత్ర అభ్యర్థులు కీలకం కావడంతో వారిని తమవైపు లాక్కునేందుకు ఆశావహులు ఫలితం వెలువడిన మరుక్షణం నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. దీనితో చైర్మన్ ఎన్నిక నాటికి ఈ రాజకీయాలు రక్తికట్టనున్నాయి.
ఎత్తులు..జిత్తులు
Published Thu, May 15 2014 3:10 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement