కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత
- అలిగిన పార్టీ సీనియర్లు
హైదరాబాద్: శాసనసభ్యుల కోటా నుంచి శాసనమండలికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకుల లలిత పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఆమె గురువారం ఉదయం నామినేషన్ వేయనున్నట్టుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి బుధవారం వెల్లడించారు. ఎమ్మెల్సీ సీటు కోసం టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఆయన కోడలు పొన్నాల వైశాలి కూడా తీవ్రంగా ప్రయత్నించారు. వీరితో పాటు మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్‌తో పాటు పలువురు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ జిల్లాలకు చెందిన 40 మంది సీనియర్లు చివరిదాకా ప్రయత్నించారు. ఆకుల లలితను అధిష్టానం ఎంపిక చేయడంతో పలువురు సీనియర్లు అలకబూనారు.
దానం నాగేందర్ రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆకుల లలిత ఎంపికపై పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హర్షం ప్రకటించారు. మహిళలను మంత్రివర్గంలోకి తీసుకోకుండా అవమానించిన టీఆర్‌ఎస్‌కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం చెంప దెబ్బ వంటిదని పొన్నం వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ శాసనసభాపక్షం అసెంబ్లీలోని కార్యాలయంలో గురువారం సమావేశం కానుంది. ఆకుల లలిత అభ్యర్థిత్వంపై ఈ భేటీలో అధికారిక ప్రకటన, అనంతరం నామినేషన్ ప్రక్రియ ఉంటుందని విప్ సంపత్‌కుమార్ వెల్లడించారు.
పార్టీలో కొనసాగలేను: దానం ఈమెయిల్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై దానం నాగేందర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న సమయంలో ఆకుల లలితను ఎంపిక చేయడం చాలా పెద్ద తప్పు అని, పార్టీ సీనియర్లను అవమానిస్తూ ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీలో కొనసాగలేనంటూ అధిష్టానవర్గానికి దానం నాగేందర్ ఈమెయిల్ చేసినట్లుగా తెలిసింది.