రంగంలోకి దిగుతున్న ఢిల్లీ దూతలు
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలికి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. పార్టీ అభ్యర్థి ఆకుల లలితను గెలిపించుకునేలా అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు వాయలార్ రవి, గులాం నబీ ఆజాద్ గురువారం మధ్యాహ్నం హస్తిన నుంచి హైదరాబాద్ రానున్నారు.
సీఎల్పీలో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం శుక్రవారం భేటీ కానుంది. పార్టీలో ఉన్న అసంతృప్తులను ఏకతాటిపై తెచ్చేందుకు ఢిల్లీ దూతలు రంగంలోకి దిగుతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ పదవి కోసం ఆశలు పెట్టుకున్న నేతలకు ...ఆకుల లలిత అభ్యర్థిత్వంపై అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఆమె గెలుపుపై అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా ఎమ్మెల్సీ సీటు కోసం టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఆయన కోడలు పొన్నాల వైశాలి కూడా తీవ్రంగా ప్రయత్నించారు. వీరితో పాటు మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్‌తో పాటు పలువురు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ జిల్లాలకు చెందిన 40 మంది సీనియర్లు చివరిదాకా ప్రయత్నించారు. ఆకుల లలితను అధిష్టానం ఎంపిక చేయడంతో పలువురు సీనియర్లు అలకబూనారు.ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.