TRS Party
-
కేటీఆర్ డ్రగ్ టెస్ట్ సవాల్‌పై బండి సంజయ్ కౌంటర్
సాక్షి, కరీంనగర్: మంత్రి కేటీఆర్ సవాల్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ వేశారు. తాము సవాల్ చేసింది ఎప్పుడు? మీరు స్పందించింది ఎప్పుడని ప్రశ్నించారు. దొంగలుపడ్డ ఆరు నెలలకు ఇప్పుడు మొరగడం ఎందుకని మండిపడ్డారు. కేటీఆర్ విదేశాలకు వెళ్లినప్పుడు చికిత్స చేయించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు దొరకననే ధీమాతోనే కేటీఆర్ స్పందించారని విమర్శించారు. డ్రగ్స్ కోసం తన రక్తం, కిడ్నీ కూడా ఇస్తానని, క్లీన్ చీట్‌తో బయటకు వస్తే కరీంనగర్ కమాన్ వద్ద తన చెప్పుతో ఆయనే కొట్టుకుంటారా అని కేటీఆర్ మంగళవారం సంజయ్‌కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.. కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ.. గతంలో ఎప్పుడో చేసిన సవాల్‌కు ఇప్పుడు టెస్టులకు రెడీ అంటున్నాడని విమర్శించారు. అన్ని టెస్టులకు ప్రిపేర్ అయి ఇప్పుడు రెడీ అంటున్నాడని అన్నారు. తాను తాంబాకు తింటున్నట్లు కేటీఆర్ ప్రచారం చేస్తున్నాడని, తాంబాకు తిన్నట్టు ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. తనకు ఆ అలవాటే లేదని, తంబాకుకు, లవంగానికి కూడా తేడా తెలియదని కేటీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. బూతులు తిట్టడం తప్ప ఏముంది మీరు చేసింది. మీ భాష చూసి నవ్వుకున్నాం. మేము సంస్కారంగా పెరిగినం మీకు అది లేక ఇలా మాట్లాడుతున్నారు. మీ చెల్లి లిక్కర్ కేసు గురించి ఎందుకు మాట్లాడట్లే. ఢిల్లీలో తీగ లాగితే ఇక్కడ భయం మొదలయింది. హైదరాబాద్ డ్రగ్స్ కేసు గుంజితే కొడుకు విషయం తెలుస్తదని విచారణ మూసేశారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. తప్పు చేయనప్పుడు కోర్టు ముందు నిరూపించుకోవచ్చు. ’ అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. చదవండి: ‘రాజగోపాల్ అన్న .. తొందర పడకు.. మాట జారకు..’ కవిత కౌంటర్ -
Malla Reddy: ఆది నుంచి వివాదాస్పదమే!.. తాజాగా మరోవివాదంలో..
సాక్షి, మేడ్చల్‌జిల్లా: మంత్రి మల్లారెడ్డి టీఆర్ఎస్లో ఆది నుంచి వివాదస్పద ఎమ్మెల్యేగా వార్తల్లోకి ఎక్కటం చర్చనీయాంశంగా మారుతోంది. విపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా పలు విమర్శలు ఎదుర్కోవడం గమనార్హం. తాజాగా జిల్లాకు చెందిన ఐదుగురు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మరో వివాదంలో చిక్కుకున్నారు. ►జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో సొంత నియోజకవర్గమైన మేడ్చల్‌కు పెద్దపీట వేస్తూ మిగతా నియోజకవర్గాలను విస్మరిస్తున్నారనేది సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రధాన ఆరోపణ. అలాగే పార్టీలో జిల్లా అధ్యక్షుడితో కలిసి గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీ పరువును బజారుకు ఈడ్చుతున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ►జయాపజయాలు ఏదైనా కాని తత్తరపాటు వ్యవహారంతో వివాదాల వరకు తొంగి చూసి.. అదే రీతిలో సమర్థించుకోవటంలోనూ మంత్రి మల్లారెడ్డి దిట్ట. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకోవటం మొదలుకొని మంత్రి పదవిని సాధించటం వరకు ఆయన వేసిన వ్యూహాలు ఫలించాయి. ►స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలుకొని సహకార సంఘాలు, మున్సిపల్ ఎన్నికల వరకు మంత్రి పలు వివాదాలకు నెలవయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపు.. కొన్ని పురపాలక సంఘాల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పలు పంచాయతీల్లో సర్పంచులు, ఉపసర్పంచ్ అభ్యర్థుల ఖరారు వరకు పలు వివాదాలను మంత్రి మల్లారెడ్డి అధిగమించారు. టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలను సైతం మంత్రి సొంత పార్టీతో సహా విపక్షాల నుంచి మూట గట్టుకున్నారు. కో–ఆప్షన్ సభ్యుల ఎంపికలో కూడా ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఇటీవల తన విద్యాసంస్థలపై ఐటీ దాడులు జరిగినప్పుడు కొత్త వివాదంలో చిక్కున్న మంత్రి ఏ విధంగా బయట పడతారని భావిస్తున్న బీఆర్ఎస్ పెద్దలకు తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో మంత్రి మల్లారెడ్డి పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నారు. నామినేటెట్ పదవుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బాహాటంగా విమర్శలు ఎదర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తాడోపెడో తెల్చుకుంటామని ఎమ్మెల్యేలు హెచ్చరించటం వివాదాస్పదంగా మారింది. భూ వివాదాల్లోనూ... అలాగే జిల్లాలో పలు భూ వివాదాల్లో కూడా మంత్రి పలు ఆరోపణలను మూటగట్టుకుని వివాదంలో చిక్కుకున్న దాఖలాలు ఉన్నాయి. 2019లో మంత్రి అయ్యాక మేడ్చల్, జవహర్‌నగర్, శామీర్‌పేట, ఘట్కేసర్, బోడుప్పల్, పీర్జాదిగూడ సహా నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని ఊళ్లలోనూ భూముల కొనుగోళ్లలో పలు వివాదాలను ఎదుర్కొన్నారు. వివాదాల నడుమ ఉన్న భూములను గుర్తించి, ఇరు వర్గాలను ఒప్పించి ఆయా స్థలాలను తనకు విక్రయించేలా చేయడంలో సిద్ధహస్తుడనే పేరు ఆయనకు ఉంది. మూడు చింతలపల్లి పరిధిలో ఈ తరహాలో భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
టీఆర్ఎస్లో వారసుల హవా: మా వాడు వస్తున్నాడు.. దీవించండి!
సీనియర్ రాజకీయ నాయకులు చాలా మంది తమ వారసుల అరంగేట్రం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత.. తనయుడి రాజకీయ భవిష్యత్ కోసం వ్యూహ రచన చేశారు. దాన్ని అమలు చేస్తున్నారు కూడా. తన కుమారుడి గురించి నలుగురు చర్చించుకునే విధంగా స్లోగా తెరమీదకు తెస్తున్నారు. ఏదోవిధంగా గులాబీ బాస్ దృష్టిలో తన కుమారుడు పడేందుకు ప్లాన్ చేస్తున్నారు. మా వాడు వస్తున్నాడు.. దీవించండి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఇప్పటికే మూడు సార్లు ఎంపీగా కొనసాగారు. ఎంతో సీనియర్ అయినప్పటికీ ఆయన రాష్ట్రంలో మంత్రి కాలేకపోయారు. ఆ కోరిక అలాగే మిగిలిపోవడం సుఖేందర్‌రెడ్డిని తొలచివేస్తోందట. అలాగే తన కుమారుడు అమిత్‌రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావడం కూడా ఆయన కోరికల్లో మరొకటి. ఉమ్మడి జిల్లా నుంచి జగదీష్‌రెడ్డి మంత్రిగా ఉన్నందున మరో రెడ్డి సామాజిక వర్గ నేతకు మంత్రి పదవి ఇచ్చే అవకాశంలేదు. భవిష్యత్‌లో కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కూడా కనిపించడంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కొడుకునన్నా రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించి చట్టసభలోకి పంపించాలని గుత్తా ప్లాన్ చేస్తున్నారు. కొంచెం గుర్తు పెట్టుకోండి. ఈ నేపథ్యంలోనే కొంతకాలం నుంచి వీలు దొరికినప్పుడల్లా కొడుకు రాజకీయ ఆరంగేట్రం గురించి ప్రస్తావన తీసుకువస్తున్నారట. దీని ద్వారా అమిత్ పేరుపై జనాల్లో చర్చ జరగాలన్నది ఆయన వ్యూహంగా తెలుస్తోంది. జిల్లాలో ఏదో ఒక నియోజవకర్గం నుంచి అమిత్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని గుత్తా చూస్తున్నారట. అయితే అది అంత సులువుగా నెరవేరే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్‌లకే సీట్లు ఇస్తామని సీఎం కేసీఆరే ప్రకటించారు. మరోవైపు జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో మొత్తం టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్‌కు అవకాశం ఎలా వస్తుంది? ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది తెలియాలి. ఒకవేళ ఎమ్మెల్యేగా అవకాశం రాకపోతే నల్లగొండ లోక్ సభ స్థానం నుంచి అయినా పోటీ చేయించాలని సుఖేందర్ రెడ్డి అనుకుంటున్నారట. ఎలాగూ గతంలో తాను ఎంపీగా పనిచేసిన స్థానం కావడంతో తనకున్న పరిచయాలు ఉపయోగపడతాయని లెక్కలు వేస్తున్నారట. మేమూ పోటీలో ఉన్నాం అయితే నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకునే నేతల లిస్ట్ కూడా టీఆర్ఎస్లో పెద్దగానే ఉందట. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఉత్తమ్ చేతిలో ఓడిపోయిన వేమిరెడ్డి నర్సింహ్మారెడ్డితో పాటు మరో పారిశ్రామికవేత్త, మొదటి నుంచి పార్టీలో ఉంటున్న ఓ మాజీ ఎంపీ కుమారుడితో పాటు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న మరో నేత కూడా టికెట్ కావాలని కోరుతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్‌కు అవకాశం వస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇన్నాళ్లు తండ్రి చాటు తనయుడిగా పెరిగిన అమిత్ ప్రజల్లోకి రాకపోవడం మైనస్‌గా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో తాను పదవిలో ఉన్నప్పుడే కొడుకు రాజకీయ భవిష్యత్‌కు బాటలు వేయాలని గుత్తా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవేళ కుమారుడికి ఎంపీ టికెట్ ఇప్పించుకోవడంలో గుత్తా విఫలం అయితే మాత్రం.. అది అమిత్ రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తమ భవిష్యత్ కోసం, వారసుల రాజకీయ భవిష్యత్ కోసం చాలా మంది కలలు కంటారు. కాని కొందరికీ కలలు వాస్తవ రూపంలో నెరవేరతాయి. మరి గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడిని చట్టసభకు పంపాలన్నా కల నెరవేరుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
‘తండ్రిపై కేటీఆర్ అలిగారు.. అందుకే ఢిల్లీ వెళ్లలేదు: రేవంత్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, ఢిల్లీ: కేసీఆర్‌కు మరోసారి అధికారం ఇస్తే వచ్చేది కిసాన్ సర్కార్ కాదని లిక్కర్ సర్కార్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదం ఇచ్చారు. దానికి కౌంటరుగా అబ్ కీ బార్ లిక్కర్ సర్కార్ అని విమర్శించాం. ఎందుకంటే కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైన విషయాల్లో మద్యం ఒకటి. ఆయన కుటుంబానికి లిక్కర్‌కు అవినాభావ సంబంధం ఉంది. మద్యంతోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు విస్తరించారని ఎద్దేవా చేశారు. ‘‘ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన కుమార్తె కవితపై ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ వార్ రూమ్ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం కాదు. నేను స్వయంగా ఆరోపిస్తున్న కేసీఆర్‌కి మరోసారి అధికారం ఇస్తే ఢిల్లీ లేదా తెలంగాణలో లిక్కర్ ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్‌పై ప్రభుత్వ ఆదాయం రూ.10,500 కోట్ల నుంచి రూ.36 వేల కోట్లకు పెరిగింది. తెలంగాణలో కొన్ని మీడియా సంస్థలను కేసీఆర్ కొనేశారు. అందుకే సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్నినిలదీస్తోంది. కేసీఆర్ అవినీతిపై కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ‘‘గత ఎనిమిదేళ్లుగా కేసీఆర్, మోదీ ఒకరికొకరు సహకరించుకున్నారు. నాణానికి బొమ్మా, బొరుసులా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. అధికారం నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయి. వారి నాటకాలను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణలో బీహార్ రాష్ట్ర సమితిగా మార్చాలనుకుంటున్నారా?. తెలంగాణలో మోదీ మోడల్ పాలనను కేసీఆర్ తీసుకురావాలనుకుంటున్నారా?. నరేంద్ర మోదీ విధానం ఐస్(ఇన్‌కంటాక్స్, సీబీఐ, ఈడీ), నైస్ (నార్కోటిక్స్, ఇన్‌కం టాక్స్, సీబీఐ, ఈడీ). తెలంగాణలో ఐస్, నైస్ మోడల్ చెల్లదు. ఈ రోజు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీనికి కుమార స్వామి, అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. అవినీతిపరుడైన కేసీఆర్‌కు సహకరించవద్దని కుమార స్వామి, అఖిలేష్ యాదవ్ ను కోరుతున్నా’’ అని రేవంత్ అన్నారు. చదవండి: TS: ముందస్తు ఎన్నికలు?.. వణికిస్తున్న సర్వే రిపోర్టులు! ‘‘కేసీఆర్ పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణను కూతురుకు అప్పగిస్తారనే కేటీఆర్ తండ్రిపై అలిగారు. అందుకే ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి కేటీఆర్ వెళ్లలేదు. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే డీఎన్ఏ మారదు. అలాగే పేరు మార్చినంత మాత్రాన ఆ పార్టీ డీఎన్ఏ మారదు. కేసీఆర్ డీఎన్ఏ ఏంటో అందరికీ తెలుసు. ప్లాస్టిక్ సర్జరీతో రూపు రేఖలు మార్చవచ్చు కానీ.. మనిషి ఆలోచనలు మార్చలేరు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినా ఆ పార్టీతో పొత్తు ఉండదు. మాది యాంటీ బీఆర్ఎస్, యాంటీ కేసీఆర్’’ అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. -
TS: ముందస్తు ఎన్నికలు?.. వణికిస్తున్న సర్వే రిపోర్టులు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఏడాదిలోపే జరగాల్సి ఉంది. కాని ముందస్తు ఊహాగానాలతో అన్ని పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. అదే విధంగా పార్టీలతో నిమిత్తం లేకుండా ఎమ్మెల్యేలు, ఆశావహులు ప్రజల దగ్గర తమ జాతకాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకుంటున్నారు. తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చెక్ చేసుకుంటున్నారు. తమ రాజకీయ భవిష్యత్ కోసం ఈ నాయకులంతా తల కిందుల తపస్సులు చేస్తున్నారు. సాంతం.. సర్వేల మయం అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలతో తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఇప్పటికే అసెంబ్లీలో ఉన్నవారు... కొత్తగా అసెంబ్లీలో ప్రవేశించాలనుకునేవారు తమ రాజకీయ భవిష్యత్ గురించి, రాబోయే ఎన్నికల్లో తమ అదృష్టం గురించి ప్రజల దగ్గర పరీక్షలు చేయించుకుంటున్నారు. అదేనండి... సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ప్రతి పార్టీ ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకుని ఓవరాల్‌గా పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, వ్యతిరేకతల గురించి.. ఒక్కో నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే, సీటు కోరుకుంటున్నవారు, ప్రతిపక్షాల పరిస్థితులపై అధ్యయనం చేయిస్తున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అన్నదాంతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీల తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. గ్రాఫ్ బాగుంటూనే టికెట్ ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నవారందరికీ వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తున్నట్లు గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించేశారు. దీంతో ఎమ్మెల్యేలంతా సంతోషంగా తమ పనుల్లో బిజీ అయిపోయారు. అదే సమయంలో టిక్కెట్ల హామీతో పార్టీలోకి వచ్చినవారు... టిక్కెట్ కోసం ప్రతి సారీ ఎదురుచూస్తున్నవారు తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చెక్ చేయించుకుంటున్నారు. కొందరిని నియమించుకుని సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇదిలా ఉంటే... గత ఎన్నికల్లో బాగా పనిచేసేవారికే టిక్కెట్లు ఇస్తామని, గ్రాఫ్ బాగాలేని ఎమ్మెల్యేలు ఇంటికే అని కేసీఆర్ హెచ్చరించారు. కాని ఒకరిద్దరు మినహా మిగిలిన సీట్లన్నీ సిట్టింగులకే కేటాయించారు. ఈసారి మాత్రం సిట్టింగులందరికీ అని ప్రకటించారు. దీంతో కేసీఆర్ మాటలకు అర్థాలు వేరులే అని కొందరు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర ఇప్పటికే అందరి జాతకాలు ఉన్నట్లు చెప్పారు. అందువల్ల ప్రజల్లో గ్రాఫ్ సరిగా లేకపోతే టిక్కెట్ రాదని భయపడుతున్నారు. అందుకే ఎవరికి వారు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. పల్లె పల్లెకు ప్రశ్నల రాయుళ్లు మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు చాలా పాఠాలు నేర్పింది. పోల్ మేనేజ్మెంట్ కొత్త పుంతలు తొక్కిన విధానాన్ని అక్కడ ప్రచారంలో పాల్గొన్న నాయకులంతా పరిశీలించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ప్రజలు వేసిన ప్రశ్నలు ఎలా ఉన్నదీ అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రత్యక్షంగా చూశారు. ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మునుగోడు ఉప ఎన్నికలో ఆయా పార్టీల కోసం పనిచేశారు. టీఆర్ఎస్ అయితే ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యేను ఇన్చార్జ్గా నియమించింది. మునుగోడు నేర్పిన పాఠాలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేంతా తమ నియోజకవర్గాల్లో ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. యూత్, మహిళలు, వృద్ధులు, రైతులు, మైనారిటీలు.. ఇలా అన్ని వర్గాల్లో తమకు ఉన్న ఆదరణ గురించి సర్వే చేయించుకుంటున్నారు. ప్రజల్లో కనుక వ్యతిరేకత ఉంటే.. దాన్ని అధిగమించడం ఎలా అన్నదానిపై వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. సంక్షేమ పథకాల విషయంలో ఉన్న అసంతృప్తి తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో తమకున్న గ్రాఫ్ పడిపోకుండా చర్యలు తీసుకోవడంతో పాటుగా.. ఇతర పార్టీల నేతలు, ముఖ్య కార్యకర్తలను ఆకర్షించే పనిలో ఎమ్మెల్యేలంతా బిజీగా ఉన్నారు. ప్రతి పార్టీ ఆపరేషన్ ఆకర్ష గ్రామ స్థాయి నుంచి అమలు చేస్తోంది. ముందుస్తు ఊహాగానాల నేపథ్యంలో మొత్తం రాష్ట్రం అంతా రాజకీయ జాతర మొదలైంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
లండన్‌లో మొట్టమొదటి బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ
లండన్: ఇటీవల అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ బీఆర్ఎస్గా మారిన సందర్భంగా సీఎం కేసీఆర్‌కు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎన్నారై బీ.ఆర్.ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి శుభాకాంక్షలు తెలిపారు. లండన్‌లోని చారిత్రక టవర్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ జెండా మంగళవారం ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎన్నారైసెల్ యూకే అధ్యక్షుడు అశోక్‌గౌడ్ దూసరి మాట్లాడుతూ.. దేశంలో గుణాత్మక మార్పు కోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి జెండాను సైతం లండన్ లోని చారిత్రాత్మక టవర్ బ్రిడ్జి వద్ద ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉందన్నారు. నేడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం దేశమంతా అమలు కావాలంటే అది కేవలం కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని ఎన్నారైలంతా విశ్వసిస్తున్నారన్నారు. యూకే లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాసులంతా బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. అలాగే భారత్ నుండి బీ.ఆర్.ఎస్ నాయకులని ఆహ్వానించి త్వరలో ఘనంగా బీ.ఆర్.యస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహిస్తామని అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సీక తెలిపారు. "దేశ్ కి నేత కేసీఆర్" "అబ్కి బార్ కిసాన్ సర్కార్" నినాదాలతో లండన్ టవర్ బ్రిడ్జి ప్రాంతం మారుమోగింది. కేసీఆర్ ప్రతీ పిలుపుకి స్పందించి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి తెలిపారు. అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సీక, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, కార్యదర్శులు హరి గౌడ్ నవాబుపేట్, సత్య చిలుముల, శ్రీకాంత్ జెల్ల, కోశాధికారి సతీష్ గొట్టెముక్కుల, అధికార ప్రతినిధులు రవిప్రదీప్ పులుసు, రవి రేతనేని, లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి, కోర్ కమిటీ సభ్యులు అబ్దుల్ జాఫర్, ఫృద్వి రావుల, మధుయాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కవిత రూటు ఎటు?.. పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ ఏంటి?
కల్వకుంట్ల కవిత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెగా అందరికీ పరిచయమే. నిజామాబాద్ ఎంపీగా ఒకసారి గెలిచిన ఆమె ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. సీబిఐ కేసు విచారణతో తరచుగా న్యూస్‌లో నానుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడైతే ఓడారో అక్కడే ఎమ్మెల్యేగా గెలవాలనే ఆలోచనతో ఉన్నారామె. నిజామాబాద్ జిల్లాలో ఇంతకీ ఆమె ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? నిజామాబాద్‌పై ప్రత్యేక దృష్టి తెలంగాణా రాష్ట్రంలో 33 జిల్లాలున్నా.. సీఎం కేసీఆర్ హైదరాబాద్ వేదికగా నిజామాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం కచ్చితంగా ఓ విశేషమే. ఈ క్రమంలోనే ఇందూరుపై సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారా అనే చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది. నిజామాబాద్ పై సీఎం సమీక్ష తర్వాత... వెనువెంటనే మంత్రి ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టరేట్ లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించగా.. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే గణేష్ గుప్తా ప్రెస్ మీట్ నిర్వహించి అభివృద్ధి వివరాలను వెల్లడించారు. సీఎం కేసీఆర్ నిజామాబాద్‌పై ఎందుకంత ఫోకస్ చేస్తున్నారన్న చర్చ మొదలైంది. సీఎం కుమార్తె కవిత వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎంపీగానే చేస్తారని.. కాదు.. కాదు.. బోధన్ నుంచీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారని.. కొందరు ఆర్మూర్ నుంచీ రంగంలోకి దిగొచ్చని.. అటు జగిత్యాల బరిలోనూ నిలువొచ్చనీ పరిపరివిధాలుగా ప్రచారమైతే సాగుతోంది. పోటీ చేస్తారా? ఫైట్ చేస్తారా? ఈ మధ్య బీజేపీ ఎంపీ అరవింద్ వర్సెస్ కవిత ఎపిసోడ్ తో.. నిజామాబాద్‌లోనే నిల్చి గెలవాలన్న పట్టుదల కవితలో మరింత పెరిగిందంటున్నారు. కూతురు కోరికను అర్థం చేసుకున్న తండ్రిగా కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో కవితనే నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా బరిలోకి దించనున్నారా అనే చర్చ టీఆర్ఎస్లో జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకే సీట్లని కేసీఆర్ తేల్చిచెప్పారంటే... కచ్చితంగా ఆలోచించాల్సిందే అనేవాళ్లూ ఉన్నారు. గతంలో ఎవరైతే బాగా పనిచేస్తారో వారికే సీట్లని చెప్పి.. దాదాపు సిట్టింగ్‌లకే టిక్కెట్లు కేటాయించిన గులాబీ బాస్ మాటల్లో ఆంతర్యాలు అంత త్వరగా అంతు చిక్కనివి. ఈ సారి కవితను నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ బరిలో దింపి.. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గణేష్ గుప్తాను పార్లమెంట్‌కు నిలబెట్టే అవకాశాలున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గణేష్ గుప్తా కూడా విద్యావంతుడు.. ఉత్సాహవంతుడు కావడంతో ఎంపీగా పార్లమెంట్‌కు పంపితే కూడా బెటరేమోనన్న ఆలోచనతో పాటు.. పెద్దగా నష్టమైతే ఉండకపోవచ్చనే లెక్కలు వేసుకుంటున్నట్టుగా టాక్. ఈక్రమంలోనే కవితను వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలో దించి గెలిపించి క్యాబినెట్లోకి తీసుకుని.. ఇందూరులో తిరుగులేని శక్తి కావాలనే యోచనతో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ అరవింద్ వర్సెస్ కవిత మధ్య వార్‌లో భాగంగా అరవింద్ ఎక్కడ నిలబడితే అక్కడి నుంచి పోటీ చేసి ఆయన్ను ఓడగొడతానన్న కవిత శపథం చేశారు. మరి రానున్న రోజుల్లో ఆ శపథాన్ని నెరవేర్చుకుంటారా? కవిత నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగితే.. మరి అరవింద్ ఎక్కడ పోటీ చేస్తారు..? లేదంటే, అరవింద్ పోటీ చేసిన సెంటర్ లోనే కవిత బరిలోకి దిగుతారా? కవిత పోటీ చేసే సెగ్మెంట్‌పై పొలిటికల్ సర్కిల్ చర్చలు జోరుగా సాగుతున్నాయి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఉండేదెవరు.. పోయేదెవరు..?.. గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు?
ఓరుగల్లు గులాబీ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ చేసిన ఒకే ఒక్క ప్రకటన ఉమ్మడి జిల్లాలో కాక రేపింది. సిట్టింగ్‌లకే సీట్లని చెప్పడంతో ఆశావహుల్లో గుబులు రేగింది. మరి టిక్కెట్లు ఆశించినవారు ఎదురుతిరిగితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో గులాబీ కోట బీటలు వారుతుందా? ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి? రాబోయే కాలానికి కాబోయే లీడర్ ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. రాబోయే కాలానికి కాబోయే లీడర్ నేనేనంటూ తిరిగిన నాయకులకు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చారు గులాబీ దళపతి సీఎం కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే సీట్లని ప్రకటించడంతో ప్రస్తుత ఎమ్మెల్యేలకు కాస్త ఊరటనిచ్చినా, టిక్కెట్లు ఆశిస్తున్నవారిని మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. ఏ ఇద్దరు కలిసిన టిక్కెట్లపైనే చర్చించుకుంటున్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉండి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పలు మార్లు పొటీకి దూరమైన నేతలను ఆలోచనలో పడేసి ఆందోళనకు గురిచేస్తోందట. అలా టిక్కెట్ రాదని ఖరారు చేసుకున్న నేతలు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకునే పనిలో నిమగ్నమవుతున్నారట. ఆ ఏడింట్లో సెగలే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో ములుగు మినహా.. మిగిలిన 11 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీటిలో ఏడు చోట్ల గులాబీ గూటిలోనే పోటీ తప్పని పరిస్థితి ఏర్పడింది. పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, వర్థన్నపేట, నర్సంపేటలో మాత్రమే సిట్టింగ్‌లకు పోటీ లేదు. మిగతా అన్ని చోట్లా సిట్టింగ్‌లకు పోటీగా ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఉద్యమ కాలం నాటి నాయకులు మేమున్నానంటూ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. పలు చోట్ల కొంతకాలం నుంచి రాజకీయంగా కత్తులు దూసుకునే పరిస్థితులు కొనసాగుతున్నాయి. నాయకుల మధ్య అంతర్గతంగా ఉన్న విబేధాలు అనేకసార్లు బయట కూడా పడ్డాయి. ఎత్తుకు పై ఎత్తులతో టిక్కెట్ సాధించుకునే పనిలో గులాబీ నేతలు ఉండగా సిట్టింగ్‌లకే మళ్ళీ అవకాశం ఇస్తామని కేసీఆర్ ప్రకటించడం ఆశావహులకు మింగుడు పడటం లేదు. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ స్టేషన్ ఘనపూర్‌లో తాటికొండ రాజయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయనకు పోటీగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి లేదా ఆయన కూతురు కావ్య టిక్కెట్ ఆశిస్తున్నారు. రాజయ్య, కడియం మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి. సీఎం నిర్ణయం మళ్లీ ఇద్దరి మద్య అగ్గికి ఆజ్యం పోసినట్లయిందని స్థానిక నాయకులు భావిస్తున్నారు. వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కు పోటీగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర టికెట్ ఆశిస్తున్నారు. భూపాలపల్లిలో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన గండ్ర వెంకట రమణారెడ్డికి పోటీగా.. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి టికెట్ రేసులో ఉన్నారు. డోర్నకల్ లో సీనియర్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ స్థానంలో మంత్రి సత్యవతి రాథోడ్ టికెట్ ఆశిస్తున్నారు. మహబూబాబాద్ లో ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ ఉండగా అక్కడ ఎంపి కవిత టిక్కెట్ కోరుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇద్దరి మద్య విబేధాలు బజారుకెక్కాయి. ఇక పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి పోటీగా.. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ రైతు విమోచన కమిటీ చైర్మెన్ నాగుర్ల వెంకటేశ్వర్లు టిక్కెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి పోటీగా.. ఎమ్మెల్సీ పోచంపల్లితో పాటు మరో నాయకుడు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. చదవండి: బీఆర్ఎస్ టికెట్ నాకే.. గెలిచేది నేనే: పట్నం సంచలన వ్యాఖ్యలు తెరపైకి ఆపరేషన్ ఆకర్ష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లకే సీట్లని ప్రకటించిన గులాబీ దళపతి.. కొండ సురేఖకు హ్యాండిచ్చారు. అయితే గతంలో మాదిరిగా ఈ సారి సైతం రెండు మూడు చోట్ల అభ్యర్థులను మార్చే అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. అదే నిజమైతే సిట్టింగ్‌లకు సైతం ప్రమాదం పొంచి ఉంది. గత అనుభవం దృష్ట్యా ఆశావహుల్లో ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. మరోవైపు.. కేసీఆర్ ప్రకటన తర్వాత అసంతృప్త నేతల కోసం కాంగ్రెస్, బీజేపీలు కాచుకుని కూర్చున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టి టిక్కెట్ రాదని నిర్ధారించుకున్న వారిని తమ వైపు తిప్పుకునే విధంగా వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల నాటికి గులాబీ గూటిలో ఉండేదెవరో పోయేదెవరో అంటూ.. కేడర్ చర్చించుకుంటోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బీఆర్ఎస్ టికెట్ నాకే.. గెలిచేది నేనే: పట్నం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వికారాబాద్: ‘బీఆర్ఎస్ పార్టీ టికెట్ నాకే.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది నేనే’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దేముల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్టీ టికెట్‌పై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారన్నారు. 1994 నుంచి నాయకులు, కార్యకర్తలు తన వెంటే నడుస్తున్నారన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి పార్టీ కార్యక్రమాలలో ముందుండి నడిచానన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ఓటర్లకు దూరం కాలేదన్నారు. తాండూరు అభివృద్ధి కోసం జిల్లా పరిషత్ నిధులతో పాటు ఎమ్మెల్సీ గ్రాంటు నిధులను స్థానిక ప్రజా ప్రతినిధులకు కేటాయించామన్నారు. పార్టీలోకి కొందరు వస్తుంటారు.. పోతుంటారు. వారి గురించి దిగులు పడాల్సిన అవసరం లేదన్నారు. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోయారని అలాంటి వారి గురించి పట్టించుకొనే అవసరం లేదన్నారు. తాండూరు రాజకీయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. ప్రజల మద్దతు తనకే ఉందన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.2వేల కోట్ల నిధులను తీసుకువచ్చానన్నారు. ఇప్పటికీ ఆ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజా రవాణాకు ఇబ్బందులు కలగకుండా తాండూరు–వికారాబాద్ రోడ్డుకు రూ.60 కోట్లు, తాండూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ఔటర్ రోడ్డుకు రూ.100 కోట్లు మంజూరు చేయించానని అన్నారు. ప్రస్తుతం ఔటర్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మరోవైపు కాగ్నా బ్రిడ్జి, బుద్దారం, గాజిపూర్, మన్సన్పల్లి, కందనెల్లి, జీవన్గిలలో బ్రిడ్జీల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. ఇటీవల నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారని వాటితో గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ముందుండి పనులు పూర్తి చేయాలన్నారు. -
సీబీఐ విచారణ పూర్తి.. సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి బయల్దేరిన కవిత ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఆమె వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు. సీబీఐ విచారణపై కేసీఆర్‌కు వివరించారు. 45 నిమిషాలపాటు వీరి సమావేశం కొనసాగింది. అనంతరం ప్రగతిభవన్ నుంచి కవిత తన ఇంటికి వెళ్లారు. కాగా ఢిల్లీ లిక్కరర్ స్కాం కేసులో కవితను సీబీఐ ఆదివారం విచారించిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటల నుంచి దాదాపు 7 గంటలపాటు కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీఆర్పీసీ 161కింద కవిత స్టేట్మెంట్ను రికార్డు చేశారు. విచారణ ముగియడంతో సీబీఐ అధికారులు ఢిల్లీకి తిరిగి వెళ్లారు. అవసరమైతే మళ్లీ విచారించే అవకాశం ఉంది. మరోవైపు కవిత విచారణకు సంబంధించి సీబీఐ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. చదవండి: ముగిసిన కవిత సీబీఐ విచారణ.. -
ఇద్దరూ ఒక పార్టీకి చెందినవారే.. గద్వాలలో కారు డ్రైవర్ ఎవరు?
వారిద్దరూ అధికార పార్టీకి చెందినవారే. ఒకరు జడ్పీ చైర్మన్, మరొకరు ఎమ్మెల్యే. కాని ఒకరంటే ఒకరికి పడదు. సమన్వయంతో పనిచేయడం మానేసి.. ఆధిపత్య పోరుకు తెర తీసారు. ఒకరు మంత్రి మనిషి.. మరొకరికి మంత్రితో పడదు.. దీంతో ఈ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? ఇంటా, బయటా.. వేడేక్కిన రాజకీయం నడిగడ్డగా పేరు పొందిన జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య జరగాల్సిన రాజకీయ పోరాటం.. అధికార పార్టీలోని వారి మధ్యే జరుగుతోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు కొంతకాలంగా అంతర్గత వైరం కొనసాగుతుంది. గతంలో జడ్పీ సీఈఓల బదిలీల విషయంలో మొదలైన అంతర్గత పోరు ఇప్పటికీ చల్లారలేదు. జడ్పీ చైర్ పర్సన్ సరితకు మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలు ఉండటంతో ఆమె ఎమ్మెల్యేతో సై అంటే సై అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్న ఎమ్మెల్యే సైతం డీ అంటే డీ అన్నట్టుగా ఉన్నారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న డీకే అరుణను ఎదుర్కొని నిలవటం ఎమ్మెల్యే కృష్ణమోహన్‌కు నిత్యం సవాల్‌గా మారుతోంది. ఇప్పుడు స్వంత పార్టీ నేత నుంచి కూడా ప్రతికూల పరిస్ధితులు ఎదురు కావడంతో ఆయనలో ఆందోళన పెరుగుతోంది. మా దారి మాదే గద్వాల నియోజకవర్గంలో జడ్పీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఎవరికి వారుగా అధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విధిలేని పరిస్ధితిలో జడ్పీ సమావేశంలో కలిసి పాల్గొన్నా అంటిముట్టనట్టే ఉంటున్నారు. వీరిద్దరి మద్య వైరానికి కారణం ఏంటని ఆరా తీస్తే.. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయుడిగా ముద్ర పడింది. దీంతో నిరంజన్‌రెడ్డితో ఆయనకు సఖ్యత లేదనే వాదన చాలా కాలంగా కొనసాగుతోంది. తన నియోజకవర్గంలో మంత్రి తనకు వ్యతిరేకంగా మరోవర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ సరిత గద్వాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో పావులు కదుపుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఓసారి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి రావాల్సిందిగా.. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలను ఆహ్వానించారు. మంత్రుల ఫోటోలతో జిల్లా కేంద్రంలో స్వాగత ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించారు చైర్మన్ సరిత. తనకు సమాచారం ఇవ్వకుండా ఒక్కరే వెళ్లి ఎలా పిలుస్తారని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సీరియస్ అయ్యారట. ఇదే విషయాన్ని మంత్రుల దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. వీరిద్దరి వర్గపోరు కారణంగానే ఆ ఇద్దరు మంత్రులు మీటింగుకు రాకుండా డుమ్మా కొట్టారు. కులాల కురుక్షేత్రం గద్వాల నియోజకవర్గంలో బీసీ వర్గాల్లో వాల్మీకి బోయల తర్వాత కురువ సామాజిక ఓటర్లే అధికంగా ఉన్నారు. కురువ వర్గానికి చెందిన సరిత రాజకీయంగా తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. గద్వాలలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని తన వర్గాన్ని పెంచుకుంటున్నారు. నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి క్యాడర్‌కు భరోసా ఇస్తున్నారు. చదవండి: బండ్ల కృష్ణమోహన్ రెడ్డికీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత బీసి కోటా కింద గద్వాల నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. టిక్కెట్ వస్తే ఎంతైనా ఖర్చు చేస్తామన్న ధీమాను ఆమె వ్యక్తం చేస్తున్నారట. పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే పట్ల అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలను చేరదీసి తన వర్గంలో కలుపు కుంటున్నారట. జడ్పీ చైర్పర్సన్ భర్త తిరపతయ్య కూడ గద్వాల రాజకీయాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే వర్గీయులు. నన్నే పక్కనబెడతారా? ఇటీవల బీసీ గురుకుల పాఠశాల భవనాన్ని తాను రాకముందే జడ్పీ చైర్‌పర్సన్‌తో ప్రారంభింప చేయటంపై ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక సంబంధిత శాఖ జిల్లా కోఆర్డినేటర్‌పై చేయిచేసుకున్నారు. ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో ఎమ్మెల్యేకు, జడ్పీ చైర్‌పర్సన్‌కు మద్య ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఘటనపై అధిష్టానానికి ఫిర్యాదులు కూడ వెళ్లినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతుండటంతో ప్రభుత్వ అధికారుల పరిస్దితి డోలాయమానంలో పడింది. ఎవరిని కలిస్తే ఎవరికి కోపం వచ్చి తమను టార్గెట్ చేస్తారోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉన్నతాధికారులు గద్వాల జిల్లాలో పనిచేయడానికి అంతగా ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఒక కంట కనిపెట్టాలని.. విభేదాలను పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని గులాబీ పార్టీ కేడర్ కోరుతోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కారులో పెరిగిన కసి.. ఆ గడ్డ ఇక ముందు ఎవరి అడ్డా?
పునాదులు లేని చోట కమలం పార్టీకి హఠాత్తుగా ఓ ఎంపీ ఎన్నికయ్యాడు. అనుకోకుండా లభించిన విజయాన్ని ఆస్వాదించడంతో పాటు దాన్ని కాపాడుకోవడం కూడా అవసరమే. పార్టీకి మరిన్ని విజయాలు అందించడానికి అక్కడున్న నేతలంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. కాని ఆ జిల్లాలోని కమలం రేకుల మధ్య ఐక్యత కనిపించడంలేదు. ఇంతకీ కాషాయ సేనలో అంతర్గత పోరు నడుస్తున్నదెక్కడ? ఎంపీ వర్సెస్ కన్వీనర్లు ఇందూరు కమలం పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. గతంలో అంతర్గతంగా ఉండే విభేదాలు ఇప్పుడు వీధిన పడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన బీజేపి ఇంటర్నల్ సమావేశం రసాభాసగా ముగిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లుగా.. ఇప్పటివరకు ఉన్నవారికి కాకుండా కొత్తవారికి ఇవ్వడంపై ఒకింత అసహనం..ఆగ్రహం వ్యక్తం అయ్యాయి. ఈ సమావేశం వల్ల మరోసారి బీజేపి నేతల మధ్య ఉన్న విభేదాలు బట్టబయలయ్యాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదోవిడత పాదయాత్ర నేపథ్యంలో ఇంఛార్జుల నియామకంలో తమను పట్టించుకోలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలపై కూడా పలు మండలాల నాయకులు అగ్గిమీద గుగ్గిలమైనట్టు సమాచారం. ఇప్పటికే ఇందూరు బీజేపీలో ఎంపీ అరవింద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నట్టుగా ఫైట్ సాగుతోంది. అరవింద్ తనకిష్టమైనవారికే పదవులిప్పించుకుంటున్నారని.. అలాగే ఇంఛార్జులు, కన్వీనర్ల నియామకాల్లోనూ తమను పట్టించుకోలేదంటూ.. కొందరు నేతలు సుమారు రెండు గంటల పాటు సమావేశంలోనే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పైగా ఎంపీ అరవింద్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలూ చేసినట్టు సమాచారం. చదవండి: (మరోసారి సంచలనాలకు వేదికగా హుజూరాబాద్) నోట నవ్వుతారు.. నొసలు చిట్లిస్తారు..! బీజేపీ పదాధికారుల సమావేశంలో.. ముఖ్యంగా ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల నేతలు అరవింద్‌పై పెద్దఎత్తున ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఈ మధ్య అరవింద్ ఆర్మూర్ లోనే ఉండి పాలిటిక్స్ చేస్తున్నారు. మరోవైపు బోధన్ లోనూ బీజేపీ ఎమ్మెల్యే సీటు ఆశావహుల సంఖ్య పెరగడంతో.. ఆయా గ్రూపుల్లో అసంతృప్తి ఏర్పడింది. ఇంతకాలం అరవింద్‌కు అనుకూలంగానే ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీనర్సయ్య కూడా ఈమధ్య అరవింద్‌తో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతుండగా.. త్వరలోనే పార్టీ జిల్లా అధ్యక్షుడినీ మార్చబోతున్నారంటూ.. గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో అధ్యక్షుడిగా పనిచేసి.. ప్రస్తుతం అరవింద్‌కు సన్నిహితంగా ఉంటున్న పల్లె గంగారెడ్డితో పాటు.. మరికొందరి పేర్లను జిల్లా అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కారులో పెరిగిన కసి ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్ లో 11 మంది కార్పోరేటర్లు బీజేపి నుంచి ఇతర పార్టీల్లోకి వలస వెళ్ళారు. అధ్యక్ష పదవి మళ్ళీ తనకే ఇవ్వకపోతే ప్రస్తుత జిల్లా అధ్యక్షుడైన బసవ కూడా పార్టీ మారే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ను ఢీ అంటే ఢీ కొడుతూ ఉవ్వెత్తున ఎగిసిపడిన బీజేపీ.. అంతేస్థాయిలో అంతర్గత కలహాల్లో కూరుకుపోతోంది. పైగా రానున్న ఎన్నికల్లో గట్టిగా పోరాడితే కమలం పార్టీకి అవకాశాలున్న నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ వంటి స్థానాల్లోనే ఈ అంతర్గత విభేదాలు పొడచూపడం పార్టీని కలవరపెడుతోంది. వడివడిగా ఎదిగిన బీజేపీ.. అంతే వడివడిగా సంక్షోభాలు.. అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. మరోవైపు అధికార టీఆర్ఎస్ మళ్లీ ఇందూరుపై సీరియస్ గా దృష్టి సారిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపి బలహీనతలే ప్రత్యర్థులకు బలమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమంటూ.. నిజామాబాద్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మరోసారి సంచలనాలకు వేదికగా హుజూరాబాద్
హుజూరాబాద్ నియోజకవర్గం మరోసారి సంచలనాలకు వేదికగా మారబోతోంది. అదీ గులాబీ పార్టీలోనే పోటీ తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆ సీటును గులాబీ పార్టీలో ముగ్గురు ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న సిటింగ్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోటీ ఏ స్థాయిలో ఉండబోతోంది? ఈటల మారారు, సీన్ మారింది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని అధికార పార్టీలో మూడు ముక్కలాట నడుస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో హుజూరాబాద్ లో గులాబీ కోట బీటలు వారింది. టీఆర్ఎస్లో అక్కడ ఈటలకు ప్రత్యామ్నాయ నేత ఇంకా తయారు కాలేదనే అనిపిస్తోంది. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల బీజేపీలో చేరి తిరిగి అసెంబ్లీకి ఎన్నికై తన బలాన్ని చూపించుకున్నారు. ఈ ఎఫెక్ట్ కూడా అక్కడ ఎక్కువే ఉంది. అయితే నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గులాబీ పార్టీ కేడర్‌లో ఒకింత గందరగోళానికి దారితీస్తున్నాయి. ఇద్దరు ముగ్గురు నేతలు హుజూరాబాద్ టికెట్ కోసం పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల సభ వద్దు.. శాసనసభ ముద్దు..! 2018లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన కౌశిక్ రెడ్డి ఆ తరవాత జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతున్నారని ఊహాగానాలు వచ్చినా.. తానే టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉండబోతున్నట్టు ఆడియోలు బయటకు వచ్చినా.. మారిన సమీకరణాలు వ్యూహ ప్రతి వ్యూహాల నేపథ్యంలో ఉప ఎన్నికలకు ముందు కారెక్కారు. కానీ టిక్కెట్ దక్కలేదు. గులాబీ దళపతి ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఎమ్మెల్సీ ఇచ్చినా కౌశిక్‌రెడ్డి మాత్రం సంతృప్తి చెందలేదు. ఇటీవల ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయంటున్నారు. ఎమ్మెల్సీ పదవి తృప్తిగా లేదు తనను ఎమ్మెల్యేగా గెలిపించండి అని కౌశిక్ వ్యాఖ్యానించారు. అందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. ముచ్చటగా ముగ్గురి పోటీ మరోవైపు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఈటల మీద ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా తానేం తగ్గేదెలే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేసేది తానే అని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఇక మునుగోడుతో రాష్ట్రంలో పొడిచిన కొత్త పొత్తుల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా పరిణామాలు మారే అవకాశాలున్నాయి. పొత్తు కుదిరితే కనుక ఆ సీటు సీపీఐకి వెళ్తుంది. అప్పుడు సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ బాబు సొంత నియోజకవర్గం అయిన హుజూరాబాద్‌కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సతీష్‌బాబు కూడా సొంత నియోజకవర్గానికి వస్తే హుజూరాబాద్ కోరుకునే వారి సంఖ్య మూడుకు చేరుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ టిక్కెట్ ఎవరికి అన్న ప్రశ్న తలెత్తుతోంది. కొత్త వారు కూడా ఈ సెగ్మెంట్‌ను కోరుకునే ఛాన్స్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. ఆయన్ను తట్టుకుని నిలబడే వారు అక్కడ గానీ చుట్టుపక్కల గానీ గులాబీ పార్టీలో కనిపించరనే టాక్ నడుస్తోంది. టీఆర్ఎస్ నుంచి ముగ్గురు పోటీ పడే పరిస్తితి వస్తే అది ఈటలకే ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. టీఆర్ఎస్ టిక్కెట్‌ను కేసీఆర్ ఎవరికి ఇస్తారో చూడాలి. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కేసీఆర్ ప్రకటనే అసలు సమస్య.. మాజీ ఎమ్మెల్యే దారేటు?
గతంలో మాదిరిగా ఈసారి కూడా సిటింగ్‌లకే సీట్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అనేక స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు. గతం నుంచీ అక్కడ గులాబీ పార్టీకి సేవ చేస్తున్నవారి పరిస్థితి ఏంటి? గతం నుంచి సీటిస్తామంటూ హామీ పొందినవారి సంగతేంటి? ఇటువంటి వారంతా సీట్ల కోసం ఏం చేయబోతున్నారు? ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నేతలు ఏమంటున్నారు? నకిరేకల్‌లో రసవత్తరం ఈసారి టికెట్ వస్తుందో రాదో అన్న అనుమానం ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత ఇచ్చిన భరోసా వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ పట్టరాని సంతోషం కలిగించింది. కొందరిని మాత్రం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. సిట్టింగులకే సీట్లు అంటే తమ పరిస్థితి ఏంటని పార్టీలో ఉన్న ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల తర్వాత గెలిచిన పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలున్న స్థానాల్లో ఈ ఆందోళనలు కాస్త ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి నియోజకవర్గాల్లో నల్లగొండ జిల్లా నకిరేకల్ కూడా ఒకటి. ఇక్కడ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వేముల వీరేశంపై కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిపోయారు. ఈ ఫిరాయింపుతోనే అసలు సమస్య మొదలైంది. కారు నడిపేది నేనే..! ప్రత్యర్థులుగా పోటీ చేసి గెలిచిన, ఓడిన నాయకులు ఇద్దరు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నారు. ఇద్దరు కూడా వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకున్నారు. కానీ అధినేత మాత్రం సిట్టింగులకే సీట్లు అని ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులతో సమావేశమైన సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా పోటీ చేస్తానని అందుకు మీరు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొందామని... మన మౌనం పిరికితనం కాదని గోడకు వేలాడ దీసిన తుపాకీ లాంటిదని ఘాటు కామెంట్స్ చేశారు. ఎంత తొక్కాలని చూస్తే బంతిలా అంత పైకి ఎగురుదామని వీరేశం మాట్లాడిన తీరు చూస్తే ఆయన ఖచ్చితంగా పోటీలో ఉండటం ఖాయం అని తెలుస్తోంది. కమలం కొత్త వ్యూహం అయితే వీరేశం ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ లోనే కొనసాగినా.. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి చెందిన వారిని ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేయించి సొంత పార్టీకి ధీటుగా కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. అందువల్ల ఆయన కూడా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు మీద పోటీ చేస్తారా? లేక ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే వేముల వీరేశంపై ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీ కూడా ఓ కన్నేసి ఉంచాయి. కాని ఇప్పటికే చెరుకు సుధాకర్ కాంగ్రెస్‌లో చేరి ఆయన భార్య లక్ష్మీని నకిరేకల్ నుంచి బరిలో దింపేందుకు ప్లాన్ చేశారు. ఇలాంటి సమయంలో వేముల కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అనుమానమే. అదే సమయంలో బీజేపీలో చేరడానికి సిద్ధాంత వైరం అడ్డుగా ఉంది. వీరేశం మాజీ మావోయిస్టు. అలాంటి వ్యక్తి బీజేపీలో చేరుతారా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. టికెట్ వచ్చినా రాకున్నా.. బరిలో ఉంటా.! వీరేశానికి టీఆర్ఎస్ టికెట్ రాకున్నా పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆయన అనుచరులు మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేయవద్దనే సూచిస్తున్నారు. పలు సంస్థలు చేసిన సర్వేల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కంటే తనకే అనుకూలత ఎక్కువ ఉందని వీరేశం చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వేలతో పాటు టీఆర్ఎస్ చేయించిన సర్వేలో కూడా సానుకూలత తనకే ఉందని వీరేశం అంటున్నారని టాక్. తనకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతుందా అన్న నమ్మకం ఆయనకు ఏమూలనో ఉందని అంటున్నారు. నకిరేకల్‌లో వేముల వీరేశం, చిరుమర్తి లింగయ్య మధ్య మరోసారి రసవత్తర పోరు జరగనుందని అర్థం అవుతోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
స్టూడెంట్ లీడర్ టు మాస్ లీడర్.. సివిల్ సప్లయ్ చైర్మన్‌గా సర్దార్
సాక్షి, కరీంనగర్: ఉద్యమ నాయకుడు సర్దార్ రవీందర్‌సింగ్‌ను అదృష్టం వరించింది. స్టూడెంట్ లీడర్‌గా రాజకీయ అరంగ్రేటం చేసిన రవీందర్‌సింగ్ మాస్‌లీడర్‌గా, న్యాయవాదిగా, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా, ఐదుసార్లు కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా ఎన్నికవ్వడమే కాకుండా కరీంనగర్ కార్పొరేషన్ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్‌గా రవీందర్‌సింగ్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేయడంతో అదృష్టమంటే రవీందర్సింగ్దే అంటూ చెప్పుకోవచ్చు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ కరీంనగర్లో రవీందర్ సింగ్ కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కొద్దిసేపటిలోనే రాష్ట్రస్థాయి చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదిస్తూ నిర్ణయాలన్ని ఒకేరోజు కావడం అనూహ్యంగా జరిగాయి. సివిల్ సప్లయ్ చైర్మన్‌గా సర్దార్ కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్‌ను రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం జీవో ఆర్టీ 2313 నెంబర్ ద్వారా రవీందర్‌సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ జీవో విడుదల చేశారు. కరీంనగర్లో రవీందర్‌సింగ్ కూతురు వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులను ఆశీర్వదించారు. సీఎం వివాహ వేడుక నుంచి వెళ్లిపోయిన కొద్ది సేపటిలోనే ఉత్తర్వులు వెలువడడంతో రవీందర్‌సింగ్ కూతురి పెళ్లికి సీఎం గిఫ్ట్ ఇచ్చారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. స్టూడెంట్ లీడర్‌గా.. మాస్ లీడర్‌గా.. రవీందర్‌సింగ్ విద్యార్థి దశలోనే 1984లో ఎస్సారార్ డిగ్రీ కళాశాలకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలంటే మక్కువ. ఎల్ఎల్బీ పూర్తి చేసి న్యాయవాద వృత్తిని చేపట్టి కొద్ది కాలంలోనే రాజకీయ అరంగ్రేటం చేశారు. కరీంనగర్ మున్సిపాల్టీలో 1995లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించి కౌన్సిలర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2001లో బీజేపీ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికై ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2005లో జరిగిన ఎన్నికల్లో మరోసారి బీజేపీ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికవ్వడంతోపాటు బీజేపీ నగర అధ్యక్షుడిగా 2006 వరకు పనిచేశారు. 2006లో సీఎం కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. కేసీఆర్ పిలుపును అందుకొని బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సమక్షంలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షునిగా ఉంటూ టీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చే పిలుపునందుకొని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తూ కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా మారారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం కరీంనగర్ నగరంలో ఉధృతంగా నడిపించడంతో కేసీఆర్‌కు నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. కరీంనగర్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల కోసం తీవ్రంగా పనిచేయడంతో కేసీఆర్ అనేక సందర్భంలో రవీందర్ సింగ్‌ను ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న సర్దార్ రవీందర్ సింగ్‌కు ఎమ్మెల్సీ అవకాశం ఖాయమంటూ ఒక దశలో ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్సీ అవకాశం అందినట్లే అంది అందకుండా పోయింది. రాష్ట్రస్థాయి పథకాలు అమలు.. టిఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా, మేయర్‌గా పనిచేసిన కాలంలో సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్ నగరంలో ఒక్క రూపాయి మేయర్‌గా ప్రసిద్ధి పొందారు. ఒక్క రూపాయికే నల్లా కలెక్షన్ ఇవ్వడం, ఒక్క రూపాయికే అంత్యక్రియలు చేయడం, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. మేయర్‌గా ఉంటూనే కరీంనగర్ నగరంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్, ప్రైవేట్ టీచర్, క్రీడా, కార్మిక సంఘాలకు, సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతూ మాస్ లీడర్‌గా, మేయర్‌గా మన్ననలు పొందారు. -
బీఆర్ఎస్ పేరును నేనే మొదట కోరా.. అవసరమైతే ఢిల్లీ హైకోర్టుకెళ్తా: ప్రేమ్నాయక్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించడాన్ని వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తోపన్నగండ తండాకు చెందిన బానోత్ ప్రేమ్నాయక్ తప్పుపట్టారు. తాను ముందుగా భారతీయ రాష్ట్ర సమితితోపాటు మరో మూడు పేర్లతో దరఖాస్తు చేశానని.. కానీ తన తర్వాత భారత్ రాష్ట్ర సమితిగా పేరుగా మార్చాలంటూ టీఆర్ఎస్ చేసిన దరఖాస్తుకు ఈసీ అనుమతి ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. చదవండి: (CM KCR: టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా..) -
అయ్యబాబోయ్ దుబ్బాకనా? ఆ పోస్టింగ్ మనకొద్దు.!
ఆ నియోజకవర్గంలో ప్రభుత్వాధికారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. అక్కడ పనిచేయాలంటేనే జంకుతున్నారు అధికారులు. ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే.. రాష్ట్రంలో అధికార పార్టీ ఎంపీ, కేంద్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇద్దరి మధ్యా నలిగిపోతున్నారు అధికారులు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? రీడ్ దిస్ స్టోరీ.. పచ్చగడ్డి వేసినా భగ్గే సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో కారు, కమలం పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు పార్టీల మధ్య వైరం నానాటికి పెరుగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యే మాటల ఈటెలు విసురుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమం ఏది జరిగినా ప్రోటోకాల్ పేరుతో రగడ సృష్టిస్తున్నారు. వీరిద్దరి వ్యవహారంతో ఏం చేయాలో తోచక అధికార యంత్రాంగం తల బాదుకుంటోంది. దుబ్బాక నియోజకవర్గానికే చెందిన టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. అందుకే నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతున్నారు. అలాగే అక్కడ ఉప ఎన్నికల్లో బీజేపీకి చెందిన రఘునందనరావు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో ఇద్దరి మధ్యా తీవ్రస్థాయిలో వర్గ పోరు సాగుతోంది. ప్రోటోకాల్ వ్యవహారంతో ప్రారంభమై... పరస్పరం దిష్టి బొమ్మల దహనం వరకు నిరంతర ప్రక్రియగా మారింది. చదవండి: బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్.. కేసీఆర్‌కు లేఖ పంపిన ఈసీ కార్యక్రమం ఏదైనా సీన్ సితారే నియోజకవర్గంలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎంపీ, ఎమ్మెల్యేలు.. దుబ్బాక అభివృద్ధి మా పార్టీయే చేసిందంటూ ఇద్దరూ ప్రజలకు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ, మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి మాట్లాడుతున్నారు. అదేవిధంగా మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ..కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎమ్మెల్యే రఘునందనరావు ఉపన్యాసాలిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్యా మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా నియోజకవర్గంలోని అక్బర్ పేట, భూంపల్లి నూతన మండలాల కార్యాలయాలను ప్రారంభించడానికి వచ్చిన మంత్రి హరీష్ రావు సమక్షంలో సైతం టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు మంత్రి చూస్తుండగానే పరస్పరం తోపులాటకు దిగారు. ఈ ఘర్షణ చూస్తూ..ఎవరికి ఎలా సర్దిచెప్పాలో తోచక అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య తరుచుగా జరుగుతున్న గొడవలు చూసి ప్రజలు కూడా చికాకు పడుతున్నారు. వీరిద్దరి వల్ల తమ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకపడిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్.. కేసీఆర్‌కు లేఖ పంపిన ఈసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి.. భారతీయ రాష్ట్ర సమితిగా అవతరించింది. దీనికి సంబంధించిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపింది. ఇక అధికారిక ప్రకటన వెలువడటమే మిగులుంది. అక్టోబర్ 5న పార్టీ పేరు మార్పుపై ఈసీకి టీఆర్ఎస్ లేఖ పంపింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ గురువారం ఈసీ ఆమోదం తెలిపింది. రేపు(శుక్రవారం) మధ్యాహ్నం 1:20కి బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం జరగనుంది. అనంతరం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. చదవండి: (రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు) -
జగిత్యాల పర్యటన.. కొండగట్టుపై సీఎం కేసీఆర్ వరాల జల్లు
సాక్షి, జగిత్యాల: జగిత్యాల పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు ప్రకటించారు. జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా నేడు అద్భుతమైన కలెక్టరేట్ నిర్మించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది కాబట్టి జగిత్యాల జిల్లా ఏర్పడిందన్నారు. జగిత్యాల జిల్లా అయితదని కలలో కూడా అనుకోలేదని, ప్రస్తుతం జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు అభినందలు తెలిపారు. ఏకైక రాష్ట్ర తెలంగాణే తెలంగాణలో అద్భుత పుణ్యక్షేత్రాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. బండలింగాపూర్‌ను మండల కేంద్రం చేస్తామని పేర్కొన్నారు. దేశంలో రైతుబంధు, రైతు బీమా ఇచ్చే ఏకైక రాషష్ట్రం తెలంగాణనే అని అన్నారు. తాను బతికున్నంత వరకూ రైతుబంధు, రైతు బీమా ఆగవని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ధాన్యం కొనదని, కానీ దేశంలో ధాన్యం కొనే ఏకైక రాష్ట్ర తెలంగాణేనని చెప్పారు. ఇంకా ఎన్నో పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చదవండి: మనకు మనమే సాటి.. ఎవరూ లేరు పోటీ: సీఎం కేసీఆర్ ‘మోటర్లకు మీటర్లు పెట్టాలట.. పెడదామా అని ప్రశ్నించారు. గోల్‌మాళ్ గోవిందం గాళ్లు, కారుకూతలు కూసేవాళ్లు మన మధ్య తిరుగుతున్నారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణలాగే దేశమంతా అభివృద్ధి చెందాలి. మనం వచ్చినప్పుడే కేంద్రంలో మోదీ కూడా వచ్చారు. కానీ ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని జరిగిందా? మోదీ వచ్చాక ఉన్న ఆస్తులు ఊడగొడుతున్నారు. రైతులకు ఉచితాలు ఇవ్వొద్దు కానీ.. ఎన్పీఏల పేరిట రూ. 14 లక్షల కోట్ల ప్రజా సంపదను దోచిపెట్టారు. రూ. 35 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న ఎల్ఐసీని కూడా అమ్మేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అందరూ పిడికిళ్లు బిగించాలి. దేశంలో ఇప్పటికే 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. 50 లక్షల మంది కార్మికుల ఉద్యోగాలు ఊడిపోయాయి.’ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. -
వామపక్షాల తీరు మారాలి.. పక్క పార్టీల వైపు ఆశగా చూస్తూ..
భారత్‌లో కమ్యూనిస్టుల పరిస్థితి దారుణంగా తయారైంది. వారు చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి అవకాశవాద, స్వార్థ రాజకీయాలు అనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. పదే పదే తప్పులు చేయడం వీరికి అలవాటై పోయింది. బీజేపి మతతత్త్వపార్టీ అంటూ వేలెత్తి చూపే ఈ కమ్యూనిస్టులు కేరళలో పచ్చి ముస్లిం మతతత్త్వ పార్టీ అయిన ముస్లిం లీగ్‌తో కలిసి తమ స్వార్థ రాజకీయాలు చేస్తుంటారు. గతంలో నిరు పేదల పక్షాన పోరాడుతారనే కాస్తో కూస్తో పేరు ఉండేది. ఇటీవల కాలంలో పోరాటాలు పక్కన పారేసి తమ పబ్బం ఎలా గడుపుకోవాలనే ఆరాటమే వీరిలో ఎక్కువైంది. గతంలో ఖమ్మంలో జరిగిన ఎన్నికల సందర్భంగా వామపక్ష పార్టీ ముఖ్య నాయకుడు డబ్బులకు అమ్ముడుపోయి పక్క పార్టీకి సహాయపడినట్లు అదే వామపక్ష పార్తీలకే చెందిన మరో కీలక నాయకుడు విమర్శించడం తెలిసిందే. ఇలాంటి వాదంతోనే ప్రస్తుతం తెలంగాణలో తమ పబ్బం గడుపుకోవడానికే టీఆర్ఎస్ పార్టీతో దోస్తీ చేస్తున్నారు. గతంలో ఇవే కమ్యూనిస్టు పార్టీలను అవమానకరంగా దూషించిన కేసీఆర్ పంచన చేరి ఆయన పారేసే ఒకటి, రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయొచ్చని ఆశపడుతున్నారు. బీజేపి మతతత్త్వ పార్టీ అని వేలెత్తి చూపుతున్న ఈ సోకాల్డ్ వామపక్షీయులు టీఆర్ఎస్ దోస్తీ చేస్తున్న పచ్చి మతతత్త్వ పార్టీ అయిన మజ్లిస్ పార్టీతో ఎలా కలుస్తారో ప్రజలకు చెప్పాలి. అంటే కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే పొత్తు అని చెప్పి తప్పించు కుంటారేమో. మతతత్త్వం పేరుతో బీజేపీని పదే పదే విమర్శించే వీరు ఎంఐఎం వైఖరిని విమర్శించిన దాఖలాలు లేవు. మొన్నటిదాక టీఆర్ఎస్ను అవినీతి, అక్రమాల పుట్ట అని వేలెత్తి చూపిన వీరు... తాము చేతులు కలుపగానే టీఆర్ఎస్ నీతిమంతంగా మారిపోయిందా? కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరిస్తుందని టీఆర్ఎస్ చేసిన అబద్ధపు ప్రచారాన్ని గుడ్డిగా నమ్మిన వామపక్షాలు, రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ పర్య టనను అడ్డుకోవాలని విఫలయత్నం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే నోముల నరసింహయ్యను టీఆర్ఎస్లో కలిపేసుకొని తమను నిర్వీర్యం చేసిన విషయాన్ని కూడా మరిచి పోయారని ఆ పార్టీల కార్యకర్తలే దుయ్యబడుతున్నారు. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో చేతులు కలిపి టీఆర్ఎస్పై దుమ్మెత్తి పోసిన వీరు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతోపాటు మళ్ళీ బీజేపీని తిట్టిపోస్తున్నారు. అంతకు ముందు ఇవే వామపక్షాలు తెలుగు దేశం పార్టీతో అంటకాగిన విషయం తెలిసిందే. దీనిని బట్టి అర్థమమ్యే విషయం ఏంటంటే వీరంతా తమ స్వార్థం కోసం ఎవరితోనైనా, ఎప్పు డైనా కలిసి పోతారనీ, సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఏమి ఉండవనీనూ. ఈ పార్టీల జాతీయ స్థాయి నాయకులు కూడా తక్కువేమీ తిన లేదు. మన రాష్ట్ర నాయకులకు వారే మార్గదర్శకులు. ఈ పార్టీలకు చెందిన అగ్రనాయకుల్లో కొందరు కోట్లకు పడగలెత్తారనీ, కొందరికి ప్రముఖ జాతీయ టీవీ ఛానళ్లలో, పత్రికల్లో వాటాలు కూడా ఉన్నాయనే విమ ర్శలున్నాయి. దేశమంతా రాష్ట్రాల వారీగా ఇతరులతో జట్టు కట్టడానికి వీరంతా చెప్పే ఏకైక కారణం బీజేపీ హిందూ మతతత్త్వాన్ని ఎదుర్కొని సెక్యులరిజాన్ని కాపాడటం. ఇక్కడ ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రీన్ అన్న... ‘భారత్‌లో సెక్యులరిజం అంటే హిందువులను అవమానించడం, మైనార్టీల పేరుతో అన్య మతస్థులను నెత్తికెత్తుకోవడం’ అన్న మాటలు గుర్తు చేసుకోవాలి. ఈ వామపక్ష భావాలవారు ప్రధానంగా సామాజిక కార్యకర్తల ముసుగులో, స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరైన తీస్తా సెతల్వాద్ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం గతంలో అక్రమంగా కేసుల్లో ఇరికించేందుకు ఎంతగా ప్రయత్నించారో ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలున్నాయంటే చాలు ఇలాంటి వారు మేధావుల రూపం లోనో, మరో రూపంలోనో బీజేపీకి వ్యతిరేకంగా కల్పిత ఉద్యమాలు సృష్టిస్తుంటారు. వామపక్షాల నాయకులు తమ పార్టీల బలోపేతానికి కృషి చేయకుండా పక్క పార్టీల వైపు ఆశగా ఎదురు చూస్తుండడం వీరి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా వామపక్షాలు మేలుకొని తమ పార్టీల పటిష్టతకు పూనుకోకపోతే గతంలో మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలనేవి ఉండేవి అని చెప్పుకునే దుఃస్థితి వస్తుంది. (క్లిక్ చేయండి: అదో.. ఆరో వేలు లాంటి వ్యవస్థ.. రద్దు చేయడమే మేలు!) - శ్యామ్ సుందర్ వరయోగి సీనియర్ జర్నలిస్ట్ -
సీబీఐకి ఎమ్మెల్సీ కవిత మరో లేఖ
-
Nagarkurnool: ముందస్తు ఊహాగానాలు.. టీఆర్ఎస్లో అలజడి
సాక్షి, మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మావతిపై అనర్హత వేటు అధికార పార్టీ టీఆర్ఎస్కు తలనొప్పి తెచ్చిపెట్టింది. నేతల మధ్య ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పోరు జిల్లా పరిషత్ పీఠం సాక్షిగా మరోసారి తెరమీదకు రావడంతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జెడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు కుమారుడు, కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు భరత్‌ప్రసాద్‌ను కాదని.. వైస్ చైర్మన్ బాలాజీసింగ్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం దుమారానికి దారితీసినట్లు తెలుస్తోంది. భరత్ప్రసాద్కు చెక్ పెట్టేలా జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు గతంలో లాగే పావులు కదిపి.. తెరవెనుక తతంగం నడిపించినట్లు ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాల్లో వైరం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలొస్తాయని ఊహాగానాలు వెల్లువెత్తుతుండగా.. తాజా రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయోననే ఆందోళన పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. తొలుత అలా.. 2019 జూన్‌లో జరిగిన నాగర్‌కర్నూల్ జెడ్పీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 20 జెడ్పీటీసీలకు 17 స్థానాలను కైవసం చేసుకుని జెడ్పీ పీఠాన్ని దక్కించుకుంది. జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వేషన్ కాగా.. కల్వకుర్తి నుంచి గెలుపొందిన భరత్‌ప్రసాద్‌ను చేయాలని తొలుత భావించారు. అయితే అనూహ్యంగా తెలకపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావతి పేరును ఓ ఇద్దరు ముఖ్యనేతలు తెరపైకి తీసుకు రాగా.. ఆమెకే అవకాశం దక్కింది. రాములు ప్రస్తుతం నాగర్‌కర్నూల్ ఎంపీగా ఉండడం, గతంలో అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించడంతో ఆయన కుమారుడు, విద్యావంతుడైన భరత్‌ప్రసాద్‌ను చైర్మన్ చేస్తే తమకు భవిష్యత్‌లో సమస్యలు తలెత్తుతాయని భావించిన సదరు నేతలు పద్మావతి పేరును తెరమీదికి తెచ్చినట్లు జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలో ఇరువర్గాలు, వారి అనుచరుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఎంపీ అనుచరుల్లో అసహనం.. విమర్శలు జెడ్పీ పీఠానికి సంబంధించి జిల్లాకు చెందిన ముఖ్యనేతలు అనుసరిస్తున్న వ్యవహారశైలిపై ఎంపీ రాములు, అతడి అనుచరుల్లో అసహనం నెలకొన్నట్లు తెలుస్తోంది. అంతర్గత భేటీలో ఈ విషయం చర్చకు రాగా.. కావాలనే గతంలో తెరచాటు రాజకీయాలు చేశారు, ఇప్పుడు చేస్తున్నారని ఒకరిద్దరు ఆగ్రహావేశాలకు లోనైనట్లు సమాచారం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు నడుచుకోవాలని.. సంయమనం పాటించాలని వారికి ఎంపీ సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికలకు సమయం ఇంకా ఏడాదికి పైగా ఉన్నప్పటికీ బాలాజీసింగ్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టడం.. ఎస్సీకి కేటాయించిన స్థానంలో వేరొకరిని నియమించడంపై ఆ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కోర్టు ఆదేశించినప్పటికీ.. తెలకపల్లి జెడ్పీటీసీగా సుమిత్ర ప్రమాణస్వీకారంలో జాప్యం జరుగుతోంది. పద్మావతి కోర్టు నుంచి స్టే తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని.. అందుకే జాప్యం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇలా.. తెలకపల్లి జెడ్పీటీసీ పద్మావతి తన ఎన్నికల అఫిడవిట్లో సంతానానికి సంబంధించి తప్పు డు వివరాలు సమర్పించారని కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. 1997లో మొదటి కుమారుడు, 2001లో ఇద్దరు కవలలు జన్మించినట్లు పేర్కొన్నారని.. వాస్తవానికి 1991లో మొదటి కుమారుడు, 1997లో ఒకరు, 2001లో మరొకరు జని్మంచారంటూ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ తర్వాత పద్మావతిని జెడ్పీటీసీ సభ్యత్వానికి అనర్హురాలిగా పేర్కొంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికైనట్లు ప్రకటించాలని ఆదేశించింది. దీనిపై పద్మావతి హైకోర్టును ఆశ్రయించగా ఆ తీర్పుపై స్టే ఇచ్చింది. చివరకు స్టే పిటిషన్‌ను కొట్టివేస్తూ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించడంతో పద్మావతిపై అనర్హత వేటు పడింది. దీనిపై ఆమె డివిజనల్ బెంచీకి వెళ్లినా చుక్కెదురైంది. దీంతో జెడ్పీ చైర్మన్ ఎంపిక అనివార్యం కాగా.. భరత్‌ప్రసాద్‌తో పాటు ఊర్కొండ జెడ్పీటీసీ శాంతకుమారి పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే తొలి నుంచి పీఠం ఆశిస్తున్న భరత్‌నే జెడ్పీచైర్మన్ పదవి వరిస్తుందని అందరూ భావించారు. కానీ.. వైస్ చైర్మన్ బాలాజీసింగ్‌కు ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. దీని వెనుక సైతం తొలుత అడ్డు పడిన వారే ఉన్నారని.. జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత అన్నీ తానై పథకం ప్రకారం భరత్‌కు చెక్‌పెట్టేలా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
జైళ్లో పెట్టుకోండి.. అంతకంటే ఏం చేయగలరు?: ఎమ్మెల్సీ కవిత ఫైర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ఎనిమిదేళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టి అడ్డదారిలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయని, అందుకే మోదీ కంటే ముందు ఈడీ వచ్చిందని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ కేసు రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవితతోపాటు మరికొందరి పేర్లను ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్(ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. తనతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు పెట్టించారని మండిపడ్డారు. తమపై కేసులు పెట్టడం నీచమైన రాజకీయ ఎత్తుగడ అని విమర్శించారు. సీబీఐ, ఈడీతో భయపెట్టించి గెలవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఈడీ వచ్చి ప్రశ్నలడిగితే కచ్చితంగా సమాధానం చెబుతామని తెలిపారు. సీబీఐ.. ఈడీ అన్నింటిని ఎదుర్కొంటామని అన్నారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నందునే ఈడీ వచ్చిందని అన్నారు. ఈ పంథా మార్చుకోవాలని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది. మీడియాకు లీకులు ఇచ్చి నేతలకు ఉన్న మంచి పేరు చెడగొట్టాలని చూస్తే మాత్రం ప్రజలు తిప్పికొడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు మనం ఏం చేస్తామో చెప్పుకొని గెలవాలి కానీ ఈడీ, సీబీఐలను ప్రయోగించి కాదు. కాదు కూడదని కేసులు పెడతామంటే పెట్టుకోండి.. అరెస్టులు చేసుకోండి.. దేనికైనా భయపడేది లేదు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటాం. జైళ్లో పెడతామంటే పెట్టుకోండి.. అంతకంటే ఏం చేయగలరు?’ అని కవిత ఫైర్ అయ్యారు. చదవండి: హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ రంగనాథ్ బదిలీ.. -
అసెంబ్లీ బరిలో కవిత..
మౌలిక వసతుల లేమి.. ఏళ్ల తరబడి సాగుతున్న భూగర్భ డ్రెయినేజీ పనులు.. వెనుక బడిన నగర సుందరీకరణ నేపథ్యంలో నగరాభివృద్ధిని పట్టాలెక్కించడానికి స్వయంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ అంశం స్థానిక ప్రజల్లో ఆసక్తిని కలిగించడంతో పాటు అభివృద్ధిపై ఆశలను చిగురింపజేసింది. మరోవైపు రాజకీయ వర్గాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రానున్న ఎన్నికల్లో అర్బన్ నుంచి బరిలో దింపడమే పరమార్థమని అంచనాలు సాగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాను పార్లమెంట్ స్థానానికి పోటీ చేయిస్తారని భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : వ్యవసాయ వనరులతో అభివృద్ధి పరంగా రాష్ట్రంలో ముందంజలో ఉన్న నిజామాబాద్ జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అయితే జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ అయి 17 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, నగర సుందరీకరణ పనుల విషయంలో పరిస్థితి ముందుకు పడడం లేదు. నిధులు వస్తున్నప్పటికీ వివిధ పనుల విషయంలో ఏళ్లతరబడి ఆలస్యం అవుతోంది. దీంతో నగర నవీకరణ వెనుకబడుతోంది. 1972లో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు రూపొందించిన మాస్టర్‌ప్లాన్ తప్ప కొత్త మాస్టర్‌ప్లాన్‌ను పట్టాలు ఎక్కించలేదు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ప్రారంభమైన భూగర్భ డ్రెయినేజీ పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఈ పనులు సాగుతూనే ఉన్నాయి. అంచనాలు మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా హైదరాబాద్‌లో నిజామాబాద్ నగర అభివృద్ధి పనుల విషయమై సమీక్ష నిర్వహించారు. రెండు నెలల్లో నిజామాబాద్ వస్తానని, ఈలోగా ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు ఖమ్మం వెళ్లి అక్కడ జరిగిన నగర అభివృద్ధిని చూసి రావాలని సూచించారు. ముఖ్యమంత్రి కేవలం ఒక్క నిజామాబాద్ నగర అభివృద్ధి పనుల విషయమై సమీక్ష చేయడంపై ప్రతిఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నగరాభివృద్ధి పనుల విషయమై ప్రజల్లో చర్చ సాగుతోంది. అయితే వివిధ వర్గాల్లో మాత్రం రాజకీయ అంశాలపై సూక్ష్మ పరిశీలనలు చేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కల్వకుంట్ల కవిత రెండోసారి ఓటమిపాలయ్యారు. బీజేపీ నుంచి ధర్మపురి అరి్వంద్ విజయం సాధించారు. తర్వాత కవిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే ఊహాగానాలు వివిధ వర్గాల్లో వేడెక్కుతున్నాయి. గత కొన్ని నెలల క్రితం మాత్రం కవిత బోధన్ లేదా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తాజాగా కవిత వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచే బరిలో ఉంటారని చర్చ జరుగుతోంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేషగుప్తాను ఈసారి నిజామాబాద్ పార్లమెంటు అభ్యరి్థగా బరిలోకి దించుతారని రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే కవిత నగరంపై ప్రత్యేక దృష్టి సారించారని, ఇందులో భాగంగానే నగర అభివృద్ధి విషయమై ముఖ్యమంత్రితో సమీక్ష చేయించినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు ముందస్తుగా వచ్చినప్పటికీ, షెడ్యూల్ మేరకు వచ్చినా సమయం ఏడాది లోపే ఉండడంతో ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కల్వకుంట్ల కవితకు రాష్ట్ర కేబినెట్లోకి రావాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా అవకాశం ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేగానే శాసనసభలో అడుగుపెట్టి మంత్రి కావాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. 2014 నుంచి 2019 వరకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కె కవిత రెండోసారి ఓటమిపాలయ్యారు. బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ విజయం సాధించారు. 40 ఏళ్ల క్రితం రూపొందించిన మాస్టర్ ప్లానే నగరానికి ఇప్పటికీ అమలవుతోంది. -
మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆరాటం.. ఎక్కడి నుంచి పోటీ?
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువైన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్ విజయంలో భాగస్వాములు కావడంతో ఎర్ర పార్టీల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. గులాబీ పార్టీతో పొత్తు కుదిరితే జిల్లా నుంచి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టవచ్చన్నది వారి ఆరాటం. టీఆర్ఎస్తో పొత్తు కుదిరితే సీపీఐ, సీపీఎంలు ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నాయి? ఇదే అదను, దిగాలి బరిలోకి ఒకప్పుడు నల్గొండ జిల్లా అంటే కమ్యూనిస్టుల ఖిల్లా అనేవారు. కాల క్రమంలో అదంతా గత వైభవంగా మిగిలిపోయింది. గతంలో మిర్యాలగూడ, నకిరేకల్, నల్లగొండ, దేవరకొండ, మునుగోడు నుంచి ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి ఎవరో ఒకరు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో దేవరకొండలో సీపీఐ తరపున రవీంద్ర కుమార్ గెలిచారు. కానీ ఆయన సొంత పార్టీకి హ్యాండిచ్చి టీఆర్ఎస్లోకి జంప్ చేశారు. గత ఎన్నికల్లో కూడా గెలిచి దేవరకొండ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ముఖ్య నాయకులే కాదు.. రెండు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కేడర్ కూడా చాలావరకు అధికార పార్టీలో చేరిపోయారు. దీంతో జిల్లాలో వామపక్షాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఇక జిల్లా నుంచి కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు అసెంబ్లీలో అడుగుపెట్టడం కలగానే మిగిలిపోతుంది అనుకున్నారు అంతా. ఇటువంటి క్లిష్ట సమయంలో వామపక్షాలకు మునుగోడు రూపంలో ఓ వరం లభించి పునర్జన్మ పొందినట్లు అయిందని చెప్పవచ్చు. మిర్యాలగూడ ఎవరికి? దేవరకొండ ఎవరికి? మునుగోడులో అధికార టీఆర్ఎస్కు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతుగా నిలిచాయి. బీజేపీని ఓడించే లక్ష్యంతో రెండు పార్టీలు గులాబీకి దన్నుగా ఉన్నాయి. ఇప్పుడిదే వారికి కలిసొచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి లెఫ్ట్, టీఆర్ఎస్ మధ్య పొత్తగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లెఫ్ట్ పార్టీలు గులాబీ పార్టీతో పొత్తుపై పూర్తి నమ్మకంతో ఉన్నాయి. అదే జరిగితే జిల్లాలో రెండు పార్టీలు ఒక్కో స్థానాన్ని తమకు కేటాయించాలని అడగనున్నట్లు తెలుస్తోంది. సీపీఎం మిర్యాలగూడ స్థానాన్ని, సీపీఐ మునుగోడు లేదా దేవరకొండ స్థానంలో ఒకదాన్ని తమకు కేటాయించాలని కోరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సీపీఐ మునుగోడు కంటే దేవరకొండ సీటుపైనే మక్కువగా ఉన్నట్లు సమాచారం. తమ పార్టీ నుంచి గెలిచి మోసం చేసి పార్టీ మారిన రవీంద్ర కుమార్‌ను దెబ్బ తీయాలని సీపీఐ నాయకత్వం భావిస్తోంది. అయితే జిల్లాలో సీపీఐకి అంతో ఇంతో కేడర్ ఉన్న నియోజకవర్గం అదే కావడం మరో కారణం. ఒకవేళ దేవరకొండలో అవకాశం రాకపోతే మునుగోడు సీటునే కోరనుంది. ఇక్కడి నుంచి ఇప్పటికే ఆ పార్టీ ఐదు సార్లు గెలవడం పార్టీ కేడర్ ఇంకా మిగిలే ఉండటంతో మునుగోడును ఇవ్వాలని బలంగా కోరే అవకాశం కనిపిస్తోంది. చదవండి: ఫాంహౌజ్ ఎపిసోడ్ ప్రకంపనలు.. కారు పార్టీలో తెర వెనక్కి ఇద్దరు.? జూలకంటి రెఢీ ఇక సీపీఎం కూడా నల్గొండ జిల్లాలో ఒక సీటు కోరుదామనే ఆలోచనలో ఉందని సమాచారం. మిర్యాలగూడ సీటు తీసుకుని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని బరిలో దించాలనే ఆలోచనలో సీపీఎం ఉందని టాక్. ఇప్పటికీ అక్కడ ఆ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. ఎలాగూ అక్కడి సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జనాలతో పాటు నియోజకవర్గానికి చెందిన పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం, కేడర్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈసారి అక్కడ సిట్టింగ్‌కు సీటు ఇస్తే అధికార పార్టీకి చేతులు కాలే పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో గులాబీ పార్టీ నాయకత్వం కూడా మిర్యాలగూడ సీటును సీపీఐఎం పార్టీకి కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఓ సభలో తనకు టికెట్ రాకున్నా పార్టీ కోసం పనిచేస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. అంటే ఆయనకు కూడా ఈ విషయంలో ఒక క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఉనికే ప్రశ్నార్థకమైన తరుణంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మునుగోడు రూపంలో కొత్త ఊపిరి పోసుకున్నట్లయింది. ఈ బంధం అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగితే ఉబయ కమ్యూనిస్టు పార్టీలకు ఎంతో కొంత ప్రయోజనం చేకూరవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.