
డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
టీఆర్‌ఎస్ నుంచి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ బయటికి రావడం ఆత్మగౌరవ ప్రకటనగా భావించాలి. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర సాధారణమైంది కాదు. హైదరాబాదులో లాప్రోస్కోపిక్ సర్జన్‌గా మంచి పేరున్న ఆయన ఒకవైపు వృత్తిని కొనసాగిస్తూనే... మరోవైపు డాక్టర్స్ సంఘ అధ్యక్షులుగా, తెలంగాణ జేఏసీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద దాదాపుగా 200 మంది డాక్టర్లు నిరాహార దీక్షలు చేపట్టారు. మిలియన్ మార్చ్, సాగరహారం లాంటి అనేక ఉద్యమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రత్యేక తెలంగాణ ఏర్పాడడానికి కారకులలో ఆయన ఒకరయ్యారు.
ప్రత్యేక రాష్ట్ర అవతరణ తరువాత జరిగిన ఎన్నికలలో బోనగిరి నుండి ఎంపీగా గెలిచి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి మేలు జరిగే పనులు చేశారు. అంతే కాకుండా యాదాద్రి గుడి పునఃనిర్మాణంలో ఆయన పాత్రను తక్కువగా అంచనా వేయలేము. గౌడ సామాజిక వర్గానికి కోకాపేటలో 5 ఎకరాల భూమి కేటాయించి, భవన నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చేయించడంలో ప్రధాన పాత్ర పోషించారు. అలాగే గీతన్నలు ప్రమాదవశాత్తూ తాటిచెట్టు పైనుండి కిందపడి చనిపోతే గతంలో ఉన్న రూ. 50,000 నష్టపరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచేలా చేసి బాధిత కుటుంబానికి ఆసరాగా నిలిచే విధంగా కృషి చేశారు.
ఈ నేపథ్యంలో రెండవసారి జరిగిన ఎన్నికలలో అధికార పార్టీ అగ్రకుల నాయకుల కుట్రల వ్యూహాలతో ఓడిపోయారు. ఆ తర్వాత నర్సయ్యకు టీఆర్‌ఎస్‌లో తగిన గౌరవం, ప్రాధాన్యం లభించలేదు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన టికెట్ ఆశించినా ఫలితం లేకపోయింది. ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో ఆయన టీఆర్‌ఎస్‌లో ఉన్న అణచివేత ధోరణిని నిరసిస్తూ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇది ముమ్మాటికీ సమర్థనీయమైన చర్య. (క్లిక్ చేయండి: టీఆర్‌ఎస్‌ను వీడుతానన్న వార్తల్లో వాస్తవం లేదు)
– డాక్టర్ మాచర్ల మొగిలి గౌడ్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment