తెలంగాణలో జెండా పాతేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న కాషాయ దళం భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతోంది? మునుగోడు పోయింది సరే, 2023 ఎన్నిక కోసం ఎలా సమాయత్తం కావాలి? ఢిల్లీ నుంచి రాష్ట్ర బీజేపీ నేతలకు వచ్చిన ఆదేశాలేంటి?
తెలంగాణలో దూకుడు మీదున్న కమలదళానికి మునుగోడ్ బ్రేక్ వేసింది. కారు, కమలం పార్టీల మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో జరిగినా.. చివరికి విజయం టీఆర్‌ఎస్‌కే దక్కింది. దీంతో కాషాయ పార్టీ అగ్రనేతలు.. తెలంగాణ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా కీలక నేతలకు బ్రీఫింగ్ ఇచ్చారు.
పటిష్టమైన క్యాడర్ లేని నల్లగొండ జిల్లాలో కొంత పట్టుసాధించినట్లు భావిస్తున్న బీజేపీ నేతలు...ఉప ఎన్నిక తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలం పెంచుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. జిల్లాలో టీఆర్‌ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో.. పార్టీకి దూరంగా ఉంటున్న నేతలకు కాషాయ కండువాలు కప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ లిస్టులో ఉన్న ప్రధానంగా మాజీ మంత్రులు, కీలక నేతలు ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ గెలవని పార్లమెంట్ స్థానాల్లో ఖమ్మం ఒకటి. ఇక్కడ పాగా వేయడానికి అవసరమైన అస్త్రాలను కమలనాథులు సిద్దం చేసుకుంటున్నారు. వారితో పాటు ఇతర జిల్లాల్లోనూ బడా నేతలపై కన్నేశారు.
1. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఖమ్మం నుంచి గతంలో వైఎస్సార్‌సిపి ఎంపీగా గెలిచిన పొంగులేటి.. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం పేరుకే పార్టీలో ఉన్నా.. పెద్దగా ప్రాధాన్యత లేదని చెబుతారు. జిల్లాలో మంచి పేరు ఉండడంతో పాటు ఆర్థికంగా పుష్కలమైన వనరులున్నాయని ఈయనకు పేరుంది. ఇటీవల ఆయన కూతురి వివాహం సందర్భంగా జిల్లా అంతటా చేసిన ఆర్భాటం ఇప్పట్లో ఎవరూ మరిచిపోరు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో కమలం పాగా వేయాలంటే పొంగులేటి సరైన వ్యక్తిగా పార్టీ భావిస్తోంది.
2. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
ఖమ్మం జిల్లాకే చెందిన మరో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల పేరు కమలం పార్టీ సీరియస్‌గా పరిశీలిస్తోంది. గతంలో కెసిఆర్‌కు అత్యంత సన్నిహితుడని పేరు తెచ్చుకున్నా.. అనూహ్యంగా ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత జిల్లాలో మారిన సమీకరణాలు ఇబ్బందికరంగా మారడం తుమ్మలను నిరుత్సాహపరిచాయి. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. మంత్రి పదవి వస్తుందనుకున్న తుమ్మలకు.. నిరాశే మిగిలింది. సత్తుపల్లిలో జరిగిన సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభకు కూడా తుమ్మల రాలేదు. తుమ్మలను చేర్చుకోగలిగితే.. జిల్లాలో పార్టీ సూపర్‌హిట్ అన్న ఆలోచనలో ఉన్నారు.
3. జలగం వెంకటరావు
ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన జలగం వెంకటరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు. అమెరికాలో చదువుకుని వచ్చి సత్తుపల్లి, కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2018లో కొత్తగూడెం నుంచి రెండో సారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయాడు. మారిన సమీకరణాలతో టీఆర్‌ఎస్ తనను పక్కన పెట్టిందన్న భావనలో జలగం వర్గం ఉంది. గత కొంతకాలంగా టీఆర్‌ఎస్ పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తుమ్మలకు సన్నిహితుడిగా ఉంటోన్న జలగం.. తాజాగా సత్తుపల్లి మీటింగ్‌కు దూరంగా ఉన్నాడు. ఇటువంటి సీనియర్ నాయకులను తమవైపు తిప్పుకుంటే పార్టీకి లాభం చేకూరుతుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు.
4. జూపల్లి కృష్ణారావు
తుమ్మల లాగే టీఆర్‌ఎస్‌లో ఒక వెలుగు వెలిగిన నాయకుడు జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ నుంచి 5 సార్లు గెలిచిన జూపల్లి.. గతంలో దివంగత నేత వైఎస్సార్ హయాంలో, ఆ తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి సర్కారులో మంత్రిగా ఉన్నారు. 2014-18 మధ్య టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో స్ట్రాంగ్ లీడర్లలో ఒకరైన జూపల్లి.. 2018లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ చేతిలో ఓడారు. కొంత కాలంగా టీఆర్‌ఎస్ పట్ల జూపల్లి అసంతృప్తిగా ఉన్నారు.
5. పట్నం మహేందర్ రెడ్డి
నాలుగు సార్లు తాండూరు నుంచి గెలిచిన పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో బలమైన నాయకుడు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి దగ్గరి బంధువు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 2018 వరకు రవాణా శాఖ మంత్రిగా పని చేసిన పట్నం.. 2018లో అనూహ్యంగా పైలట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పరిణామాల్లో పైలట్ రోహిత్ రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోవడం పట్నంకు రుచించని వ్యవహారంలా మారింది. అందుకే పట్నం మహేందర్‌రెడ్డిని తమ వైపుకు తిప్పుకోవాలన్నది బీజేపీ ఆలోచన.
6. బాల్కొండ సునీల్ రెడ్డి
బాల్కొండ టీఆర్‌ఎస్‌లో చాలా కాలం పని చేసి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో ముత్యాల సునీల్‌కుమార్ రెడ్డి సరైన సమయం కోసం వేచిచూస్తున్నాడు. నియోజకవర్గంపై కొంత పట్టున్న సునీల్‌రెడ్డి.. అవకాశం దక్కట్లేదన్న అసంతృప్తితో ఉన్నారు. నిజామాబాద్‌లో సునీల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే.. మరింత బలోపేతం అవుతామని భావిస్తున్నారు.
మొదటి ఫేజులో కొందరిని చేర్చుకోగలిగితే.. ఆటోమెటిక్‌గా మరింత మంది చేరుతారన్న భావనలో ఉన్నారు కమలనాథులు.
- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment