సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరతారనే దానిపై అధికారిక ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ అయింది. తెలంగాణ అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ఇద్దరు నేతలు తాము ఏ పార్టీలో చేరేది ప్రకటించనున్నారు. ఖమ్మం, రంగారెడ్డి లేదా మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి అదే రోజు పార్టీలో చేరనున్నారు.
ఈ జిల్లాల్లో ఎక్కడ సభ నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తారని సమాచా రం. కాగా ఈ బహిరంగ సభ తెలంగాణ ఆత్మ గౌరవ పొలికేక సభగా మారనుందని పొంగులేటి, జూపల్లి అనుచర గణం చెబుతోంది. దీనికిముందు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ అసంతృప్త నేతలతో వారి నియోజకవర్గాల్లో పొంగులేటి ఆత్మీయ భేటీలు నిర్వహించనున్నారు.
14న ఖమ్మంలో ఆత్మీయ భేటీ
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పొంగులేటి ఇప్పటికే ఖమ్మం మినహా 9 నియోజకవర్గాల్లో ఆత్మీయ భేటీలు నిర్వహించారు. భద్రాచలం, ఇల్లెందు, పిన పాక, అశ్వారావుపేట, వైరా నుంచి పోటీ చేసే తన అభ్యర్థులను కూడా ప్రకటించారు. తాజాగా ఖమ్మంలో 14న ఆత్మీయ భేటీ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
చదవండి: పొంగులేటి, జూపల్లితో భేటీపై ఈటల రాజేందర్ ఏమన్నారంటే?
ఏ పార్టీలో చేరతారో..
పొంగులేటి ఏ పారీ్టలో చేరతారన్నది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కాంగ్రెస్ నేతలు ఆయనతో పార్టీలో చేరిక విషయమై చర్చించారు. తాజాగా గురువారం బీజేపీ నేతలు పొంగులేటి, జూపల్లితో సమావేశమయ్యారు. భోజనం కూడా కలిసి చేసిన నేతలు.. నడ్డా, అమిత్‌షా ఆదేశాలకు అనుగుణంగా చర్చలు జరిపినట్లు తెలిసింది.
వీరిద్దరు బీజేపీలో చేరితే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా కలిసొస్తుందా? లేక ఓట్లు చీలి కేసీఆర్‌ను గద్దె దించే లక్ష్యం నెరవేరకుండా పోతుందా? అన్న అంశం చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఇలావుండగా బీజేపీ నేతల భేటీ నేపథ్యంలో పొంగులేటి ఆ పార్టీలో చేరతారనే ప్రచా రం ప్రారంభమయ్యింది. అయితే అధికారికంగా జూన్ 2న పొంగులేటి నిర్ణయం వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment