
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు తన విషయంలో బీఆర్‌ఎస్ వాగ్దాన భంగం చేస్తూనే ఉందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఇల్లెందులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. 2014లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రాకముందే, హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందనే ఉద్దేశంతో తమ పార్టీలోకి రావాలంటూ అప్పటి టీఆర్‌ఎస్ నాయకులు కోరారని పొంగులేటి చెప్పారు.
చివరకు రెండున్నరేళ్ల తర్వాత నాటి టీఆర్‌ఎస్‌లో చేరగా.. ఇప్పటి వరకు తనకు కానీ, తనను నమ్ముకున్న నేతలకు గానీ అర్హత ఉన్నా ఒక్క పదవీ రాలేదని అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకేస్థానాన్ని గెలవగా, ఆ ఫలితాలపై కురువృద్ధ నాయకులు చెప్పిన కల్లబొల్లి మాటలు నమ్మి తనకు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని పొంగులేటి చెప్పారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తమ పార్టీని అప్పటి టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తే చివరకు ఖమ్మం ఎంపీ టికెట్ కూడా నిరాకరించడమే తనకు దక్కిన గౌరవమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తనను జైలులో పెట్టినా ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా తన రాజకీయ ప్రస్థానం ఉంటుందని, తనను కానీ తనను నమ్ముకున్న వారిని కానీ ఇబ్బంది పెట్టాలని చూస్తే గాంధేయమార్గంలో సత్యాగ్రహం చేసైనా అధికార బలానికి ఎదురెళ్తామని పొంగులేటి వెల్లడించారు. అయితే, ప్రస్తుతం తమ దారి ఏమిటో ఇంకా తెలియదని ఆయన పేర్కొన్నారు.
చదవండి: స్మిత సబర్వాల్ ఇంట్లోకి చొరబాటు.. ఆనందకుమార్ రెడ్డి సస్పెండ్..
వారే ఆదర్శం: పోడు భూములకు పట్టాలిచ్చిన దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి, కిలో బియ్యం రూ.2కే ఇచ్చిన ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో పదికాలాల పాటు నిలిచిపోయారని, వారే ఆదర్శంగా రాజకీయాల్లోకి వచ్చానని పొంగులేటి తెలిపారు. 2018 ఎన్నికల సందర్భంగా పోడు సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. నేటికీ పోడు సమస్యకు పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment