ఆయనో ప్రభుత్వ అధికారి. వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఆయన పనిచేస్తున్న శాఖను ఉపయోగించుకుని పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టేశారు. ఆయన చేసే కార్యక్రమాలు కూడా అప్పుడప్పుడూ వివాదస్పదమవుతున్నాయి. తాజాగా సీఏం కేసీఆర్ కాళ్లు మొక్కిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎమ్మెల్యే సీటు కోసం ఆ అధికారి పడరాని పాట్లు పడుతున్నారని సెటైర్లు పడుతున్నాయి.
హెల్త్ డైరెక్టర్‌కు రాజకీయ ఆశలు
తెలంగాణ హెల్త్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌గా ఉన్న గడల శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని ఉబలాటపడుతున్నారు. కరోనా సమయంలో రాష్ట్రంలో ఆయన పేరు అందరికీ పరిచయమైంది. ఇక అప్పటినుంచి పొలిటికల్ ఏంట్రీ కోసం ఆరాటపడుతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారని టాక్. ఇప్పుడు కొత్తగూడెం పట్టణంలో ఎక్కడ చూసిన గడల శ్రీనివాసరావు ప్లెక్సీలే కనిపిస్తున్నాయి.
ఇక గులాబీ పార్టీ కండువా కప్పుకోవడమే తరువాయి అన్నట్లుగా తయారైంది పరిస్థితి. గడల చేస్తున్న హడావుడి చూసి ఏం జరుగుతుందో తెలియక సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సైలెంట్‌గా గమనిస్తున్నారు. అప్పుప్పుడు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు డిహెచ్ తీరుపై పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు.. ఎవరెన్ని డ్రామాలు వేసినా వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం టికెట్ తనకే ఇస్తారని చెబుతున్నారు వనమా.
కఠోర పూజలు, మెడికల్ క్యాంపులు
రెండు సంవత్సరాలుగా గడల శ్రీనివాసరావు నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. జీఏస్ఆర్ ట్రస్ట్ పేరుతో కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ.. జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయనే చేసే కార్యక్రమాలు కొన్ని వివాదస్పదమవుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. సుజాతనగర్ ప్రాంతంలోని చిన్న తాండాలో ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో గడల చేసిన మిరపకాయ పూజలు సంచలనం రెకెత్తించిన విషయం తెలిసిందే.
రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్ అయి ఉండి మూఢ నమ్మకాలను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. పూజ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ వివాదంతో కొన్ని రోజులు సైలెంట్ అయిన శ్రీనివాసరావు మళ్లీ లోకల్ గా కార్యక్రమాలు ప్రారంభించారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొని డిజే టిల్లు పాటకు డ్యాన్స్ వేయడంపై విమర్శలు చెలరేగాయి. ఇది కూడ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సర్.. సదా మీ సేవలో
తెలంగాణలో ఒకేసారి 8 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను సీఏం కేసీఆర్ ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌కు వచ్చిన డాక్టర్ శ్రీనివాసరావు నిమిషం వ్యవధిలో రెండు సార్లు ముఖ్యమంత్రికి పాద నమస్కారం చేశారు. రెండు చేతులు జోడించి కేసీఆర్‌కు ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. కాని గడల శ్రీనివాసరావు చెబుతున్నదానిని కేసీఆర్ విన్నట్లుగా అనిపించలేదు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ వ్యవహార శైలిపై అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే టికెట్ కోసమే డిహెచ్ ఇలా చేస్తున్నారని ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడుకుంటున్నారట. ప్రతిపక్షాలు సైతం డిహెచ్ తీరును తప్పు పడుతున్నాయి. పదవికి రాజీనామా చేసి గులాబి కండువా కప్పుకుంటే మంచిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
డాక్టర్‌కు గట్టి పోటీ
కొత్తగూడెంలో మళ్లీ పోటీ చేయాలని సిటింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కూడా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. మరోవైపు పొత్తుల్లో ఈ సీటు సీపీఐ కే వస్తుందని, తానే బరిలో దిగుతానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం మొన్నటి భేటీలో అన్నిచోట్లా సిటింగ్‌లకే సీట్లు ఇస్తామని ప్రకటించారు. మరి కొత్తగూడెంలో ఏం జరుగుతుందో చూడాలి.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment