ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలి తెలంగాణ పర్యటనలో రాజకీయంగా చాలా సంకేతాలు, సందేశాలున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ , కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మద్య ఏర్పడిన వైరుధ్యాల ప్రభావం ఈ పర్యటనలో సుస్పష్టంగా కనిపించింది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత జరిగిన మోడీ పర్యటనలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొనలేదు. గత కొంతకాలంగా వీరిద్దరి మద్య వాతావరణం ఉప్పు, నిప్పుగానే సాగుతోంది. మోడీనికాని, కేంద్ర ప్రభుత్వాన్ని కాని కెసిఆర్, కెటిఆర్, తదితర టిఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. దానికి ప్రతిగా తెలంగాణ బిజెపి నేతలు కూడా కయ్యానికి కాలు దువ్వుతున్నారు. దీంతో ఒకరకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అనూహ్యంగా ఎదిగిన కమలం
ఇటీవల పర్యటనలో ప్రధాని మోడీ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేరుగా కెసిఆర్ పైన, ఆయన కుటుంబంపైన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాకపోతే కెసిఆర్ పేరు ఎత్తలేదు. కాని మోడీ ప్రసంగంలో విమర్శల తీవ్రత భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు సంకేతంగా తీసుకోవచ్చు. కెసిఆర్ ప్రభుత్వాన్ని ఆయన అవినీతి మయంగా, కుటుంబ పాలనగాను విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
తనను కిలోల కొద్ది తిడుతున్నారని, ప్రజల కోసం తాను భరిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అంటే దీని అర్దం టిఆర్ఎస్ అధినేతలు కాని, ఇతర నేతలు కాని తనను ఎలా విమర్శిస్తున్నది గమనిస్తూనే ఉన్నానని ఆయన చెప్పకనే చెప్పారు. తెలంగాణలో కమల వికాసం ఖాయమని, మునుగోడు ఉప ఎన్నికలో బిజెపికి వచ్చిన ఓట్లే నిదర్శనమని ఆయన అన్నారు. నిజానికి మునుగోడులో బిజెపి ఓటమి చెందింది. అయినా, కాంగ్రెస్ ను మూడో స్థానానికి నెట్టివేసి, టిఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చి పదివేల తేడాతో ఓడిపోయినా, అది తమకు అనుకూల సంకేతంగానే మోడీ భావిస్తున్నారు.
మనీ పాలిట్రిక్స్
ఇంతకాలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. దానిని అధిగమించి బిజెపి అధికారంలోకి వస్తుందని ఆయన భావిస్తున్నారు. మోడీ టిఆర్ఎస్ పై అవినీతి విమర్శలు చేస్తున్నారు. కాని అదే సమయంలో ఒక విషయాన్ని వ్యూహాత్మకంగా విస్మరిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్, బిజెపి పోటాపోటీగా ఖర్చు చేశాయి. మరి అదంతా నల్లధనమా? లేక తెల్లధనమా? నోట్ల రద్దు చేయడం ద్వారా నల్లధనాన్ని అరికడతామని ప్రకటనలు చేసిన బిజెపి, ఇప్పుడు టిఆర్ఎస్ తో పోటీగా అంత డబ్బును ఎలా ఖర్చు చేయగలిగారన్నది పెద్ద ప్రశ్న. దురదృష్టవశాత్తు దేశ రాజకీయాలలో డబ్బు పాత్రను నిరోధించడంలో మోడీ ప్రభుత్వం కూడా సఫలం కాలేదు సరికదా.. తమ పార్టీ తరపున కూడా ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. అలాంటప్పుడు ఇతర పార్టీలకు బిజెపి భిన్నమైన పార్టీ అని ఎలా చెప్పగలరు.
అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడోందని ప్రధాని స్థాయిలో వారు ఆరోపిస్తే దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. మోడీ గతంలో కూడా ఇలాగే చేశారు. ఏపీలో గత ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాజకీయ విభేదాలు వచ్చాక పోలవరం ప్రాజెక్టు ఆయనకు ఏటిఎమ్ అయిందని మోడీ విమర్శించారు. అంతేకాదు.. చంద్రబాబు పి.ఎస్.పై కేంద్ర దర్యాప్తు సంస్తల అధికారులు దాడులు చేసి రెండువేల కోట్ల అక్రమాలు జరిగాయని ప్రకటించారు. అది జరిగి మూడేళ్లయినా ఆ కేసు ఎందుకు ముందుకు నడవలేదన్నది బహిరంగ రహస్యమే. ఇలాంటివాటిని మోడీ ఎలా సమర్ధించుకోగలరు?
కేంద్ర సంస్థలు x రాష్ట్ర సంస్థలు
తెలంగాణలో కూడా టిఆర్ఎస్ ప్రముఖులపై విమర్శలు చేయడం రాజకీయ లక్ష్యమే తప్ప, మరొకటి కనిపించడం లేదన్న విమర్శకు ఆస్కారం ఇస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనో, కాళేశ్వరం అవినీతి అనో బిజెపి నేతలు తరచు విమర్శలు గుప్పిస్తుంటారు. దురదృష్టవశాత్తు మన దేశంలో ఎదుటి పార్టీలను బెదిరించడానికి ఇలాంటి ఆరోపణలు చేయడం అన్ని పార్టీలకు అలవాటైంది.
రాష్ట్ర పోలీసులను టిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని, కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి వినియోగిస్తోందని ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. వీటిలో కొంతవరకు నిజమే ఉండవచ్చు. రామగుండం సభలో మాత్రం మోడీ ఒక ప్రశ్న వేశారు. సింగరేణి కాలరీస్ ను ప్రైవేటైజ్ చేస్తామంటూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే తాము ఎలా ప్రైవేటీకరిస్తామని ఆయన ప్రశ్నించారు. దీనికి టిఆర్ఎస్ కూడా సరైన సమాధానం చెప్పినట్లు కనిపించదు.
కార్ ఫైరింగ్
ఇటీవలికాలంలో టిఆర్ఎస్ నేతలు బిజెపిపైన, మోడీ, అమిత్ షా ద్వయంపై తీవ్ర విమర్శలు గుప్పించడం ద్వారా రాజకీయ రగడ సృష్టిస్తున్నారు. ఈ వ్యూహం వల్ల నష్టం జరుగుతుందా? లాభం జరుగుతుందా? అన్నది భవిష్యత్తు పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. బిజెపిని నిలువరించి, తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి టిఆర్ఎస్ అన్ని వ్యూహాలు వేస్తోంది. అంతేకాదు తమ ప్రభుత్వంలోని లోటు పాట్లను, సహజంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతను మొత్తం కేంద్రంపైన, బిజెపిపైన నెట్టడంలో టిఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో కొంతమేర సఫలం అయినట్లే అనిపిస్తుంది.
చదవండి: (CM KCR: కేంద్రం టార్గెట్‌గా సీఎం కేసీఆర్ కొత్త వ్యూహం!)
ఉదాహరణకు పార్టీ పిరాయింపుల విషయంలో టిఆర్ఎస్, బిజెపిలకు పెద్ద తేడా లేదు. కానీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెరపైకి తెచ్చి బిజెపిని బదనాం చేయడానికి టిఆర్ఎస్ బాగానే వాడుకుంది. రాష్ట్రంలో ఏ చిన్న సమస్య వచ్చినా దానికి కారణం కేంద్రమేనని టిఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. దీనిని ఎదుర్కోవడం బిజెపికి పెద్ద సవాలుగా మారిందని చెప్పాలి. ప్రత్యేకించి రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్ల అంశాన్ని గట్టిగా ప్రచారం చేస్తోంది. నిజానికి దీనివల్ల రైతులకు వాటిల్లే నష్టం ఏమీ ఉండదు. అయినా టిఆర్ఎస్ , వామపక్షాలు దీనిపై రైతులలో భయాన్ని సృష్టించే యత్నం చేస్తున్నాయి. బిజెపి కూడా మీటర్ల ఏర్పాటును సమర్ధించలేకపోవడం, తామేమీ దానిని అమలు చేయాలని కోరడం లేదని చెప్పడం విశేషమే.
రంజుగా రాజకీయం
ఒక విషయంలో మాత్రం టిఆర్ఎస్‌ను మోడీ బాగానే కార్నర్ చేశారని అనుకోవాలి. టిఆర్ఎస్ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందిన ఈ రోజులలో మూఢ నమ్మకాలకు ప్రాధాన్యం ఇస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, మంత్రివర్గం ఏర్పాటు మొదలైన అంశాలలో మూఢ నమ్మకాలను పాటిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దీనికి జవాబు ఇచ్చే స్థితిలో టిఆర్ఎస్ లేదని అంగీకరించాలి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే కేంద్రం పధకం కింద ఇళ్లు ఇవ్వలేకపోయామని మోడీ ఆరోపించారు. మొత్తం మీద వచ్చే శాసనసభ ఎన్నికలకోసం టిఆర్ఎస్, బిజెపిలు రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. మోడీ కూడా తెలంగాణ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారని అర్ధం అవుతుంది. వీరి మధ్యలో కాంగ్రెస్ నలిగిపోతుందా? లేక నిలబడగలుగుతుందా అన్నది చర్చనీయాంశంగా ఉంది.
ఆటలో అరటి పండవుతుందా?
వాస్తవానికి క్షేత్రస్థాయిలో తెలంగాణలో బిజెపికన్నా కాంగ్రెస్ బలమైన పార్టీ. కానీ ఇటీవలి పరిణామాలలో కాంగ్రెస్‌ను బిజెపి వెనక్కి నెడుతోంది. ఇప్పటికీ బిజెపికి ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినా తెలంగాణలో అధికారంలోకి రావడానికి బిజెపి వ్యూహరచన చేస్తుంది. అయితే అది అంత తేలిక కాదని టిఆర్ఎస్ జవాబిస్తోంది. గత సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్‌పై టిఆర్ఎస్ తేలికగా విజయం సాదించింది. ఈసారి బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య ఓట్లు చీలి టిఆర్ఎస్ బయటపడుతుందా? లేక బిజెపి తన సర్వశక్తులు ఒడ్డి అధికారంలోకి రాగలుగుతుందా అన్నది రాజకీయ తెరపైన చూడాల్సిందే.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment