కరోనా మరణాలకు కేసీఆర్‌దే బాధ్యత | KCR Will Take Responsibility For Coronavirus Deaths In Telangana | Sakshi
Sakshi News home page

కరోనా మరణాలకు కేసీఆర్‌దే బాధ్యత

Published Sun, Sep 6 2020 3:22 AM | Last Updated on Sun, Sep 6 2020 5:24 AM

KCR Will Take Responsibility For Coronavirus Deaths In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించిందని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. క్లిష్ట పరిస్థితుల్లో వైద్యాన్ని గాలికొదిలేశారని, రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, కరోనా మరణాలకు సీఎం కేసీఆరే బాధ్యుడని ఆయన వ్యాఖ్యానించారు. సీఎల్పీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ’ఆసుపత్రుల యాత్ర’లో భాగంగా దృష్టికి వచ్చిన ప్రభుత్వ వైఫల్యాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ను శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పొడెం వీరయ్య, ఇతర పార్టీ నేతలతో కలిసి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి వీక్షించారు.

అనంతరం భట్టి మాట్లాడుతూ తన యాత్రలో భాగంగా వైద్య సిబ్బంది పడుతున్న ఇబ్బందులు చూశానని చెప్పారు. సరైన పీపీఈ కిట్లు, సదుపాయాలు కల్పించకపోయినా వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారన్నారు. ఆరున్నరేళ్లుగా రాష్ట్రంలో కొత్త హాస్పిటల్‌ భవనాలు నిర్మించలేదని, వైద్య పరికరాలు సమకూర్చలేదన్నారు. తాను వెళ్లిన ప్రతి ఆసుపత్రిలో సిబ్బంది కొరత వేధిస్తోందని, ఆరోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోని ఆసుపత్రిలో కూడా సిబ్బంది లేరంటే ఆరేళ్లుగా గాడిదలు కాస్తున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు. మద్యం, బెల్ట్‌ షాపుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయన్న భట్టి.. రాష్ట్రంలో వైద్యం అందించడానికి సిబ్బంది లేరని, మందులు లేవని, మిషన్లు లేవని ఎద్దేవా చేశారు.

కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే జలగల్లా పట్టి పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఆరోగ్య శాఖను మూసేశారా? ఉత్సవ విగ్రహంలాంటి శాఖకు ఈటలను మంత్రిని చేశారా?’అని ప్రశ్నించారు. మూడు లక్షల కోట్ల అప్పుల్లో కనీసం పదివేల కోట్లు ప్రజారోగ్యానికి ఖర్చు చేసుంటే ప్రజలకు తిప్పలు తప్పేవన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి చికిత్స అందించాలని, ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి పేదల ప్రాణాలను కాపాడాలని కోరారు. తమ పర్యటన అనుభవాలను పేర్కొంటూ స్పీకర్, గవర్నర్‌ను కలిసి నివేదిక ఇస్తామని, ఈ సమాచారంతో హైకోర్టులో ప్రజల పక్షాన న్యాయ పోరాటం చేస్తామని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని భట్టి వెల్లడించారు.

వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి 
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ భట్టి బృందం ఆసుపత్రులను సందర్శించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చిందని అభినందించారు. గవర్నర్, హైకోర్టు తిట్టినా ప్రభుత్వం స్పందించడం లేదని, ఇంకా ఆ శాఖను పట్టుకుని వేలాడటానికి మంత్రి రాజేందర్‌కు సిగ్గనిపించడం లేదా అని వ్యాఖ్యానించారు. హుజురాబాద్‌ సంఘటనలో మంత్రి రాజేందర్‌ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం చెప్పినట్టు తప్పుడు లెక్కలు చూపించలేదని వేధించారని విమర్శించారు. అక్రమ కేసులు పెట్టి ఆపరేటర్‌ ప్రవీణ్‌యాదవ్‌ను పోలీస్‌స్టేషన్‌లో కరెంట్‌ షాక్‌ పెట్టి చనిపోయేలా చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజారోగ్యంపై దృష్టిపెట్టి పేదల ప్రాణాలను కాపాడాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement