
భారత పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) ప్రశంసలు కురిపించాడు. మూడు ఫార్మాట్లలోనూ ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్ అతడేనని కొనియాడాడు. తాను ఎదుర్కొన్న బౌలర్లలో అత్యంత కఠినమైన బౌలర్ బుమ్రానే అని కోహ్లి వెల్లడించాడు.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సత్తా చాటిన కోహ్లి.. ప్రస్తుతం ఐపీఎల్-2025 సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) సోషల్ మీడియాతో మమేకమైన కోహ్లి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
అత్యుత్తమ బౌలర్
ఇక మీ కెరీర్‌లో ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ప్రపంచంలో ప్రస్తుతం వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్ ఎవరంటే.. జస్‌ప్రీత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఐపీఎల్‌లో కొన్ని సందర్భాల్లో అతడు నన్ను అవుట్ చేశాడు. అయితే, ఎక్కువసార్లు నేనే అతడిపై పైచేయి సాధించాను. అయినా సరే.. మా ఇద్దరి మధ్య పోటీ అంటే ఎంతో ఆసక్తికరంగా, సరదాగా ఉంటుంది. ప్రతి బంతిని షాట్ బాదేందుకు నేను ప్రయత్నిస్తా.
నన్ను ఆపేందుకు అతడూ ట్రై చేస్తాడు. ఇద్దరి మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరుకున్న వేళ.. ఎవరూ కూడా తగ్గకుండా ముందుకు సాగితే మజాగా ఉంటుంది కదా!..
ఇక నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నపుడు నేను రెగ్యులర్‌గా బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొంటా. నాకు నచ్చిన, నేను ఆస్వాదించే మూమెంట్ అది. అంతేకాదు.. అదే కఠినమైన సవాల్ కూడా!’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు.
కాగా క్యాష్ రిచ్ లీగ్ ఆరంభమైన నాటి(2008) నుంచి కోహ్లి ఆర్సీబీలో కొనసాగుతుండగా.. బుమ్రా తన కెరీర్ ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్‌తో ప్రయాణిస్తున్నాడు.
ఫోర్లు బాదిన కోహ్లి.. అవుట్ చేసిన బుమ్రా
ఇక 2013, ఏప్రిల్ 4న ముంబై తరఫున ఆర్సీబీతో మ్యాచ్‌తో బుమ్రా ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. నాడు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. 32 పరుగులు ఇచ్చిన బుమ్రా మూడు వికెట్లు తీశాడు.
తన ఆరంభ ఓవర్లోనే కోహ్లి ఒకటి, రెండు, నాలుగో బంతుల్లో ఫోర్లు బాది చుక్కలు చూపించగా.. ఐదో బంతికి బుమ్రా విజయం సాధించాడు. నాడు 19 ఏళ్ల వయసులో ఉన్న బుమ్రా తన అద్భుత నైపుణ్యాలతో వికెట్ల ముందు కోహ్లిని దొరకబుచ్చుకుని.. తన తొలి వికెట్ సాధించాడు.
ఇక ఇప్పటి వరకు 133 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న బుమ్రా 165 వికెట్లు తీశాడు. ముంబై జట్టు ఐదుసార్లు టైటిల్ గెలిచిన సందర్భాల్లోనూ అతడు జట్టులో భాగంగా ఉన్నాడు.
మరోవైపు.. కోహ్లి జట్టు ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఇదిలా ఉంటే.. కోహ్లి- బుమ్రా టీమిండియాకు కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే. కోహ్లి సారథ్యంలో బుమ్రా ఆడగా.. పలు సందర్భాల్లో బుమ్రా కెప్టెన్సీలో కోహ్లి ఆడటం విశేషం.
చదవండి: అసలు అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు?: పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం
"𝙒𝙝𝙚𝙣𝙚𝙫𝙚𝙧 𝙄 𝙛𝙖𝙘𝙚 𝙝𝙞𝙢, 𝙞𝙩'𝙨 𝙡𝙞𝙠𝙚, '𝙊𝙠𝙖𝙮, 𝙞𝙩'𝙨 𝙜𝙤𝙣𝙣𝙖 𝙗𝙚 𝙛𝙪𝙣.'" 🗣
Ever wondered who’s the toughest bowler Virat’s ever faced? 🤔 Catch him spill the tea, at the 𝗥𝗖𝗕 𝗜𝗻𝗻𝗼𝘃𝗮𝘁𝗶𝗼𝗻 𝗟𝗮𝗯 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗦𝗽𝗼𝗿𝘁𝘀 𝗦𝘂𝗺𝗺𝗶𝘁… pic.twitter.com/36F8d8twN6— Royal Challengers Bengaluru (@RCBTweets) March 17, 2025
Comments
Please login to add a commentAdd a comment