Public Health Director
-
తగ్గేదేలే.. ఆస్పత్రికి కాదు.. సరాసరి అసెంబ్లీకే పోవాల.!
ఆయనో ప్రభుత్వ అధికారి. వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఆయన పనిచేస్తున్న శాఖను ఉపయోగించుకుని పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టేశారు. ఆయన చేసే కార్యక్రమాలు కూడా అప్పుడప్పుడూ వివాదస్పదమవుతున్నాయి. తాజాగా సీఏం కేసీఆర్ కాళ్లు మొక్కిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎమ్మెల్యే సీటు కోసం ఆ అధికారి పడరాని పాట్లు పడుతున్నారని సెటైర్లు పడుతున్నాయి. హెల్త్ డైరెక్టర్‌కు రాజకీయ ఆశలు తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్‌గా ఉన్న గడల శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని ఉబలాటపడుతున్నారు. కరోనా సమయంలో రాష్ట్రంలో ఆయన పేరు అందరికీ పరిచయమైంది. ఇక అప్పటినుంచి పొలిటికల్ ఏంట్రీ కోసం ఆరాటపడుతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారని టాక్. ఇప్పుడు కొత్తగూడెం పట్టణంలో ఎక్కడ చూసిన గడల శ్రీనివాసరావు ప్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఇక గులాబీ పార్టీ కండువా కప్పుకోవడమే తరువాయి అన్నట్లుగా తయారైంది పరిస్థితి. గడల చేస్తున్న హడావుడి చూసి ఏం జరుగుతుందో తెలియక సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సైలెంట్‌గా గమనిస్తున్నారు. అప్పుప్పుడు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు డిహెచ్ తీరుపై పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు.. ఎవరెన్ని డ్రామాలు వేసినా వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం టికెట్ తనకే ఇస్తారని చెబుతున్నారు వనమా. కఠోర పూజలు, మెడికల్ క్యాంపులు రెండు సంవత్సరాలుగా గడల శ్రీనివాసరావు నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. జీఏస్ఆర్ ట్రస్ట్ పేరుతో కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ.. జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయనే చేసే కార్యక్రమాలు కొన్ని వివాదస్పదమవుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. సుజాతనగర్ ప్రాంతంలోని చిన్న తాండాలో ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో గడల చేసిన మిరపకాయ పూజలు సంచలనం రెకెత్తించిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్ అయి ఉండి మూఢ నమ్మకాలను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. పూజ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ వివాదంతో కొన్ని రోజులు సైలెంట్ అయిన శ్రీనివాసరావు మళ్లీ లోకల్ గా కార్యక్రమాలు ప్రారంభించారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొని డిజే టిల్లు పాటకు డ్యాన్స్ వేయడంపై విమర్శలు చెలరేగాయి. ఇది కూడ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సర్.. సదా మీ సేవలో తెలంగాణలో ఒకేసారి 8 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను సీఏం కేసీఆర్ ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌కు వచ్చిన డాక్టర్ శ్రీనివాసరావు నిమిషం వ్యవధిలో రెండు సార్లు ముఖ్యమంత్రికి పాద నమస్కారం చేశారు. రెండు చేతులు జోడించి కేసీఆర్‌కు ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. కాని గడల శ్రీనివాసరావు చెబుతున్నదానిని కేసీఆర్ విన్నట్లుగా అనిపించలేదు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ వ్యవహార శైలిపై అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే టికెట్ కోసమే డిహెచ్ ఇలా చేస్తున్నారని ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడుకుంటున్నారట. ప్రతిపక్షాలు సైతం డిహెచ్ తీరును తప్పు పడుతున్నాయి. పదవికి రాజీనామా చేసి గులాబి కండువా కప్పుకుంటే మంచిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. డాక్టర్‌కు గట్టి పోటీ కొత్తగూడెంలో మళ్లీ పోటీ చేయాలని సిటింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కూడా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. మరోవైపు పొత్తుల్లో ఈ సీటు సీపీఐ కే వస్తుందని, తానే బరిలో దిగుతానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం మొన్నటి భేటీలో అన్నిచోట్లా సిటింగ్‌లకే సీట్లు ఇస్తామని ప్రకటించారు. మరి కొత్తగూడెంలో ఏం జరుగుతుందో చూడాలి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి. శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు పితృ సామానులని ఆయన పాద పద్మాలు తాకడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆదివారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడాన్ని సమర్థించుకున్నారు. ఒక్కసారి కాదు వందసార్లు బరాబర్ మొక్కుతానని అన్నారు. ఒక వ్యక్తి సేవ చేయడానికి వస్తే ఆ వక్తిని ఎలా బలహీన పరచాలి? ఎలా దూరంచేయాలి? అనే కుట్రలు చేస్తున్నారంటూ ఆయనను నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారిపై కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే, ఇటీవల ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిమిషం వ్యవధిలోనే డీహెచ్ రెండు సార్లు కేసీఆర్‌కు పాదాభివందనం చేసిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి తెలిసిందే. చదవండి: (కేసీఆర్ కాళ్లుమొక్కిన ఉన్నతాధికారి.. ఎమ్మెల్యే టిక్కెట్ కోసమేనా!) -
కేసీఆర్ కాళ్లుమొక్కిన ఉన్నతాధికారి.. ఎమ్మెల్యే టిక్కెట్ కోసమేనా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి. శ్రీనివాసరావు వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆయన ప్రవర్తనను పలువురు సీనియర్ అధికారులు తప్పుబడుతున్నారు. పదవుల కోసం ఇంతగా దిగజారతారా అంటూ ఆక్షేపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? తెలంగాణలో ఒకేసారి 8 కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం నాడు ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌కు వచ్చిన డాక్టర్ శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్‌కు పాద నమస్కారం చేశారు. అక్కడితో ఆగకుండా మరోసారి ముఖ్యమంత్రి కాళ్లుమొక్కారు. దీనికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. శ్రీనివాసరావు వ్యవహార శైలిని పలువురు అధికారులు ఆక్షేపించారు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. పరువు తీస్తున్నారు: ఆకునూరి మురళి శ్రీనివాసరావు కొత్తగూడెం అసెంబ్లీ టిక్కెట్ కోసమే కేసీఆర్ కాళ్లు పట్టుకున్నారని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి విమర్శించారు. ‘మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారు. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూశాను టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే. పదవిని దుర్వినియోగం చేస్తూ కొత్తగూడెంలో ఏదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నార’ని ఆకునూరి మురళి ట్వీట్ చేశారు. కేసీఆర్‌కు శ్రీనివాసరావు కాళ్లు మొక్కిన వీడియోను కూడా షేర్ చేశారు. శ్రీనివాసరావు కోరిక నెరవేరుతుందా? టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే టిక్కెట్ కోసం డాక్టర్ శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నట్టు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ తరపున పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సిట్టింగ్‌లకే టిక్కెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు కొత్తగూడెం టికెట్ పొత్తుల్లో భాగంగా సిపిఐ కి వెళ్తుందన్న ప్రచారం స్థానికంగా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం టికెట్ కోసం ఇప్పటినుంచే అన్ని ప్రయత్నాలు ప్రారంభించేశారట. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు కోరిక ఫలిస్తుందో, లేదో చూడాలని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. (క్లిక్ చేయండి: శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి అభినందన) -
ప్రజారోగ్య సంచాలకుడి అక్రమాలపై విచారణకు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు అక్రమాలపై విచారణ జరపాలని ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆయన అక్రమాలపై ఇప్పటికే లోకాయుక్తను ఆశ్రయించా నని, మార్చి 9న హాజరు కావాలని లోకాయుక్త సమన్లు జారీ చేసిందని తెలిపారు. మందుల కొనుగోలులో అక్రమాలు, కోవిడ్–19 మరణా ల సమాచారంలో తప్పుడు లెక్కలు, వైద్యుల బదిలీలు, పదోన్నతుల్లో అవక తవకలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని కోరారు. -
ఐదు కంటే ఎక్కువ కేసులొస్తే స్కూలు బంద్
సాక్షి, హైదరాబాద్: ఒక బడిలో ఐదు కరోనా కేసులు నమోదైతే, దాన్ని ఒక క్లస్టర్‌గా తీసుకొని కట్టడి చర్యలు చేపడతామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఐదు కంటే ఎక్కువగా కేసులు నమోదైతే ఆ పాఠశాలను నిర్ణీత సమయం వరకు మూసివేస్తారని చెప్పారు. వైరస్ సోకిన విద్యార్థులతో ఎంతమంది సన్నిహితంగా ఉన్నారనేది గమనించి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. వ్యాక్సిన్ తీసుకున్న టీచర్లకే అనుమతి పిల్లల్ని పాఠశాలలకు పంపించడంపై ఇప్పటికీ కొందరు తల్లిదండ్రుల్లో భయాందోళనలు ఉన్నా యి. కానీ ఆందోళన వద్దు. పిల్లలపై కరోనా ప్రభా వం తక్కువ. కాబట్టి నిరభ్యంతరంగా పాఠశాల లకు పంపించండి. ప్రత్యక్ష బోధన ద్వారా మాత్రమే విద్యకు సార్ధకత చేకూరుతుంది. అందరూ నిబంధనలను పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయొచ్చు. మరో కొత్త రకం, మరింత ఎక్కువ ప్రమాదకరమైంది వస్తే తప్ప మూడోదశ ఉధృతి రాదు. బోధన, బోధనేతర సిబ్బందిలో 95 శాతం మందికి ఇప్పటికే టీకాలు అందించాం. కాబట్టి వీరి నుంచి వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువ. మిగతావారిని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే బడిలోకి అనుమతించాలని ఆదేశాలిచ్చాం. విద్యార్థులు, ఉపాధ్యాయులు సహా ఎవ్వరూ మాస్కు ధరించకుండా తరగతి గదిలోకి ప్రవేశించకూడదు. లక్షణాలు కన్పించిన వెంటనే టెస్టు చేయించాలి లక్షణాలు కనిపించిన పిల్లలను పాఠశాలలు వెంటనే తల్లిదండ్రుల వద్దకు పంపించాలి. వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించేలా చూడాలని ఆదేశాలిచ్చాం. ఒకవేళ ఒక విద్యార్థిలో లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ విద్యార్థిని వేరే గదిలో కూర్చో బెట్టాలి. మిగతావారిని పరిశీలనలో ఉంచాలి. ఒకవేళ ఇంటి వద్ద లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు పాఠశాలకు పంపొద్దు. వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించాలి. బడి నుంచి వచ్చిన తర్వాత యూనిఫామ్‌ను విడిగా ఉంచాలి. చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవడం వంటివి చేయించాలి. పిల్లలు ఇంటికే పరిమితమై ఉండటం లేదు రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉందనుకుంటే, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సుమారు 60 లక్షల మంది వరకు ఉన్నారు. తరగతులు జరగక పోవడం వల్ల స్కూలుకు రాకపోయినా వీరంతా ఇంటికే పరిమితమై లేరు. ఇరుగుపొరుగు వారి ఇళ్లల్లో, పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు తిరుగుతూనే ఉన్నారు. పండుగలు జరుపుకుంటున్నారు. ఐసీఎంఆర్ సీరో సర్వే ప్రకారం పెద్దల్లో ఇప్పటికే 63 శాతం మంది కరోనా బారినపడ్డారు. పిల్లల్లోనూ 50 శాతానికి పైగా వారికి తెలియకుండానే ఇన్ఫెక్షన్ బారినపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో ఇటీవల మొహర్రం, బోనాలు వంటి పండుగలు ప్రజలు జరుపుకున్నారు. శుభ కార్యాలకు వందల సంఖ్యలో హాజరవుతున్నారు. కానీ ఎక్కడ కూడా భారీగా ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగలేదు. అందువల్ల తల్లిదండ్రులు భయపడనక్కర్లేదు. అన్నీ పరిశీలించి, జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే పాఠశాలలను తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. థర్డ్‌వేవ్ ఎదుర్కోవడానికి సిద్ధం ఐసీఎంఆర్, ఇతర సంస్థలు అక్టోబర్‌లో థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాలున్నాయని చెబుతు న్నాయి. కానీ అక్టోబర్‌లో కచ్చితంగా థర్డ్‌వేవ్ ఉధృతి వస్తుంద నడానికి ఎక్కడా శాస్త్రీయ ఆధారాల్లేవు. ఒకవేళ వచ్చినా ఎదుర్కోవ డానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో ప్రస్తుతం కోవిడ్ పూర్తిగా అదుపులోనే ఉంది. ప్రజలు కూడా నిబంధనలు పాటిస్తూ శుభ కార్యాలు, పండుగలు జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేసి దాదాపు రెండున్నర నెలలు దాటుతోంది. అయినా ఇప్పటికీ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు, మరణాల రేటు అత్యల్పంగానే నమోదవు తున్నాయి. పిల్లలకు సోకినా త్వరగా కోలుకుం టున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్యను పరిశీలిస్తే.. పిల్లల్లో ఒక ఏడాది నుంచి పదేళ్ల వరకు కరోనాకు గురైనవారు 3 శాతం మంది మాత్రమే. 10–20 ఏళ్ల వారిని తీసుకుంటే 10% మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తంగా 20 ఏళ్లలోపు వారు 13%, 20–60 ఏళ్ల మధ్య వయస్కులు అధికంగా 73% కరోనా బారినపడ్డారు. పిల్లలకు కరోనా సోకినా వారిలో తీవ్రత చాలా తక్కువగా ఉండి త్వరగా కోలుకుంటున్నారు. ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం కూడా చాలా స్వల్పంగా ఏర్పడింది. మరణాలైతే అస్సలే నమోదు కాలేదు. 1.80 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చాం... రాష్ట్రంలో ఇప్పటివరకు 1.80 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చాం. వచ్చే 15–20 రోజుల్లోనే ఈ సంఖ్య 2 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయన్నారు. జీహెచ్ఎంసీలో ఇప్పటికే 95 శాతం మందికి టీకాలు ఇచ్చాం. 60 శాతం కాలనీల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేశాం. దసరా నాటికి రాష్ట్రంలో అర్హులైన అందరికీ తొలిడోసు ఇచ్చేలా ప్రణాళిక రచించాం. సినిమాకెళ్లాలంటే టీకా తప్పనిసరి కానుంది పిల్లలకు సంబంధించి ఇప్పటికే జైడస్ క్యాడిలా టీకాను అనుమతించారు. 12 ఏళ్ల పైబడిన వారికి దీన్ని ఇస్తారు. ఇది ఈ నెలలో అందుబాటులోకి వస్తుంది. భవిష్యత్తులో రెండేళ్లు పైబడిన వారి కోసం భారత్ బయోటెక్స్ రూపొందిస్తున్న టీకా అక్టోబర్/ నవంబర్ నుంచి అందుబాటులోకి రావచ్చు. ఇతర దేశాల నుంచి ఇంకా అనేక రకాల వ్యాక్సి న్లు కూడా మన దగ్గరకు వస్తాయి. మాల్స్, సినిమా టాకీసులకు వెళ్లాలంటే టీకాలు పొంది ఉండాలనే నిబంధన త్వరలోనే రానుంది. -
Corona Second Wave: ప్రమాదం నుంచి బయటపడ్డాం!
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం నుంచి రాష్ట్రం బయటపడిందని, ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితి లేదని రాష్ట్ర ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్–19 పాజిటివిటీ రేటు 4.1 శాతంగా ఉందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచనల ప్రకారం 5 శాతం లోపు పాజిటివిటీ ఉంటే పరిస్థితి అదుపులో ఉన్నట్లేనని చెప్పారు. ఈ నెలాఖరులోగా కరోనా సెకండ్ వేవ్ దాదాపు తగ్గుముఖం పడుతుందని, జూన్ నెలాఖరుకల్లా సెకండ్ వేవ్ దాదాపు తగ్గిపోయే అవకాశాలున్నాయని వివరించారు. కరోనా నిర్ధారణపై మరింత దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారని, ఈక్రమంలో రాష్ట్రంలో నిర్ధారణ పరీక్షలను ప్రతిరోజూ లక్ష నుంచి లక్షన్నర మధ్య చేయనున్నట్లు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లోనే పరీక్షల సంఖ్య పెరిగేలా చూస్తామన్నారు. బుధవారం డైరెక్టరేట్‌లో వైద్య విద్య విభాగం సంచాలకులు రమేశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఓపీ, ఫీవర్ సర్వేలో లక్షణాలున్న వారికి కిట్లు ‘రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో సర్వేలు చేపడుతున్నాం. ఔట్ పేషెంట్ సర్వేలో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 1,518 కేంద్రాల్లో 13.05 లక్షల ఓపీని పరిశీలించగా.. 2,78,502 మందికి లక్షణాలున్నట్లు తేలింది. వీరిలో 2,57,277 మందికి కరోనా కిట్లు పంపిణీ చేశాం. ఫీల్డ్ ఫీవర్ సర్వే తొలి రౌండ్లో 33,374 బృందాలు రంగంలోకి దిగి పరిశీలించాయి. 1,01,28,711 ఇళ్లు తిరిగి సర్వే చేయగా.. 2,41,103 మందికి లక్షణాలున్నట్లు గుర్తించి 2,18,698 కిట్లు పంపిణీ చేశారు. తాజాగా రెండో రౌండ్లో 17,089 బృందాలు 46,70,358 ఇళ్లు సందర్శించాయి. 1,57,963 మందిలో లక్షణాలున్నట్లు గుర్తించి 93,129 కిట్లు పంపిణీ చేశారు..’అని శ్రీనివాసరావు తెలిపారు. హైరిస్క్ కేటగిరీకి తొలుత వ్యాక్సిన్లు ‘టీకాల పంపిణీని వ్యూహాత్మకంగా చేపడుతున్నాం. తొలుత హైరిస్క్ (సూపర్ స్ప్రెడర్స్) కేటగిరీలో ఉన్న వాళ్లను గుర్తించి వారికి వ్యాక్సిన్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నాం. ఈ నెల 28 నుంచి వారికి సమాచార ప్రసారాల శాఖ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతాం. రాష్ట్రంలో ప్రస్తుతం 250 ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలున్నాయి. వీటిని 1,200కు పెంచుతాం. ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 56 లక్షల టీకా డోసులు పంపిణీ: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 56 లక్షల టీకా డోసులు పంపిణీ చేశాం. ప్రస్తుతం 6.18 లక్షల కోవిషీల్డ్, 2.5 లక్షల కోవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. జూన్ మొదటి వారంలో మరో 2.5 లక్షల డోసులు రాష్ట్రానికి వస్తాయి. సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన వారికి ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్ చేపడతాం. క్యాబ్ డ్రైవర్లకు జీహెచ్ఎంసీ ద్వారా వ్యాక్సిన్లు వేస్తాం. ఈ నెలాఖరు నాటికి 3 లక్షల మందికి కోవాగ్జిన్ రెండో డోసు ఇవ్వాల్సి ఉంది..’అని తెలిపారు. పడకల సంఖ్య పెంచాం ‘గత వారానికి రాష్ట్రంలో 53 వేల బెడ్లు ఉంటే ఇప్పుడు వాటిని 55,120కి పెంచాం. ప్రస్తుతం 31,375 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రిపాలైన రోగులు 23,745 మంది ఉంటే వీరిలో 40 శాతం రోగులు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలకు చెందినవారే. ఐసీయూ బెడ్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో 612, ప్రైవేటులో 3,977 ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 4,589 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ పడకలు 9,718 అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 2,750 పడకలు ఉండగా, ప్రైవేటులో 6,968 బెడ్లు ఖాళీగా ఉన్నాయి..’అని శ్రీనివాసరావు వివరించారు. పోస్ట్ కోవిడ్ లక్షణాలపై దృష్టి: డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆస్పత్రిలో చేరి కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొందరికి ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి చెప్పారు. అలాంటి వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యస్థితి పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓపీ సేవలు అందిస్తామన్నారు. ‘బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో ప్రస్తుతం 240కి పైగా బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి. రోజూ 20 మందికి చొప్పున ఆపరేషన్లు చేస్తున్నాం. బోధనాసుపత్రుల్లో కూడా దీనికి చికిత్స చేయనున్నాం..’అని రమేష్‌రెడ్డి తెలిపారు. జూనియర్ డాక్టర్ల సమ్మె సరికాదు ప్రస్తుతమున్న హెల్త్ ఎమర్జెన్సీ సమయంలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడం సరికాదని, ఈ అంశంపై ముఖ్యమంత్రి సైతం సూచనలు చేశారని రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే జూనియర్ డాక్టర్లకు 15 శాతం స్టైపెండ్ పెంపు ఇచ్చామని, సీనియర్ రెసిడెంట్లకు కూడా 15 శాతం పెంపునకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకున్నారన్నారని తెలిపారు. వీరంతా సమ్మె విరమించి వైద్యసేవలు అందించాలని కోరారు. -
'సరిపడా నిల్వలున్నప్పుడే వ్యాక్సినేషన్'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతానికి 3 లక్షల కోవాగ్జిన్ డోసులు అవసరమని, కానీ వైద్య,ఆరోగ్య శాఖ వద్ద కేవలం 50 వేల డోసులు మాత్రమే ఉన్నాయని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు వెల్లడించారు. చాలినన్ని డోసులు లేకపోవడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వాయిదా వేశామన్నారు. టీకా డోసులు సంతృప్తికరంగా ఉన్నప్పుడు సమాచారమిచ్చి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని, అప్పటివరకు ఆగాల్సిందేనని స్పష్టంచేశారు. మంగళవారం కోఠిలోని తన కార్యాలయంలో వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కోవిడ్–19 వ్యాప్తి తగ్గుతోందని, సీఎం కేసీఆర్ తీసుకుంటున్న వ్యూహాత్మక కార్యాచరణతోనే ఇది సాధ్యమైందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పాజిటివిటీ, డెత్ రేటు తక్కువగా ఉందన్నారు. రికవరీ రేటు 90 శాతానికి పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చాలా పడకలు ఖాళీగా ఉన్నాయని, ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల బిల్లులు, చికిత్సపై ఇప్పటివరకు 26 ఫిర్యాదులు వచ్చాయని, తాజాగా నాలుగు ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఇందులో మాదాపూర్‌లోని ఓ ఆస్పత్రికి కోవిడ్–19 చికిత్స అనుమతిని రద్దు చేసినట్లు వివరించారు. కరోనాను ఎదుర్కోవడమంటే ఎక్కువ పరీక్షలు చేయడం కాదని, సకాలంలో చికిత్స చేయడమని తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా చెబుతోందని, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ విధానాన్ని అనుసరిస్తోందన్నారు. బ్లాక్ ఫంగస్ కొత్త వ్యాధి కాదని, వీటికి కోఠిలోని ఈఎన్టీ, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్స ఇస్తున్నట్లు వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి తెలిపారు. హౌస్‌సర్జన్, పీజీ డాక్టర్లకు ఉపకారవేతనాలు 15% పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. త్వరలో ప్రారంభం కానున్న రెండు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 604 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందు కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు -
ఫీవర్ సర్వేతో కోవిడ్‌కు చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ఫీవర్ సర్వే కారణంగా కోవిడ్ పాజటివ్ రేట్ తగ్గు ముఖం పడుతుందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు.. మొత్తం 21 వేల మంది 81 లక్షల ఇళ్లను సర్వే చేశారని తెలిపారు. కోవిడ్ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ హోం ఐసొలేషన్ కిట్లు ఇవ్వడం వల్ల వారంతా కోవిడ్‌ను జయించేందుకు అవకాశం ఏర్పడిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రుల్లో అడ్మిషన్ల సంఖ్య వారం రోజులుగా తగ్గుముఖం పట్టిందని చెప్పారు. త్వరలోనే 18 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం ఉందని వివరించారు. వ్యాక్సిన్ల కొరత, బ్లాక్‌ఫంగస్, ఆసుపత్రుల్లో బెడ్ల కొరత వంటి అంశాలపై మంగళవారం ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. సర్వేకు మంచి ఆదరణ ‘పదిహేనురోజుల క్రితం చేపట్టిన ఫీవర్ సర్వేకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇంట్లోనే ఉంటూ కరోనాను జయించేందుకు మేము ఇచ్చిన ఐసోలేషన్ కిట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్ నగరంతో పాటు అన్ని జిల్లాలు, గ్రామాల్లో 2 లక్షలకు పైగానే కిట్లు ఇచ్చాం. ఫీవర్ సర్వే తెలంగాణ ప్రభుత్వానికి ఒక టర్నింగ్ పాయింట్. అందుకే కేంద్ర ప్రభుత్వం మంగళవారం నుంచి ఈ ఐడియాను దేశవ్యాçప్తంగా అమలు చేస్తోంది. వ్యాక్సిన్లకు గ్లోబల్ టెండర్లు రాష్ట్రంలో 18–45 సంవత్సరాల వయసున్న వారు సుమారు 1.82 కోట్ల మంది ఉన్నారు. వీళ్లుకా కుండా మరో 25 లక్షల మంది ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. అంటే తెలంగాణలో సుమారు 2 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. దీనికి 4 కోట్ల డోసులు కావాలి. కానీ కేంద్రం ఇచ్చింది 4.90 లక్షలే. అందుకే వీటిని ముందుగా ఎవరికివ్వాలి? ఎప్పుడివ్వాలి? అనే విషయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నారు. త్వరలో దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో సీఎం మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. గ్లోబల్ టెండర్లను ఆహ్వానించి తద్వారా రాష్ట్రానికి కావాల్సినన్ని వ్యాక్సిన్ డోసులను తెచ్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో పాటు కొత్త వ్యాక్సిన్లు కూడా వస్తున్నాయి. స్పుత్నిక్, జాన్సన్ అండ్ జాన్సన్ అనేవి కూడా మన హైదరాబాద్‌లోనే తయారు కానున్నాయి. దీనిపై స్టేట్ టాస్క్‌ఫోర్స్‌ను మంత్రి కేటీఆర్ ఏర్పాటు చేశారు. వాళ్లు ఈ వ్యాక్సిన్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక 45 సంవత్సరాలు పైబడిన వారికి కేంద్రమే వ్యాక్సిన్ ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 45 సంవత్సరాల పైబడిన వారు 92 లక్షల మంది ఉన్నారు, వీరికి 1.85 కోట్ల డోసులు కావాలి. ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చింది కేవలం 57 లక్షల డోసులు మాత్రమే. రాష్ట్రంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ నిల్వలు లక్ష డోసులు మాత్రమే ఉన్నాయి..’ అని శ్రీనివాసరావు తెలిపారు. పడకలు మూడింతలు పెంచాం ‘ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ వేవ్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ, ప్రై వేటు ఆసుపత్రుల్లో బెడ్ల సామర్థ్యాన్ని పెంచాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16 వేలు, ప్రై వేటు ఆసుపత్రుల్లో 38 వేలు మొత్తం 54 వేల బెడ్లు ఏర్పాటు చేశాం. ఇలా ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తేæ సెకెండ్ వేవ్‌లో మూడింతలు పెంచాం. వీటిలో ఆక్సిజన్ బెడ్లు 21 వేలు, ఐసీయూ బెడ్లు 12 వేలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు 115కు, ప్రై వేటు ఆసుపత్రులు 1,100కు పెంచి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నాం. ఆక్సిజన్ కొరత లేదు సెకెండ్ వేవ్‌లో రోగుల తాకిడి ఉధృతం కావడంతో..రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోంది. రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదా సరఫరా అంతరాయం అనేది లేదు. ఆక్సిజన్ సరఫరాను ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది. ఉచితంగా బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ బ్లాక్ ఫంగస్ అనేది కొత్త వ్యాధి కాదు. దీనికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ వహించకూడదు. ముక్కు దిబ్బడగా ఉండటం, ముక్కు ద్వారా గాలి సజావుగా పీల్చుకోలేకపోవడం వంటివి దీని లక్షణాలు. ఇది ఎక్కువగా కోవిడ్‌ను జయించిన వాళ్లకు వస్తుంటుంది. ఈ సమస్యను ఎదుర్కొంటున్న వాళ్లు తక్షణం గాంధీ లేదా కోఠి ఈఎన్టీ ఆసుపత్రుల్లోని వైద్యులను సంప్రదించాలి. దీని మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ఇంజక్షన్ ధర రూ.3,500. వీటిని ఉచితంగా ఇస్తాం..’ అని శ్రీనివాసరావు వివరించారు. -
ఆస్పత్రులకు పరుగెత్తొద్దు..
సాక్షి, హైదరాబాద్: కరోనా విషమ పరిస్థితుల నుంచి బయటపడుతున్నామని, కేసుల్లో స్థిరత్వం వస్తోందని రాష్ట్ర ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు, వైద్యవిద్య డైరెక్టర్ రమేశ్‌రెడ్డి చెప్పారు. మే నెలాఖరు వరకు జాగ్రత్తలు పాటిస్తే పూర్తిగా బయటపడతామని.. కేసులు తగ్గుతున్నాయని అలసత్వం వహిస్తే మళ్లీ తిరగబెడుతుందని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బెడ్స్‌కు, ఆక్సిజన్‌కు ఎలాంటి కొరత లేదని, అనవసర ఆందోళన వీడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకోవడం, సాధారణంగా మందులతో తగ్గిపోయేదానికి భయంతో ఆస్పత్రులకు పరుగెత్తడం మానుకోవాలని సూచించారు. 85 నుంచి 90 శాతం కరోనా బాధితులు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే.. డాక్టర్ల సూచనలతో బయటపడొచ్చని తెలిపారు. లక్షణాలు ఉంటేనే టెస్టులకు.. లక్షణాలు లేకుండా కోవిడ్ టెస్ట్‌లకు వెళ్తే.. అక్కడున్న వారితో కరోనా సోకే ప్రమాదం ఉందని శ్రీనివాసరావు హెచ్చరించారు. కళ్లలో మంట, ఎర్రబడటం, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు, విరేచనాలు, రుచి, వాసన కోల్పోవడం వంటి కరోనా లక్షణాలు ఉంటేనే పరీక్షల కోసం వెళ్లాలన్నారు. లక్షణాలు లేకున్నా టెస్టులకు వెళ్లడం, అవసరం లేకున్నా ఆస్పత్రుల్లో చేరడం వల్లే.. టెస్టు కిట్లు, బెడ్లకు కొరత ఏర్పడుతోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 108 అంబులెన్సులు 450 ఉంటే.. వాటిలో 150 కేవలం కోవిడ్ బాధితుల కోసం ఉపయోగిస్తున్నామని శ్రీనివాసరావు వివరించారు. 108 వాహనాల్లో వెళ్తే దగ్గర్లో ఎక్కడ బెడ్స్ ఉంటే ఆ ఆస్పత్రికి బాధితులను తీసుకెళ్తాయని తెలిపారు. కరోనా బాధితులు సలహాలు, సూచనల కోసం 104 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రులపై ఫిర్యాదులకు 91541 70960 నంబర్‌కు వాట్సాప్ చేయవచ్చని వివరించారు. రాష్ట్రంలో టెస్టులు ఎందుకు తగ్గాయన్న ప్రశ్నకు శ్రీనివాసరావు స్పందిస్తూ.. దేశంలో రోజుకు కేవలం 17 లక్షల కిట్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని, కిట్ల లభ్యత ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చివరి నిమిషంలో రావడంతోనే మరణాలు గాంధీ, టిమ్స్, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులకు రోగులు పరిస్థితి విషమించిన తర్వాతే వస్తుండటంతో.. ఆ ఆస్పత్రుల్లో మరణాలు కనిపిస్తున్నాయని వైద్యవిద్య డైరెక్టర్ రమేశ్‌రెడ్డి చెప్పారు. వైద్య సిబ్బంది ఏడాదిన్నరగా విరామం లేకుండా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదన్నారు. బెడ్స్ కోసం దూరంలో ఉండే కార్పొరేట్ ఆస్పత్రుల దాకా వెళ్లకుండా.. దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని రకాల మందులు ఉన్నాయన్నారు. రోగులు జిల్లా ఆస్పత్రుల నుంచి అనవసరంగా హైదరాబాద్‌లోని గాంధీ, టిమ్స్, వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రులకు రావొద్దని.. ఇక్కడ చేసే చికిత్సనే జిల్లా ఆస్పత్రుల్లోనూ ఉంటుందని వివరించారు. అనవసరంగా ఆస్పత్రుల్లో ఉంటూ ఆక్సిజన్ పెట్టుకోవడం క్రిమినల్ వేస్టేజీ అని వ్యాఖ్యానించారు. -
జనంలోకి వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాన్య ప్రజలకు కరోనా టీకా కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం అవుతుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రాధాన్యంగా 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45–59 ఏళ్ల మధ్య వయసులోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా అందజేస్తామని ఆయన ప్రకటించారు. వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డితో కలసి డాక్టర్ శ్రీనివాసరావు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సోమవారం లాంచనంగా సాధారణ జనానికి టీకా కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. ఎంపిక చేసిన 48 ప్రభుత్వ, 45 ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ ఉంటుందని తెలిపారు. ఒక్కో కేంద్రంలో 200 మంది చొప్పున 18,200 మందికి టీకా వేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్‌లోనే ప్రారంభం అవుతుందని, రెండో తేదీ నుంచి పూర్తిస్థాయిలో టీకా కార్యక్రమం ఉంటుందని వివరించారు. మున్ముందు వెయ్యి కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. రెండు ప్రాధాన్య వర్గాలకు నాలుగైదు నెలలపాటు టీకా కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. రెండో డోస్ కూడా అదే కేంద్రంలో వేస్తామన్నారు. ఆ మేరకు షెడ్యూల్ ఖరారు చేస్తామని వెల్లడించారు. వెంటనే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జారీచేస్తామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. సాధారణ ప్రజల్లో 50 లక్షల మంది రెండు ప్రాధాన్య వర్గాలకు టీకాలు వేస్తామన్నారు. ‘ధ్రువీకరణ’ సమర్పించాలి... దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎంబీబీఎస్ డాక్టర్ లేదా ఆపై స్థాయి వైద్యుడి నుంచి తాము జారీ చేసే నమూనా ఆధారంగా ధ్రువీకరణ పత్రం సమర్పించాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దాన్ని కోవిన్ యాప్‌లో అప్లోడ్ చేశాకే టీకా వేస్తామని తెలిపారు. 20 రకాల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేస్తామన్నారు. లబ్ధిదారులు వారంలోగా యాప్‌లో రిజిస్ట్రేషన్‌తోపాటు దగ్గరలో ఉన్న బూత్‌కు నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకొని టీకా పొందవచ్చన్నారు. అన్ని టీకాలు సురక్షితమేనని, ఎవరికి ఏ కంపెనీ టీకా ఇస్తామనేది బయటకు వెల్లడించబోమని ఆయన చెప్పారు. 45–59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సర్టిఫికెట్లు ఇచ్చేలా అనెక్జర్–1బీ కాపీ ఇంటర్నెట్లోనూ, కోవిన్ యాప్‌లోనూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆ ఫార్మాట్‌ను ఆధారం చేసుకొని వైద్యులు సర్టిఫికేట్ ఇస్తారని శ్రీనివాసరావు వివరించారు. కోవిన్ 2.0 వెర్షన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం నుంచే అందుబాటులోకి వచ్చిందని, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సోమవారం టీకా ఇస్తామన్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి కూడా అదే రోజు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ప్రతి సెంటర్లోనూ సాధారణ ప్రజలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులకు కూడా టీకా వేస్తామన్నారు. నిర్దేశించిన రోజున టీకా వేయించుకోలేనివారు తదుపరి రీ షెడ్యూల్ చేసుకోవచ్చన్నారు. జ్వరం లేదా ఒళ్లు నొప్పులు సాధారణమే... టీకా వేసుకున్నాక జ్వరం లేదా ఒళ్లు నొప్పులు ఉండటం చాలా మందిలో సహజమేనని డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఎవరికైనా టీకా వేసిన అరగంటలోనే తీవ్ర దుష్ప్రభావాలు కనిపిస్తాయని, కాబట్టి వారు అరగంటపాటు తమ పరిశీలనలోనే ఉండాలన్నారు. ఇంటికి వెళ్లాక ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సమీప ఆసుపత్రికి వెళ్లాలని, లేకుంటే 104 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. అన్ని వసతులున్న ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనే టీకా వేస్తామన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టీకా కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బుధ, ఆదివారాల్లో టీకాలు వేయరని, ప్రైవేటులో మాత్రం వారమంతా వేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. దశలవారీగా కేంద్రాల పెంపు... వ్యాక్సినేషన్ ప్రక్రియ కొద్ది సెంటర్లతో ప్రారంభించి దశలవారీగా విస్తరిస్తామని డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు. మున్ముందు 863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 85 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), 19 ఏరియా ఆసుపత్రులు, 29 జిల్లా ఆసుపత్రుల్లో, 9 బోధనాసుపత్రుల్లో కరోనా టీకా వేస్తామన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న 215 ప్రైవేటు ఆసుపత్రులను టీకా వేసేందుకు గుర్తించామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా ఉచితమని, ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా ధర రూ. 150, సర్వీస్ చార్జీ రూ. 100 వరకు వసూలు చేసుకోవడానికి కేంద్రం అనుమతించిందన్నారు. అంతకంటే ఎక్కువ వసూలు చేయడానికి వీల్లేదన్నారు. అందుబాటులో డాక్టర్: డీఎంఈ టీకా కేంద్రాల్లో లబ్దిదారులు వేచి ఉండే గది వద్ద ఒక డాక్టర్, టీకా వేశాక అరగంట సేపు పరిశీలనలో ఉండే చోట మరో డాక్టర్ అందుబాటులో ఉంటారని డీఎంఈ రమేష్‌రెడ్డి తెలిపారు. రెండో ఫేజ్ కరోనా వ్యాక్సిన్ రెండు ప్రాధాన్య వర్గాలతో ప్రారంభం అవుతుందన్నారు. తొలుత కొన్నిచోట్ల మాత్రమే టీకా ప్రారంభిస్తామన్నారు. ఒకేసారి జనం పోటెత్తకుండా ఉండేందుకు కొన్ని సెంటర్లలోనే ప్రారంభిస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు అంగీకరించాయన్నారు. ఈ మేరకు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ప్రభుత్వమే టీకాలను సరఫరా చేస్తుందన్నారు. రాష్ట్ర టీకా కేంద్రం నుంచి జిల్లా కోల్డ్‌చైన్ పాయింట్లకు వ్యాక్సిన్లను సరఫరా చేసి వారికి ఇస్తామన్నారు. అంతకుముందే వారు టీకాలకు డబ్బులు చెల్లించి రసీదు తీసుకుంటారని, ఆ మేరకు వాటికి పంపిణీ జరుగుతుందన్నారు. 29–42 రోజుల మధ్య రెండో డోసు కరోనా రెండో డోసును తొలి డోసు తీసుకున్న 28వ రోజున లబ్ధిదారులు తీసుకోవాలన్న నిబంధన ఇప్పటివరకు ఉండగా కేంద్ర ప్రభుత్వం దాన్ని తాజాగా మార్చింది. తొలి డోసు వేసుకున్న 29వ రోజు నుంచి 42వ రోజు మధ్య ఎప్పుడైనా లబ్ధిదారులు రెండో డోసు తీసుకోవచ్చని తెలిపింది. అలాగే ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది ఇళ్లకు వెళ్లి వ్యాక్సిన్ వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆసుపత్రికి రావల్సిందేనని తేల్చిచెప్పింది. ఎవరైనా ఆసుపత్రికి వచ్చే పరిస్థితి లేకపోతే వారిని అంబులెన్స్‌లో తీసుకురావాలని సూచించింది. 50 లక్షలు: టీకాలు పొందబోయే సాధారణ ప్రజానీకంలోని రెండు ప్రాధాన్య వర్గాల వారి సంఖ్య. 4.43 లక్షలు: జనవరి 16 ఇప్పటివరకు టీకా వేసుకున్న వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్ల సంఖ్య. (మొదటి డోస్ 2.95 లక్షల మంది, రెండో డోస్ 1.47 లక్షల మంది) 215: టీకా వేసేందుకు గుర్తించిన ఆరోగ్యశ్రీ జాబితాలోని ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య. టీకాలు ఇచ్చే కేంద్రాలు... 863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 85 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ) 19 ఏరియా ఆసుపత్రులు 29 జిల్లా ఆసుపత్రులు 9 బోధనాసుపత్రులు 215 ప్రైవేటు ఆసుపత్రులు నేటి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇలా... ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 45 ప్రైవేటు ఆసుపత్రులు 48 ప్రభుత్వ ఆసుపత్రులు ఒక్కో కేంద్రంలో 200 మంది చొప్పున 18,600 మందికి టీకాలు -
తెలంగాణలో ‘ప్రైవేట్’ టీకా రేటెంతో..?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేసే కరోనా టీకాకు ఎంత ధర ఖరారు చేస్తారన్న దానిపై అన్ని వర్గాల ప్రజల్లో చర్చ మొదలైంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ వర్గాలకు చెందినవారు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న 236 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా టీకా వేయించుకోవడానికి అవకాశం కల్పించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తప్ప ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా వేసేందుకు అనుమతి లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు స్పష్టం చేశా యి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు చెల్లించి టీకా తీసుకోవాలని తెలిపాయి. అంతమాత్రాన వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్లోకి వచ్చినట్లుగా భావించకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకా ధర ఎంత ఉండవచ్చనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే రూ.300 నుంచి రూ.400 మధ్య ఉండే అవకాశముందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై నేడో రేపో స్పష్టత వస్తుందన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మాత్రమే ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ కనుసన్నల్లోనే ప్రైవేట్ వ్యాక్సినేషన్! ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో టీకా కార్యక్రమాన్ని ఎవరు పర్యవేక్షిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే ఆయా ఆసుపత్రులకు ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్ నుంచే టీకాలు సరఫరా అవుతాయా లేక నేరుగా కంపెనీల నుంచే వెళతాయా అన్నదానిపైనా స్పష్టత లేదు. దీనిపై త్వరలోనే కేంద్రం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వస్తాయని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కోవిన్ యాప్‌ను ఆధునీకరించే పనిలో ఉంది. సాంకేతిక సమస్యలను పరిష్కరించి, కొన్ని మార్పులు చేర్పులతో కోవిన్ యాప్ రెండో వెర్షన్‌ను తీసుకురానుంది. అది నేడో రేపో అందుబాటులోకి రానుంది. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా వారికి సరఫరా అయిన వ్యాక్సిన్ వివరాలు తప్పనిసరిగా యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అర్హులైన లబ్ధిదారుల వివరాలను యాప్‌లో నమోదు చేశాకే టీకా వేయాలి. అలాగే ఏరోజు ఎన్ని టీకాలు వేశారో ఇంకెన్ని మిగిలాయో నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రైవేట్‌లోనూ పకడ్బందీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని, దీన్ని పర్యవేక్షించేందుకు కొందరు అధికారులను నియమిస్తామని కూడా ఉన్నతాధికారులు చెబుతున్నారు. టీకా వేసే సిబ్బందికి ఈ మేరకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కేసులు నమోదైనా వెంటనే ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. టీకా ఉచితంగా తీసుకోండి ప్రైవేట్‌లో డబ్బులకు కరోనా టీకా వేస్తారు కాబట్టి, లబ్ధిదారులు ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వేసే టీకాలనే తీసుకోవాలి. కిందిస్థాయి పీహెచ్‌సీలు మొదలు గాంధీ, ఉస్మానియా వంటి పెద్దాసుపత్రుల వరకు దాదాపు 1,250కు పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా అందుబాటులో ఉంది. మున్ముందు రాష్ట్రంలో దాదాపు 4,500కు పైగా ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ టీకా అందుబాటులో ఉంచుతాం. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు -
రాష్ట్రంలో కొత్త వైరస్ ప్రభావం లేదు!
కొత్త రకం కరోనా వైరస్‌కు సంబంధించి రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, రాష్ట్రంలోకి ఇంకా కొత్త వైరస్ రాలేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కొత్త వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. -పబ్లిక్‌హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సాక్షి, హైదరాబాద్: కొత్తరకం కరోనా వైరస్‌కు సంబంధించి రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, రాష్ట్రం లోకి ఇంకా కొత్త వైరస్ రాలేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కొత్త వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. బ్రిటన్‌లో గుర్తించిన కొత్తరకం వైరస్‌పై కేంద్ర వైద్య, పౌర విమానయాన శాఖల ఆదేశాల మేరకు అలర్ట్ అయ్యామని, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో వైద్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. సోమవారం బ్రిటన్ నుంచి ఏడుగురు ప్రయాణికులు హైదరాబాద్ రాగా, వారందరికీ నెగెటివ్ వచ్చిందని తెలిపారు. ఈ నెల 15 నుంచి 21 మధ్య బ్రిటన్ నుంచి 358 మంది హైదరాబాద్‌కు వచ్చారని తెలిపారు. ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చిన వారు ఆరోగ్య శాఖకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. గత వారం రోజులుగా విదేశాల నుంచి వచ్చిన వారు 040–24651119 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. వారికి కొత్త వైరస్ సోకిందా లేదా అన్నది పరీక్షల్లో తేలుతుందన్నారు. నెగెటివ్ వచ్చినా కూడా ప్రయాణికులను 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతామన్నారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్‌రెడ్డి, డబ్ల్యూహెచ్‌వోకు చెందిన డా.పుట్రాజు తదితరులు ఈ కార్యకమంలో పాల్గొన్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు.. కొత్త రకం వైరస్ విషయంలో రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులపై ప్రభుత్వ శాఖలన్నింటితో కలసి యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. కొత్త వైరస్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. అత్యంత తక్కువ స్థాయిలో యాక్టివ్ కేసులు నమోదవుతున్నాయని, గత నాలుగు వారాలుగా కరోనా కేసుల తీవ్రత చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రజల మద్దతు, సహకారంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్య శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. చదవండి: (కరోనా కొత్త అవతారం!) పండుగల సమయంలో జాగ్రత్త.. నూతన సంవత్సర వేడుకలు ఇంటి సభ్యులతోనే జరుపుకోవాలని, బయటి వేడుకల్లో పాల్గొనవద్దని కోరారు. పండుగల సందర్భంగా విందులు, వినోదాలు జరుపుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రాబోయే క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండుగలకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నాలుగైదు వారాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, దీని పంపిణీకి 10 వేల మందిని సిద్ధం చేశామన్నారు. మూడు కోట్ల వ్యాక్సిన్ డోసులు భద్రపరిచేం దుకు కోల్డ్ స్టోరేజీ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. కుటుంబ సభ్యుల మధ్యనే పండుగలు జరుపుకోవాలని, కొత్త వ్యక్తులు, అపరిచితులతో జరుపుకోవద్దని కోరారు. రాబోయే 2 వారాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉండాలన్నారు. పబ్‌లు, రెస్టారెంట్ల వంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదన్నారు. పబ్‌లలో యువతీ, యువకులు జాగ్రత్తలు పాటించడం లేదని, వారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించ కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పుణేకు రెండు శాంపిళ్లు ఇటీవల బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు కొందరు ప్రయాణికులు వచ్చారు. వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అది కొత్త రకపు కరోనా వైరసా కాదా.. అన్న దానిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్లో అనుమానాలు తలెత్తాయి. దీంతో వారి శాంపిళ్లను మరోసారి క్షుణ్నంగా పరీక్షించే నిమిత్తం ఫుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. సాధారణ ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో సరైన ఫలితాలు రావచ్చు.. రాకపోవచ్చు. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కొత్త వైరస్ బయట పడకపోవచ్చని అంచనా. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ వైరస్ సంచలనం కావడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. చదవండి: (బ్రిటన్ నుంచి ముంబైకు ఐదు విమానాలు!) కొత్త మ్యుటేషన్లు వస్తూనే ఉంటాయి: డీఎంఈ ప్రతి వైరస్‌లో కొత్త కోణాలు, మ్యుటేషన్లు, వేరియంట్లూ వస్తూనే ఉంటాయని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్‌రెడ్డి తెలిపారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా.. తక్కువ తీవ్రత ఉంటుందని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా కట్టడిలో రాష్ట్రం ఎంతో విజయం సాధించిందని చెప్పారు. వైరస్ విషయంలో ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే టెస్టులు చేయించుకోవాలని కోరారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో కోవిడ్ ప్రభావం తగ్గిందనే భావన ప్రజల్లో ఏర్పడి, భౌతికదూరం పాటించట్లేదని తెలిపారు. -
కొత్త కరోనా: తెలంగాణ సర్కార్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: బ్రిటన్‌లో కరోనా తీవ్రరూపం దాల్చడంతో తెలంగాణ అప్రమత్తమైంది. యూకే ప్రయాణికులను ట్రాక్ చేస్తున్నామని, వారం రోజుల్లో యూకే నుంచి 358 మంది వచ్చినట్టు గుర్తించామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. యూకే నుంచి వచ్చిన వారు సమాచారం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. నిన్న యూకే నుంచి వచ్చిన వారికి టెస్టులు చేశామని, గత వారం రోజులుగా వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామని పేర్కొన్నారు. (చదవండి: భారత్‌లో కొత్త రకం కరోనా ఎంట్రీ!) సౌదీ అరేబియా సహా కొన్ని దేశాలకు కొత్త వైరస్ సోకిందని.. తెలంగాణలో ఇప్పటి వరకు కొత్త వైరస్ లేదని తెలిపారు. కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తోందని.. మరణాలు, తీవ్ర లక్షణాలు మాత్రం చాలా స్వల్పంగా ఉన్నాయని పేర్కొన్నారు. కొత్త వేరియంట్ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విందులు, వినోదాలకు దూరంగా ఉండాలని, క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నాలుగైదు వారాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు.(చదవండి: ‘బ్రిటన్’ జర్నీపై ప్రత్యేక నిఘా) -
33 వేల మందితో ‘కంటి వెలుగు’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం కోసం ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. అందుకోసం వైద్య ఆరోగ్య యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తోంది. అత్యంత సున్నితమైన కార్యక్రమం కావడంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేసింది. రైతుబంధు చెక్కుల పంపిణీ ఎలా నిర్వహించారో అలాగే కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ‘కంటి వెలుగు’కార్యక్రమాన్ని నడిపిస్తున్న ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావును ‘సాక్షి’ఇంటర్వ్యూ చేసింది. వివరాలివీ.. సాక్షి: కంటి వెలుగు లక్ష్యాలేంటి? శ్రీనివాసరావు: ‘అంధత్వ రహిత తెలంగాణ’ దిశగా సర్కారు చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగు. దీనిద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. అవసరమైన వారందరికీ ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తాం. ఉచిత కంటి శస్త్ర చికిత్సలు కూడా చేస్తాం. సాధారణ కంటి వ్యాధులున్న వారికి మందులను అందజేస్తాం. సాక్షి: ఎంతమందికి కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించారు? శ్రీనివాసరావు: రాష్ట్రంలోని మూడున్నర కోట్ల జనాభాకు పరీక్షలు చేస్తాం. అందులో దాదాపు 40 లక్షల మందికి కంటి అద్దాలు అవసరమని అంచనా వేశాం. అలాగే 3 లక్షల మందికి శస్త్ర చికిత్సలు అవసరం అవుతాయని భావిస్తున్నాం. శస్త్ర చికిత్సల కోసం 114 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను, స్వచ్ఛంద సంస్థ లను గుర్తించాం. మొత్తం కార్యక్రమాన్ని కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ద్వారా అమలుచేస్తాం. ప్రపంచంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఇంత భారీగా సామూహిక కంటి పరీక్షల కార్యక్రమం జరుగుతోంది. ఈ నెల 15 నుంచి కంటి వెలుగు ప్రారంభం కానుంది. 6 నెలలపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. సాక్షి: ఎంతమంది వైద్య సిబ్బంది పాల్గొంటారు? శ్రీనివాసరావు: దాదాపు 33 వేల మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందులో 24 వేల మంది ఆశ కార్యకర్తలు, ఏడు వేల మంది ఏఎన్ఎంలు ఉన్నారు. మొత్తం 799 బృందాలను ఏర్పాటు చేశాం. అత్యవసర సేవల కోసం అదనంగా మరో 113 బృందాలను సిద్ధంగా ఉంచాం. అందులో 940 మంది వైద్యాధికారులు, వెయ్యి మంది కంటి వైద్య నిపుణులు ఉంటారు. వారంతా శిక్షణ పొందినవారే. నిరంతరం కంటి సమస్యతో బాధపడే వారికోసం 150 విజన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాం. సాక్షి: ఎలా నిర్వహిస్తారు? శ్రీనివాసరావు: గ్రామీణ ప్రాంతాల్లో గ్రామం వారీగా, హైదరాబాద్, ఇతర పట్టణ ప్రాంతాల్లో వార్డుల వారీగా కంటి శిబిరాలను నిర్వహిస్తాం. ప్రతి శిబిరంలో ఒక వైద్యాధికారి, కంటి వైద్య నిపుణుడు, ఏఎన్ఎం, సూపర్వైజర్లు, ఆశ కార్యకర్తలు ఇలా 6–8 మంది సహాయక సిబ్బంది ఉంటారు. ప్రతి బృందానికి ఒక వాహనాన్ని సమకూర్చుతున్నాం. ఒక శిబిరంలో రోజుకు గ్రామీణ ప్రాంతంలోనైతే దాదాపు 250 మందికి, పట్టణ ప్రాంతాల్లో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తాం. 40 శాతం మందికి అద్దాలు లేదా శస్త్రచికిత్సలు అవసరమవుతాయని అంచనా వేశాం. కంటి శిబిరాలను నిర్వహించే గ్రామాల షెడ్యూల్‌ను తయారుచేశాం. అందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తాం. జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గ్రామాల్లోనూ అవగాహన కల్పిస్తాం. ఎప్పటికప్పుడు సమాచారం కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నాం. సాక్షి: సమన్వయం ఎలా చేస్తారు? ప్రైవేటు ఆసుపత్రుల భాగస్వామ్యం? శ్రీనివాసరావు: జిల్లా, మండల స్థాయిలో ప్రధాన శాఖలను భాగస్వాములను చేయాలని జిల్లా కలెక్టర్లను కోరాం. కంటి వెలుగును విజయవంతం చేసేందుకు మంత్రి లక్ష్మారెడ్డి ఇప్పటికే ప్రజాప్రతినిధులకు లేఖలు రాశారు. ప్రైవేటు కంటి ఆసుపత్రులు ఏవైనా ఉంటే ఆరోగ్యశ్రీ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించాం. వారి సేవలను ఉపయోగించుకుంటాం. 30 జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లోని కంటి వైద్య విభాగాలను, హైదరాబాద్‌లోని సరోజినీ కంటి ఆసుపత్రిని, వరంగల్‌లోని ప్రాంతీయ కంటి ఆసుపత్రిని బలోపేతం చేస్తున్నాం. -
చాంతాడులా చిట్టా
50 మంది అరెస్ట్‌కు రంగం సిద్దం పక్కదారి పట్టింది రూ.10కోట్లు పైమాటే. అప్పటి ఏడీఎంహెచ్‌వో, పబ్లిక్ హెల్త్ డెరైక్టర్‌తో సహా వైద్యులూ నిందితులే... అరెస్టయిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వైద్య ఆరోగ్యశాఖను కుదిపేస్తున్న ట్రెజరీ కుంభకోణం ట్రెజరీ కుంభకోణం వైద్య, ఆరోగ్యశాఖను కుదిపేస్తోంది. స్వాహా రాయుళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏ క్షణాన్న ఎవరి అరెస్ట్ వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళన వారి వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఇందులో పాత్రధారులుగా ప్రజారోగ్యశాఖ, వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సైతం ఉన్నట్టుగా గుర్తించారు. నిందితుల చిట్టా చాంతాడులా సాగుతోంది. రూ.10కోట్ల మేర పక్కదారిపట్టినట్టు భోగట్టా. విశాఖపట్నం: రాష్ర్ట వ్యాప్తంగా సంచలనమైన చిం తపల్లి ఉపఖజానా కుంభకోణంపై పోలీసులు సాగి స్తు న్న విచారణలో వెలుగుచూస్తున్న వాస్తవాలు విచారణా ధికారులనే విస్మయానికి గురిచేస్తున్నాయి. పీ హెచ్సీల్లో పనిచేసే కాం ట్రాక్టు ఉద్యోగుల జీత భత్యాల బడ్జెట్లో నకి లీ బిల్లులు సృష్టించి 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.3.6 కోట్లు పక్కదారిపట్టించారంటూ ఖజానాశాఖ డీడీ ఎం.గీతాదేవి గతేడాది నవంబర్ 27న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక విచారణ అనంతరం జనవరి 29న ఈ కేసులో ముగ్గుర్ని అరెస్ట్ చేసి రూ.1.71కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో సూత్రధారులు వీరైనప్పటికీ పాత్రధారులు ఎంతోమంది ఉన్నారని..వారిలో ప్రజారోగ్యశాఖ, వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సైతం ఉన్నట్టుగా గుర్తించారు. 2009-10 నుంచి 2014-15 వరకు బడ్జెట్ కేటాయింపులు..చెల్లింపులకు సంబంధించి లోతైన పరిశీలన జరిపితే ఏకంగా రూ.10కోట్ల వరకు పక్కదారిపట్టినట్టుగా పోలీసులు గుర్తించినట్టు తెలియ వచ్చింది. ఇప్పటికే అరెస్ట్యన చింతపల్లి ఉపఖజనా కార్యాలయ సీనియర్ సహాయకుడు పెద అప్పలరాజుతో పాటు విశాఖలోని రాణిచంద్రమతిదేవి ఆస్పత్రిలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సాగిన సింహాచలం, పాడేరు అదనపు డీఎంఅహెచ్వో కార్యాల యంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పల్లాసంజీవరావులను పోలీసులు అరెస్ట్ చేయగా, వీరిలో అప్పలరాజుపై అరెస్టయిన రెండురోజులకే ఆశాఖ సస్పెండ్ వేటు వేసింది. సాగిసింహాచలం, పల్లా సంజీవరావులను సస్పెండ్ చేస్తూ ప్రాంతీయ వైద్యఆరోగ్యశాఖడెరైక్టర్ సోమరాజు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మరోపక్క ఈ కేసును ఛాలెంజ్గాతీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అప్పటి డీఎంహెచ్‌వోతో పాటు ప్రజారోగ్యశాఖ డెరైక్టర్‌తో సహా 50 మందికి పైగా వైద్యఆరోగ్యశాఖకు చెందిన అధికారులు..సిబ్బంది ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. దారిమళ్లిన సొమ్ము ఏఏ ఖాతాలకు జమైంది. ఏవిధంగా జమైంది ఆరా తీశారు. డీడీ, చెక్కు నంబర్లతో సహా బ్యాంకుల వారీగా జాబితాలను సేకరించారు. కొంతమంది ఈ కేసుతోసంబంధం లేకపోయినా వారి అకౌంట్లకు ఈ నిధులు జమ చేసి వారి ద్వారానే డ్రా చేయించి అవినీతిచేపలు స్వాహా చేసినట్టుగా గుర్తించారు. అయినప్పటికీ ఈ సొమ్ము ఎవరెవరి ఖాతాలో జమైందో వారందరినీ నిందితుల జాబితాలో చేరుస్తున్నారు. ఈ చిట్టా ఏకంగా ఇప్పటికే 50కు చేరినట్టుగా సమాచారం. జాబితాలో ఏజెన్సీ పరిధిలోని నలుగురు మెడికల్ ఆఫీసర్లు, ఆరడజను మంది స్టాఫ్‌నర్సులు, ఐదుగురు సీనియర్ అసిస్టెంట్లతో పాటు వివిధ గ్రామాలకు చెందిన వీఆర్వోలు ఉన్నట్టుగా సమాచారం. కేసులో కీలకసూత్రధారులైన అప్పలరాజు, సింహాచలం, సంజీవ్‌కుమార్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నట్టుగా తెలియవచ్చింది. ఇప్పటికే అకౌంట్లలో సొమ్ములు జమైన వ్యవహారంపై లోతైన విచారణ చేపట్టారు. త్వరలోనే ఈ కేసులో మలివిడత అరెస్టలుంటాయని పోలీసుఅధికారులు చెబుతున్నారు.అప్పలరాజును ఇరికించి ట్రెజరీలో మిగిలిన అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనేవాదన బలంగా వినిపిస్తోంది. అలాగే ప్రజారోగ్యశాఖ, వైద్య ఆరోగ్యశాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు సైతం ఈకేసు నుంచి తప్పించుకునేందుకు రాజకీయంగా పావులు కదుపుతున్నట్టు తెలియవచ్చింది.