తెలంగాణలో ‘ప్రైవేట్‌’ టీకా రేటెంతో..? | Discussion Started On Cost Of Covid Vaccine In Private Hospitals | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ‘ప్రైవేట్‌’ టీకా రేటెంతో..?

Published Fri, Feb 26 2021 2:57 AM | Last Updated on Fri, Feb 26 2021 12:50 PM

Discussion Started On Cost Of Covid Vaccine In Private Hospitals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వేసే కరోనా టీకాకు ఎంత ధర ఖరారు చేస్తారన్న దానిపై అన్ని వర్గాల ప్రజల్లో చర్చ మొదలైంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ వర్గాలకు చెందినవారు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న 236 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా టీకా వేయించుకోవడానికి అవకాశం కల్పించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు తప్ప ఇతర ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో టీకా వేసేందుకు అనుమతి లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు స్పష్టం చేశా యి. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో డబ్బులు చెల్లించి టీకా తీసుకోవాలని తెలిపాయి.

అంతమాత్రాన వ్యాక్సిన్‌ బహిరంగ మార్కెట్లోకి వచ్చినట్లుగా భావించకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో టీకా ధర ఎంత ఉండవచ్చనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే రూ.300 నుంచి రూ.400 మధ్య ఉండే అవకాశముందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై నేడో రేపో స్పష్టత వస్తుందన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు మాత్రమే ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రభుత్వ కనుసన్నల్లోనే ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌! 
ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో టీకా కార్యక్రమాన్ని ఎవరు పర్యవేక్షిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే ఆయా ఆసుపత్రులకు ప్రభుత్వ వ్యాక్సిన్‌ సెంటర్‌ నుంచే టీకాలు సరఫరా అవుతాయా లేక నేరుగా కంపెనీల నుంచే వెళతాయా అన్నదానిపైనా స్పష్టత లేదు. దీనిపై త్వరలోనే కేంద్రం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వస్తాయని డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కోవిన్‌ యాప్‌ను ఆధునీకరించే పనిలో ఉంది. సాంకేతిక సమస్యలను పరిష్కరించి, కొన్ని మార్పులు చేర్పులతో కోవిన్‌ యాప్‌ రెండో వెర్షన్‌ను తీసుకురానుంది. అది నేడో రేపో అందుబాటులోకి రానుంది. ప్రైవేట్‌ ఆసుపత్రులు కూడా వారికి సరఫరా అయిన వ్యాక్సిన్‌ వివరాలు తప్పనిసరిగా యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

అర్హులైన లబ్ధిదారుల వివరాలను యాప్‌లో నమోదు చేశాకే టీకా వేయాలి. అలాగే ఏరోజు ఎన్ని టీకాలు వేశారో ఇంకెన్ని మిగిలాయో నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రైవేట్‌లోనూ పకడ్బందీగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుందని, దీన్ని పర్యవేక్షించేందుకు కొందరు అధికారులను నియమిస్తామని కూడా ఉన్నతాధికారులు చెబుతున్నారు. టీకా వేసే సిబ్బందికి ఈ మేరకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కేసులు నమోదైనా వెంటనే ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు.

టీకా ఉచితంగా తీసుకోండి
ప్రైవేట్‌లో డబ్బులకు కరోనా టీకా వేస్తారు కాబట్టి, లబ్ధిదారులు ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వేసే టీకాలనే తీసుకోవాలి. కిందిస్థాయి పీహెచ్‌సీలు మొదలు గాంధీ, ఉస్మానియా వంటి పెద్దాసుపత్రుల వరకు దాదాపు 1,250కు పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా అందుబాటులో ఉంది. మున్ముందు రాష్ట్రంలో దాదాపు 4,500కు పైగా ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ టీకా అందుబాటులో ఉంచుతాం. – డాక్టర్‌ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement