సాక్షి, న్యూఢిల్లీ: మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ టీకా వేసేందుకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. 45 ఏళ్లు పైబడిన వారికి ఎప్పటిలాగే ప్రభుత్వం ఉచితంగా వేస్తుంది. కానీ 18 ఏళ్ల నుంచి 45 లోపు వారికి నిర్ధిష్ట రుసుము చెల్లించడం ద్వారా టీకా వేసేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చింది. మొత్తం వ్యాక్సిన్లలో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి, మిగిలిన 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలకు రిజర్వ్ చేసింది.
బహిరంగ మార్కెట్లో కోవిడ్ వ్యాక్సిన్లను సేకరించే ప్రైవేటు ఆసుపత్రులు... తాము టీకా ప్రతి డోసుకు వసూలు చేసే చార్జీలను పారదర్శకంగా ప్రకటించాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన వ్యాక్సిన్ విధానంపై సోమవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్కువ వ్యవధిలో గరిష్ట సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ పొందగలిగేలా ప్రభుత్వం ఏడాది నుంచి కృషి చేస్తోందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచ రికార్డు వేగంతో ప్రజలకు టీకాలు వేస్తోందని, మరింత వేగంతో కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. జాతీయ కోవిడ్ –19 టీకా వ్యూహం ఒక క్రమబద్ధమైన, థర్డ్ పార్టీ సాయం అవసరం లేని ఎండ్ టూ ఎండ్ విధానంలో నిర్మితమైందని ప్రభుత్వం తెలిపింది.
అధిక ప్రభావం ఉన్న వర్గాలకు ముందుగా తొలి రెండు విడతల్లో టీకాలకు అనుమతి ఇచ్చిన కేంద్రం ఇప్పుడు మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకాలకు అనుమతి ఇచ్చింది. తొలి విడతగా జనవరి 16, 2021 నుంచి ఆరోగ్య రంగ సిబ్బందికి, ఇతర ఫ్రంట్ లైన్ సిబ్బందికి టీకాకు అనుమతి ఇచ్చింది. అనంతరం మార్చి 20 నుంచి రెండో దశలో 45 ఏళ్లకు పైబడిన వారందరికీ టీకా ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. రెండు దేశీయంగా తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడంతో పాటు తాజాగా మూడోది విదేశీ వ్యాక్సిన్ (స్పుత్నిక్)కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిని భవిష్యత్తులో దేశంలో తయారు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మూడో దశలో జాతీయ టీకా వ్యూహాన్ని మరింత సరళీకరించి కవరేజీని పెంచాలని కేంద్రం నిర్ణయించింది.
మూడో దశ టీకా వ్యూహం ఇలా..
► టీకా తయారీదారులు తమ నెలవారీ సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీలో విడుదల చేసిన మోతాదుల్లో 50% కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉంటుంది. మిగిలిన 50% రాష్ట్ర ప్రభుత్వాలకు, బహిరంగ మార్కెట్‌కు సరఫరా చేసేందుకు అనుమతి ఉంటుంది.
► రాష్ట్ర ప్రభుత్వాలు, బహిరంగ మార్కెట్లకు సరఫరా చేసే 50 శాతం టీకాల ధరను పారదర్శకంగా మే 1కి ముందే తయారీదారులు ప్రకటించాల్సి ఉంటుంది. ఈ ధరకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆసుపత్రులు, పారిశ్రామిక సంస్థలు మొదలైనవి తయారీదారుల నుంచి టీకాలను సేకరించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి కేటాయించిన 50 శాతం వాక్సిన్లు కాకుండా, ఇతర 50 శాతం నుంచే ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాక్సిన్లు సేకరించుకోవాల్సి ఉంటుంది. ఇలా 18 ఏళ్లు పైబడిన అందరికీ టీకా అందుబాటులోకి వస్తుంది.
► ప్రభుత్వం ద్వారా ఇంతకుముందులాగే ఉచితంగా టీకాలు వేయడం కొనసాగుతుంది. ఇంతకుముందు నిర్వచించిన విధంగా అర్హతగల జనాభాకు అనగా హెల్త్ కేర్ వర్కర్స్‌కు, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు, 45 ఏళ్లు పైబడిన అందరికీ ప్రభుత్వం ఉచితంగా టీకా వేస్తుంది.
► ప్రభుత్వం అయినా, ప్రైవేటు ద్వారా అయినా టీకా వేసే ముందు అన్ని నిర్ణీత నిబంధనలు పాటించాలి.
► 50% కేంద్ర ప్రభుత్వానికి, మిగిలిన 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలన్న నిబంధన వ్యాక్సిన్ తయారీదారులందరికీ దేశమంతటా వర్తిస్తుంది. అయితే విదేశాల నుంచి దిగుమతయ్యే వ్యాక్సిన్లను వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలను కేంద్రం అనుమతిస్తుంది.
► కేంద్ర ప్రభుత్వం తమ వాటా నుంచి వ్యాక్సిన్లను యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య, పనితీరు (పరిపాలన వేగం) వంటి ప్రమాణాల ఆధారంగా రాష్ట్రాలకు కేటాయిస్తుంది. టీకా వృ«థా ఎక్కువగా ఉంటే ప్రతికూలాంశంగా పరిగణిస్తారు. ఆమేరకు కేంద్రం నుంచి వ్యాక్సిన్ల కేటాయింపు తగ్గుతుంది. ఆయా ప్రమాణాల ఆధారంగా, రాష్ట్రాల వారీగా కోటా నిర్ణయిస్తారు.
► రెండో డోస్ పెండింగ్‌లో ఉంటే దానికి తగిన ప్రాధాన్యత ఇస్తారు. ఇందుకోసం కేంద్రీకృత వ్యూహాన్ని రూపొందించి తెలియపరుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment