ప్రైవేట్‌ కోటా కోవిడ్‌ టీకాలు మాకివ్వండి: సీఎం జగన్‌ | Take Back Unused Covid Vaccine Stocks From Private Hospitals Reallot To State | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ కోటా కోవిడ్‌ టీకాలు మాకివ్వండి: సీఎం జగన్‌

Published Sat, Jul 17 2021 3:16 AM | Last Updated on Sat, Jul 17 2021 2:12 PM

Take Back Unused Covid Vaccine Stocks From Private Hospitals Reallot To State - Sakshi

సాక్షి, అమరావతి: ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోతున్న కరోనా వ్యాక్సిన్ల స్టాక్‌ను రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. దీనివల్ల మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు. జూలైలో ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించారని.. కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే వారికి కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నారని సీఎం తెలిపారు.

జూన్‌లో కూడా ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమేనని సీఎం ప్రధాని దృష్టికి తెచ్చారు. కోవిడ్‌ నివారణలో మీ సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు సాగుతామని మోదీకి తెలిపారు. కోవిడ్‌ నివారణ చర్యలపై వివిధ రాప్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..

కోవిడ్‌ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు. రాష్ట్ర విభజనవల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నాం. అత్యాధునిక వైద్య సదుపాయాలు రాష్ట్రంలో లేవు. రాష్ట్ర విభజనవల్ల హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు కూడా ఏపీలో లేవు. అయినా సరే.. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచాం. అలాగే, రాష్ట్రంలో ఏర్పాటుచేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్‌ విస్తరణను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేశాయి. ఇప్పటివరకూ 12 సార్లు ఇంటింటికీ వెళ్లి ఫీవర్‌ సర్వే చేశాం. లక్షణాలున్న వారిని గుర్తించి టెస్టులు చేశాం. దీనివల్ల కోవిడ్‌ విస్తరణను అడ్డుకోగలిగాం. కోవిడ్‌కు సరైన పరిష్కారం వ్యాక్సినేషనే. దీనికి సంబంధించి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. అవి..

రాష్ట్రానికి 1,68,46,210 వ్యాక్సిన్‌ డోసులు వచ్చాయి. వీటిని ఎక్కడా కొంచెం కూడా వృధా చేయకుండా పకడ్బందీగా ఉపయోగించడంవల్ల మరింత ఎక్కువ మందికి వేయగలిగాం. అంటే.. 1,68,46,210 మందికి బదులు 1,76,70,642 మందికి వ్యాక్సిన్లు వేయగలిగాం. వ్యాక్సినేషన్‌లో మంచి విధానాలు అవలంబించడంవల్లే ఇంత ఎక్కువ మందికి ఇది సాధ్యమైంది.
ఇక జూలైలో 53,14,740 వ్యాక్సిన్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారు. అదే నెలలో ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించారు. కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో వారు ఇవ్వలేకపోతున్నారు. అలాగే, జూన్‌లో ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమే. 
ఇలా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన కోవిడ్‌ టీకా స్టాకును తిరిగి రాష్ట్రానికి కేటాయించాలని కోరుతున్నాం. రాష్ట్రం మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. 

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement