సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత కొరవడింది. ఇక్కడ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నా వ్యాక్సిన్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తోంది. ఇది వ్యాక్సినేషన్ ప్రక్రియపై తీవ్ర ప్రభా వం చూపుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు 47 లక్షల డోసులే పంపిణీ చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కొన్ని రాష్ట్రాలకు కోటికిపైగా డోసులు పంపిణీ చేయగా... తెలంగాణకు ఇప్పటివరకు టీకా కేటాయింపులు అరకోటి దాటలేదు. వ్యాక్సిన్ నిల్వలను బట్టి పంపిణీ చేస్తున్న రాష్ట్ర యంత్రాంగం... ప్రస్తుతం టీకా కోటా నిల్వలు నిండుకోవడంతో పంపిణీ ప్రక్రియలో వేగాన్ని తగ్గించాల్సిన పరిస్థితి తలెత్తింది.
2 లక్షల నుంచి లక్షకు తగ్గించి...
వైరస్ వ్యాప్తి వేగం పెరగడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను సైతం వైద్య, ఆరోగ్య శాఖ విస్తృతం చేసింది. టీకాల పంపిణీ ప్రారంభ సమయంలో రోజుకు 20–30 వేల మందికి వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన అధికారులు ఈ నెల 20 నుంచి ఏకంగా 2 లక్షల డోసులకు పెంచారు. 4–5 రోజులపాటు రోజుకు 2 లక్షల కంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చిన యంత్రాంగం... టీకాల కోటా నిండుకోవడంతో గత 5 రోజులగా పంపిణీ వేగాన్ని తగ్గించి కేవలం లక్ష మందికే టీకాలు ఇస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద లక్షకు మించి టీకాల కోటా లేనట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు ఈ నెల ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ వైద్యశాఖ వద్ద టీకాల కోటా తగినంతగా లేనందున మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియను వెంటనే చేపట్టలేమని తేల్చిచెప్పింది. ప్రస్తుతం నిల్వ ఉన్న కోటాను రెండో డోసు వేసుకొనే వారికి ఇస్తే మెరుగైన ఫలితం ఉంటుందని భావించి ఆ మేరకు చర్యలు చేపట్టింది. 45 ఏళ్లు పైబడి రెండో డోసు తీసుకొనేందుకు వచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఓ అధికారి అభిప్రాయపడ్డారు.
అక్కడ కోటి దాటినా: కొన్ని రాష్ట్రాల్లో పలుచోట్ల టీకాల పంపిణీ విస్తృతంగా సాగుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 1.61 కోట్ల డోసులు పంపిణీ చేశారు. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో ఇప్పటికే కోటికి పైగా డోసులు పంపిణీ చేశారు. కర్ణాటకలో కూడా దాదాపు కోటి డోసులు వేయగా... తెలంగాణలో మాత్రం అరకోటి దాటలేదు.
ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వ టీకాల సరఫరా బంద్..
ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ పంపిణీ నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సరఫరా చేసిన టీకా నిల్వలు ఉంటే వాటిని వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉధృతం చేసే ఉద్దేశంతో ఇప్పటివరకు ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం టీకా సరఫరా చేసింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం.. ఉచితంగా ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. శనివారం నుంచి 3వ దశ వ్యాక్సినేషన్ ప్రారంభం కావాల్సి ఉన్నా టీకా నిల్వలు లేని కారణంగా అమలు సాధ్యం కాదని ప్రైవేట్ ఆస్పత్రుల వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఈ నెల 3 తర్వాతే స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి. కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి తమ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఇస్తామని అపోలో వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment