ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కోటి మందికి కరోనా టీకాలు వేయాలని వైద్య, ఆరోగ్య శాఖ లక్ష్యంగా నిర్దేశించింది. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45–59 ఏళ్ల మధ్య ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రమే టీకాలు వేస్తున్నారు. అయితే 45–59 ఏళ్ల మధ్య వయసున్న వారిలో సాధారణ వ్యక్తులందరికీ కూడా వ్యాక్సిన్ వేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఆ వయసు వారిలో కొత్తగా 30 లక్షల మంది వ్యాక్సిన్‌కు అర్హులవుతారు. వారందరూ కలిపి కోటి మంది అవుతారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
45–59 ఏళ్ల వయసులోని అందరికీ టీకా వేయాలన్న విషయంపై కేంద్రానికి ప్రతిపాదనలు చేసినట్లు ఓ ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. ఇటీవల కేంద్రంతో జరిగిన సమావేశంలో ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనను ముందుపెట్టింది. త్వరలో దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు.
కేసులు విస్తరిస్తుండటంతో..
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి 16న ప్రారంభమైంది. మొదట వైద్య సిబ్బందికి, తర్వాత ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకావేశారు. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45–59 ఏళ్ల మధ్య ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేస్తున్నారు. ఇప్పటివరకు 8.75 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా వేస్తున్నారు. వాస్తవంగా ఈ నాలుగు కేటగిరీలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 60 లక్షల మందికి టీకా వేయాలనుకున్నారు. అందులో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు దాదాపు 6 లక్షలు కాగా, 10 లక్షల మంది 45–59 ఏళ్ల మధ్య ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారు. 60 ఏళ్లు పైబడిన వారు 54 లక్షల మంది ఉన్నారు. వీరుకాక 45–59 ఏళ్ల మధ్య వయసున్న వారు సుమారు 30 లక్షల మంది ఉంటారని అంచనా వేశారు.
దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయి. మరో 2 నెలల్లో పరిస్థితి చేయి దాటిపోతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విస్తృతంగా టీకాలు వేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. 45 ఏళ్లు పైబడిన వారందరికీ వేస్తే వైరస్ వ్యాప్తి అరికట్టొచ్చని కేంద్రానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విన్నవించింది. అందుకు కేంద్రం కూడా సుముఖంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిరంతరాయంగా వ్యాక్సిన్ వేసేలా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 20 పడకలకు పైగా ఉన్న అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ జరగనున్నట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment