సాక్షి, హైదరాబాద్: కరోనా టీకా మొదటి డోస్ తీసుకున్న తర్వాత కోవిడ్ వచ్చి తగ్గింది కదా, ఇంకా రెండో డోసు ఎందుకన్న భావనలో ఉన్నారా... రెండోడోసు తీసుకోవడం ఆలస్యమైంది కదా, ఇక ఎందుకులే అని అనుకుంటున్నారా.. ఇలాంటి ఆలోచనలు సరికాదంటోంది కేంద్ర ప్రభుత్వం. ఆలస్యమైనా సరే, రెండో డోసు వేసుకుంటేనే వైరస్ నుంచి పూర్తిస్థాయి రక్షణ లభిస్తుందని స్పష్టం చేసింది.
దీనిపై రాష్ట్రాలు అప్రమత్తమై రెండోడోస్ వేసుకోనివారి కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది. దీంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసి, రెండో డోస్ ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ వారికి టీకాలను అందజేసేలా ప్రణాళిక రచించింది.
కరోనా ప్రభావంలేదన్న భావనతో నిర్లక్ష్యం
రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు కోట్ల డోసుల కరోనా టీకాలు అందజేశారు. అందులో 76 శాతం మంది మొదటి డోస్, 30 శాతం మంది రెండో డోస్ వేసుకున్నారు. మొదటి డోస్ వేసుకొని నిర్ణీతకాలంలో రెండో డోస్ తీసుకోనివారు 36.55 లక్షల మంది ఉండటం గమనార్హం. దీనికి ప్రధాన కార ణం ప్రస్తుతం కరోనా ప్రభావం అంతగా లేకపోవడమేనన్న భావనతో ఉండటమేనని నిపుణులు అంటున్నారు. మొదటి డోస్ వేసుకున్న తర్వాత కరోనా వచ్చిపోవడం వల్ల కూడా చాలామంది రెండో డోస్ వేసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కొరత వల్ల కూడా చాలామంది రెండో డోస్ పొందలేదని తెలుస్తోంది.
మూడు నుంచి ఆరు నెలలలోపైతే మంచిది...
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం కరోనా వ్యాక్సిన్ రెండు డోస్‌లూ నిర్ణీత కాలవ్యవధిలో వేసుకోవాలి. ఒకవేళ రెండో డోస్ వేసుకోవడం ఆలస్యమైనా సరే, ఎప్పుడైనా వేసుకోవచ్చు. మళ్లీ షెడ్యూల్‌ను ప్రారంభించాల్సిన అవసరంలేదు. ఉదాహరణకు కోవిషీల్డ్‌పై చేసిన పరిశోధనలో రెండు డోస్‌లు వ్యవధిలోనే వేసుకుంటే లక్షణాలతో కూడిన కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం 66.7 శాతంగా ఉంటుంది.
4 వారాలలోపు 66.56 శాతం, 4 నుంచి 8 వారాల లోపలైతే 56.42 శాతం. 9–12 వారాల మధ్య అయితే 70.48 శాతం, 12 వారాల తర్వాత తీసుకుంటే 77.62 శాతం సామర్థ్యం ఉంటుంది. ఆలస్యం అవడం వల్ల టీ సెల్ ఆధారిత రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 3 నెలల నుంచి 6 నెలలలోపు రెండో డోసు టీకా వేసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్న 22 రోజులకు దాని ప్రభావం మొదలవుతుంది. ఆరు నెలల తర్వాత మొదటి డోస్ ప్రభావం తగ్గుతుంది. ఆ లోపులో రెండో డోస్ వేసుకుంటే మంచిది.
కరోనాను ఎదుర్కొనే శక్తి ఇలా..
తీవ్రమైన కరోనాను ఎదుర్కొనే శక్తి మొదటి డోస్ తర్వాత 71 శాతం, రెండో డోస్ తర్వాత 92 శాతం ఉంటుంది. వయస్సు మళ్లినవారికి మొదటి డోస్ సామర్థ్యం వేగంగా తగ్గుతుంది. కాబట్టి వీళ్లు వీలైనంత త్వరగా రెండో డోస్ వేసుకోవాలి. మొదటి డోస్ వేసుకున్న తర్వాత ఒకవేళ కరోనా వచ్చి నయమైపోతే, మూడు నెలల తర్వాత రెండో డోసు వేసుకుంటే మంచిది. డెల్టా వంటి వైరస్‌లను ఎదుర్కొవాలంటే మూడు నెలల్లోనే వేసుకుంటే మంచిది. ఇలాంటి డోస్‌ను బూస్టర్ లేదా మూడో డోస్‌గా పేర్కొనవచ్చు.
మరో వేవ్‌ను తట్టుకోవచ్చు
వ్యాక్సిన్‌పై పరిశోధనలు నిరంతరం సాగుతుండటంతో మనకు ఎప్పటికప్పుడు కొత్త సమాచారం అందుబాటులోకి వస్తోంది. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల బీ, టీ, మెమరీ సెల్ ఆధారిత రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది. డోసుల వ్యవధిని బట్టి వాటి ప్రభావం మారుతుంది. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం మొదటి డోసుతో 96 శాతం మరణాలను ఎదుర్కొనే శక్తి వస్తే, రెండో డోస్‌తో 98 శాతం వస్తుంది. ఇప్పుడు తీసుకుని ఉంటే, వచ్చే 3–4 నెలల్లో మరో కరోనా వేవ్ వస్తే దాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు. వీరిలో చాలామంది ఇప్పటికే కరోనా బారిన పడితే మనమిచ్చే రెండో డోసు కూడా వారికి బూస్టర్ లాగా పనిచేస్తుంది.
–డా. కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ
Comments
Please login to add a commentAdd a comment